21, అక్టోబర్ 2013, సోమవారం

సమస్యాపూరణం - 1211 (వాలిని సంహరించినది)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.....
వాలిని సంహరించినది వాయుసుతుండని నమ్మిరందఱున్.
ఈ సమస్యను పంపిన అందవోలు విద్యాసాగర్ గారికి ధన్యవాదాలు.

22 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించ నున్నవి !

    01)
    __________________________________________

    వాలుగ బాణమేసి గద - వాటముగా మరి రాముడొక్కడే
    వాలిని సంహరించినది ! - వాయుసుతుండని నమ్మిరందఱున్
    బాలను జూచి రాగలుగు - వానర ముఖ్యుడు , వీనికే గదా
    వీలగు నూఱు యోజనపు - ప్రేర్త్వము దాటుచు లంక జేరగన్ !

    __________________________________________
    వాలు = వంకర(చాటు)
    వాటము = అనుకూలము
    ప్రేర్త్వము = సముద్రము
    బాల = ఆడుది(సీత)

    రిప్లయితొలగించండి
  2. పాపం ! వాయుసుతుడంటే అర్థం తెలియని బాలుడు :

    02)
    __________________________________________

    మేళక మందు జేరి రట - మేకల మేపెడి పిల్లలందరున్
    పాలను త్రాగి గుంపుగను - పాడుచు వాగుచు నున్న యత్తరిన్
    వాలిని జంపె నెవ్వరది - బాణముతో ? మరి చెప్పుమన్న, నో
    బాలుడు జెప్పె నిట్లు , తన - బాలల బొమ్మల ఙ్ఞానసంపదన్
    "వాలిని సంహరించినది - వాయుసుతుండని" ! నమ్మిరందఱున్ !
    __________________________________________
    మేళకము = సమూహము
    బాలల బొమ్మల ఙ్ఞానసంపద = బాలల బొమ్మల రామాయణము భారతము చదివిన ఙ్ఞానము

    రిప్లయితొలగించండి
  3. ఒక ఔత్సహిక పద్య రచనాకారుడు :

    03)
    __________________________________________

    మేలగు పద్యముల్ రచన - మే యొనరింపగ బుద్ధి పుట్ట , నో
    వేళను వ్రాయబూని యతి - వేగము వ్రాసెను రెండు పాదముల్
    "వాలము గల్గువాడె గద - వాలిని జంపును యుద్ధమందునన్
    వాలిని సంహరించినది - వాయుసుతుండని నమ్మిరందఱున్" !
    __________________________________________

    రిప్లయితొలగించండి
  4. 04)
    __________________________________________

    కోలల నేసి జంపె నతి - ఘోరముగా , వని , రాముడెవ్వరిన్ ?
    మేలగు వార్త దెచ్చి తమ - మేనున ప్రాణము నిల్పు నాతడే
    వీలుగ వార్థి దాట గల - వీరుడు, లంకను జేరు నెవ్వడో ?
    వాలిని సంహరించినది ! - వాయుసుతుండని నమ్మిరందఱున్ !
    __________________________________________

    రిప్లయితొలగించండి
  5. వాలిని సంహరించినది వాయుసుతుండని నమ్మి, రందఱున్
    హనుమని నోరార పొగడంగ , మహీ కపి వినమ్రుడై
    చెట్టు వెనుక నున్న రాముని చూపించి
    తలవొగ్గి నమస్కరించే రామా నీకు సాటి లేరెవ్వరు ఇలలో నటంచున్ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. కాలము దాపురించ, దశకంఠుఁడు రామునితోడఁ బోరఁగన్
    గాలుఁడ నంచు వచ్చి, చిరకాలము నోపిక లేక పాఱె నా
    భీల రణమ్మునుండి; కన వింతయె; చచ్చిన రాక్షసేశ్వరా
    శ్వాలిని సంహరించినది వాయుసుతుండని నమ్మిరందఱున్!

    రిప్లయితొలగించండి
  7. ఆలికి దూరమై బ్రతుకు హాయిగ సాగని వీరులిద్దరిన్
    మేలగు నంచు మారుతియె మిత్రులఁ జేయగ మిత్రలాభమే
    వాలిని మట్టుబెట్టెనను భావమె జేరగ లోకమందునన్
    వాలిని సంహరించినది వాయుసుతుండని నమ్మిరందఱున్!

    రిప్లయితొలగించండి
  8. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..

    సరదాగా

    బళ్ళారి లో గాలి వారు జేసినది శాసనము,కాదన గాలికి కోపము వచ్చునను భయముతో ప్రజలు వారి బాటను నడచును.
    ============*============
    గాలి జనార్థనుండు దన కావ్యము నందున వ్రాసె నిట్లు నా
    వాలిని సంహరించినది వాయుసుతుండని,నమ్మిరందఱున్
    కాలము తోడ మారు గద కావ్యము నందలి కర్మ మర్మముల్,
    కాలుని దండనాంశములు!కాదని యుద్దము జేయ లేకయే !

    రిప్లయితొలగించండి
  9. పందితనేమానిగారికి పూజ్యగురుదేవులు
    శంకరయ్యగారికి వందనములు

    వైళమ లంక జొచ్చి యట వారిజనేత్రను సీత జూచి యా
    భీలముగా నశోక వన వృక్షములన్ పెకలించి లంకనున్
    వాలపుటగ్ని గాల్చి తన వైరి నెదుర్కొని పోరి పూర్వదే
    వాలిని సంహరించినది వాయుసుతుండని నమ్మురందరున్

    రిప్లయితొలగించండి
  10. క్రమాలంకారము :

    శూలసమాన బాణము యశోవిభు రామ కరాగ్ర వర్జమై,
    వేలకు వేలయోజన సవిస్తర సాగర నిస్తరంబు నా
    భీల పరాక్రమాన్వితుఁడు వేగమె చేయగలండటంచు నీ,
    వాలిని సంహరించినది, వాయుసుతుండని నమ్మిరందఱున్.

    రిప్లయితొలగించండి
  11. వాలము బెంచినట్టికపి వాటము జూచిన లంకవాసులున్
    మేలగు కోతికా దిదియె మేరువు నెత్తిన వాడెవీడగున్
    కాలుని వంటియేలికకె కాలము తీరెను వీనివల్లనే!
    "వాలిని సంహరించినది- వాయుసుతుండని"! నమ్మిరందరున్!

    రిప్లయితొలగించండి
  12. వసంత కిశోర్ గారూ,
    వైవిధ్యంగా నాలుగు చక్కని పూరణలు చెప్పారు. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    ‘అశ్వాలిని’ అంటూ ప్రశస్తమైన పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణలోని ‘లాజిక్కు’ బాగుంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    గాలి జనార్దన్ ప్రస్తావనతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    ‘పూర్వదేవాలిని’ అంటూ మీరు చెప్పిన పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    క్రమాలంకారంలో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘పద్యరచన’కు ఏ అంశాన్ని ఇవ్వాలో తోచలేదు.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. వాలిని రాముడేసెనను వార్తను నమ్మిన కొందరిట్లనన్
    'మాలిమి లేక సోదరుని బాధలు పెట్టిన వాని కర్మమే
    వాలిని సంహరించినది', వాయుసుతుండని నమ్మిరందఱున్
    శ్రీలను పొంద వానరవరేణ్యుడు నిశ్చయ హేతు విత్తరిన్.

    (వానరవరేణ్యుడు=సుగ్రీవుడు)

    రిప్లయితొలగించండి
  14. కాలము దాపురించినది కావున రాముని బాణ మట్టులన్
    వాలిని సంహరించినది ; వాయుసుతుండని నమ్మి ఱందరున్
    చాల సమర్థు డాతడని సాగర మంతయు దాటి యాతడే
    వాలును లంకలో ననుచు బల్కిరి రాముని తోడ వానరుల్




    రిప్లయితొలగించండి
  15. మిస్సన్న గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మంచి పూరణ చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. శ్రీగురుభ్యోనమ:

    బాలుని గాంచ నొజ్జయనె ప్ర్రశ్నలు వేసి పరీక్ష జేయగాన్
    శూలమువోలె గ్రుచ్చినది చూడగ బాణమదేమి జేసెనో?
    కాలెను లంక యంతయును కారణమెవ్వడు? చెప్పె నంతటన్
    వాలిని సంహరించినది, వాయుసుతుండని, నమ్మిరందఱున్.

    రిప్లయితొలగించండి
  17. సుఖము-థుఖఃము, జయమపజయము మున్నగు పట్టికన్
    వదలి, నిజ-ఙ్ఞానోద్భవమ్మగు ఆనందమున నిత్యం మెదిలి
    అద్వైతులుగ శివ కేశవుల భావించెడు నిజ సుమతులు,
    వాలిని సంహరించినది వాయుసుతుండని నమ్మిరందఱున్.

    రిప్లయితొలగించండి
  18. శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మద్దూరి ఆదిత్య గారూ,
    మీకు భాషపై మంచి పట్టు ఉన్నది. కొద్దిగా శ్రమిస్తే పద్యాలను వ్రాయగలరు. ప్రయత్నించండి. అన్ని విదాల సహకరించడానికి నేను, మిత్రులు ఉన్నారు.

    రిప్లయితొలగించండి
  19. ధన్యవాదాలండి తప్పకుండా ప్రయత్నిస్తాను

    రిప్లయితొలగించండి
  20. వాలిని,వాని సోదరుని వైరముఁ దీర్చి సయోధ్య జేయగా
    జాలకపోయె, బల్మిగొని సంగరమందున నిల్చిపోరగా
    పోలిక లేని వీర వరపుత్రుని రామునిఁ జేర్చె తోడుగా;
    వాలిని సంహరించినది వాయుసుతుండని నమ్మిరందఱున్.

    రిప్లయితొలగించండి
  21. కాలము జేసినాడనుచు గద్దియ నెక్కిన తమ్మునోర్వకన్
    వీలును జూచి సోదరుని పెండ్లము నెత్తుక పోయి నట్టి యా
    వాలిని సంహరించె నొక బాణముతో రఘురాము డప్పు డా
    వేళకు చెట్టుమాటున నవేద్యము గావున దుష్టశీలుడౌ
    వాలిని సంహరించినది వాయుసుతుండని నమ్మిరందరున్

    రిప్లయితొలగించండి
  22. జాలిగ తార జేరుచును జాప్యము చేయక విన్నవింపగన్
    వీలుగ నారు వత్సముల పిమ్మట మేల్కొని ధూముధామునన్
    పోలిసు లందరున్ కలిసి బొమ్మను తిమ్మగ మార్చివేయగా
    వాలిని సంహరించినది వాయుసుతుండని నమ్మిరందఱున్

    రిప్లయితొలగించండి