16, అక్టోబర్ 2013, బుధవారం

పద్య రచన - 496 (జగడము)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“జగడము”

16 కామెంట్‌లు:

  1. పగడపు మెరుపుల నేలిక
    జగడమ్ములు వీడి నంత జగతికి మేలౌ
    పగ సెగలు మరచి కలసిన
    సుగమమ్ము గనుండు నంచు సోనియ పలికెన్

    రిప్లయితొలగించండి
  2. జగడమ్ములెట్లు మనుజస్వభావమున్
    మిగమీఱె? మిత్రతనమెట్లుబోయెనో?
    పగ పెచ్చగిల్లె; నిక ప్రాణహాని హె
    చ్చుగ సంభవించునెటు చూడ గల్గునో?

    రిప్లయితొలగించండి
  3. జగమున నరులిట నిరతము
    పగలను సెగలను గలుగుచు బరగిన గనగా
    జగడము లధికము లగుగద
    జగడము వదలిన జనులకు జగతిని సుఖమౌ.

    రిప్లయితొలగించండి
  4. జగదీశ్వర పదమునకై
    జగను డొకడు జతనమూనె సంరంభముతో
    జగడము లేలా? సాదర
    ముగ తత్పద మతనికిచ్చి పూజింప దగున్

    రిప్లయితొలగించండి
  5. శ్రీ కంది శంకరయ్య గురువర్యులకు వందనములు,
    అర్థ గణదోషములున్న సవరించ ప్రార్థన !
    తడబాటులేక నిలబడి
    జడియక కలబడగ నీవు జగడములాడన్
    సుడిబడుదురు ప్రత్యర్థులు
    వడివడిగను జేరి గెలుపు వశమౌ నీకున్

    రిప్లయితొలగించండి
  6. లోకమ్ము సౌఖ్య మందగ
    శ్రీకారము జుట్టుమనెడు శ్రీపతి వచనం
    బాకారము దాల్చ కున్నను
    భీకర జగడమ్ము లెగయు వేదన మిగులున్!

    రిప్లయితొలగించండి
  7. జగడము లాడుట మానుడు
    జగడములేదారితీయుజావులకు నిలన్
    జగడము ధర్మ విరుధ్ధము
    సుగమమునగు జీవితంబు జగడము లేమిన్

    రిప్లయితొలగించండి
  8. జగడ మాడంగ హెచ్చును శత్రుభావ;
    మెడఁద శాంతమ్ముఁ గోల్పోవు; హితముఁ దొలఁగు;
    ధనము వ్యయమగు; సౌఖ్యమ్ముఁ దలఁగిపోవు!
    జగడ మెంతేని వలదయ్య జనుల కెపుడు!!

    రిప్లయితొలగించండి
  9. సోదరి లక్ష్మీదేవిగారికి నమస్కారము. తమరి మంజుభాషిణీ వృత్తము రమణీయముగ నున్నది. కాని, మిత్రతనము సాధువు కాదని యనిపించుచున్నది. పరికించఁగలరు.

    రిప్లయితొలగించండి
  10. జగడము లాడెడు వానిని
    పగతో నిరతము రగిలెడు వానిని, కుమతిన్,
    జగడములకు గారణమై
    వగపించెడు వాని విడువ వలయును మిత్రా..

    రిప్లయితొలగించండి
  11. తప్పును సూచించినందుకు ధన్యవాదములండి.
    " మిత్రతయు మృగ్యమయ్యెనో" అని సవరింపదగుననుకొనుచున్నాను.

    రిప్లయితొలగించండి
  12. చిన్న సవరణతో...

    జగమున నరులిట నిరతము
    పగలను సెగలను గలుగుచు వగచుట తగునా
    జగడము లధికము లగుగద
    జగడము వదలిన జనులకు జగతిని సుఖమౌ.

    రిప్లయితొలగించండి
  13. జగడమే కౌరవ సంతతిఁ విడదీసి
    ......... ఘోర యుద్ధమునకు దారి తీసె!
    జగడమే రాముని శరము వాలిని ద్రుంచ
    ......... కారణమై యొప్పె ఘనముగాను!
    జగడమే సురలను పగవారిగా జేసె
    ......... దాయాదులైనట్టి దైత్యులకును!
    జగడమే చిన్న రాజ్యాలెల్ల లోకువై
    ......... తెల్లవారికి జిక్కు దిక్కు జూపె!

    జగడమే నేడు రాష్ట్రమున్ జగతి లోన
    నవ్వు పాల్జేయుచున్నది నమ్ముడయ్య!
    మైత్రికిన్ మించు కల్మి జగత్రయమున
    కాన రాదని నమ్మిన కలుగు శుభము.

    రిప్లయితొలగించండి
  14. మిత్రులందరు మంచి మంచి పద్యములను వ్రాసి మన బ్లాగును అలరింప జేసిరి. అందరికీ శుభాశీస్సులు మరియు అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. పండిత నేమానిగారికి గురుదేవులు శంకరయ్యగారికి వందనములు

    జగడములాడుట వలదని
    పగలను పెంచునట౦చను వాక్కులు నిజమే
    పగలను పెంచగ బూదియె
    మిగులును సెగలారిపోవ మేదిని యందున్

    జగడము తప్పదొకప్పుడు
    జగడము లో రావణుండు చావగతెచ్చెన్
    మగువనుసీతను రాముడు
    జగడము పాండవులకునిచ్చె జయమును కీర్తిన్
    జగడము మనకేలననగ
    సగము హిమాలయపు సీమ చైనా వశమై
    వగ కాశ్మీరమునందున
    తేగటార్చిరి జూడ భారతీయుల సేనన్
    జగడము న్యాయము కొరకై
    జగడము సేయంగ వలయు స్వాతంత్ర్యముకై
    జగడ మ్మనివార్యంబగు
    జగమున ధన మాన ప్రాణ సంరక్షణకై

    రిప్లయితొలగించండి
  16. కవిమిత్రులకు నమస్కృతులు.
    గత వారం రోజులుగా ఊళ్ళు తిరుగుతూ తీరిక లేకపోవడం, ఇంటర్ నెట్ అందుబాటులో లేకపోవడం తదితర కారణాల వల్ల బ్లాగును చూచే అవకాశం లభించడం లేదు. నా పరోక్షంలోనూ మిత్రులు నిరాటంకంగా, ఉత్సాహంగా పూరణలు చేస్తూ, పద్యాలను వ్రాస్తూ, గుణదోష విచారణ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది.
    అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
    రేపటి నుండి బ్లాగుకు అందుబాటులో ఉండగలనని అనుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి