11, అక్టోబర్ 2013, శుక్రవారం

సరస్వతీ ప్రార్థన

వందనమ్ము సరస్వతీ!


శ్రీ సరోరుహ గర్భసంభవు జిహ్వ లాలిత రత్న సిం
హాసనమ్ముగ నొప్పు దేవత! హంసవాహన! భారతీ!
భాసమాన యశోన్వితా! నిను ప్రస్తుతించెద సర్వదా
వాసవాది సురాళి వందిత! వందనమ్ము సరస్వతీ!

సకల వేద పురాణ శాస్త్ర రస ప్రసార వినోదినీ!
సుకవి పండిత వర్య వందిత శుద్ధ కీర్తి సమన్వితా!
శుక విరాజిత పాణి పల్లవ శోభితా! భువనేశ్వరీ!
ప్రకట వాగ్విభవ ప్రదాయిని! వందనమ్ము సరస్వతీ!

మల్లెలంచలు కప్పురంబుల మంచి చాయల నొప్పుచున్
చల్లనౌ కనుచూపు తోడుత జల్లుచున్ కృప మా యెడన్ 
తల్లి! మమ్ముల బ్రోచుచుందువు తమ్మిచూలికి డెందమున్
బల్లవింపగ జాలు కోమలి వందనమ్ము సరస్వతీ!

సరస మంజుల సత్ఫలప్రద సత్య సూక్తుల సన్మతిన్
నిరతమున్ బలికించి ప్రోతువు నీవు మమ్ముల ప్రేమతో
పరమ భక్తి విశేష మానస పంకజమ్మున వేడుదున్
పరమ విద్య ననుగ్రహింపుము వందనమ్ము సరస్వతీ!

వీణ మీటుచు వేదనాదము విశ్వమంతట నింపు గీ
ర్వాణి! మంజుల భాషిణీ! ప్రియ వాగ్విభూషణి! తోషిణీ!
క్షోణి నౌదల జేర్చి నిన్ను విశుద్ధ భక్తి దలంచుచున్
బాణి యుగ్మము మోడ్చి చేయుదు వందనమ్ము సరస్వతీ!

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

10 కామెంట్‌లు:

  1. పలుపలు విధముల చక్కని
    పలుకులతో పద్యములను వ్రాసిరి కనరే !
    పలుకులతల్లిని గొలువగ
    పలుకోర్కెలు తీరు గాద ! పఠియించగనే !

    రిప్లయితొలగించండి
  2. శ్రీవాణి పై శ్రద్ధతో మత్తకోకిల ఆలపించిన తరళరాగములను వినిపించిన పండితులవారికి శుభాభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. పూజ్యులు నేమానివారూ, తమ సరస్వతీ స్తుతి పద్యము లత్యంత భక్తి ప్రదములుగా, శోభాయమానములుగా, నిత్యస్తోత్రోపయుక్తముగా నున్నవి. సరస్వతీ కరుణాకటాక్ష వీక్షితులైన తమరి కభినందనలు తెలుపుకొనుచు....సరస్వతీ స్తుతి...

    విద్యాధినేత్రి! మాతా!
    సద్యః స్ఫురణ ప్రదాత్రి! శారద! వాణీ!
    మద్యోగ్య పద్య ధాత్రీ!
    మాద్య న్మంగళ సుగాత్రి! మాన్య!నమస్తే!

    రిప్లయితొలగించండి
  4. శారద మాతా! నతులివె
    శారదమా! గృపను జూడు శరణము నీవే
    యారయ,చదువుల తల్లివి
    పారంగతు జేయుమమ్మ! పరిపూర్ణముగాన్

    రిప్లయితొలగించండి


  5. నేమాని పండితార్యా! నమోన్నమః

    మల్లియ, చందమామ, తెలి మంచు తుషారపు హార దీధితుల్
    తెల్లనఁ బోవు నీ తనువు తెల్లని కాంతికి వాణి! దివ్యమౌ
    తెల్లని యంబరమ్మునను, తెల్లని పద్మము నందు నిన్గనన్
    యుల్లము పొంగదే జనుల కుర్విని యీ నవరాత్రి వేళలో!

    ఏ పాదాబ్జములన్ విరించి కొలుచున్ సృష్ట్యాదిలో శక్తికై?
    ఏ పాదాబ్జపు నీడలో హరి జగమ్మేలంగ సంశక్తుడౌ?
    నే పాదాబ్జ మహద్రజో గరిమచే నీశుండు సంహర్తయౌ?
    నీ పాదాబ్జము లెన్నగా నవియె వాణీ! సంశయ మ్మేలనో.

    తల్లీ! నిన్ను దలంచిన
    యుల్లము లుప్పొంగు వాక్కు లుబుకును ఝరులై!
    ఫుల్లాబ్జాక్షి! సరస్వతి!
    చల్లని నీ చూపు సోక సౌభాగ్య మగున్.

    రిప్లయితొలగించండి
  6. శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
    చక్కని పద్యములను వ్రాసేరు. సంతోషము. మా అభినందనలు. 1వ పద్యములో యుల్లము అనుచోట మరియు 3వ పద్యములో యుల్లము అనుచోటను యడాగమము రాదు. పరిశీలించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. నా పద్యములకు స్పందించిన మిత్రులు శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారికి, శ్రీమతి లక్ష్మీదేవి గారికి, శ్రీ గుండు మధుసూదన్ గారికి, శ్రీ సుబ్బా రావు గారికి మరియు శ్రీ మిస్సన్న గారికి మా సంతోషపూర్వక అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. అవును నేమాని పండితార్యా! పొరబాటును దిద్దుకొన్నాను.

    మల్లియ, చందమామ, తెలి మంచు తుషారపు హార దీధితుల్
    తెల్లనఁ బోవు నీ తనువు తెల్లని కాంతికి వాణి! దివ్యమౌ
    తెల్లని యంబరమ్మునను, తెల్లని పద్మము నందు చూడగా
    నుల్లము పొంగదే జనుల కుర్విని యీ నవరాత్రి వేళలో!

    ఏ పాదాబ్జములన్ విరించి కొలుచున్ సృష్ట్యాదిలో శక్తికై?
    ఏ పాదాబ్జపు నీడలో హరి జగమ్మేలంగ సంశక్తుడౌ?
    నే పాదాబ్జ మహద్రజో గరిమచే నీశుండు సంహర్తయౌ?
    నీ పాదాబ్జము లెన్నగా నవియె వాణీ! సంశయ మ్మేలనో.

    తల్లీ! నిన్ను దలంచిన
    నుల్లము లుప్పొంగు వాక్కు లుబుకును ఝరులై!
    ఫుల్లాబ్జాక్షి! సరస్వతి!
    చల్లని నీ చూపు సోక సౌభాగ్య మగున్.

    రిప్లయితొలగించండి