17, అక్టోబర్ 2013, గురువారం

సమస్యాపూరణం - 1207 (జీతములేనట్టి కొలువె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.....
జీతములేనట్టి కొలువె శ్రేష్ఠము జగతిన్.

31 కామెంట్‌లు:

  1. యాతన బడి పనిజేసిన
    వేతనములు సూన్య మాయె వేలకు వేలౌ
    నేతల జాతర లందున
    జీతము లేనట్టి కొలువె శ్రేష్ఠము జగతిన్

    రిప్లయితొలగించండి

  2. కష్టే ఫలే శర్మ గారి నేటి టపా
    తోక టీ ఏ బిల్లు కథ చదవంగ
    అనిపించే నా మనంబున
    జీతములేనట్టి కొలువె శ్రేష్ఠము జగతిన్!!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. తాతలకిక నేడరుదగు
    జాతకబలమునఁ గలిగెడి సంతోషముతో
    ప్రీతిగ మనుమలఁ బెంచెడి
    జీతము లేనట్టి కొలువె శ్రేష్ఠము జగతిన్.

    రిప్లయితొలగించండి
  4. నీతికి పాతర వేయుచు
    భీతిని కల్పించి నీదు పేరును చెడిచే
    నేతల స్వార్థంబను పుం
    జీతము లేనట్టి కొలువు స్రేష్ఠము జగతిన్.

    పుంజీతము = పులిజూదము ఆట

    రిప్లయితొలగించండి
  5. ప్రీతిగ నీశుని సేవల
    నేతీరుగ మరచిపోక నిత్యము కొలిచే
    రీతిని కొలువనుకొన నీ
    జీతములేనట్టి కొలువె శ్రేష్ఠము జగతిన్.

    రిప్లయితొలగించండి

  6. తాతలసేవలనరయగ
    జీతములేనట్టి కొలువె, శ్రేష్ఠము జగతిన్
    మాతాపితరులసేవలు
    ఏతావత తెలిసికొనుమ యెప్పటికైనన్.

    రిప్లయితొలగించండి

  7. పందితనేమానిగారకి పూజ్యులుశంకరయ్య గారికి వందనములు
    పండిత నేమనిగారికి పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    జీతములేకనుజేసిన
    చేతల నన్నిటికి దేశసేవ యనంగన్
    ప్రీతిగనిత్తురు కాన్కలు
    జీతములేనట్టి కొలువు శ్రేష్టమె జగతిన్
    మ్రోతగనటనలొనర్చుచు
    వేతనమున కన్న నూరు వేల ధనమ్ముల్
    ప్రీతిగ గొను నాయకులకు
    జీతము లేనట్టి కొలువు శ్రేష్టమె జగతిన్

    రిప్లయితొలగించండి
  8. ఏ తీరుగ గని దయతో
    నీ తనయునొసగితివంచు హెచ్చగు తీరున్
    నే తుష్టినిఁ బొందితి; యా
    జీతములేనట్టి కొలువె శ్రేష్ఠము జగతిన్.

    రిప్లయితొలగించండి
  9. రాజేశ్వరి అక్కయ్యా,
    నేతల దగ్గర కొలువు ప్రస్తుతం వేతనం లేకున్నా భవిష్యత్తులో ఉపయోగపడుతుందంటారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    జిలేబీ గారూ,
    ధన్యవాదాలు. కష్టే ఫలే గారి ఆ కథ చదివి మీ భావానికి పద్యరూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను.
    *
    చంద్రశేఖర్ గారూ,
    ప్రస్తుతం నేను అదే కొలువులో వున్నాను. మనుమణ్ణి స్కూల్లో దించి రావడం, మళ్ళీ వెళ్ళి ఇంటికి తీసుకురావడం, వాడిని ఆడించడం... అయితే ఆనందం అనే వేతనం దొరుకుతున్నది సుమా!
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ ‘పుంజీతపు’ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘పేరుఁ జెఱచు నా/ నేతల...’ అనండి.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    జీతము లేని దేవుని కొలువును గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘ఏతావాతా’ సరియైన ప్రయోగము. చివరి రెండు పాదాలకు నా సవరణ...
    మాతాపితరులసేవలు
    నేతావాతా యెఱుంగు మెప్పటికైనన్.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. వేతన పదవీ విరమణ
    చే తను జేయఁదగు సంఘ సేవలు జేయన్
    చేతన. స్వస్థత గలుగన్
    జీతము లేనట్టి కొలువు శ్రేష్టము జగతిన్!

    రిప్లయితొలగించండి
  11. యాతన బడితే జీతము
    జీతము వచ్చిననుకోతె జీవికి గొలువున్
    మ్రోతలు వాతల బ్రతుకుల
    జీతము లేనట్టి కొలువె శ్రేష్టము జగతిన్

    రిప్లయితొలగించండి
  12. సహదేవుడు గారూ,
    పదవీ విరమణ చేసిన వారు సంఘసేవ చేయాలన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. గుండు మధుసూదన్ గారూ,
    ‘శంకరాభరణం’ బ్లాగుకు సర్వాంగసుందరమైన ‘హెడర్’ తయారు చేసినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. మిత్రులు శంకరయ్యగారికి నమస్కారములు.

    మన శంకరాభరణం బ్లాగు హెడర్‍ను సిద్ధము చేయు మహద్భాగ్యము నాకు కలిగించినందులకు నేనే మీకు ధన్యవాదములు తెలుపుకొనవలెను శంకరయ్యగారూ!

    నా పూరణము:

    చేతమునందున నిల్పియు,
    సీతాయుత రామచంద్రు స్థిరమగు భక్తిన్
    గీతములఁ బాడి కొలిచెడి
    జీతము లేనట్టి కొలువె శ్రేష్ఠము జగతిన్!

    రిప్లయితొలగించండి
  15. నిజమే మనవలతో హాయిగా గడపడం , అన్నిటికన్న ఆనంద కరమైన , అదృష్ట వంతమైన జాబు . అభినందనలతో
    గురువులకు ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  16. రోతగు సమయము కందెడు
    జీతము లేనట్టి కొలువె ; శ్రేష్ఠము జగతిన్
    బ్రీతిగ మడి దున్ని బ్రదుక ;
    రాతను బట్టియె ధనమ్ము రాబడి కలుగున్

    రిప్లయితొలగించండి
  17. జీతము నొందక పరులకు
    యాత ననక జేయు సేవ లన్నియు గూడన్
    వేతన మీయనివే గద
    జీతము లేనట్టి కొలువె శ్రేష్ఠము జగతిన్

    రిప్లయితొలగించండి
  18. కాసుల వేటలో వెనుకబడె, సద్గతి
    ఆరు శత్రువుల దాడికతిశయించే భీతి
    నీ పాద దాశ్యమే ఉపశమన రీతి
    జీతములేనట్టి కొలువె శ్రేష్ఠము జగతి[న్]

    రిప్లయితొలగించండి
  19. గుండు మధుసూదన్ గారూ,
    ఎంతో కాలంగా అటువంటి హెడర్‍ను ఏర్పాటుచేయాలని కోరిక... సాంకేతిక పరిజ్ఞానం లేక చేయలేకపోయాను. మీరు చేసి నా కోరిక తీర్చారు. చాలా ఆనందంగా ఉంది.
    మీ పూరణము చక్కగా ఉన్నది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మంచి భావంతో పూరణ చెప్పారు. అభినందనలు.
    ‘రోత యగు సమయమున కందెడు’ అనవలసి ఉందికదా... అలాగే వ్రాతను రాత అన్నారు. నా సవరణతో మీ పద్యం....
    రోత యగు వేళ కందెడు
    జీతము లేనట్టి కొలువె ; శ్రేష్ఠము జగతిన్
    బ్రీతిగ మడి దున్ని బ్రదుక ;
    వ్రాతను బట్టియె ధనమ్ము రాబడి కలుగున్
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘యాతన యనక’ అని యడాగమం వస్తుంది. ‘యాతన యననట్టి సేవ లన్నియు...’ అందామా?
    *
    మద్దూరి ఆదిత్య గారూ,
    మంచి భావంతో, అంత్యానుప్రాసతో వచనపద్యం చెప్పారు. బాగుంది.
    ఛందోబద్ధంగా వ్రాయడానికి ప్రయత్నించండి.

    రిప్లయితొలగించండి
  20. పద్యాన్ని చక్కగా సవరించి నందులకు గురువు గారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  21. శ్రీగురుభ్యోనమ:

    నేతల కడ జేయకుమీ
    జీతములేనట్టి కొలువె! శ్రేష్ఠము జగతిన్
    యాతన కలిగిన జీవికి
    ప్రీతిగ సేవలను జేయ పెన్నిధి కాదే

    రిప్లయితొలగించండి
  22. శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి



  23. నేతల ప్రాపకముండిన
    నేతావుననున్ననేమి,యే పనియైనన్
    గీతము బాగుండినచో
    జీతము లేనట్టి కొలువె శ్రేష్ఠము జగతిన్.

    రిప్లయితొలగించండి
  24. కమనీయం గారూ,
    ‘గీతం’ ఎక్కువ అయినప్పుడు జీతం అక్కరలేదన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. శ్రీ కంది శంకరయ్య గురుదేవులకు నమస్కారములు, సవరణతో............

    యాతన నొందక పరులకు
    జీతము నాశించకుండ జేసెడు సేవల్
    వేతన మీయనివే కద
    జీతము లేనట్టి కొలువె శ్రేష్ఠము జగతిన్.

    రిప్లయితొలగించండి
  26. రిప్లయిలు
    1. తాతా! రావా! దాగుడు
      మూతలయాటకని పిలువ ముచ్చట మీరన్
      కోతలు కోయుచు మురిసెడి
      జీతములేనట్టి కొలువె శ్రేష్ఠము జగతిన్!

      తొలగించండి


  27. వాతను బెట్టుట కుదరదు
    చేతల తప్పుల కనుగొన చెవల వెధవనన్
    కూతలిడలేరు,రమణీ
    జీతములేనట్టి కొలువె శ్రేష్ఠము జగతిన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  28. నూతన సమస్య తోడుత
    పాతవి పూరణలు జేయు పైత్యము నందున్
    ప్రీతిని శంకర వరుదౌ
    జీతములేనట్టి కొలువె శ్రేష్ఠము జగతిన్

    రిప్లయితొలగించండి