18, అక్టోబర్ 2013, శుక్రవారం

సమస్యాపూరణం - 1208 (పద్యమ్ముల వ్రాయునట్టివాఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.....
పద్యమ్ముల వ్రాయునట్టివాఁ డల్పుఁ డగున్.

29 కామెంట్‌లు:


  1. గద్యములతో గరిటీ తిప్పు కాలమున
    హైకూల తో హై 'టెక్కు 'లాడించు కాలమున
    వచన కవితలతో పెను విర్ర వీగు కాలమున
    పద్యమ్ముల వ్రాయునట్టివాఁ డల్పుఁ డగున్!!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. హృద్యమ్ముగ రసమయముగ
    పద్యమ్ముల వ్రాయునట్టి వాడుత్తముడౌ
    విద్యల సొగసుల నెరుగక
    పద్యమ్ముల వ్రాయునట్టి వాడల్పు డగున్

    రిప్లయితొలగించండి
  3. సేద్యము జేయుట మేలౌ
    ఖాద్యములకు ప్రభువుకమ్ము కావ్యము కొరకై
    చోద్యమ ? పోతన చెప్పెను
    పద్యమ్ముల వ్రాయునట్టివాఁ డల్పుఁ డగున్.

    రిప్లయితొలగించండి
  4. శ్రీమతి జిలేబి గారి భావమునకు నా పద్య రూపము.

    హృద్యమమీ హైకూలే
    గద్యము, నానీల కవిత, కాలము మారెన్
    చోద్యంబిదె యనువారికి
    పద్యమ్ముల వ్రాయునట్టివాఁ డల్పుఁ డగున్!!

    రిప్లయితొలగించండి
  5. పందితనేమానిగారికి పూజ్యగురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    పద్యము మెచ్చిరి జనములు
    హృద్యమ్ముగ నాటకమున నింపుగ పాడన్
    చోద్యము గాదా యనగను
    పద్యమ్ములు వ్రాయునట్టి వాడల్పుడగున్







    రిప్లయితొలగించండి
  6. విద్యాదేవిని భక్తిని
    పద్యములందునఁ బొగడక పరిపరి విధమౌ
    యద్యతన స్థితుల దలచి
    పద్యమ్ముల వ్రాయునట్టివాఁ డల్పుఁ డగున్.

    రిప్లయితొలగించండి
  7. అరుదగు సాహిత్య సంపద పద్య రూపమున
    తెలుగు భాషలో తప్ప వెతికినా దొరకునా
    స్వతహాగా వ్రాయకున్న కరువామనకేమన్న
    పద్యమ్ముల వ్రాయునివాడు, అల్పుడగుక మానునా.

    రిప్లయితొలగించండి
  8. పద్యము కవితకు ఆద్యము
    పద్యమునకుప్రాణమగును ప్రాసలు యతులున్
    హృద్యముగానవివ్రాయక
    పద్యమ్ముల వ్రాయునట్టి వాడల్పు డగున్

    రిప్లయితొలగించండి
  9. సద్యతులవి లేకుండిన
    పద్యంబున చేవ తగ్గు; వదలక ఛందో
    విద్యను నేర్వక తప్పుడు
    పద్యమ్ములు వ్రాయునట్టి వాడల్పుడగున్

    (సత్ + యతులు = సద్యతులు)
    ఛందో విద్య అనుట సాధు ప్రయోగమేనా?

    రిప్లయితొలగించండి
  10. పద్యము సుస్వర భరితము
    పద్యము వ్రాయగ పదముల పలుకును భావమ్
    పద్యము విలువను తెలియక
    పద్యమ్ముల వ్రాయునట్టివా డల్పు డగున్

    రిప్లయితొలగించండి
  11. జిలేబీ గారూ,
    మీ భావానికి చక్కని పద్యరూపాన్నిచ్చారు గోలి హనుమచ్ఛాస్త్రి గారు. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    భుక్తికోసం పద్యాలను వ్రాసి అమ్ముకునేవాడు అల్పుడన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    జిలేబీ గారి భావాన్ని పద్యబద్ధం చేసినందుకు ధన్యవాదాలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    జనం అభిమానించే నాటక పద్యాలను రచించిన కవులు అల్పులు ఎలా అవుతారన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మద్దూరి ఆదిత్య గారూ,
    మంచి భావాన్ని వెలిబుచ్చారు. సంతోషం.
    మీ భావాన్ని ఎవరైనా మిత్రులు ఛందోబద్ధం చేస్తారేమో చూద్దాం.
    *
    శైలజ గారూ,
    ఛందోనియమాలు పాటించక పద్యాన్ని వ్రాసేవారిని గురించిన మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    రెండవ పద్యంలో ‘భావమ్’ అని హలంతంగా వ్రాసారు. అక్కడ ‘భావము పలుకున్’ అంటే సరి.
    *
    పుష్యం గారూ,
    తప్పుడు పద్యాలను వ్రాసేవాడి గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘ఛందోవిద్య’ అనడంలో దోషం లేదు.

    రిప్లయితొలగించండి
  12. విద్యలలోపల నుత్తమ
    విద్య కవిత్వమ్ము, దాని విలువ నెరుగకన్
    హృద్యముగా లేనట్టుల
    పద్యమ్ముల వ్రాయు నట్టి వాడల్పు డగున్.

    రిప్లయితొలగించండి
  13. అధ్యా త్మిక గ్రంధములను
    అధ్యయ నము జేసినట్టి యాచార్యు డె యౌ
    హృద్యమ్ముగ ప్రీతి నిడని
    పద్యమ్ముల వ్రాయు నట్టి వాడల్పు డగున్

    రిప్లయితొలగించండి
  14. హృద్యాంచితభావగత సు
    వేద్యతరోల్లక్షణయుత వినుతోక్త నిస
    ర్గోద్యద్రసపాకరహిత
    పద్యమ్ముల వ్రాయునట్టివాఁ డల్పుఁ డగున్!

    రిప్లయితొలగించండి
  15. హృద్యమ్ముగాను వ్రాసిన
    పద్యములు విని తరియింత్రు పామరులెల్లన్
    గద్యముల, నర్థమివ్వని
    పద్యమ్ముల వ్రాయునట్టి వాడల్పు డగున్

    రిప్లయితొలగించండి
  16. పద్యాలను వ్రాయుటయే
    యుద్యోగము తనది యనుచు నొప్పగు పద్యాల్
    హృద్యముగ జెప్ప, నెట్టుల
    పద్యమ్ముల వ్రాయునట్టివాఁ డల్పుఁ డగున్ ?

    రిప్లయితొలగించండి
  17. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    ద-ధ ప్రాస వేసినా మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ సంస్కృత భాషాప్రావీణ్యతకు జోహార్లు. సుదీర్ఘసమాసయుక్తమైన మీ పూరణ హృద్యంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    కుసుమ సుదర్శన్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. పద్యములో పసలేదని
    గద్యమ్మే మనకు దిక్కు కావలె కవితా
    సేద్యమని - కొంద రందురు
    "పద్యమ్ముల వ్రాయు నట్టి వాడల్పు డగున్"

    రిప్లయితొలగించండి
  19. నాగరాజు రవీందర్ గారూ,
    మీ రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి




  20. పద్యము తెలుగు విశిష్టత
    హృద్యమ్మగుదాని మధురహేలా వీణా
    వాద్యము భంగి రచింపక
    పద్యమ్ముల వ్రాయునట్టి వాడల్పుడగున్.

    రిప్లయితొలగించండి
  21. శ్రీగురుభ్యోనమ:

    విద్యాగర్వను జేతను
    మద్యము సేవించినట్టి మైకముతోడ
    న్నాద్యంతంబుల నెరుగక [విద్యను జులకన జేయుచు]
    పద్యమ్ముల వ్రాయునట్టివాఁ డల్పుఁ డగున్.

    రిప్లయితొలగించండి
  22. పద్యముల వ్రాసి రెందఱొ
    ఖద్యోతముల వలె మెఱయ కావ్యము లందున్
    సద్యోజాతముగ నెటుల
    పద్యమ్ముల వ్రాయునట్టివాఁ డల్పుఁ డగున్?

    రిప్లయితొలగించండి
  23. ఖాద్యమున ఉప్పుతగ్గిన
    అధ్యక్షా! మెచ్చగలమె, అవ్విధముగనే,
    సద్యతులు ప్రాసలొదులుచు
    పద్యమ్ములు వ్రాయునట్టి వాడల్పుడగున్

    శంకరయ్య గారు,
    ద-ధ లకు ప్రాస కుదురుతుందని, చింతా వారి బ్లాగులో చదివాను.

    12) స్వ వర్గజ ప్రాస :-
    " థ - ధ " లకు,ప్రాస చెల్లును.
    " ద - ధ " లకు ప్రాస చెల్లును.

    రిప్లయితొలగించండి
  24. కమనీయం గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘గర్వము’ టైపాటు వల్ల ‘గర్వను’ అయినట్టుంది.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ తాజా పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పుష్యం గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘ఒదులుచు’ అన్నారు. ఆ పాదాన్ని ‘సద్యతులు ప్రాసల వదలి’ అందాం.
    స్వవర్గజ ప్రాసను ప్రస్తావించినందుకు ధన్యవాదాలు. అది దోషమని, వాడరాదని అనలేదండీ. కేవలం రాజేశ్వరి అక్కయ్య దానిని ప్రయోగించారని ప్రస్తావించాను. సాధ్యమైనంత వరకు దానిని ఉపేక్షించడం మంచిదని నా అభిప్రాయం.

    రిప్లయితొలగించండి
  25. నా పరిశీలనలో చాలా వరకు

    పద్యమ్ముల ప్రౌడమ్ముగ
    హృద్యముగఁ జెప్పు వారి హృదయా వనిలో
    నాద్యంతము లలితంబౌ
    పద్యమ్ముల వ్రాయు నట్టి వాడల్పుడగున్!

    రిప్లయితొలగించండి
  26. విద్యా వినయమ్ములుడిగి
    మద్యమ్మును గ్రోలుచుండి మతిభ్రంశమున
    న్నుద్యోగము విరమించుచు
    పద్యమ్ముల వ్రాయునట్టివాఁ డల్పుఁ డగున్

    రిప్లయితొలగించండి


  27. చోద్యమిదియే జిలేబీ
    పద్యమ్ముల వ్రాయునట్టివాఁ డల్పుఁ డగున్,
    గద్యములకు చెల్లె హరిమ!
    విద్యయనగ యింగిలీసువింగ్లీసులహో :)

    జిలేబి

    రిప్లయితొలగించండి


  28. నాటి జిలేబీయానికి నేటి జిలేబీయం :(

    గద్యంబన కవితలహో!
    విద్యయనగ హైకు! విర్ర వీగు జిలేబీ
    హృద్యంబగు పదములనన్
    పద్యమ్ముల వ్రాయునట్టివాఁ డల్పుఁ డగున్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  29. విద్యలు కడు నేర్వకయే
    సద్యశమును కోరుచుండి చతికిల పడుచున్
    సేద్యము జేయక మడినిన్
    పద్యమ్ముల వ్రాయునట్టివాఁ డల్పుఁ డగున్

    రిప్లయితొలగించండి