18, అక్టోబర్ 2013, శుక్రవారం

పద్య రచన - 498 (నిధి చాల సుఖమా?)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“నిధి చాల సుఖమా?”

20 కామెంట్‌లు:

  1. చక్కటి పద్యాలు , మంచి పూరణలు కొలువై ఉండే శంకరాభరణం బ్లాగు సన్నిధి చాలా ఆనందదాయకం గురువు గారు .. నిధి కన్ననూ !

    రిప్లయితొలగించండి
  2. నిధియో? నీ పద పద్మ సన్నిధియొ? దేనిన్ గోరుటో యంచనన్
    విధి శక్రాది సురాళి సేవితమునై వెల్గొందుచున్ సత్కృపా
    సుధలన్ గూర్చి సుఖాధియోగమిడుచున్ శోభిల్లు నీ పాద స
    న్నిధియే సౌఖ్యమటంచు గోరుదు మదిన్ శ్రీరామచంద్ర ప్రభూ!

    రిప్లయితొలగించండి
  3. నిధిచాల సుఖమనుచు పె
    న్నిధులే సాధింపజూచు నెవ్విధియైనన్
    విధి జెప్పు కడకు హరి స
    న్నిధియే సుఖమంచు, నరుడు నేర్చునదెపుడో !

    రిప్లయితొలగించండి
  4. ఇది చెంత ఉన్నంత పెరుగు గరిమ
    ఇది కోల్పోయిన సర్వం-నిశి-సుమా
    అని అనిత్యమైన వాటి పై తగని భ్రమ
    సచ్చిదానందం కాని, నిధి చాల సుఖమా?

    రిప్లయితొలగించండి
  5. పండితనేమాని గారికి పూజ్యగురుదేవులు శంకరయ్యగారికి వందనములు

    ధననిధు లున్నవనంగను
    తనయింటిని త్రవ్వుకొనగ ధనములు లేకన్
    మనుటకు గూడును పోవగ
    ఘన రాఘవు సన్నిధియె తగ సుఖమ్మనియెన్

    రిప్లయితొలగించండి
  6. నిధి సౌఖ్యముగాదను నిక్కమునే
    సుధ వోలెను గైకొను శుద్ధమనం
    బు ధరిత్రిని లేదన బొంకగు; వా
    రిధి జీవన నావకు లెక్క వలెన్.

    రిప్లయితొలగించండి
  7. నిధియే సంతుష్టినొసగు
    నిధియే కీర్తిని నిలుపును నేరము మాపున్
    నిధియే దైవంబిలలో
    నిధిచా లసుఖమ్మునిచ్చు నిక్కము గానే

    రిప్లయితొలగించండి
  8. లేదే నిధిలో సౌఖ్యము
    రాదే నిధితోనెశాంతి రాదే చోటన్
    పోదే నిధితో వేదన
    ఏదీ పెన్నిధి యెచటన్ ఎరుకగ లేదే

    రిప్లయితొలగించండి
  9. పరుచూరి వంశీ గారూ,
    ధన్యవాదాలు.
    *
    పండిత నేమాని వారూ,
    అభినవ త్యాగరాజులాగా ‘రాముని పాద సన్నిధి’ మేలన్న మీ పద్యం అత్యుత్తమంగా,మనోహరంగా ఉంది.అభినందనలు, ధన్యవాదాలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ‘హరి సన్నిధి’ మేలన్న మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    మద్దూరి ఆదిత్య గారూ,
    మంచి భావాన్ని వచన పద్యంలో తెలియజేసారు. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    చక్కని నీతిబోధమమైన పద్యాన్ని చెప్పారు.అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    విశేష పద్యరచన పట్ల మీ ఆసక్తి ప్రశంసింపదగినది. మీ పద్యం భేషుగ్గా ఉంది.అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. రామా!
    ఏది దక్క నిల మరేదనవసరమో
    దానిఁ బడయ మాకు దారి జూపు
    పెన్నిధిట తమపద సన్నిధి సుఖమీయ
    నే నిధు లెటుల సుఖమిచ్చు మాకు?

    రిప్లయితొలగించండి
  11. మధురముగఁ బాడెఁ ద్యాగయ
    "నిధి చాల సుఖమ? రఘుకులుని పదమ్ముల స
    న్నిధి చాల సుఖమ?" యనుచును
    సుధలు గురియు తెలుఁగు వెలుఁగు సూక్తులు మెఱయన్!

    రిప్లయితొలగించండి
  12. విధి వంచన లేకుండగ
    నిధు లన్నిట దోచి దాచి నిలకడ లేకన్
    సుధ వంటి దైవ చింతన
    మధురము గానుండు మనకు మాయా జగతిన్

    రిప్లయితొలగించండి
  13. నిధి కావలెనంచును నేఱక దు
    ర్విధి నార్జనఁ జేయక పెన్నిధియౌ
    మధుసూదనునిన్ మనమారగ ద
    ల్చు ధనంబునుఁ బొందగఁ జూడుమికన్.

    గురువుగారూ,
    అనేక ధన్యవాదములు. నిధి కన్నా పెద్దది ఉందని కూడా చెపుదామని....ఇంకొక ప్రయత్నము.

    రిప్లయితొలగించండి
  14. సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    త్యాగయను ప్రస్తావిస్తూ మధురమైన పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మనస్సుకు హాయిని గూర్చే పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ రెండవ పద్యం కూడా మనోహరంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి




  15. నిధియె చాల సుఖమ్మె?యనియడుగుచును
    రామపాదసన్నిధికాదె రమ్యమనెడి
    త్యాగరాజగానము విని రహినిపుట్ట
    నింక మదిలోన సందియ మేల మనకు?

    రిప్లయితొలగించండి
  16. కమనీయం గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. డబ్బు
    రచన: మా తమ్ముడు చిరంజీవి కొర్నెపాటి చంద్రశేఖరరావు

    విధులన్ చక్కగ నిర్వహించు భటుడౌ విత్తంబు చింతింపగా,
    నధముండౌ యజమాని తానెయగు నీ యర్ధంబు తర్కింపగా,
    పృథివిన్నర్థము సార్ధకంబుగ దగన్ వెచ్చించినన్ వేలుపే,
    వ్యధలున్ గాక సుధల్ వరించునె? ధనవ్యామోహసంపన్నునిన్!!!

    రిప్లయితొలగించండి
  18. కొర్నెపాటి విద్యాసాగర్ రావు గారూ,
    శంకరాభరణం బ్లాగు మీ సోదరులిద్దరికీ స్వాగతం పలుకుతున్నది. సంతోషం.
    మీ సోదరులు చంద్రశేఖర్ రావు గారి పద్యం (కొద్దిగా అన్వయలోపం ఉన్నా) మొత్తానికి బాగుంది. ముందు ముందు చాలా మంది పద్యకవిత్వం వ్రాయగలరని కచ్చితంగా చెప్పగలను.
    ఇంతకుముందు మీనుండి నా ఫోన్ కు మీ ఎస్సెమ్మెస్ వచ్చింది. అది అసంపూర్ణంగా ఉంది. “తాతగారి రచనలలో మూడు..." అన్నారు. సందేశం పూర్తిగా లేదు.

    రిప్లయితొలగించండి