1, అక్టోబర్ 2013, మంగళవారం

సమస్యాపూరణం – 1191 (మడిగట్టిన పండితుండు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
మడిగట్టిన పండితుండు మద్యము గ్రోలెన్.
ఈ సమస్యను పంపిన సంపత్ కుమార్ శాస్త్రి గారికి ధన్యవాదములు.

58 కామెంట్‌లు:

 1. తడి యారని మడి బట్టను
  వడి వడీగా నార బెట్ట బారున కేగెన్
  సడి జేయక చలి కోర్వని
  మడి గట్టిన బ్రాహ్మ ణుండు మద్యము గ్రోలెన్

  రిప్లయితొలగించండి
 2. "బ్రాహ్మణుండు" అనే కంటే "పండితుండు" అంటే బాగుంటుందేమో!

  రిప్లయితొలగించండి
 3. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  యజమాని వద్దంటున్నా అలవాటైన రైతు మానునా :

  01)
  __________________________________

  వడి వడి పారెడి యెద్దుల
  మడి దున్నెడి కమతకాడు - మద్యము ద్రావన్
  విడు , వలదని వారించిన
  మడి గట్టిన బ్రాహ్మణుండు; - మద్యము గ్రోలెన్ !
  __________________________________

  రిప్లయితొలగించండి
 4. వెండిశివుణ్ణి పూజించి
  మడికట్టుతో భార్య ప్రసాదం తెచ్చిస్తే
  కులవృత్తి మాని
  మడిలో యెద్దులతో అరకను గట్టి
  కాయకష్టం చేస్తున్న బ్రాహ్మడు
  కొంచెం పుచ్చుకున్నాడు చాటుగా :

  03)
  __________________________________

  మడికాసు శివుని పూజల
  మడికచ్చను భార్యదెచ్చి - మడికూ డిడినన్
  మడకల దున్నగ నెద్దుల
  మడి గట్టిన బ్రాహ్మణుండు - మద్యము గ్రోలెన్ !
  __________________________________
  మడికాసు = వెండి
  మడికచ్చ = వైదిక స్త్రీలు చీర కట్టుటలోని ఒక రీతి
  మడికూడు = ప్రసాదము
  మడక = అరక
  మడి = పొలము

  రిప్లయితొలగించండి
 5. చెడ్డ వాడైన కొడుకు తండ్రి మాట వినునా :

  02అ)
  __________________________________

  చెడు నడతల జరియించెడు
  కడవాడగు తనయు తోడ - "కాదంబరమున్
  విడ వలయు తప్పురా " యన
  మడి గట్టిన బ్రాహ్మణుండు; - మద్యము గ్రోలెన్ !
  __________________________________
  కాదంబరము = మద్యము

  రిప్లయితొలగించండి
 6. మడీ తడీ లేనివాడు తాగడమే కాదు విశ్వేశ్వరుణ్ణి కూడా నిందిస్తాడు మైకంలో :

  04అ)
  __________________________________

  మడిగా శివు బూజించును
  మడి గట్టిన బ్రాహ్మణుండు ! - మద్యము గ్రోలెన్
  మడి విడనాడిన వాడే
  మడికాసుమలఃప్రభువును - మైకము దిట్టున్ !
  __________________________________
  మడికాసుమల = రజతాద్రి = కైలాసపర్వతము

  రిప్లయితొలగించండి
 7. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..
  శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
  కవిమిత్రులకెల్లరుకు శుభోదయం...
  ======*=======
  గుడి ముంగిట వలదనెనా
  మడి గట్టిన బ్రాహ్మణుండు;మద్యము గ్రోలెన్ !
  చెడు నడతలుగల యువకులు
  వడివడిగ పరుష పదములు బల్కుచు వెడలెన్!

  రిప్లయితొలగించండి
 8. అడవి జనులు దెచ్చిన మద్యము బహు శ్రేష్టమనివిని మడి గట్టితినని మరచి బ్రాహ్మణుండు మద్యము ద్రాగెను.

  కొన్ని ప్రాంతములలో మద్యము నైవేద్యముగ బెట్టుదురు.
  =======*===========
  అడిగిన వరముల నిచ్చెడి
  యుడుపతి నైవేద్యముగను నొక్క కడవతో
  డడవి జనులు నిడుగ,మరచి
  మడి గట్టిన బ్రాహ్మణుండు మద్యము గ్రోలెన్ !

  రిప్లయితొలగించండి
 9. మిస్సన్న గారూ,
  ఈ సమస్య ప్రసిద్ధమైనదే. ఇది సంపత్ కుమార్ శాస్త్రి గారి సృష్టి కాదు. గతంలో కొన్ని అవధానాలలో మంచి పూరణలకు అవకాశమిచ్చిన సమస్యే.
  అయినా మీ సూచనను పాటించి మార్పు చేస్తున్నాను. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 10. మిత్రులారా! శుభాశీస్సులు.
  ఈశాన్య భారత దేశాచారము ప్రకారము ఇది యొప్పిదమే.

  వడి వామాచారుండొ
  క్కడు పూజ మకార పంచకముతో జేయన్
  దొడగుచు సిద్ధంబగుటను
  మడిగట్టిన పండితుండు మద్యము గ్రోలెన్

  (మకారాది పంచకమనగా మహిళ, మద్యము, మాంసము, మొ.వి.)

  రిప్లయితొలగించండి
 11. రాజేశ్వరి అక్కయ్యా,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  మీరున్న అమెరికా వంటి చలిదేశాల్లో కొందరికి అది తప్పదేమో కాని, ‘మడిబట్ట నారబెట్టడానికి బారుకు పోవడం’ ఏమిటి? ‘ఆరబెట్టి’ అనడానికి టైపాటా?
  *
  వసంత కిశోర్ గారూ,
  మీ నాలుగు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. సంపత్ కుమార్ శాస్త్రి గారి పూరణ....

  వడిగల యెద్దులు గానకఁ
  తడియంటని నేలగాంచి దైన్యముతోడన్
  సడిచేయక విషమనుకొని
  మడిగట్టిన బ్రాహ్మణుండు మద్యము గ్రోలెన్

  రిప్లయితొలగించండి
 13. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ఇంతకీ ఆ బ్రాహ్మణుడు పౌరోహిత్యం వదిలి వ్యవసాయం మొదలుపెట్టినవాడా?

  రిప్లయితొలగించండి
 14. ఆర్యా.. నమస్సులు..మడిగట్టిన బ్రాహ్మణుండు మద్యము ద్రాగెన్ అను సమస్యను శంకరాభరణములో గతములో ఇచ్చినట్లు గుర్తు...
  ఇంతకీ మేము మడి గట్టవలసినది బ్రాహ్మణునకా..పండితునకా...

  రిప్లయితొలగించండి
 15. మడిగట్ట పొలము కేగెను
  గుడికందుల పండిత శివ గురవారావే
  ముడిగట్టి బుడ్డి దెచ్చెను
  మడిగట్టిన పండితుండు మద్యము గ్రోలెన్.


  రిప్లయితొలగించండి
 16. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  నిజమే. ఇది గతంలో ‘మడిగట్టిన శ్రోత్రియుండు మద్యము ద్రాగెన్’ అని ఇవ్వబడింది. గుర్తుంటే ఇవాళ దీనిని ఇవ్వకుండా ఉండేవాడిని.
  ‘బ్రాహ్మణుండు/పండితుండు’ ఇద్దరిలో ఎవరినీ తీసుకున్నా ఫరవాలేదు.
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. ఆర్యా ! ధన్యవాదములు..
  నాపూరణ మరొక విధముగా...

  ముడిగట్టి బుడ్డి బొడ్డున
  గుడికందుల పండిత శివ గురవారావే
  మడిగట్ట పొలము కేగెను
  మడిగట్టిన ' పండితుండు ' మద్యము గ్రోలెన్.

  రిప్లయితొలగించండి
 18. శ్రీగురుభ్యోనమ:

  వడివడిగా నెవరేగిరి
  గుడి పూజకు,శ్రమ మరువగ గ్రోలెన్ దేనిన్
  మడి దున్నిన రైతు యొకడు
  మడి కట్టిన బ్రాహ్మనుండు,మద్యము గ్రోలెన్.

  రిప్లయితొలగించండి
 19. గురువుగారికి మరియునితర కవిమిత్రులకు నమస్సుమాంజలి.

  మొదటిసారిగా నాచే సూచింపబడిన సమస్య శంకరాభరణములో రావడము నాకెంతో ఆనందముగా ఉంది.

  ఇకపోతే, "మడి" అనే పదానికి "మడుగు" అనే అర్థముతో రాయలసీమ ప్రాంతములో వాడుక గలదు. మరి నిఘంటువులు ఏమి చెప్తున్నాయో తెలీదు. సాధారణంగా మడుగులో ఉన్నవాళ్ళు ఇతరులను తాకడము అనేది ఉండదు ( నిష్ట ఎక్కువ కాబట్టి ). అటువంటి వాడు అందునా బ్రాహ్మణుడు మద్యము త్రాగడము అనేది సమస్య. అందువలననే ఇక్కడ పండితుడు అనేదానికంటే శ్రోత్రియుడు లేదా బ్రాహ్మణుదు అనే పదాలకే ఎక్కువ పొందిక జరుగుతుంది సమస్యతో.

  కానీ, ఇతరకవిమిత్రుల కోరికపరంగా నైతెనేమి, ఎక్కువ పూరణలు కొఱకైతేనేమి, గురువుగారు చేసిన సవరణ ( పండితుండు ) సర్వదా ఆమోదయోగ్యమే.

  పాతపూరణ తెలీదు కానీ, నేను కూడా "మడి" అనే పదాన్ని సేద్యము పరంగానే అర్థాన్ని సంగ్రహించి పూరించినాను.

  త్వరలో మరికొన్ని సమస్యలను సేకరించి పంపుతాను.

  ధన్యోస్మి.

  రిప్లయితొలగించండి
 20. వడివడిగా గుడికేగెను
  మడిగట్టిన పండితుండు, మద్యము గ్రోలెన్
  దుడుకుదనంబులు గలిగియు
  చెడు వర్తన గలిగియుండు చెనటులు మిగులన్

  రిప్లయితొలగించండి
 21. హనుమచ్ఛాస్త్రి గారూ,
  మార్పులు చేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘పొలమున కేగెను’ అనవలసి ఉంటుంది కదా... అక్కడ ‘పొలమునకుఁ జనె’ అందామా?
  *
  శ్రీపతి శాస్త్రి గారూ,
  క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘రైతు + ఒకడు’ సంధి నిత్యం. యడాగమం రాదు. అక్కడ ‘రైతొకండు’ అందాం.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  గతంలో ‘శ్రోత్రియుండు’ అంటూ ఇచ్చిన సమస్యే ఇది. అందువల్ల మార్పు చేయవలసి వచ్చింది.
  ‘మడి’ అన్న పదానికి ‘వరి పొలము’ అన్న అర్థం సుప్రసిద్ధమే. ఏదైనా అర్థం కోసం ఎక్కడికో వెళ్ళి నిఘంటువులను వెదకాల్సిన పని లేదు. మన బ్లాగులోనే ఉన్న ‘ఆంధ్రభారతి’ని క్లిక్ చేసి, పదాన్ని టైప్ చేస్తే దానికి ఏయే నిఘంటువులు ఏయే అర్థాలనిచ్చాయో, పర్యాయపదాలతో సహా మీ ముందు ప్రత్యక్షం.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. కొన్ని ప్రాంతములలో మద్యము నైవేద్యముగ బెట్టుదురు.
  =========*==========
  పుడమిని గాచెడి పురుషుడు
  కడు ముదమున జేకొనునని కడవల తోడన్
  నిడగ,ప్రసాద మనుచు నా
  మడిగట్టిన బ్రాహ్మణుండు మద్యము గ్రోలెన్!

  రిప్లయితొలగించండి
 23. వరప్రసాద్ గారూ,
  కొందరు గ్రామదేవతలకు మద్య మాంసాలు నైవేద్యం చేయడం మామూలే. మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘కడవలతో తా/ మిడగ...’ అనండి.

  రిప్లయితొలగించండి
 24. పూజ్యగురుదేవులు శంకరయ్యగారికి కవులందరికీ నమస్కారములు
  వడివడిగ సంధ్యవార్చగ
  తడి యుడుపుల పండితుండు తాడిని జేరెన్
  జడదారి జూచి పల్కెను
  మడిగట్టిన పండితుండు మద్యము గ్రోలెన్

  రిప్లయితొలగించండి
 25. గడగడ వణికెడు తండ్రికి
  పడిపోయినపల్సుజూడపరుగున బోయెన్
  కొడుకులు మందని యివ్వగ
  మడిగట్టిన పండితుండు మద్యము గ్రోలెన్

  రిప్లయితొలగించండి
 26. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 27. పొడగని యొకతుచ్ఛాత్ముని
  మడిగట్టిన బ్రాహ్మణుండు(పండితుండు), "మద్యము గ్రోలెన్
  కెడ జేరనీయరా"దని
  వడివడిగా తొలగిపోయె పలుకక తానున్.

  రిప్లయితొలగించండి
 28. విడదీయ రాని బంధము
  చెడునడత వలన దగిలిన స్నేహము తోడన్
  ముడివడ బలహీనతతో
  మడిఁగట్టిన పండితుండు మద్యము గ్రోలెన్!

  రిప్లయితొలగించండి
 29. గుడి చుట్టు తిరిగి గొల్చెను
  మడిగట్టిన బ్రాహ్మణుండు, మద్యము గ్రోలేన్
  గుడి చెంత భక్తి భాహ్యుడు ,
  గుడిలోనే తస్కరించె కుమతుండొకడున్.

  రిప్లయితొలగించండి
 30. గుండు మధుసూదన్ గారి పూరణ......

  వెడలెను పశ్చిమదేశ
  మ్మిడఁగను నుద్యోగ మెలమి మేలయెఁ; జలిచే
  వడ వడ వణఁకుచుఁ దాళక
  మడిఁగట్టిన పండితుండు మద్యముఁ గ్రోలెన్!

  రిప్లయితొలగించండి
 31. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  మంచి పూరణ చెప్పారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 32. అడుసున పొలమును దున్నుచు
  వడివడిగా పనులు జేసి బడలిక తోడన్
  కడతేరక కష్టంబులు
  మడి గట్టిన బ్రాహ్మణుండు మద్యము గ్రోలెన్.

  రిప్లయితొలగించండి
 33. బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 34. గురువుగారూ! నేను ఇప్పుడే బ్లాగును చూస్తున్నాను. ఇంతవరకు యేవ్యాఖ్యనూ పెట్టలేదు. "The Other" నేను కాదు.

  రిప్లయితొలగించండి

 35. తడయక తన వరి చేనుకు
  మడి గట్టిన, బ్రాహ్మణుండు, మద్యము గ్రోలెన్
  పడియుండి పాక లోపల,
  సడిజేయక, పాలెగాడు సంతోషముతో.

  రిప్లయితొలగించండి
 36. మిస్సన్న గారూ,
  గతంలో మీరొకసారి "The other" నేనే అని చెప్పుకున్నారు కదా! అందుకని పొరబడ్డాను. మన్నించండి.
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 37. ఆర్యా ! ధన్యవాదములు..
  మీరు సూచించిన సవరణతో...

  ముడిగట్టి బుడ్డి బొడ్డున
  గుడికందుల పండిత శివ గురవారావే
  మడిగట్ట పొలమునకు జనె
  మడిగట్టిన ' పండితుండు ' మద్యము గ్రోలెన్.

  రిప్లయితొలగించండి
 38. విడువక పూజలు సలిపెను
  మడిగట్టిన పండితుండు,మద్యము గ్రోలెన్
  చెడు నడత గలిగిన నరుడొ
  కడు- తలరాతలను మార్చు ఘనులిట గలరే?

  రిప్లయితొలగించండి
 39. గురువుగారు,
  other అట్లా చెప్పి ఇంకొక వ్యాఖ్య పెట్టేది ఎప్పుడూ చంద్రశేఖరులవారు కదా!

  రిప్లయితొలగించండి
 40. లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  The other విషయంలో నేను నిజంగానే పొరబడ్డాను. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 41. శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యములో "చేనుకు"కి బదులుగా చేనునకు అని ఉండవలెను. మరియు పద్యములో అన్వయ లోపము కనుపట్టుచున్నది. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 42. మడిలో నారును వేసియు
  వడివడిగా గృహము జేరి వడ్డన కోరన్
  ఘడియైన ఓర్వ జాలక
  మడిగట్టిన పండితుండు మద్యము గ్రోలెన్

  రిప్లయితొలగించండి
 43. గురువుగారికి నమస్సులు. యడాగమము విషయములో పొరపాటును సవరించి క్రింది విధంగా సవరించినాను.

  వడివడిగా నెవరేగిరి
  గుడి పూజకు,శ్రమ మరువగ గ్రోలెన్ దేనిన్
  మడి దున్నిన యువకుడొకడు (యువకుడు తాన్)
  మడి కట్టిన బ్రాహ్మనుండు,మద్యము గ్రోలెన్.

  రైతొకండు అంటే 3 వ గణము జగణము ఔతుంది కదా!

  ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 44. మిస్సన్న గారూ,
  మీ పద్యం మొదటి పాదాన్ని ‘తడయక వరి చేనునకున్...’ అందాం. ‘మడి గట్టెను’ అంటే అన్వయలోపం తొలగుతున్నది.
  *
  ప్రభల రామలక్ష్మి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  మీ మూడవ పాదాన్ని ‘గడియ యయిన నోర్వకనే’ అనండి.
  *
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ సవరణ బాగుంది. సంతోషం.

  రిప్లయితొలగించండి
 45. శ్రీ కంది శంకరయ్య గారు: శుభాశీస్సులు.
  మీరు శ్రీ మిస్సన్న గారి పద్యమునకు చిన్న సవరణలు సూచించేరు. మడిగట్టెను అంటే అన్వయము సరిపోవును కానీ మీరు ఇచ్చిన సమస్యలోని అక్షరములను మార్చుట జరుగును కదా. చూడండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 46. పండిత నేమాని వారూ,
  నిజమే. నేను గమనించలేదు. ధన్యవాదాలు.
  ‘కడు నలసెను పొలమునకున్
  మడిగట్టిన పండితుండు....’ అంటే ఎలా ఉంటుందంటారు?

  రిప్లయితొలగించండి
 47. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ! సరే అంటాను. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 48. గురువుగారికి నమస్సులు. పొరపాటును క్రింది విధంగా సవరించినాను.

  మడిలో నారును వేసియు
  వడివడిగా గృహము జేరి వడ్డన కోరన్
  గడియ యయిన నోర్వకనే
  మడిగట్టిన పండితుండు మద్యము గ్రోలెన్

  రిప్లయితొలగించండి
 49. ఎడతెరిపిలేని వర్షము,
  కడుభీకర చలికి గుండె గజగజ వణుకన్
  బిడియపడుతు చలివీడను
  మడి గట్టిన బ్రాహ్మణుండు మద్యము గ్రోలెన్

  రిప్లయితొలగించండి
 50. నేమాని పండితులకు, గురువుగారికి నా పద్యంలోని తప్పులను సరిదిద్దినందులకు ధన్యవాదములు

  రిప్లయితొలగించండి
 51. కుసుమ సుదర్శన్ గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  ‘భీకర చలి’ అని సమాసం చెయ్యరాదు కదా. ‘కడు బెడగగు చలికి’ అందామా?

  రిప్లయితొలగించండి
 52. విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని |
  శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః ||


  మిడిమిడి జ్ఞానమునందున్
  వడివడిగా గీత చదివి వార్ధక్యమునన్
  తడి బట్టలు కట్టు కొనుచు
  మడిగట్టిన పండితుండు మద్యము గ్రోలెన్

  రిప్లయితొలగించండి


 53. సుడిగుండపుసంకటమున
  పడినట్టి మనజుడు తాను పరమాత్ముని జే
  ర డిగనురుకన్ జిలేబీ,
  మడిగట్టిన పండితుండు మద్యము గ్రోలెన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 54. ప్రభాకర శాస్త్రి గారూ,
  జిలేబీ గారూ,
  ఇద్దరూ పోటీ పడి పాత సమస్యలకు చక్కని పూరణలను అందిస్తున్నారు. సంతోషం. కాని పనుల ఒత్తిడి వల్ల మీ పూరణలను సమీక్షించలేకపోతున్నాను. మన్నించండి.
  నేను సిద్ధం చేస్తున్న సమస్యాపూరణల పుస్తకంలో మీ పూరణలు తప్పక ఉంటాయి.

  రిప్లయితొలగించండి
 55. రిప్లయిలు

  1. కంది వారు

   వావ్ ! సమస్యా పూరణముల పుస్తకమా !
   అదురహో ! వేచివుంటాం

   జిలేబి

   తొలగించండి
  2. అవునండీ... కొంతకాలంగా ఆ పనిమీద ఉన్నాను. కనీసం ఐదు వందల సమస్యలు, ఒక్కొక్క సమస్యకు శంకరాభరణంలోని కవిమిత్రుల పూరణలలో నాలుగింటిని ఎన్నుకొంటూ సిద్ధం చేస్తున్నాను. అంటే ప్రతి పేజీలో పైన బోల్డ్ అక్షరాలతో సమస్య, దాని క్రింద నాలుగు పూరణలు పూరించినవారి పేర్లతో సహా ఉంటాయి. అంటే ఒక్కొక్క పేజీకి ఒక సమస్య, నాలుగు పూరణలు ఉంటాయి. ఇప్పటికి వందకు పైగానే ఎన్నుకున్నాను. ఈ మధ్య కొంత అనారోగ్యం, పని ఒత్తిడి కారణంగా వెనుకబడింది. మళ్ళీ మొదలు పెట్టాలి.

   తొలగించండి
 56. పడిగాపులు పడుచు పడుచు
  కుడి యెడమలు చూడకుండ కూరిమి మీరన్
  ధడధడ వోటుల కొరకై
  మడిగట్టిన పండితుండు మద్యము గ్రోలెన్

  రిప్లయితొలగించండి