13, అక్టోబర్ 2013, ఆదివారం

పద్య రచన - 493 (విజయ దశమి)

కవిమిత్రులారా,
దసరా శుభాకాంక్షలు.
ఈనాటి పద్యరచనకు అంశము....
"విజయ దశమి"

17 కామెంట్‌లు:

 1. మిత్రులందరికీ విజయ దశమి (విజయద శమీ) పర్వ శుభాకాంక్షలు:

  మాలిని:
  విజయ దశమి మీలో వెల్గులన్ బెంపుజేయున్
  విజయ దశమి మీకున్ వేడుకల్ గూర్చుచుండున్
  విజయ దశమి యంచున్ విందులన్ దేలుడెంతే
  విజయ నిరతులౌచున్ పృథ్వి వర్ధిల్లు డాప్తుల్

  రిప్లయితొలగించండి
 2. మిత్రులందరికీ విజయ దశమి శుభాకాంక్షలు

  రిప్లయితొలగించండి
 3. విజయ మందెను రాముడు వీరు డగుచు
  విజయ మందెను పార్థుడు విజయు డగుచు
  నే యుగంబు నందైన నీ కృప లేక
  విజయ దశములు లేవమ్మ విజయ దుర్గ!

  రిప్లయితొలగించండి
 4. గురువులు శ్రీ శంకరయ్య, శ్రీ పండిత నేమాని గారలు మరియు కవి మిత్రులకు ,పాఠకమహాశయులకు విజయ దశమి శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 5. శ్రీ కంది శంకరయ్య గురువర్యులకు వందనములు,,అర్థ గణదోషములున్న సవరించ ప్రార్థన !
  విజయ దశమి శుభాకాంక్షలతో...

  విజయ దశమినాడు జనులు వివిధ పనులు
  విజయ మొసగ వలెనని విజయ దుర్గ
  మాత పూజలు జేతురు మనసు బెట్టి
  భద్ర కాళిని గొలుతురు భక్తి తోడ

  రిప్లయితొలగించండి
 6. చెడుపై మంచికి నెన్నడున్ విజయమౌ సృష్ట్యాదినుం చందురే!
  కడగండ్లొందుచు ధాత్రిపై జనులు దుఃఖాంబోధిలో నీదగా
  వడి నీ వుద్భవ మంది దుష్ట తతులన్ వజ్రాయుధోపేతవై
  మడియం జేయుదు వన్న ధైర్యము సదా మాకిమ్ము దుర్గాంబికా!

  విజయ మొసగు మమ్మా! విశ్వవిజ్ఞాన మిమ్మా!
  అజ హరి హర వంద్యా! ఆగమాంతాది వేద్యా!
  రజతగిరి నివాసా! రాజితానంద హాసా!
  విజయ దశమి వేళన్ వేడెదన్ నీ విభూతిన్!

  రిప్లయితొలగించండి
 7. బ్లాగు వీక్షకులు, గురువర్యులకు, కవిమిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలు.

  కినుకను చూపకు మాపై
  కనకమ్మును కోరమమ్మ, కారుణ్యముతో
  గని మాకష్టములన్నిటి
  దునుమాడుమ విజయ ! కనకదుర్గా ! మాతా !

  రిప్లయితొలగించండి
 8. విజయ దశమి నాడు విష్ణు బూజనుసేయ
  సకల సంపదలును,సంతునిచ్చు
  రాముడటులజేసి రావణువధియించె
  అర్జునుండు గెలిచె నరి గణమును

  రిప్లయితొలగించండి
 9. సాహితీ మిత్ర కవి పండిత వీక్షకాళికి విజయ దశమి పర్వదిన శుభాకాంక్షలు!

  మహిష రాక్షస భయముచే మహి వసించు
  జనుల భయమునుఁ దొలఁగింప సత్వరమ్మె
  యాదిశక్తి స్వరూపయై యసురుఁ ద్రుంచి,
  విజయ మందించ నదియయ్యె విజయ దశమి!

  రిప్లయితొలగించండి
 10. అయ్యా! శ్రీ మిస్సన్న గారు: శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.

  సృష్ట్యాది నుండి యందురే అనుట సాధు ప్రయోగము.
  రజతగిరి నివాసిని మరియు రాజితానంద హాసిని అనుట సాధువు అనుకుంటాను.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 11. అయ్యా! శ్రీ సహదేవుడు గారు: శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.

  3వ పాదములో టైపు పొరపాటు అనుకొంటాను. కృపయె లేక అని ఉండాలి.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 12. పండిత నేమానిగారికి గురుదేవులు శంకరయ్యగారికి వందనములు

  అసురగణము ననిని హతమొనర్చెను దుర్గ
  రావణుని జంపె రామచంద్రు
  డర్జునుండు పోరి ఆలమందనుదెచ్చె
  కౌరవులనుగెల్చి ధీరుడగుచు
  అస్త్రవిజ్ఞాన సంపద అమిత బలము
  సాహసము శూరతయు గల్గ చాలవెపుడు
  తగిన భక్తియు శ్రద్ధయుధర్మనిష్ఠ
  విజయదాయక మనిదెల్పువిజయదశమి

  రిప్లయితొలగించండి
 13. మునుమహిషాసురాధముని పోరున సంహరణంబొనర్చి యా
  మునిగణ వేదవేత్తులకు మోదమొసంగె ధరాతలంబునం
  దనుపమ భక్తిభావములకాశ్రమై వెలుగొందు దుర్గ మా
  కనవరతంబు నిచ్చుత శుభాశిషముల్ నిజజన్మ ధన్యతన్.

  రిప్లయితొలగించండి
 14. గురువుగారూ! ధన్యవాదములు. తమరి సూచన ప్రకారం సవరణ:


  విజయ మందెను రాముడు వీరు డగుచు
  విజయ మందెను పార్థుడు విజయు డగుచు
  నే యుగంబైన మునగక నీ కృపాబ్ది
  విజయ దశములు లేవమ్మ విజయ దుర్గ!

  రిప్లయితొలగించండి
 15. నేమాని పండితార్యా! మీ సూచనల ననుసరించి సవరించాను. ధన్యవాదములు.

  చెడుపై మంచికి నెన్నడున్ విజయమౌ సృష్టిన్, నిజం బెన్నగా!
  కడగండ్లొందుచు ధాత్రిపై జనులు దుఃఖాంబోధిలో నీదగా
  వడి నీ వుద్భవ మంది దుష్ట తతులన్ వజ్రాయుధోపేతవై
  మడియం జేయుదు వన్న ధైర్యము సదా మాకిమ్ము దుర్గాంబికా!

  విజయ మొసగు మమ్మా! విశ్వవిజ్ఞాన మిమ్మా!
  అజ హరి హర వంద్యా! ఆగమాంతాది వేద్యా!
  వరము లొసగు మమ్మా! వందన మ్మందుకొమ్మా!
  విజయ దశమి వేళన్ వేడెదన్ నీ విభూతిన్!

  రిప్లయితొలగించండి
 16. మిత్రులార! శుభాశీస్సులు.
  ఈనాటి పద్య రచన అంశములో పాల్గొనిన కవి మిత్రులందరకు శుభాభినందనలు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 17. స్వాగతం

  అమ్మవంచు గని యాశగ బిడ్డన్
  నమ్మకంబిడితి నా గతి నీవే!
  మమ్ములన్ విజయ మార్గము పంపన్
  సమ్మతమ్మొసగి స్వాగతమిమ్మా!

  రిప్లయితొలగించండి