28, ఏప్రిల్ 2014, సోమవారం

సమస్యాపూరణం - 1396 (రామవినాశముం గనుచు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రామవినాశముం గనుచు రాక్షసు లేడ్చిరి సీత నవ్వెరా
(ఆకాశవాణి వారి సమస్య)

30 కామెంట్‌లు:

  1. భూమి పయిన్ జెలంగు దివి పోయన నొప్పెడు లంక జొచ్చితిన్
    భూమిజ కార్తి బాపితిని, బూడిద జేసితి లంక నెల్ల, జే
    రామ! యటంచు పొంగితిని, రావణు డెంతయు గుప్ప గూలె, నో
    రామ! వినాశమున్ గనుచు రాక్షసు లేడ్చిరి, సీత నవ్వెరా

    రిప్లయితొలగించండి
  2. ఏమని జెప్పగా వలయు నేనిటు లంకను ముట్టడిం చగా
    భూమిజ కేమియా పదలు బొందగ జేసెనొ రాక్షసాం గనల్
    నామది తల్లడి ల్లగను మన్నన జేయుమ టంచువే డెనో
    రామ ! వినాశముం గనుచు రక్కసు లేడ్చిరి సీత నవ్వెరా

    రిప్లయితొలగించండి
  3. గురువుగారూ......
    ఇతరకవివర మార్గమందేగుచుంటి......

    క్షేమము జెప్పవచ్చితిని, సీతను జూచితి లంకలోన ను
    ద్దామ విశిష్ఠభావముల దాశరథీ తపమాచరించు,సం
    గ్రామము చేయగల్గితిని గాల్చితి వాలముచేత లంక నో
    రామ! వినాశముం గనుచు రాక్షసులేడ్చిరి సీత నవ్వెరా.

    రిప్లయితొలగించండి
  4. భూమిజయున్కిగాంచగనభూతగతిన్పయనించి,లంక నా
    రామమునందునొక్కశిఖి బ్రాకి కనుంగొని, సీతకూర్మికన్
    రామునిగుర్తు గానొసగి,రక్కసు లేడ్వవనంబుగూల్చ, నా
    రామవినాశముం గనుచు రాక్షసు లేడ్చిరి సీత నవ్వెరా

    రిప్లయితొలగించండి
  5. పండిత నేమాని గారికిపూజ్యులుగురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    ఏమిదివింత?యొక్కకపి యివ్విధి లంకను జొచ్చిసీతతో
    సేమపు మాటలాడి వనసీమను ధ్వంస మొనర్చి రావణున్
    చీమగ ధిక్కరించ దనుజేశుడు తోకకు నిప్పు వెట్టగా
    భీమ పరాక్రమాన కపి వేగమె లంకను గాల్చె మందిరా
    రామ వినాశముం గనుచు రాక్షసు లేడ్చిరి సీత నవ్వెరా

    రిప్లయితొలగించండి
  6. పండిత నేమాని వారూ,
    రామసంబోదనతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘జేసిరొ రాక్షసాంగనల్’ అనండి.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    లంకానగరారామవినాశనం గురించి ఎవరు వ్రాస్తారా అని ఎదురుచూస్తున్నా. మీనుండి వచ్చింది. మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు.
    ఇదే భావంతో నేను మొదలు పెట్టిన పద్యం ఒకటిన్నరపాదాల దగ్గర ఆగిపోయింది...

    రిప్లయితొలగించండి
  7. భూమిజ సుందరాంగి రఘు భూవరు భార్యను దుష్ట చిత్తుడై
    రామనుపస్థి తిన్ బరిచి రావణు డెత్తుక పోయె లంకకున్
    రాముడు వానితోడ సమరంబును జేసియు జంపె, విరోధి శ్రీ
    రామ, వినాశముం గనుచు రక్కసు లేడ్చిరి సీత నవ్వెరా

    రిప్లయితొలగించండి
  8. కెంబాయి తిమ్మాజీరావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘రామ + అనుపస్థితి = రామానుపస్థితి’ అవుతుంది. అక్కడ ‘రాముడు లేనిచో’ అందామా?

    రిప్లయితొలగించండి
  9. శ్రీ శంకరయ్య గురువరులకు నమస్కారములు
    సవర్ణ దీర్ఘ సంధి కార్యము మరవడం జరిగింది. మీ సూచనకు ధన్యవాదములు
    సవరిస్తూ వ్రాశాను చూడండి

    భూమిజ సుందరాంగి రఘు భూవరు భార్యను దుష్ట చిత్తుడై
    రాముడు లేని పూట గని రావణు డెత్తుక పోయె లంకకున్
    రాముడు వానితోడ సమరంబును జేసియు జంపె, విరోధి శ్రీ
    రామ వినాశముం గనుచు రక్కసు లేడ్చిరి సీత నవ్వెరా

    రిప్లయితొలగించండి
  10. కామము తోడ రావణుడు కావరమొంది యయోనిజన్ మహా
    ప్రామిడి తోడ లంక కనివారణమున్ గొనిపోయె, తెల్పగా
    రామునకున్ జటాయువుపరాత్పరుడప్పుడు వార్ధి దాటి యా
    రాముడు రావణున్ తునిమె రాపడ రాజ్యము, చెప్పిరా సురల్
    రామ! వినాశముం గనుచు రాక్షసు లేడ్చిరి సీతనవ్వెరా.

    రిప్లయితొలగించండి
  11. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. భూమిసుతన్ రయమ్ముఁగొని పోయి నికృష్టుడు రావణుండు నా
    రామమునందు రక్కసుల రాత్రిఁ బవళ్ళును కావలుంచె, శ్రీ
    రాముడు లంకకేగివెస రావణు దున్మగఁ జెప్పిరా సురల్
    రామ! వినాశముంగనుచు రాక్షసులేడ్చిరి సీతనవ్వెరా

    రిప్లయితొలగించండి
  13. భూమిజ జూచితిన్ దనుజమూకలు తోకకు నిప్పు పెట్టగా
    నా మది మండి లంకను క్షణమ్మున జేసితి బూది కుప్పగా
    రామ! వినాశమున్ గనుచు రాక్షసు లేడ్చిరి, సీత నవ్వె, రా!
    రాముడు చూచి రమ్మన భళా! మసి జేసితి వంచు మెచ్చె నన్.


    రిప్లయితొలగించండి
  14. ఏమొకొ మీ యహమ్మిటుల హెచ్చె, నొకింత మదీయ వాక్కులన్
    ప్రేమగ నాలకింపుడిక, భీకర సంగరమందు లంకనున్
    రాముడు గెల్చినట్టు కల లందున గాంచితి భావి యిద్దియే
    రామ!వినాశముం గనుచు రాక్షసు లేడ్చిరి సీత నవ్వె!రా
    జ్యమ్ముల నేలు వారలిటు సన్మతిఁ దప్ప ఫలమ్ములిట్టులౌ!

    రిప్లయితొలగించండి
  15. లక్ష్మీ దేవిగారూ ఆఖరి పాదంలో ప్రాసను సరిజేయండి.

    రిప్లయితొలగించండి
  16. శ్రీ మిస్సన్న గారూ: శుభాశీస్సులు.
    మీ ప్రశంసకు మా సంతోషము. మీ పద్యము బాగుగనే యున్నది. అభినందనలు. దనుజ మూకలు అని సమాసము చేయరాదు కదా. చూడండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘కావలి + ఉంచె’ అన్నప్పుడు యడాగమం వస్తుంది.
    *
    మిస్సన్న గారూ,
    మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    ‘భూమిజఁ జూచితిన్ రిపుసమూహము...’ అంటే ఎలా ఉంటుందంటారు?
    *
    లక్ష్మీదేవి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘రా/జే మఱి యిట్లు చేసిన నశించును రాజ్యము మూలముట్టుగన్’ అంటే ఎలా ఉంటుంది?

    రిప్లయితొలగించండి
  18. గురువుగారు,
    మీ సవరణ బాగున్నది. ధన్యవాదములు.
    మిస్సన్న గారు, ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  19. రాముని యాజ్ఞపై హనుమ రయ్యన బోయెను లంకకున్ బహు
    క్షేమముగా వసించు సతి సీతను కన్గొని సంతసించి తా
    సోమము తోడ నాపురిని స్రొక్కగ జేసెనగ్నికప్పు డా
    రామ వినాశముంగనుచు రాక్షసు లేడ్చిరి సీతనవ్వెరా

    రిప్లయితొలగించండి
  20. అవును పండితార్యా రక్కసి మూకలు ఉంటాయి కాని దనుజ మూకలు ఉండవు.
    గురువుగారు చెప్పినట్లు రిపు సమూహము అని కాని, భట సమూహము అని కాని సరిపోతుందని అనికొంటున్నాను.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  21. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. తమరి సలహాకు కృతజ్ఞతలు. సవరించిన పద్యమును పంపుచున్నాను.
    భూమిసుతన్ రయమ్ముఁగొని పోయి నికృష్టుడు రావణుండు నా
    రామమునందు రాక్షసుల రక్షణమందున నుంచె సీత నా
    రాముడు లంకకేగివెస రావణు దున్మగఁ జెప్పిరా సురల్
    రామ! వినాశముంగనుచు రాక్షసులేడ్చిరి సీతనవ్వెరా

    రిప్లయితొలగించండి
  22. ఏమిది?మాయలోకమున నింతుల వంతల కంతు లేదయా
    రామయ!రావణాసురులు రంకెలు వేయుచు జిత్తుజూపినన్
    భూమిజ వంటిసీతలను బ్రోవగనిర్బయ చట్టమురక్షణుండ నో
    రామ! వినాశముం గనుచు రక్కసు లేడ్చిరి సీత నవ్వెరా

    రిప్లయితొలగించండి
  23. శైలజ గారూ,
    మంచి భావంతో పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
    మూడవపాదం చివర గణదోషం. ‘నిర్భయ చట్ట ముండ నో..’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  24. రాముని విల్లునే వదలి రయ్యిన వచ్చిన బాణమై యటన్
    భూమిజ జూచి, రక్కసులు భోరున నేడ్వగ సీత నవ్వగా
    ప్రేమగ పెంఛినట్టి వని పెళ్ళున మారుతి గూల్చుచుండ నా
    రామ వినాశముం గనుచు రాక్షసు లేడ్చిరి సీత నవ్వెరా

    రిప్లయితొలగించండి
  25. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. భామిని సీత శోధనకు వార్ధిని దాటిన ఆంజనేయుడా
    కోమలి జాడ దెల్సుకొని గోడు నెరింగియు తిర్గి వెళ్ళుచున్
    రాముని శత్రు దేశమగు లంకను గాల్చగ బోరుమంచు నో
    రామ! వినాశముంగనుచు రక్కసులేడ్చిరి, సీత నవ్వెరా!

    రిప్లయితొలగించండి
  27. కీమాయణము:

    క్షామము రాగ రాక్షసులు క్రందగ కమ్మని లంకనందునన్
    రాముని తోడ పోరిడగ రమ్యపు జీతము కర్వుభత్యమున్
    నీమము వీడి త్రాగుచును నిద్దుర తీరని మైకమందునన్
    రామవినాశముం గనుచు రాక్షసు లేడ్చిరి, సీత నవ్వెరా!

    రిప్లయితొలగించండి