17, ఏప్రిల్ 2014, గురువారం

పద్య రచన – 569

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:


  1. ఎందులకు ఆ కన్నీరు జిలేబి
    పద్య రచన చేయమని నందులకా !
    నీకు తెలిసిన విధమున నీవు చేయుము
    అయ్యవారలు సరిదిద్దెదరు ఏడుపు మానుమా !!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. ఈ ఎల్.కే.జీ.; యు.కే.జీ.; ప్రీకేజీ ఎవడు కనిబెట్టాడోకానీ శుద్ధ దండుగ. తల్లీ తండ్రీ ఆఫీసులకి వెళ్ళటానికి పిల్లలని జైలులో వేసినట్టనిపిస్తుంది. ఆనాడూ, ఈ నాడూ అంతే.

    రిప్లయితొలగించండి
  3. నిలయము బోవగ పదమని
    బలిమిగ చెయిబట్టి గుంజె బంధువు ననుచున్
    వలవల నేడ్చెడి పాపను
    బలిసేయగ దేని కొఱకొ పాపపు జగతిన్

    రిప్లయితొలగించండి
  4. క్షమించాలి
    మూడవ పాదంలొ " వలవల యేడ్చెడి " అని ఉండాలను కొంటాను

    రిప్లయితొలగించండి
  5. ముక్కు పచ్చలారని చిరు ముద్దు పాప
    కారుచున్నవి కన్నీరు ధారవోలె
    నాటలాడెడి వయసులో నాత్రముగను
    త్రోయు చుండిరి బడిలోన తొందరేల?

    రిప్లయితొలగించండి
  6. జిలేబీ గారూ,
    మీ భావానికి నా పద్యరూపం.......

    ఎందు కేడ్చుచుంటి వీరీతిగ జిలేబి?
    పద్యరచన చేయు పనికి భయమొ?
    తెలిసినట్లు వ్రాయ దిద్దెడి యయ్యవా
    రుండ, నింక నూరకుండు మమ్మ!
    *
    The Other గారూ,
    _/\_
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. మొండి పట్టును బట్టిన మోము జూడ
    నిష్ట పడనట్లు దోచెను నేగ బడికి
    ఎంత లాగిన చేతిని నించు కైన
    కదల కుండెను బాలిక కనుడు సామి

    రిప్లయితొలగించండి

  8. పద్యరచన;తల్లియొడి పిల్లబడి
    తల్లి యొడియె విద్యలెల్ల నేర్పును మనకు
    తండ్రి ప్రేమ నేర్పు తాత భక్తి
    ఆటలాడు వేళ యందరి స్నేహమ్ము
    తెలిసి కొనును పాప కలసిమెలసి.
    గానుగెద్దు రీతి గంతలు కట్టగ
    యూనిఫాము నందు యుక్కపోయ
    గాడిద వలె పుస్తకముల భారమ్ముతో
    చదువు “కొనగ”పాప చంప కయ్య.

    రిప్లయితొలగించండి
  9. అమ్మ నన్నేల బడికి మీ రంపువారు?
    హాయిగా నాడుకోనీయ రమ్మ మీరు
    పెద్ద దాననే పొత్తాల పెద్ద మూట
    వీపుపై బెట్టి మోయించు విధము తగునె?

    చిన్నారి పొన్నారి చిట్టి చేతుల లోన
    ......బొమ్మల బదులుగా పుస్తకములె?
    అమ్మ నాన్నా యని హాయిగా గునియక
    ......సారుల మేడంల జేర వలనె?
    గౌనులు పరికిణీల్ గాలి తగులుట మాని
    ......యూనిఫారంలోన నుక్క వలనె?
    తాతయ్య వీపుపై తైతక్క లాడక
    ......నడ్డి వంగే బర్వు నొడ్డ వలెనె?

    తెలుగు పలుకుల మానుక నలవి కాని
    పెద్ద ఇంగ్లీషు మాటలు పెదవి పైన
    నాట్య మాడగ ననుగని నగవుతోడ
    చూతురే? చిన్ని పాపను చేతురె బలి?

    వయసు మీరెనె నాకేమి వలను గాదె
    అయిదు వత్సరాల్ నిండిన వయసు లోన
    విద్యలను నేర్వగా లేనె? వెర్రి గాక,
    రెండు నిండి నంతనె యేల దండనమ్ము?

    రిప్లయితొలగించండి
  10. సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    ఆర్ద్రమైన భావాలతో పసికూన మనోవృత్తిని చిత్రించిన మీ పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. నాన్న చేయిని వీడక చిన్ని పాప
    బడికి పోవుట కెందుకో హడలు చుండె
    అమ్మ నాన్నల నొడిలోన హాయిగాను
    ఆడు కొనుటకు కాబోలు నంత ఏడ్పు

    రిప్లయితొలగించండి
  12. శ్రీ మిస్సన్న గారికి శుభాశీస్సులు.
    మీ పద్యములు బాగుగ నున్నవి. అభినందనలు.
    కొన్ని అసాధు ప్రయోగములను కొందరు వాడుచున్నారు. వానిని వీలైనంత వరకు ప్రయోగించకుండుట మంచిది.
    చేతురు, కోతురు వంటివి అసాధువులు. చేయుదురు కోయుదురు అనుట మంచిది.
    నడ్డి వంగే బర్వు - నడ్డి వంగెడి బర్వు అన వచ్చు కదా. మీరు సంప్రదాయమును పాటించగలరని మా నమ్మకము.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. ఆట పాటలు కరువైన నానంద మేలేని
    చదువు లెట్టుల మాచిన్ని మెదడు నిల్చు !
    తెల్ల వారక ముందరె వెళ్ళి మీరు
    నిద్ర పోగనె యరుదెంచ నిజము గాదె !
    ఆదివారపు రోజె మీ యాద రమ్ము !
    మాదు మనసుల తెలిసియు మంచి గూర్చు
    బడుల నెలకొల్పు వరకును వద్దు తండ్రి
    ఇంటి పట్టునె నేర్చెద వెంట గొనుము !

    రిప్లయితొలగించండి
  14. నేమాని పండితార్యా! మీ సూచనలను తప్పక పాటించే ప్రయత్నం చేస్తాను. ఈ పద్యాలలో తప్పని సరయి కొన్ని ఆంగ్ల పదాలను వాడుతున్నాను కదా అని కొంచెం అటువంటి పదాలను వాడేను. పునరావృతం కాకుండా చూచు కొంటాను.

    గురువుగారూ! ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. బడికే పోననుచడ్డము
    బడి యేడ్చినగాని వినడు పాపము నాన్నే
    బడితెను దీయును దెబ్బలు
    బడి వాతలు బడక బడికి పదవే పాపా !

    రిప్లయితొలగించండి
  16. శ్రీ సహదేవుడు గారు: శుభాశీస్సులు.
    మీ 2 పద్యములు బాగుగ నున్నవి. అభినందనలు.
    కొన్ని సూచనలు:
    1వ పద్యము 1వ పాదములో కొన్ని అక్షరములు ఎక్కువగా నున్నవి.
    2. 2వ పద్యము : ఆదివారము నాడె అందాము - రోజు తెలుగు పదము కాదు.
    మాదు మనసు - నకు బదులుగా మా మనస్సు అందాము. మాదు అను ప్రయోగము సాధువు కాదు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. గురువుగారికి ధన్యవాదములతో తమరి సూచిత సవరణతో పద్యం:
    ఆట పాటలు కరువైన హాయి లేని
    చదువు లెట్టుల మాచిన్ని మెదడు నిల్చు !
    తెల్ల వారక ముందరె వెళ్ళి మీరు
    నిద్ర పోగనె యరుదెంచ నిజము గాదె !
    ఆదివారపు నాడె మీ యాద రమ్ము !
    మా మనస్సుల తెలిసియు మంచి గూర్చు
    బడుల నెలకొల్పు వరకును వద్దు తండ్రి
    ఇంటి పట్టునె నేర్చెద వెంట గొనుము !

    రిప్లయితొలగించండి