21, ఏప్రిల్ 2014, సోమవారం

పద్య రచన – 573

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12 కామెంట్‌లు:

  1. ఘన నీలాంగుడు గోప నాయకుడు లోక త్రాణ దక్షుండు చొ
    చ్చెను కాళింది మడుంగు నా జలములన్ జీకాకులన్ వెట్టు దు
    ష్టుని కాళీయుని ద్రొక్కి బట్టి తలపై శోభాయమానమ్ముగా
    నొనరించెన్ బళి తాండవంబు జను లత్యుత్సాహులై యొప్పగా

    వడి వడి నాట్యమొనర్చెను
    గడ గడలాడించె నెదను కాళీయునికిన్
    పుడమి జనులకున్ భద్రము
    లిడె కృష్ణుడు తత్పదముల కిదె నతి గూర్తున్

    రిప్లయితొలగించండి
  2. పుడమి జనులను రక్షింప బూనుకొ నుచు
    పాము పడగల మీదను పాద ముంచి
    యణ గ ద్రొక్కగ కా ళీయు ఫ ణ ములన్ని
    ఆర్తి బ్రార్ధించె నా గృష్ణు నపుడు మిగుల


    రిప్లయితొలగించండి
  3. అల కాళీయునిపైననెక్కు మన గోపాలుండ జూడంగ నా
    కలగా నుండెనె, నేడు కన్నులకు చొక్కమ్మైన రూపమ్మదో
    సులభమ్మీవిధి గాంచు భాగ్యమిట నా చూపెల్ల ధన్యమ్ముగా
    నిల నిల్చెన్ ! మది సంతసమ్ముఁ గన నేడింతింతనంజాలునా!

    రిప్లయితొలగించండి
  4. అంతటి కాళీయునిపై
    వింతగ నర్తించుచుండె వెన్నుడు ముదమున్
    ఎంతటి వాడవు కృష్ణా!
    చింతలు తొలగించునిన్ను చేరి భజింతున్

    రిప్లయితొలగించండి
  5. పండిత నేమాని వారూ,
    కాళియమర్దన ఘట్టాన్ని మనోహరమైన పద్యాలలో చెప్పి అలరింపజేశారు. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు..
    మొదటిపాదంలో యతి తప్పింది.
    *
    శైలజ గారూ,
    పద్యం బాగుంది. అభినందనలు.
    ‘ముదమున్’ అన్వయం కుదరడం లేదు. ముదమునన్ అంటే కుదురుతుంది కానీ గణదోషం అవుతుంది. అక్కడ ‘వెన్ను డలరుచున్’ అనండి.

    రిప్లయితొలగించండి
  6. గురువుగారు,
    గోపాలుడు లో ఆ వస్తుందనుకున్నాను. మన్నించండి.
    శోభాంగుండ/పుణ్యాత్ముండ అని మారిస్తే బాగుంటుందంటారా?

    రిప్లయితొలగించండి
  7. యమున యందున కాళియు డనెడి సర్ప
    రాజు వసించుచుండెను రాజసముగ
    జలము త్రాగగ చనుదెంచు జంతువులను
    పట్టి భక్షించు చుండెను వరుసగాను
    ఆడు చుండగ గోపకుల్ వేడుకగను
    బంతిచేరెనా మడుగులో నంతిమముగ
    కర్రివేలుపు గాంచి తా కరము వేగ
    దూకె నదిలోన బంతికై తేకువగను
    కనలి కాళియు డుతనపై కాలు ద్రువ్వ
    చిందు లాడుచు శిరముపై చెన్నుగాను
    గర్వ భంగము జేసె నా కంసవైరి
    విష్ణు నాజ్ఞను మన్నించి విషపు పాము
    చేరె వేరొక మడువుకు చెలులతోడ

    రిప్లయితొలగించండి
  8. చెంగున దూకె లోకముల క్షేమము జూచెడు నందుపట్టి నీ-
    లాంగుడు దుష్ట కాళియు నడంచగ వాని శిరమ్ము పైకి చూ-
    డంగను భీతులై జనులు ఠావులు దప్పగ పాము ప్రాణముల్
    హంగుగ నాడె తాండవము హాయిగ జేయుచు వేణుగానమున్.

    తలలు ఛిద్రమాయె దర్పమ డంగెను
    పతి యవస్థ జూచి పాము సతులు
    హే పరాత్పరా! ఆహీశ్వరునకు ప్రాణ
    భిక్ష నొసగు మనుచు వేడి రపుడు.

    కాళీయుని కరుణించెను,
    కాళిందిని వీడె నహియు, కరుణామయు గో-
    పాళి నుతించెను కడు, గో-
    పాలకు పద పద్మములకు ప్రణతులు గూర్తున్.


    రిప్లయితొలగించండి
  9. ఇడుముల తాలగ లేమయ!
    మడుగున కాళీయు ద్రొక్క మా గోపాలా!
    యడుగిడ రావా! యనినన్
    పడగల నెక్కియు యడచిన వరదునకు నుతుల్!

    రిప్లయితొలగించండి
  10. గరుడ రేఖ యున్న కరవదు పామంచు
    నరులు చెప్పుచుంద్రు, నాట్య మీవు
    చేయ గొప్పతనము చెప్పగా లేములే
    గరుడ గమను వైన కతన గాదె.

    రిప్లయితొలగించండి
  11. లక్ష్మీదేవి గారూ,
    మీ సవరణలు బాగున్నవి.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ తేటగీతిక బాగుంది. అభినందనలు.
    రెండవ పాదంలో ‘వసియించు’ అంటే గణదోషం ఉండదు. బహుశా టైపాటు కావచ్చు.
    *
    మిస్సన్న గారూ,
    మనోహరమైన ఖండిక చెప్పారు. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.

    రిప్లయితొలగించండి