4, అక్టోబర్ 2015, ఆదివారం

సమస్యాపూరణం - 1806 (స్తనవస్త్రము విడిచి వధువు తలఁచెను మామన్)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
స్తనవస్త్రము విడిచి వధువు తలఁచెను మామన్.
(నిన్న అవధానంలో ఒక వక్త చెప్పిన ‘స్తనవస్త్రం పరిత్యజ్య వధూః శ్వశుర మిచ్ఛతి’ అన్న సంస్కృత సమస్యకు తెనుఁగుసేత)

33 కామెంట్‌లు:

  1. ఘనవనమున నినతాపం
    బున మిక్కుటముగ హిడింబ పొగులుచు గాలిన్
    మన మలర వీచఁ గోరెను
    స్తనవస్త్రము విడిచి వధువు దలఁచెను మామన్.

    రిప్లయితొలగించండి
  2. వనమంత దిరిగు చెలియకు
    తనువంత పులకింత లిడగ తారను గాంచెన్
    మనమంత మధుర భావన
    స్తనవస్త్రము విడిచి వధువు తలఁచెను మామన్

    రిప్లయితొలగించండి
  3. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ఇక్కడ ‘మామ’ అంటే చందమామ అని మీ భావనా?
    రెండవపాదంలో గణదోషం. ‘తనువంతయు పులకరించ తారను గాంచెన్’ అనండి.

    రిప్లయితొలగించండి
  4. మాస్టరు గారూ..చక్కని పూరణ రుచి చూపారు..రాజేశ్వరి గారి భావం బాగుంది

    రిప్లయితొలగించండి
  5. ఘనమగు దాపము నోర్వక
    యనుమతి నిం బొంది పతిది యాహా యనుచు
    న్ద నదగు హర్మ్యంబోపరి
    స్తన వస్త్రము విడిచి వధువు తలచెను మామన్

    (మామ =చందమామ )


    రిప్లయితొలగించండి
  6. శ్రీగురుభ్యోనమః

    అనఘా యిదియె సమస్యని
    వినిపించెను పృచ్ఛకుండు విజ్ఞులు మెచ్చన్
    ఘనముగ నొసగినదేమన
    "స్తనవస్త్రము విడిచి వధువు తలఁచెను మామన్"

    రిప్లయితొలగించండి

  7. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ధన్యవాదాలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    రెండవపాదంలో అన్వయం కొంచెం ఇబ్బందిగా ఉంది. ‘హర్మ్యంబోపరి’ అన్నచోట సంధిగత దోషం. మీ పద్యానికి నా సవరణ...
    ఘనమగు దాపము నోర్వక
    యనుమతి పతివలనఁ బొంది యాహా యనుచున్
    దన హర్మ్యములోన నుపరి
    స్తన వస్త్రము విడిచి వధువు తలచెను మామన్
    *****
    శ్రీపతి శాస్త్రి గారూ,
    తప్పించుకొని వెక్కిరించడమంటే ఇదే! వెనుకట దుష్కరప్రాస, సంక్లిష్టభావాలతో ఒక పృచ్ఛకుడు సమస్య ఇస్తే ఒక అవధాని ఇటువంటి పద్ధతిలోనే పూరణ చెప్పాడు. కాని ఇప్పుడా పద్యం గుర్తుకు రావడం లేదు.
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘సమస్య+అని’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ఆ పాదాన్ని ‘అనఘా సమస్య యిదె యని’ అంటే ఎలా ఉంటుంది?

    రిప్లయితొలగించండి

  8. అనిలకుమారుండగు భీ
    మునితో క్రీడించి ద్రుపదు పుత్రిక శ్రమ దీ
    రను విను చూలిని గోరుచు
    స్తన వస్త్రము విడిచి వధువు తలచెను మామన్

    రిప్లయితొలగించండి
  9. శ్రీగురుభ్యోనమః

    మనువాడెడు తన మామయె
    కనిపించక విరహమునకు కారణమవగా
    మనసిజు మామను గాంచుచు
    స్తనవస్త్రము విడిచి వధువు తలఁచెను మామన్.

    గురువుగారు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  10. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. మిత్రులందఱకు నమస్సులు!

    (పెండ్లియైన పిదప నూతనవధూవరులు పెండ్లిబట్టలను విడిచి క్రొత్తబట్టలు కట్టికొని యూరేఁగింపునకై సిద్ధపడిన సందర్భము నిట ననుసంధానించుకొనునది)

    "మనువయె మీకును! శుభమ!"
    స్తన, వస్త్రము విడిచి, వధువు తలఁచె నుమా మం
    డను; నవ వసనము నూరేఁ
    గను గట్టియును, వరు నోరకంటఁ గని నగెన్!

    రిప్లయితొలగించండి
  12. తనకున్ కాబోవు విభుడు
    పనిగొను నెపమ్మున ప్రక్క పట్టణ మేగన్
    ననవిలుతు హతిని బడి తా
    స్తనవస్త్రము విడిచి వధువు తలచెను మామన్

    రిప్లయితొలగించండి
  13. 1.
    వనమున ద్రుపదసుతయె భీ
    ముని యంకమ్మున పరవశ మొందెడు వేళన్
    వినుచూలియె సిగ్గిల్లగ
    స్తనవస్త్రము విడిచి వధువు తలచెను మామన్

    2.
    మనసుని దోచెడు వెన్నెల
    అనంగుని శరతాపియైన నతివొక్కతి చం
    ద్రుని కాంచుచు మోహముతో
    స్తనవస్త్రము విడిచి వధువు తలచెను మామన్

    రిప్లయితొలగించండి
  14. *------------------------*
    గు రు మూ ర్తి ఆ చా రి
    *------------------------*

    ఘన సుమశర ఘాతముచే
    స్తన వస్త్రము విడిచి వధవు తలచెన్ మామన్;

    తన భర్తన్ : పిలిచెన్ గద. !

    తనను మదన. కేళి య౦దు తనియి౦చుమనెన్

    ( వధువు --- మేనమామను
    పె౦డ్లాడిన.కన్య. ) ె

    రిప్లయితొలగించండి
  15. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    ఘనమగు వివాహ వేదిక
    మనువాడగ నొక్కకాంత మామను , నిశిలో
    తనువే పులకించెను, తన
    స్తనవస్త్రము విడచి వధువు తలచెను మామన్

    రిప్లయితొలగించండి
  16. వనిత యొక నిసిస్నానగ
    మన కనె నచ్చట శశాంకు మానస హారుం
    డని చందమామ మదిని
    స్తనవస్త్రము విడిచి వధువు తలఁచెను మామన్.

    (మామ = చందమామ)

    రిప్లయితొలగించండి


  17. వినువీధి చంద మామయె
    తనవంకనె జూచి నవ్వు తలపున లజ్జన్
    పెను యుక్క తాళ జాలక
    స్తన వస్త్రము విడిచి వధువు తలఁచెను మామన్.

    రిప్లయితొలగించండి
  18. జనులును హితులును శుభమ
    స్తన, వస్త్రము విడిచి వధువు తలచెను మా మన్
    డనమగు వాహన మందున
    మనసొప్పిన వాడి తోడు మది మురిసెనుగా!

    ఇక్కడ
    వస్త్రము=మధుపర్కము (పెండ్లివస్త్రాలు)
    మండనము=అలంకరించిన

    (భావం.॥ బంధుమిత్రుల దీవెనలందుకొని వివాహానంతరము మధుపర్కాలను విడిచి అలంకరించబడిన తమ స్వంత కారులో ప్రేమించిన ప్రియుని సరసన కూర్చొని అత్తవారింటికీ వెళుతుంటే మనసు ఆనందంతో పులకరిస్తుందని వధువు తలచిందని భావం)

    రిప్లయితొలగించండి
  19. తన తండ్రిని మఱపించుచు
    కొనయూపిరిఁ దీయు వేళ కొడుకౌదుననన్
    దనయునకు చన్గుడపగన్
    స్తన వస్త్రము విడిచి మగువ తలఁచెను మామన్!

    రిప్లయితొలగించండి
  20. గుండు మధుసూదన్ గారూ,
    ఎప్పుడూ సమస్యను ఇతరులకంటె వైవిధ్యంగా పూరించాలనే తపన, సామర్థ్యం మీలో మొదటినుండి చూస్తున్నాను.
    ఈనాటి పూరణ ఆకోవలేనే అద్భుతంగా ఉంది. అభినందనలు.
    కాని సమస్యలో ద్రుతాంతంగా ఇచ్చిన అక్షరాన్ని అనుస్వారంగా మార్చవచ్చో లేదో చింత్యం. ద్రుతకార్యం జరిగి ద్రుతం అనుస్వారంగా మారితే పరవాలేదు (మామం గని). కాని ఇక్కడ ద్రుతకార్యం జరుగలేదు కదా!
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    రెండవపాదంలో గణదోషం. ‘పనిగొనెడు నెపమున ప్రక్క.../ పనిగొను నెపమునను ప్రక్క...’ అనండి.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    రెండవ పూరణ రెండవపాదంలో గణదోషం. ‘అతివ+ఒక్కతి’ అన్నప్పుడు సంధి లేదు. ఆ పాదాన్ని ‘అనంగు శరతాపిత యగు నతివ యొకతి చం...’ అనండి.
    మూడవపూరణలో సమస్యలో ఇచ్చిన ‘మన్’ పూరణలో ‘మం’గా మార్చడం ఆలోచించదగినది.
    *****
    గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు కామేశ్వర రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవపాదంలో గణదోషం. ‘మదిని’ అన్నదాన్ని ‘మదినిన్/మదిలో’ అనండి.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మనోహరమైన భావంతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *****

    రిప్లయితొలగించండి
  21. చీరకట్టు సాంప్రదాయము మెచ్చెడు మామ, పెళ్లైన తర్వాత తనకు అలవాటైన సల్వార్ కమీజు ధరిస్తే ఒప్పుకొనలేడని వధువు సంశయించిందను భావంతో:

    తన పెళ్లి తంతు ముగియన్
    గొనసాగక చీరలోన, గూర్చగ సల్వార్
    తననొప్పడేమొ యనుచున్
    స్తన వస్త్రము విడిచి వధువు తలఁచెను మామన్!

    రిప్లయితొలగించండి
  22. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మదిని లో “ని” గురువే అయ్యింది కదా “స్త “ వలన అందుకే మదిని ఉంచాను.

    రిప్లయితొలగించండి
  24. కామేశ్వర రావు గారూ,
    మదిని (మనస్సులోని అనే అర్థంలో) తెలుగు పదం అయితే తరువాతి ‘స్త’వల్ల ‘ని’ గురువు కాదు. పోనీ మది- నిస్తన అని పదవిభాగం చేస్తే ని గురువవుతుంది. కాని ‘నిస్తన’ అన్న పదం లేదు. ‘వాడు ద్రోహి’ అన్నచోట ‘డు’ లఘువే. ‘సంఘద్రోహి’ అన్న సంస్కృత సమాసంలో ‘ఘ’ గురువు.

    రిప్లయితొలగించండి
  25. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నేను ఒక్క “ర” వత్తు కే ఆ సందర్భములో గురువు కాదనుకునే వాడిని. అన్ని సంయుక్తాక్షరాలకు యిది వర్తిస్తుందా ? తెలుప గోర్తాను. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  26. కామేశ్వర రావు గారూ,
    తెలుగు పదం తర్వాత సంయుక్తాక్షరంతో మొదలయ్యే పదం ఉంటే ఆ తెలుగు పదం చివరి అక్షరం గురువు కాదు. ఎలాగంటే ‘వాడు మ్లేచ్ఛుడు’.. ఇక్కడ ‘వాడు’ తెలుగు పదం. ఇక్కడి ‘డు’ తరువాతి ‘మ్లే’ తో ఊనిక పొందక అది లఘువుగానే ఉంటుంది. ‘సీతా’ అనేది ఆకారాంత స్త్రీలింగ సంస్కృత పదం. ఇది తెలుగులో ‘సీత’ అయింది. ‘సీత ద్యుమణికి మ్రొక్కె’ అన్నప్పుడు ‘త’ లఘువే. ‘రవిద్యుతి’ అన్నచోట రవి, ద్యుతి రెండు వేర్వేరు పదాలైన సమాసంలో కలిసిపోయాయి. ఇక్కడ ‘వి’ తప్పని సరిగా గురువవుతుంది. ‘కవి వ్రాసెను’ అన్నప్పుడు రెండూ తెలుగు పదాలే. కనుక ‘వి’ గురువు కాదు. ‘దైవధ్యానము’ అన్నచోట రెండూ సంస్కృతపదాలే, అందులోను సమసించాయి కనుక ‘వ’ గురువవుతుంది. ఇంకా ఏమైనా సందేహాలుంటే నిర్మొహమాటంగా అడగండి.

    రిప్లయితొలగించండి
  27. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి నమస్సులు!

    మీరు నా పూరణ విషయమునం జేసిన వ్యాఖ్యను నేనింతకు ముందే చూచుట జరిగినది.

    "సమస్యలో ద్రుతాంతంగా ఇచ్చిన అక్షరాన్ని అనుస్వారంగా మార్చవచ్చో లేదో చింత్యం. ద్రుతకార్యం జరిగి ద్రుతం అనుస్వారంగా మారితే పరవాలేదు (మామం గని). కాని ఇక్కడ ద్రుతకార్యం జరుగలేదు కదా!" యని మీరు సందేహమును వెలిఁబుచ్చితిరి.

    కాని, నే నీ సమస్యనుం బూరించునప్పుడు నన్నయగారి పద్యము నా మనస్సులో మెదలినది. దాని ప్రభావముననే నే నీ సాహసమునకుఁ బూనితిని.

    నన్నయగారి యా పద్యమునుం గనుఁడు...

    శ్రీమదాంధ్రమహాభారతము_ఆదిపర్వము-పంచమాశ్వాసము-పద్యము సంఖ్య:138

    లయగ్రాహి:
    "కమ్మని లతాంతములకు మ్మొనసి వచ్చు మధుపమ్ముల సుగీత నినదమ్ము లెసఁగెం; జూ/తమ్ముల..."

    ఇక్కడ...

    "లతాంతములకున్ + మొనసి" యనునప్పుడు "ద్రుతమునకు సరళ స్థిరములు పరంబు లగునపుడు లోప సంశ్లేషంబులు విభాషనగు" యను చిన్నయసూరిగారి సూత్రము ప్రవర్తింపవలసియున్నది. కాని యట్లు జరుగలేదు. "బిందుం ప్రవదంతితం క్వచిత్ కేచి"దను చింతామణి సూత్రానుసారముగా నిందలి నకారమున కనుస్వారమ్ము రాఁగా, "కమ్మని లతాంతములకుం + మొనసి (కమ్మని లతాంతములకు మ్మొనసి)" యను రూపమేర్పడినది. ఇది నన్నయగారి యద్భుతమైన ప్రయోగవైచిత్రి. కాఁగా, మకార పరత్వమున నిట్టి బిందులేఖనము నేఁడు గానరాదు. ఇట్టి రూపమును వ్రాయు నభ్యాసమును లేదు. నేఁడు "కమ్మని లతాంతములకు మొనసి" యనియే వ్రాయుచున్నారు. ఇట్టి ప్రాసవిధానమును సంరక్షింప నవ్యులగు వ్యాకర్తలు "ప్రాసంబున మకారంబు పరం బగుచో, ద్రుతంబునకు మకారాదేశంబగు" నని (ప్రౌఢవ్యాకరణము-సంధి.22వ సూత్రము) సూత్రించి యున్నారు. ఇది మఱొక ప్రయోగవైచిత్రి.

    ఈ ప్రయోగ వైచిత్ర్యముల ననుసరించి నేను చేసిన సాహసము సకల కవిపండితజనామోదము నందఁగలదో లేదో నాకు సందేహమే. తాము నా ప్రయోగమును...నన్నయగారి ప్రయోగమును...ప్రౌఢవ్యాకర్త సూత్రమునుఁ బరిశీలించి, గుణదోషములను, వాటి యుచితానుచితములను గూర్చి తెలుపఁగలరని సవినయముగా విన్నవించుకొనుచున్నాఁడను.

    మీ యామోదమునకై వేచియున్న...
    మీ మిత్రుఁడు,
    గుండు మధుసూదన్

    రిప్లయితొలగించండి
  28. గుండు మధుసూదన్ గారూ,
    వివరంగా, సప్రమాణంగా, వ్యాకర్తల నిర్ణయాలతో తెలిపిన సందేహ నివృత్తి చేశారు. ఇంకేమంటాను? ఔనంటాను. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  29. ఇటువంటి జుగుప్సాకర సమస్యలు ఇవ్వవద్దని మనవి.

    రిప్లయితొలగించండి
  30. చనిపోయిన మామ సరిని
    కనిపించెడి తనయునుగొని కౌగిటి లోనన్
    చనుబాలనివ్వ గోరుచు
    స్తనవస్త్రము విడిచి వధువు తలఁచెను మామన్

    వధువు : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
    సం. వి. ఊ. స్త్రీ.
    4. కోడలు;

    రిప్లయితొలగించండి