5, అక్టోబర్ 2015, సోమవారం

సమస్యాపూరణం - 1807 (కావేరీతీరమందు గలదఁట ఢిల్లీ)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కావేరీతీరమందు గలదఁట ఢిల్లీ.

32 కామెంట్‌లు:

  1. దేవేరి తపము పండగ
    కావేరీ తీరమందు ,గలదట ఢిల్లీ
    పావన యమునా జలములు
    జీవము నిడునంట జగతి సేమము కోరన్

    రిప్లయితొలగించండి
  2. దేవేరి తపము పండగ
    కావేరీ తీరమందు ,గలదట ఢిల్లీ
    పావన యమునా తటమున
    జీవము నిడునంట జగతి సేమము కోరన్

    రిప్లయితొలగించండి
  3. శ్రీగురుభ్యోనమః

    నీవెరుగవె శ్రీరంగము
    కావేరీతీరమందు గలదఁట, ఢిల్లీ
    కావల కనుగొన హిమనగ
    మావర్తనములు స్థిరముగ హ్లాదము నొసగున్

    రిప్లయితొలగించండి
  4. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘దేవేరి తపము పండెను...’ అనండి. చివరిపాదానికి అన్వయం? జీవము ఇచ్చేది ఢిల్లీయా, యమునయా? ‘జీవము జగతికి నొసగుచు చెలగెడి నదులే’ అందామా?
    *****
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. దేవేరి తపము పండెను
    కావేరీ తీరమందు , గలదట ఢిల్లీ
    పావన యమునా తటమున
    జీవము జగతికి నొసగుచు చెలగెడి నదులే
    -----------------------------------------
    క్షమించాలి నాకసలు సోషల్ రాదు .అందునా
    మేప్పాయిటింగు అసలే రాదు .అందుకే యస్ .యస్..ల్.సి,లో 18 మార్కులు వచ్చి ఫైల్ అయ్యాను . అప్పడికే పెళ్ళై పోయింది .

    రిప్లయితొలగించండి
  6. 1.రావే యొక వింతచ్చో
    కావేరీ తీరమందు గలదట;ఢిల్లీ
    పోవలె నెటులను నటులే
    కావేరీరంగని గాంచగ పదవే.
    2.శ్రీవారి యాలయ మొకటి
    కావేరీ తీరమందు గలదట;ఢిల్లీ
    లో వేలవేల జనులట
    యావాసమునుండి పోదురాలయము గనన్

    రిప్లయితొలగించండి
  7. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘వింతచ్చో..’? ‘రావే వింతను గనగా..’ అందామా?

    రిప్లయితొలగించండి
  8. పావన మౌశ్రీరంగము
    కావేరీతీరమందు గలదట, డిల్లీ
    యావిర్భవించె యమునా
    ప్లావన ప్రాంతమ్మునందు భారత శిఖియై(పురియై)

    రిప్లయితొలగించండి
  9. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘భారత మణియై’ అనండి.

    రిప్లయితొలగించండి
  10. ఓ వాణీ ! వింటి వయిది
    కావేరీ తీర మందు గలదట డిల్లీ
    నీవును నమ్మితె? యోయమ !
    పావన మగుగుడులు గలవు పరమా త్ము నివిన్

    రిప్లయితొలగించండి
  11. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ వివరణ తో (నిన్నటి) నా సందేహము పూర్తిగా తీరింది. ఇది నేను ఇప్పుడు క్రొత్తగా నేర్చుకున్న పాఠము. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  12. కవిమిత్రులకు నమస్కారములతో
    గురుమూర్తి ఆచారి

    (ఢిల్లీ విహార యాత్ర వెళ్ళిన స్నేహితురాండ్ర మాటలు)

    రావే "యమునా" దరికిన్
    కావేరీ ! తీరమందు గలదట ఢిల్లీ
    యీవేళ మనము నగరము
    లో, వీలగునన్ని వింతలు గనగ వచ్చున్

    రిప్లయితొలగించండి
  13. ప్రావేశిక ప్రశ్నలలో
    యీవర ఢిల్లీ పురమది యెచటని యడుగన్
    ప్రావీణ్యత నుడివె నొకడు
    కావేరీ తీరమందు గలదఁట ఢిల్లీ.

    (టైపాటు సవరించాను)

    రిప్లయితొలగించండి
  14. శ్రీవైష్ణవ దేవగృహము
    కావేరీ తీరమందు గలదట, ఢిల్లీ
    పావన యమునా తటమున
    భావముగా విస్తరిల్లి వాసిని గాంచెన్!!!

    రిప్లయితొలగించండి
  15. గురువుగారికి ప్రణామములతో ..,
    మరదలు కావేరితో బావ తెలుపుతున్న పలుకులుగా ఊహించిన పూరణము...

    ఓ విరిబాలా! యెఱుగవె
    కావేరీ! తీరమందు గలదట ఢిల్లీ
    పావన యమునా నదికిన్ ,
    పోవలె మనరాజధాని పురమది గాదే!

    రిప్లయితొలగించండి
  16. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘పరమాత్మునివి’ అనాలి. దానికి ద్రుతం రాదు. ‘పావనమగు గుడులు గలవు భక్తిని గొలువన్’ అందామా?
    *****
    గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు కామేశ్వర రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ప్రశ్నలలో| నీ వర....’ అనండి.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  17. శ్రీ విశ్వాత్ముని యర్చన
    కావేరీ తీరమందు గలదట.డిల్లీ
    లో వేడ్కను గోవిందుని
    సేవించుట గలదు జనుల సేమమ్మునకై

    రిప్లయితొలగించండి
  18. కోవెలఁ బ్రధాని జూడగఁ
    దా వచ్చిన పాలనమ్ము తాత్కాలికమౌ
    సేవల నీయగఁ దీరగఁ
    గావేరీ తీరమందుఁ గలదట ఢిల్లీ!

    రిప్లయితొలగించండి
  19. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    ప్రధానితో పాటు కావేరీ తీరానికి మొత్తం ఢిల్లీని పట్టుకొచ్చారన్న మాట. బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    పావన, పుణ్యక్షేత్రము
    కావేరీతీరమందు గలదఁట; ఢిల్లీ
    యా వారణాశి కటకము
    జీవనదుల చెంతనటులె చెందెను ఖ్యాతిన్

    రిప్లయితొలగించండి
  21. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి నమస్సులు!

    మీరు నిన్న నా పూరణ విషయమునం జేసిన వ్యాఖ్యను నేనింతకు ముందే చూచుట జరిగినది.

    నిన్నటి నా పూరణము:
    (పెండ్లియైన పిదప నూతనవధూవరులు పెండ్లిబట్టలను విడిచి క్రొత్తబట్టలు కట్టికొని యూరేఁగింపునకై సిద్ధపడిన సందర్భము నిట ననుసంధానించుకొనునది)

    "మనువయె మీకును! శుభమ!"
    స్తన, వస్త్రము విడిచి, వధువు తలఁచె నుమా మం
    డను; నవ వసనము నూరేఁ
    గను గట్టియును, వరు నోరకంటఁ గని నగెన్!

    అని...తలఁచెను మామన్...అను దానిని...తలఁచె నుమా మం/డను (ఉమాదేవినిం దన శరీరార్ధభాగమున నలంకరించుకొనిన పార్వతీపతినిం దలఁచెనని నా భావనము)...నని ప్రయోగించితిని.

    ఈ ప్రయోగమునుఁగూర్చి తమరు...
    "సమస్యలో ద్రుతాంతంగా ఇచ్చిన అక్షరాన్ని అనుస్వారంగా మార్చవచ్చో లేదో చింత్యం. ద్రుతకార్యం జరిగి ద్రుతం అనుస్వారంగా మారితే పరవాలేదు (మామం గని). కాని ఇక్కడ ద్రుతకార్యం జరుగలేదు కదా!" యని సందేహమును వెలిఁబుచ్చితిరి.

    కాని, నే నీ సమస్యనుం బూరించునప్పుడు నన్నయగారి పద్యము నా మనస్సులో మెదలినది. దాని ప్రభావముననే నే నీ సాహసమునకుఁ బూనితిని.

    నన్నయగారి యా పద్యమునుం గనుఁడు...

    శ్రీమదాంధ్రమహాభారతము_ఆదిపర్వము-పంచమాశ్వాసము-పద్యము సంఖ్య:138

    లయగ్రాహి:
    "కమ్మని లతాంతములకు మ్మొనసి వచ్చు మధుపమ్ముల సుగీత నినదమ్ము లెసఁగెం; జూ/తమ్ముల..."

    ఇక్కడ...

    "లతాంతములకున్ + మొనసి" యనునప్పుడు "ద్రుతమునకు సరళ స్థిరములు పరంబు లగునపుడు లోప సంశ్లేషంబులు విభాషనగు" యను చిన్నయసూరిగారి సూత్రము ప్రవర్తింపవలసియున్నది. కాని యట్లు జరుగలేదు. "బిందుం ప్రవదంతితం క్వచిత్ కేచి"దను చింతామణి సూత్రానుసారముగా నిందలి నకారమున కనుస్వారమ్ము రాఁగా, "కమ్మని లతాంతములకుం + మొనసి (కమ్మని లతాంతములకు మ్మొనసి)" యను రూపమేర్పడినది. ఇది నన్నయగారి యద్భుతమైన ప్రయోగవైచిత్రి. కాఁగా, మకార పరత్వమున నిట్టి బిందులేఖనము నేఁడు గానరాదు. ఇట్టి రూపమును వ్రాయు నభ్యాసమును లేదు. నేఁడు "కమ్మని లతాంతములకు మొనసి" యనియే వ్రాయుచున్నారు. ఇట్టి ప్రాసవిధానమును సంరక్షింప నవ్యులగు వ్యాకర్తలు "ప్రాసంబున మకారంబు పరం బగుచో, ద్రుతంబునకు మకారాదేశంబగు" నని (ప్రౌఢవ్యాకరణము-సంధి.22వ సూత్రము) సూత్రించి యున్నారు. ఇది మఱొక ప్రయోగవైచిత్రి.

    ఈ ప్రయోగ వైచిత్ర్యముల ననుసరించి నేను చేసిన సాహసము సకల కవిపండితజనామోదము నందఁగలదో లేదో నాకు సందేహమే.

    ఇచ్చట ద్రుత మనుస్వారముగ మాఱుట వరకు నేను గ్రహించితిని. ...నుమా మన్ + డను..."నుమా మం + డను" నని ప్రయోగించితిని. ఇది యెంతవరకు సరియైనదో...(కాని, యిది సాధారణ కావ్యములం దనుసరణీయము కాకపోయినను, నిట్టి చమత్కార కారకములగు సమస్యాపూరణములం దామోదదాయక మగునను నుద్దేశ్యముతో మాత్రమే ప్రయోగించుట జరిగినది)...

    తాము నా ప్రయోగమును...నన్నయగారి ప్రయోగమును...ప్రౌఢవ్యాకర్త సూత్రమునుఁ బరిశీలించి, గుణదోషములను, వాటి యుచితానుచితములను గూర్చి తెలుపఁగలరని సవినయముగా విన్నవించుకొనుచున్నాఁడను.

    మీ యామోదమునకై వేచియున్న...
    మీ మిత్రుఁడు,
    గుండు మధుసూదన్

    రిప్లయితొలగించండి
  23. గుండు మధుసూదన్ గారూ,
    ఇంత సప్రమాణంగా సోదాహరణంగా లక్ష్య లక్షణ సమన్వయంతో వివరించాక సందేహానికి తావెక్కడిది. బాగుంది మీ వివరణ. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  24. నేఁటి సమస్యకు నా పూరణము:

    (యమునానదీ తీర వాసులతో గంగానదీ తీరవాసులు పలుకుచున్న సందర్భము)

    "సావాసము సేయఁగ గం
    గా వాసులె మీరు? కారు! కా రనుచో మీ
    కీ వీథిఁ గలవి మీవే?
    కా వే రీ తీరమందుఁ గలదఁట ఢిల్లీ!"
    (కావు + ఏరు + ఈ తీరమందుఁ గలదఁట ఢిల్లీ)

    భావము:
    [మాతో సహవాసముం జేయుటకు (మీరు + ఏరు) మీరెవరు? మీరు గంగానదీ తీర వాసులు కారు గదా! కానిచో మీ కీ వీథినిం గల యాస్తులు మీవి యగునా? కావు గదా! ఈ యమునానదీ తీరమందు ఢిల్లీ పట్టణము గలదఁట గదా! అచటికే యేఁగి జీవింపుఁ డనిరని భావము]

    పస లేకున్నను చమత్కారము సాధించుటకై యీ పూరణమునుం జేసితిని. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  25. గుండు మధుసూదన్ గారూ,
    చమత్కార సాధనలో మీరు విజయం సాధించారు. సందేహం లేదు. చక్కని పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  26. నా వల కాదనె సోషలు;
    కావలననె నేదునూరి కవయిత్రిటనే
    శ్రీవారిహెల్పు లైనిక:
    "కావేరీతీరమందు గలదఁట ఢిల్లీ?"

    రిప్లయితొలగించండి

  27. రావే సఖియ తిరుచ్చికి
    కావేరీతీరమందు గలదఁట! ఢిల్లీ
    పోవే చాలా దూరము
    రావడము కుదరదు సకియ రమ్యాకృష్ణా :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  28. భావకవిత్వము చెలగగ
    బావురు మనగను మనస్సు బరబర వ్రాయన్
    పోవగ కవులకు మతియే
    కావేరీతీరమందు గలదఁట ఢిల్లీ

    రిప్లయితొలగించండి