19, అక్టోబర్ 2015, సోమవారం

సమస్య - 1829 (కృష్ణుఁ డాడెనఁట క్రికెట్టు క్రీడ)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కృష్ణుఁ డాడెనఁట క్రికెట్టు క్రీడ.

36 కామెంట్‌లు:


  1. శ్రీగురుభ్యోనమః

    తమిళనాడు లోన తరచుగా శివరామ
    కృష్ణుఁ డాడెనఁట క్రికెట్టు క్రీడ.
    కపిలదేవు నాయకత్వమ్ము నందున
    బంతి విసరు నట్టి బౌల రతడు.

    రిప్లయితొలగించండి
  2. మ్యాచి జూడ వెడలె మాయింటి యభిమాని
    కృష్ణుఁ డాడెనఁట క్రికెట్టు క్రీడ
    వెఱగు పడగ నతడు వేలుపు వరమంచు
    తనకు రాదు గాన తనరు మదిని

    రిప్లయితొలగించండి
  3. బాలుడాడు కొరకు బాలు,బ్యాటునుదెచ్చి
    బహుమతీయగానె బర్తుడేకి
    మురిసి తాతతోడ ముద్దుల మనుమడు
    కృష్ణుఁ డాడెనఁట క్రికెట్టు క్రీడ.

    రిప్లయితొలగించండి
  4. ఆదుకొనగ వరద బాధిత ప్రజలను
    ధనము ప్రోగు జేయ ఘనముగాను
    నటుల తోడ కలసి నాణెమ్ముగా బాల
    కృష్ణుఁ డాడె నట క్రికెట్టు క్రీడ!!!

    రిప్లయితొలగించండి
  5. మిత్రులందఱకు నమస్సులు!

    వెన్నదొంగ యెవఁడు? చిన్ని బాలకులతో
    నేమి సేసెనంట? నియమమునను
    సచినుఁ డేమి నెగ్గె? సరి యుత్తరా లివె
    కృష్ణుఁ, డాడెనఁట, క్రికెట్టుక్రీడ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా రెండవ పూరణము:

      చిన్నపిల్లలాడు చిఱ్ఱగోనెయె నేఁడు
      క్రికెటు పేరఁ బఱఁగె! గ్రీడ యదియె!
      ద్వాపరమ్మునందుఁ బడుచు గోపకులతోఁ
      గృష్ణుఁ డాడెనఁట క్రికెట్టుక్రీడ!!

      తొలగించండి
    2. గుండు మధుసూదన్ గారూ,
      మీ రెండు విధాల పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  6. కందుకముల నెన్నొ కంసుండు విసరగ
    నప్పడైన తాను త్రిప్పి కొట్టె
    మామ నోడ జేయు మహితాత్ముడై బాల
    కృష్ణుఁడాడె నట క్రికెట్టు క్రీడ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. రాచ క్రీడ లెన్ని యోసత్య భామతో
    కృష్ణు డా డె నట, క్రికెట్టు క్రీడ
    యందు పేరు మోసె యాసచిను గదార్య !
    యొక్క రొకొక యాట నొప్పుదు రిల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగుంది. అభినందనలు.
      మొదటిపాదంలో యతి తప్పింది. ‘రాసక్రీడ లెన్నొ రహి సత్యభామతో’ అనండి.

      తొలగించండి
  8. చిత్ర సీమ నటిలు చేరినారచ్చోట
    సేవచేయునట్టి చింతతో డ
    ధనముకూడబెట్ట జనులనుండి సినిమా
    కృ ష్ణు డాడె నట క్రికె ట్టు క్రీడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘నటులు’ టైపాటుతో ‘నటిలు’ అయింది.

      తొలగించండి
  9. కపిలదేవు నాట కమనీయముగ జూచి
    బ్యాటు కృష్ణు డనెడి బాలు డడగ
    తండ్రి ప్రేమ తోడ తనయున కొసగంస
    కృష్ణు డాడె నట క్రికెట్టు క్రీడ.

    రిప్లయితొలగించండి
  10. భరత జట్టు లోన బౌలరై శివరామ
    కృష్ణు డొకడు దేశ కీర్తి బెంచె
    మేటిగాను బంతి మెలికలు ద్రిప్పుచున్
    కృష్ణు డాడెనట క్రికెట్టు క్రీడ

    రిప్లయితొలగించండి
  11. సమస్య
    *గు రు మూ ర్తి ఆ చా రి *

    కృష్ణు డాడెనట క్రికెట్టు క్రీడ నెలమి


    యను సమస్య నిచ్చి తి శ౦కరార్య ! చక్రి


    కెట్టు తెలియును నేటి క్రికెట్టు క్రీడ. !


    పాలకడలిలో యాశేష. పాన్పు పైన


    లక్ష్మి పాదము లొత్త విలాసముగను


    సకల భువనము లాడి౦చు స్వామి యతడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘కడలిలో నా శేష...’ అనండి.

      తొలగించండి
  12. గూటుబిళ్ళ యాట కాలక్రమమ్మున
    క్రికెటుగానుమారె సుకవి! వినుము
    గోపకులను గూడి రేపల్లెలో బాల
    కృష్ణుడాడెనఁట క్రికెట్టు క్రీడ.

    (మేం చిన్నప్పుడు గోణేబిళ్ళ అనే ఆట ఆడుకొనే వాళ్ళం. దాన్నే కొందరు గూటేబిళ్ళ అంటారు)

    రిప్లయితొలగించండి
  13. కాళి చరణు పూర్వ కాలపు వాడట
    మేఘ శ్యాముడు గన మేటి యాట
    గాడు పరుగు లందు కౌశల మధికంబు
    కృష్ణుఁ డాడెనఁట క్రికెట్టు క్రీడ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘మేఘశ్యాము’ డన్నప్పుడు ‘ఘ’ గురువై గణదోషం. ‘మేఘ వర్ణుడు గన’ అనండి.

      తొలగించండి
    2. పూజ్యు లు శంకరయ్య గారికి వందనములు. మేఘశ్యాముడు గమనించ లేదు పొరపాటున. ధన్యవాదములు.

      తొలగించండి
  14. గోపికాళియందు గోముగ సయ్యాట
    కృష్ణు డాడెనట|”క్రికెట్టు క్రీడ
    నెంచలేదునాడు”నేడిల నాడంగ
    ఆటలందు గొప్పయాట జూడ|

    రిప్లయితొలగించండి
  15. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    మామ బిలిచె ననుచు మాధవు డేగగా
    కండ బలము జూప కంస భటులు
    సిక్సులట్టు కొట్టి చెండాడ వారిని
    కృష్ణుఁ డాడెనఁట క్రికెట్టు క్రీడ.

    రిప్లయితొలగించండి
  16. ఇటువంటి వికారం కలిగించే సమస్యలు ఇవ్వవద్దని మనవి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అజ్ఞాత గారూ,
      మంచి విషయాన్ని ‘అజ్జాత’గా చెప్పడం ఎందుకు?
      అయినా సమస్యా అంటేనే అసంబద్ధంగా, అసహజంగా, లోకరీతికి విరుద్ధంగా, కొండొకచో అశ్లీలంగా, జుగుప్సాకరంగా ఉండవచ్చు. పూరణతో సంస్కరించడం అవధాని పని. అప్పటికీ నేను సాధ్యమైనంత వరకు సంస్కారవంతంగా ఉండే సమస్యలనే ఇస్తున్నాను. గతంలో ప్రసిద్ధ అవధానాలలో ఇచ్చిన అశ్లీలమైన సమస్యలు నేను సేకరించినవాటిలో ఉన్నాయి. కాని ఇవ్వడం లేదు. ధన్యవాదాలు.

      తొలగించండి