16, జులై 2010, శుక్రవారం

సమస్యా పూరణం - 40

కవి మిత్రులారా!
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ...
ధనమె గొప్ప మంచితనము కంటె.

21 కామెంట్‌లు:

  1. మంచితనము కన్న మంచి ధనమె మిన్న
    మనిషి కన్న, మనిషి మంచి కన్న!
    చూచియుంటిమన్న సోంపేటలో నిన్న
    ధనమె గొప్ప మంచితనము కంటె

    రిప్లయితొలగించండి
  2. ఘనము ఘనమటంచు కల్యాణకరమంచు
    మంచితనము నుంటి. వంచితులిల
    ధనము బలము చేసి దయమాలి వర్తించు.
    ధనమె గొప్ప మంచితనము కంటె.

    రిప్లయితొలగించండి
  3. జబ్బు చేసినంత డబ్బు సాయ మడుగ
    ప్రాణ మిత్రుడొకడు పారి పోయె
    వైరిగా తలచిన వాడు సాయ పడిన
    ధనమె గొప్ప మంచితనము కంటె.

    రిప్లయితొలగించండి
  4. చదువరి గారూ,
    చింతా రామకృష్ణారావు గారూ,
    హరి దోర్నాల గారూ,
    అందరి పూరణలు చాలా బాగున్నాయి. అభినందనలు. సమయాభావం వల్ల విడివిడిగా వ్యాఖ్యానించలేక పోతున్నాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  5. ఇన్ని పాటు లోర్చి ఇప్పుడిఁక సయోధ్య
    యందురా?అదియును ఐదు ఊళ్ళ
    కట!కట కట!వలఁదు.క్షత్రియునకిలఁ ని
    ధనమె గొప్ప మంచితనము కంటె.

    నిధనము - మరణము
    నిర్ధనము - దారిద్ర్యము అని మృచ్ఛకటికంలో ఓ చోట వస్తుంది.

    రిప్లయితొలగించండి
  6. మన్నించడమేంటి మాస్టారూ, ఓపిగ్గా సమస్యలనిచ్చి మా పూరణలను ప్రచురిస్తున్నారు, అదే ఎక్కువ. :) అందరికీ కలిపి ఒక అభినందన వ్యాఖ్య చాలదూ!?

    రిప్లయితొలగించండి
  7. నేనూ చదువరి గారి వ్యాఖ్యను సమర్థిస్తున్నాను

    రిప్లయితొలగించండి
  8. వారకాంతలకడ, వర్తకమున, నేడు
    గనగ రాజకీయమునను, కడకు,
    కట్టె గాల్చ నిచ్చు కాపరి వద్దనూ
    ధనము గొప్ప మంచి తనము కంటె.

    రిప్లయితొలగించండి
  9. @ కవి మిత్రుల౦దరికి అభినందనలు.

    ధనము గొప్పదియగు దానగుణము యున్న,
    విద్య గొప్పదియగు వినయమున్న,
    కర్మ ఫలము వీడి గావించు కార్య సా
    ధనమె గొప్ప మంచితనము కంటె.

    రిప్లయితొలగించండి
  10. మంచి మాటలెన్ని మనసార చెప్పినా
    బడుగు జీవి కెటుల కడుపు నింపు?
    చేతనైన యంత చేయూత నివ్వరా,
    ధనమె గొప్ప మంచితనము కంటె!!

    రిప్లయితొలగించండి
  11. మంచి మంచి యన్న మనుగడ యేముంది
    కంచి కేగు నట్టి కతల కతన
    వేంక టేశు డైన వరమిచ్చు ఫలమొంది [వజ్రములందుకొని ]
    ధనమె గొప్ప మంచి తనము కంటె

    రిప్లయితొలగించండి
  12. ధనమె గొప్ప మంచితనము కంటె యనుచు
    తలిచె నొక్క జనుడు ధరణి యందు!
    కరువు వొచ్చి యతడె కష్టాల కాయగా
    సాయ మడుగ నెవరి జాడ లేదు!!

    రిప్లయితొలగించండి
  13. బందుఁజేసినంత బందయ్యె పెట్రోలు
    చూడ లీటరుండె స్కూటరందు
    ఫ్రెండు కోర కొంత రిజెక్టుఁజేసె, యిం
    ధనమె గొప్ప మంచితనము కంటె!!

    రిప్లయితొలగించండి
  14. ఊకదంపుడు గారూ,
    బాగుంది మీ పూరణ. ధన్యవాదాలు.

    సుమిత్ర గారూ,
    బాగుంది. అభినందనలు. "దానగుణము + ఉన్న" అన్నప్పుడు యడాగమం రాదు. "దానగుణంబున్న" అని సవరిస్తే సరి.

    నచికేత్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు. రెండవ పూరణలో "కరువు వొచ్చి" అన్నారు. తెలుగులో వు,వూ,వొ,వోలతో మొదలయ్యే పదాలు లేవని చిన్నయ సూరి చెప్పాడు. "కరువు వచ్చి" అంటే సరిపోతుంది.

    నేదునూరి రాజేశ్వరి గారూ,
    మంచి బావం. అభినందనలు. అయితే మూడవ పాదంలో యతిమైత్రి తప్పింది.
    "వేంకటేశుడైన వినడు ముడుపు లేక" అని సవరిస్తే ఎలా ఉంటుంది?

    జిగురు సత్యనారాయణ గారూ,
    భావం బాగుంది. అభినందనలు. మూడవ పాదంలో ఇంద్రగణానికి బదులు "రిజెక్టు" అని జగణం వేసారు.

    రిప్లయితొలగించండి
  15. నా పూరణ -

    ఐహిక సుఖ రక్తు లైనట్టి వారికిన్
    ధనమె గొప్ప; మంచితనము కంటె
    మించినట్టి దేది? మేలుగ పుణ్య సా
    ధనముఁ జేయువారె ధన్య జనులు.

    రిప్లయితొలగించండి
  16. తిట్టిపోయునెడల తిరిగి తిట్టవలయు -
    మంచితనము చూప మనము గోరి,
    మిన్నకున్న- ఇంక మించి పోదురు! మాన
    ధనమె గొప్ప మంచి తనము కంటె!

    రిప్లయితొలగించండి
  17. ఆచార్య ఫణీంద్ర గారూ,
    ఆలస్యమైనా మంచి పూరణ పంపించారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    01)
    ____________________________________

    మంచి తనము జూపి - వంచనాపరులను
    వదల గూడ దెపుడు - వసుధ యందు !
    చెడ్డ వారి నెల్ల - శిక్షింప, నిట దుర్మ
    థనమె మేలు మంచి - తనము కంటె !
    ____________________________________

    రిప్లయితొలగించండి
  19. వసంత కిశోర్ గారూ,
    మంచిభావాన్నే తీసుకున్నారు పూరణకు. కాని సమస్యపాదంలోని ప్రథమాక్షరాన్ని‘థ’ గా మార్చారు. అది ‘ధ’ కదా!

    రిప్లయితొలగించండి
  20. శంకరార్యా ! ధన్యవాదములు !
    మరేం జెయ్యను ?
    ధ-లన్నీ ఐపోయినై !

    రిప్లయితొలగించండి