27, జులై 2010, మంగళవారం

సమస్యా పూరణం - 49

కవి మిత్రులారా!
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ...
గురువే శిష్యుల నడిగెను గూఢార్థములన్.
( మా బావ గారు, తెలుగు పండితులు మిట్టపెల్లి సాంబయ్య గారు ఇచ్చిన సమస్య )

10 కామెంట్‌లు:

  1. గురుతర జ్ఞాన ప్రదీపులె
    గురువులు. సద్గురులె గురులు.గూఢార్థంబుల్
    తెలుపును శిష్యుల; కెపుడే
    గురు వేశిష్యుల నడిగెను గూఢార్థములన్?
    (రలయో రభేదః; అభేద ప్రాస)

    రిప్లయితొలగించండి
  2. అరయగ గూడార్థములను
    అరటి ఫలంబులు వలిచిన యట్లుగ చెపుచున్
    తిరిగి పరీక్షల వేళను
    గురువే శిష్యుల నడిగెను గూఢార్థములన్.

    రిప్లయితొలగించండి
  3. ఈ విషయంలో నిజా నిజాలు మీరూ, మీబావగారే చెప్పాలి..
    ఈ మార్కోని విద్యావ్యవస్థ వచ్చిన తరువాత..
    ఒకానొక సమయం లొ బాషా పండితులు కూడ తప్పని సరి గా ఆంగ్ల పరీక్ష ప్యాస్ అవ్వలన్న నిమయమ్ వచ్చిమ్దట. అప్పుడు అందరు భాషాప్రవీణులు (అప్పటికే ఆంగ్లపు చదువుల పాల్బడ్డ తమ శిష్యుల వద్ద) ఆంగ్లమ్ నేర్చుకోవటం మొదలు పెట్టారుట.

    పరులే ప్రవేశపెట్టగ
    మెరుగౌ విద్యలకు బదులు మ్లేఛ్ఛపుపాఠాల్
    త్వరబడి ఆంగ్లము నేర్వన్
    గురువే శిష్యుల నడిగెను గూఢార్థములన్.

    రిప్లయితొలగించండి
  4. ఎరిఁగిన విద్యలఁ మరువక
    స్మరణము జేయింపనెంచి సతతము తానున్
    పరీక్షలకుఁ గురి జేయుచు
    గురువే శిష్యుల నడిగెను గూఢార్థములన్

    రిప్లయితొలగించండి
  5. సరికొత్తగ తన ఫోనున
    చిరు సందేశముల యందు చిందిన పొడియ
    క్షరముల భావము గానక
    గురువే శిష్యుల నడిగెను గూఢార్థములన్

    రిప్లయితొలగించండి
  6. ధన్య వాదములు శంకరయ్య గారు పద్యాన్ని సవరణ చేయడమె గాక సమస్యను కుడా మార్చిన మీ ఔన్నత్యం శ్లాఘ నీయము .ఈ విధం గా నైనా నేర్చు కొ గలిగితె ధన్యు రాలను

    రిప్లయితొలగించండి
  7. గురువును మించిన శిష్యులు
    గర్వము నడచం గనెంచి గురువును ఎట్లన్
    పరిణతి చెందిన పండిత
    గురువే శిష్యుల నడిగెను గూడార్ధములన్

    రిప్లయితొలగించండి
  8. అరయుడి మరఖేచరము ల
    మరెను గురిగ భూరుహాగ్రమందున మీకై
    కురుకొమరులార నగుచున్
    గురువే శిష్యుల నడిగెను గూడార్థములన్

    రిప్లయితొలగించండి
  9. చింతా రామకృష్ణారావు గారూ,
    హరి దోర్నాల గారూ,
    అజ్ఞాత గారూ,
    రవి గారూ,
    చదువరి గారూ,
    నేదునూరి రాజేశ్వరి గారూ,
    గిరి గారూ,
    పూరణలు పంపించిన మీ కందరికీ అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. మురియుచు ముదుసలి టీచరు
    పరుగిడి కంప్యూటరుకొని పట్టుకు తలనున్
    అరయగ జాలపు కిటుకుల
    గురువే శిష్యుల నడిగెను గూఢార్థములన్

    రిప్లయితొలగించండి