19, అక్టోబర్ 2013, శనివారం

శివామృతలహరి


శివామృతలహరి
ఏల్చూరి మురళీధరరావు

శా.    శ్రీనాదాంతవిభావనీయపరమశ్రేయోనిధానా! త్రివే
        దానుస్వారవిధాన! వైదికలతాంతారూఢతత్త్వైకవి
        ద్యానన్యాదృశకేళిరమ్య! ప్రణవధ్యానైకగమ్యా! స్వస
        ర్గానూనస్థితిసంహృతిత్రితయముక్తాకార! విశ్వేశ్వరా!                           

మ.    కలరూ పేర్పడరాని వైద్యుతలతాకల్పంబవై పొల్చి, పెన్
        వెలుఁగై నిల్చిన నాదబిందుసుకళాభిజ్ఞాస్పదభ్రూయుగీ
        విలసన్మధ్యతలావతార! కరుణావిస్తార! నాలోన ని
        న్నెలమిం దాపము తీఱఁ జూచుటెపుడోయీ, స్వామి విశ్వేశ్వరా!                                                             

శా.    నీవై యుంచెదు మంటినేల మొలకన్; నీర్వోసి పేరాదటం
        జేవ న్నించెద; విట్లు పెంచెదవు హృత్సీమన్ వెలుంగై మము
        న్నీవే నొంచెద; వింకఁ ద్రుంచెదవునున్ నీలాభ్రధూర్జాటజూ
        టీవిస్తీర్ణసురాపగాశివచిరంటీరమ్య! విశ్వేశ్వరా!                                                                         

శా.    ఓంకారాభిధమంత్రబంధశుభవర్ణోర్జస్వలప్రౌఢిమా
        లంకర్మీణ! భవార్తభక్తజనకల్యాణైకపారీణ! భా
        వాంకూరశ్లథనైకదక్ష! దురితవ్యాఘ్రౌఘహర్యక్ష! య
        స్తుంకారమ్మును జూపి బాపవె మనోదుఃఖమ్ము విశ్వేశ్వరా!                            

శా.    సేవింతున్ నిగమాగమాంకితశుభశ్రీనామధేయున్, నినున్
        భావింతున్ జతురాస్యకేశవనిలింపాదృష్టచూడాపదుం,
        గావింతున్ భవదీయదాసజనకైంకర్యంబు, నీ పాదరా
        జీవద్వంద్వనిరంతరార్చనవిధిన్ జీవింతు విశ్వేశ్వరా!                                

మ.    చిరమై శారదచంద్రికారుచిరమై శీర్యణ్యగంగాశుభా
        కరమై శాంతజితేంద్రియప్రకరమై కైవల్యమందారసుం
        దరమై విద్రుతభక్తలోకదరమై ధర్మానుసంధానసు
        స్థిరమై పొల్చెడు వెల్గు నిన్ను నొకఁడే సేవింతు విశ్వేశ్వరా!                                    

మ.    నతభక్తార్ణవచంద్రమండలఘృణీ! నైజాత్మయోగారణీ!
        స్తుతకల్యాణమణీ! జటాటదమరస్రోతస్వినీధోరణీ!
        శ్రితలోకైకశిరోమణీ! శ్రుతిశిరస్సీమంతముక్తామణీ! 
        ప్రతిమానన్యు నినున్ భవాబ్ధితరణీ! ప్రార్థింతు విశ్వేశ్వరా!                            

శా.    గాలింతున్ నిను గాలిలోఁ, బృథివి, నాకాశంబులో, నీటిలో,
        లీలామేయ! వెలుంగులోన; నిజకేళీకల్పవిశ్వా! జగ
        జ్జాలంబున్ మథియింతుఁ గాని, భవనిస్తారైకకేళీధృతిన్
        నాలో నున్నది నీవు నేనని మదిన్ భావింప విశ్వేశ్వరా!                              

శా.    కల్యాణావహధర్మనిర్మలగుణౌకస్ఫూర్తి నీ జీవసా
        కల్యంబుం బరమానురాగమయవీక్షాదీక్ష రక్షించి కై
        వల్యానందమరందమత్తమధుపవ్రాతంబుగాఁ దీర్చు వై
        పుల్యప్రోజ్జ్వలభక్తిభావమహితాంభోజాక్ష! విశ్వేశ్వరా!                                    

శా.    శర్వాణీరమణీమణీహృదయశశ్వత్పద్మభృంగాణ! నీ 
        నిర్వాణప్రదనిర్మలాకృతిని మౌనిప్రాజ్ఞు లూహింప దృ
        క్పర్వంబై యగుపింతు వెట్లు దయఁ బ్రోవన్ రావె తండ్రీ! నను
        న్నర్వాచీనవటద్రుమూలఫలవిద్యామూర్తి! విశ్వేశ్వరా!    
                           
శా.    శ్రీగౌరీకుచకుంభసంభృతలసత్‌శ్రీగంధకస్తూరికా
        భోగోరస్కుఁడ! నిన్నుఁ గొల్తు, భుజగీభూషాక! నీతో జనుః
        ప్రాగల్భ్యంబు స్మరింతు, నీ కొఱకు నర్చాకర్మఁ గావింతు, నీ
        కాగమ్యస్తుతిఁ జేతు, నిల్తుఁ గడ నీ యం దేను విశ్వేశ్వరా!                             

మ.   ఎడఁదన్ నాగెఁటిచాలుగాఁ దిగిచి భవ్యేక్షాకటాక్షామృతం
        బొడఁగూర్పన్ వడిఁగూర్ప నంత మొలకల్, పూఁబిందె లందమ్ములై
        వొడమెన్ శారదపూర్ణమౌళిశశిసంభూషామనోజ్ఞాకృతీ!
        జడచైతన్యధృతీ! దయార్ద్రసుమతీ! సత్యాత్మ! విశ్వేశ్వరా!                                    

మ.   బ్రతుకెల్లన్ వరిబీడుగా నెఱియలై వాటిల్లు నెచ్చోట నీ
        వు తిరంబై కొలువున్న చిన్నెలివి కాబోలు న్వగ, ల్లేవడుల్
        జత గోరంబుల పంటలయ్యె నను నొల్లంబోక నొక్కింత చూ
        పితి వీ నిన్నుఁ దలంచు నెమ్మదిఁ దమిన్ విశ్వాత్మ! విశ్వేశ్వరా!                          

మ.   తరణాతీతభవాబ్ధిలో మునిఁగి శ్రీ తారుణ్య కారుణ్య స
        ద్వరణామోఘగుణౌఘగాన మొనరింతున్ స్వామి! రానిమ్ము త్వ
        చ్చరణాంభోజము లాత్మ నిల్పికొను దాసశ్రేణిపైఁ గొంత నీ
        కరుణాపూర్ణకటాక్షవీక్షణము నాకై కొంత విశ్వేశ్వరా!                                 

మ.   నినుఁ గన్గోనల నైనఁ గానఁగ భవానీప్రాణకల్పా! మన
        మ్మును బద్ధ మ్మొనరించి కాంచనధనాంభోజాస్యలం దెమ్మికం
        జన కర్చించిన, చిత్తమా? నిలువ ; దీశా! నీవు రావౌటయుం
        గనినన్ రెంటికిఁ జెడ్డ రేవఁడయితిం గాబోలు విశ్వేశ్వరా!                             

శా.    విశ్వాధిక్యముఁ గల్పితోపలముఁ గావింపన్ భవన్మాయ లీ
        శశ్వన్మానసనిత్యసంస్థితములై సంత్రస్తరక్షాపరా
        త్మా! శ్వేతాశ్వతరానుభావచిత! చిత్తక్షోభ మేపార, నీ
        వా శ్వశ్రేయస మెట్లు కూర్చెదవు? భవ్యధ్యేయ! విశ్వేశ్వరా!                      

శా.    మేడల్ మిద్దెలుఁ గట్టుకొన్న వలఁతిన్ మేల్గీడులం గూర్మిఁ గా
        పాడం జూతువు! వాని ముంగిటను గాఁపై నిల్చెదున్; వానినే
        ఱేడుం జేతువు కాని రేయిఁబవలున్ ఱెక్కాడినం గాని డొ
        క్కాడన్ రోజులు లేనివారిఁ గన సిగ్గా నీకు? విశ్వేశ్వరా!                              

శా.    శ్రీచిద్వహ్నిశిఖోజ్జ్వలాగమచతుస్సీమాంతరవ్యాహృతి
        స్వాచైకీర్షితలక్షణాస్ఫుటకళాసందీపితానందబో
        ధాచైతన్యమనోజ్ఞరూపవిభవాంతర్జ్యోతిరాలోచనా
        వైచక్షణ్యమహానుభావభరితవ్యాపార! విశ్వేశ్వరా!                                    

 శా.   శర్వాణీరమణీమణీహృదయశశ్వత్పద్మభృంగాణ! నీ
        నిర్వాణప్రదనిర్మలాకృతిని మౌనిప్రాజ్ఞు లూహింప దృ
        క్పర్వంబై యగుపింతు వెట్లు దయఁ బ్రోవన్ రావె, తండ్రీ! నను
        న్నర్వాచీనవటద్రుమూలఫలవిద్యామూర్తి! విశ్వేశ్వరా!                             

15 కామెంట్‌లు:



  1. అభినవ ధూర్జటి శ్రీ యేల్చూరి వారి శివామృతలహరి చదువుతుంటే శ్రీ కాళహస్తీశ్వర శతకము చదివిన అనుభూతి కలుగుచున్నది.వారి ప్రతిభకు నమోవాకములు.

    రిప్లయితొలగించండి
  2. గురువుగారు నమస్కారం మరియు పుట్టిన రోజు శుభాకాంక్షలు

    శివామృతలహరి అనే పరమాన్నాన్ని శరద్ పౌర్ణమి నాడు మా అందరికీ అందించినందులకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  3. మిత్రులు శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారి శివామృతలహరి భక్తిస్ఫోరకముగ, సంస్కృత సమాస సంభరితముగ, ధ్వని ప్రయుక్తముగ, మా బోంట్లకు స్ఫూర్తిదాయకముగ నున్నది. శయ్యా చమత్కృతి పూర్వకవులను దలపించుచున్నది. ఇంత చక్కని శివామృతలహరిలో నోలలాడింపఁ జేసిన ఏల్చూరివారికి శతసహస్రాభివందనములు!

    రిప్లయితొలగించండి
  4. శ్రీ విశ్వేశ్వర! నీ మహోన్నతుల విశ్లేషించుచున్ స్తోత్రమున్
    గావించెన్ మురళీధరాహ్వయుడు భక్త్యావేశ పూర్ణాత్ముడై
    ధీవైశిష్ట్యము పొంగుచుండ కవితా దీప్తుల్ జెలంగన్ మహా
    దేవా! మోదము తోడ బ్రోవు మతనిన్ దీవ్యత్ కృపావైభవా!

    రిప్లయితొలగించండి
  5. మాన్యులు శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబసభ్యులకు భగవంతుడు ఆయురారోగ్యైశ్వర్యాది సకల శుభములు చేకూర్చు గాత !
    మీ శివామృతలహరి చాలా బాగుంది. శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి గారు నుడివినట్లు మీరు అభినవ ధూర్జటే ! మీరు శ్రీ విశ్వనాధ వారిని కూడా తలపిస్తున్నారు.

    రిప్లయితొలగించండి
  6. మురళీధరుల కలంనుంచి శివస్తుతి, ఆహా!
    విశ్వనాధ వారి విశ్వేశ్వరశతకం గుర్తుకొచ్చింది. సవినయ గమనిక, కొన్ని మత్తేభాలని శా. అని గుర్తు పెట్టారు. తప్పక ముద్రారాక్షసమే అని నా విశ్వాసము.

    రిప్లయితొలగించండి
  7. గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    రమణ గారికి,
    గుండు మధుసూదన్ గారికి,
    పండిత నేమాని వారికి,
    గన్నవరపు నరసింహమూర్తి గారికి,
    చంద్రశేఖర్ గారికి
    ధన్యవాదాలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    సవరించాను.

    రిప్లయితొలగించండి
  8. దయతో ఆదరామృతవర్షాన్ని కురిపించిన మాన్యశ్రీ కంది శంకరయ్య గారికి,
    హృద్యపద్యాశీర్వచోమణిసంహతిని ప్రసాదించిన పూజ్యశ్రీ నేమాని పండిత గురుదేవులకు,
    సహృన్మిత్రశ్రీ సమితికి,

    పావన మగు భావనమున
    దీవెన లిడినట్టి ప్రేమదివ్యారాముల్
    భావితమధుమయకవితా
    శేవధులకు మీకు భక్తిఁ జేసెద నతులన్!

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  9. నమస్కారములు
    గౌరవ నీయులైన శ్రీ ఏల్పూరి మురళీ ధర రావుగారి కలం నుంచి జాలువారిన శివామృత లహరి అమృత వర్షాన్ని కురి పించీ భక్తి పారవస్యము ను కలిగించినది ధన్య వాదములు
    అభినందన మందారములు

    రిప్లయితొలగించండి
  10. శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు.
    మీ శివామృతలహరి చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  11. శంకరయ్య ముంగిట మురళిధరుడు చేసిన శివస్తుతి!! శివ కేశవ అభేదానికి ఇంతకంటే తార్కాణం అక్కర్లేదేమో!

    రిప్లయితొలగించండి
  12. మా గురువు గారు శ్రీ ఏల్చూరి మురళీధర్ గారికి నమస్కారములు మరియు జన్మదిన శుభాకాంక్షలు. వారు రచించిన శివానందలహరి పద్యములు కడు రమ్యముగాను హృద్యముగాను ఉన్నవి. నా వంటి పద్యప్రియులకు బహు ఉపయోగకరములైన పద్యములను మాకు చదువుకోవడానికి ఇప్పించిన గురువు గారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  13. మా గురువు గారు శ్రీ ఏల్చూరి మురళీధర్ గారికి నమస్కారములు మరియు జన్మదిన శుభాకాంక్షలు. వారు రచించిన శివానందలహరి పద్యములు కడు రమ్యముగాను హృద్యముగాను ఉన్నవి. నా వంటి పద్యప్రియులకు బహు ఉపయోగకరములైన పద్యములను మాకు చదువుకోవడానికి ఇప్పించిన గురువు గారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  14. శివామృతలహరి నోలలాడించిన శ్రీ యేల్చూరి వారికి నమోవాకములు.

    రిప్లయితొలగించండి