7, మే 2014, బుధవారం

సమస్యాపూరణం - 1405 (కడుపాయెను)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కడుపాయెను కొడుకు చేతఁ గాంతామణికిన్.
ఈ ప్రసిద్ధ సమస్యను సూచించిన డా. విష్ణునందన్ గారికి ధన్యవాదాలు.

28 కామెంట్‌లు:

  1. కడు వింతకథల నొలికిం
    చెడు పుత్రుని ప్రక్రియలకు చిత్తమలరు సం
    దడిలో నగవుల కడవగ
    కడుపాయెను కొడుకు చేత కాంతమణికిన్

    రిప్లయితొలగించండి
  2. వేడుక జేయగ నొకపరి
    పాడుచు వినిపించె సుతుడు పరిహా సముగన్
    చూడగ నగవుకు బానగ
    కడు పాయెను కొడుకు చేత గాంతా మణికిన్

    రిప్లయితొలగించండి
  3. కడచిన బహుకాలమునకుఁ
    గడుపాయెను; కొడుకుచేత కాంతామణికిన్
    గడచెను తా గొడ్రాలని
    యెడి పేరు; ముదమ్మునందె నెంతయు వేడ్కన్.

    రిప్లయితొలగించండి
  4. పండిత నేమాని వారూ,
    కడుపు నగవుల కడవ అయిందన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    బానకడుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    కాని ప్రాసను గమనించలేదు. సమస్య లఘువుతో ప్రారంభమైతే మీరు మిగిలిన మూడు పాదాలను గురువుతో ప్రారంభించారు. మీ పద్యానికి నా సవరణ....
    కడువేడుకతో నొకపరి
    వడి పాటను వినిచె సుతుడు పరిహాసముగన్
    పడిపడి నవ్వగ బానగ
    కడు పాయెను కొడుకు చేత గాంతా మణికిన్
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘కడు నుబ్బెత్తుగ’ అనండి.

    రిప్లయితొలగించండి
  5. పూజ్యులు గురుదేవులు 
    శ౦కరయ్య గారికి వందనములు
    "వానపాముకాటు ప్రాణ హరము"సమస్యకునేనుపంపిన పూరణలు
    పరిశీలనకునోచుకోలేదు చాలానిరుత్సాహజనకము

    రిప్లయితొలగించండి
  6. బుడిబుడి నడకల పాపడి
    నొడి నిడుకొన పొట్ట మీద నురకలు వేయన్
    బుడుతడు, పాపము పుండుగ
    కడుపాయెను కొడుకు చేతఁ గాంతామణికిన్.

    రిప్లయితొలగించండి
  7. కడుముదమున పెండ్లి జరిపె
    కొడుకునకును తల్లి మేన కోడలి తోడన్
    గుడులెన్నొ తిరిగి మ్రొక్కగ
    కడుపాయెను, కొడుకుచేత కాంతా మణికిన్

    రిప్లయితొలగించండి
  8. పడతి పది వత్సరమ్ములు
    కడు దుఃఖము జెందె సంతు కలుగని చేతన్
    విడిపోయె జింత నేటికి
    కడుపాయెను కొడుకుచేత గాంతా మణినికిన్ .

    రిప్లయితొలగించండి
  9. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    పూరణలను సమీక్షించకుంటే మీతో పాటు మీరు పరిచయం చేసిన క్రొత్త కవిమిత్రులు చాలా నిరుత్సాహపడి ఉంటారు. క్షంతవ్యుణ్ణి. నిన్నటి పూరణలన్నింటినీ పరిశీలించాననే అనుకున్నాను. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడా పూరణలను సమీక్షించాను.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. నడివయసు దాటిపోయిన
    గడుపాయెను, కొడుకుచేత కాంతామణికిన్
    యిడుములు తొలగెను బ్రతుకున
    కడువేడుక కలిగెగాదె కమనీయముగన్

    రిప్లయితొలగించండి
  11. అడపా తడపా జరుగును
    కడుమదమున నుండి మఱియు కామము పెచ్చౌ
    నడరెడు తల్లులు గలచో
    కడుపాయెను గొడుకు చేత కాంతా మణికిన్

    రిప్లయితొలగించండి
  12. కొడుకనె నొక తల్లిని గని
    "కొడుకును గని కోడలిపుడు కోరిక దీర్చున్ "
    తడబడి తల్లియు బలికెను
    "కడుపాయెను కొడుకు చేతఁ గాంతామణికిన్!".

    రిప్లయితొలగించండి
  13. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘మణికిన్ + ఇడుములు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘మణికి/ న్నిడుములు’ అనవచ్చు. లేదా ‘మణికిన్/ గడచిన విడుములు...’ అనండి.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ పద్యం బాగుంది. కానీ భావం విపరీతంగా ఉంది.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    బాగున్నది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  14. పూరణ:1. బుడి బుడి యడుగుల స్కందుడు నడయాడుచు తండ్రి జేరి నాగము లాగన్
    పడి పడి యుమ నగె యుబ్బిన
    కడుపాయెను కొడుకుచేత కాంతామణికిన్
    2 .కడ తేరెను సౌభద్రుడు
    తడయక కురు సేన జొచ్చి తమ్మి మొగరమున్
    చెడువార్త వినగ శోకపు
    కడుపాయెను కొడుకుచేత కాంతామణికిన్

    రిప్లయితొలగించండి
  15. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. కడు సంతసమున ననెను మ
    గడు, కోడలు మణికి గలిగె గర్భంబనుచున్
    వడి వడి శుభ వార్త వినుము
    కడుపాయెను కొడుకు చేత గాంతా! మణికిన్

    రిప్లయితొలగించండి
  17. పూజ్యులు గురుదేవులు
    శ౦కరయ్య గారికి వందనములు
    మల్లెల సోమనాధ శాస్త్రిగారి పూరణ
    కడు వేడగ నా కుంతియు
    వడి కర్ణుడు గాతు ననియె ఫల్గునుదక్కన్
    కడు సంత సించె చల్లని
    కడుపాయెను కొడుకుచేత కాంతామణికిన్

    రిప్లయితొలగించండి
  18. పండిత నేమాని వారూ,
    మణికి కడుపయిందన్న మీ పూరణ వైవిధ్యంగా, క్రొత్త కవులకు మార్గదర్శకంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. గుడికొలను చెంతను పడతు
    లడుగగ నీవెట్లువస్తి వత్తాయని మా
    రిడె కడవెత్తుచు నామెయె
    కడుపాయెను కొడుకు చేత కాంతమణికిన్

    రిప్లయితొలగించండి
  20. రామకృష్ణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. వడి మూడుముడులు వేయగ
    కడుపాయెనుకొడుకుచేత;కాంతామణికిన్
    బుడిబుడినడకల వే,మన
    వడు తనముద్దు తీర్ఛివారసుడవగా!

    రిప్లయితొలగించండి
  22. వడి మూడుముడులు వేయగ
    కడుపాయెనుకొడుకుచేత;కాంతామణికిన్
    బుడిబుడినడకల వే,మన
    వడు తనముద్దు తీర్ఛివారసుడవగా!

    రిప్లయితొలగించండి
  23. శ్రీ రామఋష్ణ మూర్తి గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    మనవడు అనుట వ్యావహారికము - మనుమడు అనుట సాధు ప్రయోగము.
    ఆ రీతిగా సరిజేయండి మీ పద్యమును.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  24. కొడుకే వైద్యుడు, తల్లికి
    మిడిమేలపు కడుపునొప్పి మిక్కుట మవగా
    పొడిమందునీయ చక్కని
    కడుపాయెను కొడుకు చేతఁ గాంతామణికిన్.

    రిప్లయితొలగించండి
  25. "కొడుకా? కూతుర?" నాకన,
    నడిరేయిన స్కాను దీసి నర్సిటులనియెన్:
    "జడవకురా! దౌర్భాగ్యుడ!
    కడుపాయెను కొడుకు చేతఁ గాంతామణికిన్!"

    రిప్లయితొలగించండి


  26. తడబడెడడుగుల ముద్దుల
    బుడతడి నడుగ మురిపెమ్ము పూర్తిగ తీరన్,
    జడగంటలాడ చక్కని
    కడుపాయెను కొడుకు చేతఁ గాంతామణికిన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  27. బడుగును చేయగ నేతను
    జడియక బిడియమును వీడి జగడమ్మున తా
    కొడుకున కొసగగ పట్టము
    కడుపాయెను కొడుకు చేతఁ గాంతామణికిన్

    రిప్లయితొలగించండి