26, మే 2014, సోమవారం

సమస్యాపూరణం – 1424 (తారలు మధ్యాహ్నవేళ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
తారలు మధ్యాహ్నవేళ తళుకున మెరసెన్.
ఈ సమస్యను పంపిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.
అవధానంలో గరికిపాటి వారికి ఇచ్చిన సమస్య ఇది...
తారల కాంతిచే పగలు తళ్కులు చిందియు తెల్లబోయెగా!

23 కామెంట్‌లు:

 1. చీరెల వ్యాపారంబును
  భారీ యెత్తున మొదలిడు భావమున సినీ
  తారల నాహ్వానింపగ
  తారలు మధ్యాహ్నవేళ తళుకున మెరసెన్!

  రిప్లయితొలగించండి
 2. హారము కొన్నది శ్రీమతి
  భారము కాదంచు మీకు భర్తకు జూపెన్
  ఘోరము ధరగాంచి వెఱగున
  తారలు మధ్యాహ్న వేళ తళుకున మెరిసెన్

  హరము - 108 పేటల ముత్యాల హారము

  రిప్లయితొలగించండి
 3. మీరలు విందుకే గవలె మింటను నంటెడు భోగముల్ గనన్
  భూరి గణంబు లంతయును భూసురు సైతము నీసు పెండ్లికై
  తేరుల మీదుగా తరలి దేవత లెల్లరు మోద మొందగా
  తారల కాంతిచే పగలు తళ్కులు చిందియు తెల్ల బోయెగా

  రిప్లయితొలగించండి
 4. బేరములబెంచుకొనుటకు
  వారమువారము దుకాణవైభవమొప్పన్
  చారెడుకన్నుల సినిమా
  తారలు మధ్యాహ్నవేళ తళుకున మెరసెన్!

  రిప్లయితొలగించండి
 5. నోరూరు రుచులటంచును
  కారము రెట్టించ, నావకాయను మ్రింగన్
  కారగ కన్నీరు నదిగ
  తారలు మధ్యాహ్నవేళ తళుకున మెరసెన్.

  రిప్లయితొలగించండి
 6. భేరీభాంకణములతో
  నూరుదినంబుల సభకని నూత్నాభరణా
  ధారులయి యున్న సినిమా
  తారలు మద్యాహ్న వేళ తళుకున మెరిసెన్.

  రిప్లయితొలగించండి
 7. ఆరని జోతులు గదమఱి
  తారలు మధ్యాహ్న వేళ తళు కున మెరసెన్
  బారులొ నొక భామా మణి
  పేరడుగగ జెప్పె యామె వీ ణా యనుచున్

  రిప్లయితొలగించండి
 8. భారత నూతన భూపతి
  సారథ్యము జూచి మెరయ సప్తాధివరుల్
  జేరగ నభమున సందడి
  తారలు మద్యాహ్న వేళ తళుకున మెరిసెన్.

  సప్తాధివరుల్ =సార్క్ ఆమంత్రితులు

  రిప్లయితొలగించండి
 9. సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  మూడవ పాదంలో గణదోషం. ‘ఘోరపు ధరఁ గని వెఱగున’ అంటే సరి!
  వృత్తంలో మీ పూరణ బాగుంది. ‘భూసురు లెల్లను నీశు పెండ్లి’ అనండి!
  *
  మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘దుకాణపు వైభవము’ అనాలి కదా... అక్కడ ‘అంగడి వైభవ మొప్పన్’ అందాం.
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  అది గుంటూరు కారమా? బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘భాంకణము’ శబ్దం ఏ నిఘంటువులోను దొరకలేదు. అక్కడ ‘భేరీభాంకృతు లొప్పగ’ అంటే బాగుంటుందేమో?
  ‘నూత్నాభరణధారులు’ అనాలి కదా. అక్కడ ‘నూత్నాభరణ/శ్రీ రంజిల్లెడి సినిమా...’ అంటే ఎలా ఉంటుంది?
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘వీణ యటంచున్’ అనండి.
  *
  చంద్రమౌళి గారూ,
  మీ పూరణ కాలానుగుణంగా ఉంది. బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. గురువుగారు,

  చాలా సంతోషమండీ. అద్భుతమైన సవరణలను సూచించారు. శతథా ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 11. నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  నా సవరణలను సహృదయంతో ఆమోదించినందుకు సంతోషం.

  రిప్లయితొలగించండి
 12. మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణలు

  చేరియు రాహువు సూర్యుని
  భారీగ్రహణము కొరకయి పట్టెడి వేళన్
  ఔరా! చీకటి నభమున
  తారలు మధ్యాహ్న వేళ తళుకున మెరిసెన్

  భారీ యెన్నిక సభకై
  తారల నెందరినొ తెచ్చిదండిగ నిలుపన్
  కోరిననాట్యము లాడుచు
  తారలు మధ్యాహ్నవేళ తళుకున మెరిసెన్


  రిప్లయితొలగించండి
 13. బీరము లాడెడి నొకరుడు
  తేరగ తెగ మాటలాడి తీరికవేళన్
  చేరియు జనముల నిట్లనె
  తారలు మధ్యాహ్నవేళ తళుకున మెరసెన్

  రిప్లయితొలగించండి
 14. భారత యెన్నిక లందున
  జోరుగ సాగెడి సభలకు సొబగులు దిద్దన్
  చేరుకొనగ యువ సినిమా
  తారలు మధ్యాహ్న వేళ తళుకున మెరసెన్!

  రిప్లయితొలగించండి
 15. నాగరాజు రవీందర్ గారూ,
  మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  *
  రెండుచింతల రామకృష్ణమూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. ఈరోజు ఒక బ్లాగును చూసి నేను దిగ్భ్రాంతికి గురి అయ్యాను. అది రావ్ ఎస్. లక్కరాజు గారి ‘శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు’ అన్న బ్లాగు.
  http://naakunachchinapadyalu.blogspot.in
  ఒక బ్లాగును చూసి అందలి రచనలను చదివి నచ్చిన, నచ్చని అంశాలపై వ్యాఖ్య పెట్టడం మనకు తెలుసు.
  ‘శంకరాభరణం’ బ్లాగులో పూరణలు, పద్యాలను వ్రాసి, వాటిని తమ బ్లాగుల్లో ప్రకటించుకునే కవిమిత్రులున్నారు.
  కాని ఒక బ్లాగులోని నచ్చిన అంశాల గురించి వ్రాయడానికి ప్రత్యేకంగా ఒక బ్లాగు సృష్టింపబడడం బహుశః బ్లాగుల చరిత్రలోనే ప్రథమం కావచ్చు. ఆ అదృష్టానికి మన ‘శంకరాభరణం’ నోచుకోవడం ఆనందదాయకం, గర్వకారణం.
  బ్లాగు మిత్రులందరికీ లక్కరాజు వారు పరిచయమే. చాలాకాలంగా ఏదైనా సమస్యా పూరణలో కాని, పద్యరచనలో కాని వారికి నచ్చిన అంశాన్ని పేర్కొని ఆయా కవులకు అభినందనలు తెల్పుతూ వారిని ప్రోత్సహిస్తున్నారు. ఎన్నడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయని సౌజన్యం వారిది.
  లక్కరాలు వారికి నా పక్షాన, బ్లాగు మిత్రుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 17. తారట్లాడుచు గనె వ
  స్తారో రారోననుచును, వైభవమొప్పన్
  తీరుగ జరిగెడు సభలో
  తారలు మధ్యాహ్న వేళ తళుకున మెరసెన్

  రిప్లయితొలగించండి
 18. తారట్లాడుచు గనె వ
  స్తారో రారోననుచును, వైభవమొప్పన్
  తీరగు సినిమా సభలో
  తారలు మధ్యాహ్న వేళ తళుకున మెరసెన్

  రిప్లయితొలగించండి
 19. భారత మంత్రి మండలి సభాస్థలి పూనిక జేయుచుండగా
  పేరును బొందినట్టి పలు వేదిక లందున, చిత్రసీమలో
  వీరులు, నాయకీమణులు వేడుక సల్పగ వచ్చిచేర యా
  తారల కాంతిచే పగలు తళ్కులు చిందియు తెల్లబోయెగా!

  రిప్లయితొలగించండి
 20. లక్కరాజు రావు గారు,
  రాజలక్షణం చూపించినారు. సంతోషం కలిగించినారు. మీకు శుభాకాంక్షలు. వందనములు./\

  రిప్లయితొలగించండి
 21. సవరణతో...
  తారట్లాడుచు గన వ
  స్తారో రారోననుచును, సరగున నపుడే
  తీరగు సినిమా సభలో
  తారలు మధ్యాహ్న వేళ తళుకున మెరసెన్

  రిప్లయితొలగించండి
 22. ఆరోజు డిసెంబరులో
  తీరికగా మాలు లోన తిరుగెడు వేళన్
  చేరగ క్రిస్మస్ చెట్టున
  తారలు మధ్యాహ్నవేళ తళుకున మెరసెన్!

  రిప్లయితొలగించండి
 23. గారబు హైద్రబాదునను కారుది చిహ్నము గెల్వ నెన్నికన్
  వీరుడు చంద్రశేఖరుడు భేషుగ నవ్వగ కారునేగుచున్
  దారుల వెంబడిన్ జన, మతాబు టపాసులు చిచ్చుబుడ్ల వౌ
  తారల కాంతిచే పగలు తళ్కులు చిందియు తెల్లబోయెగా!

  రిప్లయితొలగించండి