20, మే 2014, మంగళవారం

సమస్యాపూరణం - 1418 (కలువ పూవులోన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కలువ పూవులోన గరళ ముండు.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

27 కామెంట్‌లు: 1. కలువ పూవులోన గరళ ముండు
  కొండ చిలువ లోన గరళ ముండు
  చెలువ చూపులోన గరళ ముండు
  చలువ చేతల లోన గరళ ముండు !!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. అంద మైన చెలికి బంధమేయగ నెంచె
  ప్రొద్దు దిరుగు పూవు పొలతి మనసు
  కలికి మహిమ లెన్న కాలుని తరమేని
  కలువ పూవు లోన గరళ ముండు

  రిప్లయితొలగించండి
 3. మనిషి మెదడు లోన మలినంబు జొచ్చెనా
  మాటలోన విషపు ఘాటులుండు
  కొలనులోన కాల కూటమ్ము నిండెనా
  కలువ పూవులోన గరళ ముండు !!!

  రిప్లయితొలగించండి
 4. విదుని బింబము గని వికసించు నిత్యము
  కలువపూవు, గరళముండు
  ప్రీతిని కురిపించి గోతులు త్రవ్వుచు
  దానవులుగ మారు మానవులకు

  రిప్లయితొలగించండి
 5. పైన సాధువైన లోన మంత్రాంగము
  పైన మంచిమాట లోన బల్లెం
  విరిసి మధుర సుధల వెదజల్లె వదనము
  కలువ పూవు, లోన గరళ ముండు

  రిప్లయితొలగించండి
 6. మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణ

  ఆటవెలది కనులు నందంపు కలువలౌ
  ధనము నిచ్చినంత దరహసించు
  విత్తహీను గనియు విరసంబు జూపునా
  కలువ పూవులోన గరళముండు

  రిప్లయితొలగించండి
 7. పుష్పమందు నున్న పూదేనె కోసమై
  యెన్నొ కీటకములు యీగ వెంట
  చేరి విడచు మలము చిందించు కలుషము
  కలువ, పూవులోన గరళ ముండు.

  కలువ కంటె మనసు కఠినమై రూపొంద
  కలువరాయడైన గడగడమను !
  కలికి కంట నగ్ని కనుపించ నొకడనె
  కలువ పూవులోన గరళ ముండు

  రిప్లయితొలగించండి
 8. ప్రాణి తన్ను తాను రక్షించుకో గల్గు
  కూర్పు లోన ప్రభువు కూర్చె నంట
  హాని యన్న దనుచ నంతర్గతంబుగ
  కలువ పూవు లోన గరళముండు

  రిప్లయితొలగించండి

 9. స్వచ్ఛ మైన తేనె చవులూరు చుండును
  కలువ పూవులోన, గరళ ముండు
  ఖలునకు నిలువెల్ల గాక యుండు నికను
  స్నేహితులకు గీడు జేయు బుద్ధి

  రిప్లయితొలగించండి
 10. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘కాలుని వశమౌన’ అంటే ఇంకా బాగుంటుంది.
  *
  మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  చంద్రమౌళి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘బల్లెం’ అన్నచోట గణభంగం. అంతేకాక పదం అనుస్వారంతో అంతమయింది. అది వ్యావహారికం. ‘లోన కత్తి’ అనవచ్చు కదా!
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ‘కీటకములు + ఈగ’ అన్నప్పుడు యడాగమం రాదు. సంధి జరుగుతుంది. అక్కడ ‘కీటకమ్ము లీగ’ అనండి.
  *
  సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘ఉన్న దనుచ’...?
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. గురువుగారికి ధన్యవాదములు.
  టైపాటు వల్ల జరిగిన పొరబాటుకు సవరణ:


  ప్రాణి తన్ను తాను రక్షించుకో గల్గు
  కూర్పు లోన ప్రభువు కూర్చె నంట
  హాని యన్న దణచ నంతర్గతంబుగ
  కలువ పూవు లోన గరళముండు

  రిప్లయితొలగించండి
 13. శ్రీ శంకరయ్యగారికి నమస్సులు. ఆరొగ్యముతో సబలులై సమ్ముఖులైనందులకు సంతోషం.సవరణకు ధన్యవాదములు.

  రాజచంద్రు జంప రాక్షస యోజన
  విష వనితను బంప ఫలమె యుక్తి
  గురుడు గుప్తుగాచె, కోరికలూరించు
  కలువపూవు లోన గరళ ముండు

  రిప్లయితొలగించండి

 14. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శ౦కరయ్య గారికి వందనములు

  చెలియ కనులు రేయి కలువపూవులౌను
  చెలిమిజేసి చెంతచేరినపుడు
  దురభిమాని యగుచు తూలద్రోయంగ నా
  కలువ పూవు లోన గరళ ముండు

  రిప్లయితొలగించండి

 15. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శ౦కరయ్య గారికి వందనములు
  మరియొక పూరణ:
  విధు కరమ్ము సోక వికసించు విధి యేది?
  మధువు గ్రోల తేటి మసలునెచట?
  వృశ్చికంపు తోక వెలసిన విషమేది?
  కలువ, పూవులోన, గరళ ముండు

  రిప్లయితొలగించండి
 16. చంద్రమౌళి గారూ,
  మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  మొదటి పూరణలో ‘విరి యేది’ టైపాటు వల్ల ‘విధి యేది’ అయినట్టుంది.

  రిప్లయితొలగించండి
 17. కలువ పూవు లోన గరళముండుటకల్ల
  కలువ పూవు లోన కలదు తేనె
  ఖలునకు నిలువెల్ల గరళముండుననుచు
  కఠిన నిజము తెలిపె కవివరుండు

  రిప్లయితొలగించండి
 18. చెలియ! చూడు మదొక చిత్రమ్ము, చక్కని
  కలువ పూవు, లోన గరళముండు
  రాజకీయములను రాజిల్లు రీతులు
  చూడ నటులె యుండు నేడు రేపు

  రిప్లయితొలగించండి
 19. మల్లెల వారి మరొక పూరణ

  అడవి కీటకాలు నట్టిటు ప్రాకగా
  కాలినుండు విషము కలియు చుండు
  అట్టి కీటకాల అద్భుత విషమదే
  కలువ,పూవు లోన గరళముండు

  రిప్లయితొలగించండి
 20. పురుగు మండులంచు బోలెడు ద్రవములన్
  పూల తోటలందు బోయ దగదు
  నీటి లోన కలియ నెమ్మదిగా మందు
  కలువ పూవులోన గరళ ముండు

  రిప్లయితొలగించండి
 21. క్రమాలంకారము

  వెసను చంద్రు జూచి వికసించు పువ్వేది?
  తేనెలుండు చోటు తెలియనెద్ది?
  పరమ శివుని గళము పరికింప నేముండు?
  కలువ; పూవులోన; గరళముండు.

  రిప్లయితొలగించండి
 22. కలువ పూవులోన గరళ ముండు నెటుల
  నందరి నలరించు చందమామ
  గానరాని నాడు కనులైన తెరవదు
  విరుల జాతిలోన వరలు కలువ

  రిప్లయితొలగించండి
 23. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శ౦కరయ్య గారికి వందనములు

  మరియొక పూరణ:
  చదల రిక్కలన్ని చంద్రు తో క్రీడింప
  నరసి వసుధ పైన సరసు లోన
  విరిసి విరహ బాధ భరియింప జాలని
  కలువపూవులోన, గరళ ముండు

  రిప్లయితొలగించండి
 24. శైలజ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘మందు’ టైపాటు వల్ల ‘మండు’ అయింది.
  *
  రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 25. గురువుగారికి ధన్యవాదాలు. టైపాటు కు చింతిస్తున్నాను.

  రిప్లయితొలగించండి