21, మే 2014, బుధవారం

సమస్యాపూరణం - 1419 (లాడెను చేయి బట్టుకొని)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
లాడెను చేయి బట్టుకొని లాగెను ద్రౌపది కౌగలింతకై.
ఈ సమస్యను పంపిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.
(ఇది ఒకానొక అవధానంలో గరికిపాటివారికి ఇచ్చిన సమస్య)

20 కామెంట్‌లు:

 1. పాండవ వనవాస సమయములో భీముఁడు ద్రౌపదితో అంటునట్లుగా............

  నేఁడు వసంతపౌర్ణమి ధునీజనితామృత మందయానముల్,
  చేడియనీదు రూపములశేషముగా విరహాగ్ని బెంచె మా
  రాడక రమ్ము చేతుము విహారములిత్తఱియంచుఁ బల్కి వ్రే
  లాడెను, చేయిపట్టుకొని లాగెను ద్రౌ పది కౌగిలింతకై.

  రిప్లయితొలగించండి
 2. గాడుపు సూను నత్తరిని కామ విమోహిత భ్రాంతి జూచుచున్
  "కూడుట కేగుదెంచి యిక కుల్కులతో సరిబుచ్చ న్యాయమే
  చేడియ! రమ్ము చెంతకని" సింహబలుం డకటా! పరాచికా
  లాడెను చేయి బట్టుకొని లాగెను ద్రౌపది కౌగలింతకై.

  రిప్లయితొలగించండి
 3. మాడిన బుద్ధితో ఖళుడు పావకపుత్ర్యనురాగవర్తియై
  చూడగ వన్యభాగమున శోభిలె నొంటిగ సైంధవుండు తా
  నాడుచు పొల్లుమాటలను నాతిని గోరుచు ప్రాబలించి వా
  లాడెను చేయి బట్టుకొని లాగెను ద్రౌపది కౌగలింతకై.

  రిప్లయితొలగించండి
 4. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  చంద్రమౌళి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. పాడుచు నాటలాడుచు, సుభద్రకు గర్భము నుండె శ్రోతయై
  క్రీడివచించు వ్యూహమున కేవిధి మార్గమొ దూర నేర్వగా,
  నేడభిమన్యుడయ్యదియె నేర్పుగ బల్కుచు ముద్దులొల్క, కా
  లాడెను, చేయి బట్టుకొని లాగెను ద్రౌపది కౌగలింతకై

  రిప్లయితొలగించండి
 6. భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి


 7. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శ౦కరయ్య గారికి వందనములు

  గాడుపుపట్టి సౌష్టవము కండర మొప్పెడు బాహు దoడముల్
  దాడియొనర్చు దూకుడును దట్టపు మీసము భీము గాంచగా
  వాడిని వేడిమిన్ కలుగు వాము శరమ్ములు సంచలించ చ
  ర్లాడెను చేయి పట్టుకొని లాగెను ద్రౌపది కౌగిలింతకై


  రిప్లయితొలగించండి
 8. మూఢగ కీచకుండు కడు మోహితుడై పరకాంతఁ గోరుచున్
  వీడెను జీవమున్ వలలు వ్రేటుకు నర్తనశాల జేరగన్
  జేడియ బుగ్గలన్ విరియ సిగ్గులు, భీముడు మౌన భాషణా
  లాడెను, చేయి బట్టుకొని లాగెను, ద్రౌపది కౌగలింతకై !

  రిప్లయితొలగించండి
 9. తోడుగ బోయిఫ్రండు వని తోచక స్నేహము జేసియుం టినే
  నీడగ వెంట నంటిమది నేలుచు ప్రీతిగ రాజరాజు వై
  వీడకు మంటినా కరము వేడుక కైనను స్వప్న మందునన్
  లాడెను చేయి బట్టుకొని లాగెను ద్రౌపతి కౌగిలింత కై

  ఇక్కడ ద్రౌపతి ఆమె పేరు

  రిప్లయితొలగించండి
 10. గురువులకు ప్రణామములు
  క్షమించాలి
  మొదటి పాదంలో ఇంగ్లీషు పదం అభ్యంతర మనుకుంటే ఇలా కుదురు తుందేమో అనుకుంటున్నాను
  " తోడుగ ప్రీతిపాత్రమని తోచక స్నేహము జేసియుం టినే "

  రిప్లయితొలగించండి
 11. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘మూఢగ’ అన్నచోట ‘మూఢుఁడు’ అంటే బాగుంటుంది.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీరు అంతర్జాతీయ ప్రేమికుల గురించి వ్రాశారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ద్రౌపదిని ద్రౌపతి చేశారు....

  రిప్లయితొలగించండి
 12. మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణలు

  వీడెను నెగ్గుసిగ్గులను,వీడెను శౌర్యము కీచకుండు తా
  పీడననంది కామమున పేరినమౌఢ్యముతో,సుధేష్ణ నే
  "చేడియచేత పంపమనిచెల్వుగ మద్యము" నంచు,తానున
  ల్లాడెను చేయిబట్టుకొని, లాగెను ద్రౌపది కౌగలింతకై

  చేడియ పాండు పత్నియని చెల్లెలు నంచును నెంచకుండగా
  వీడిన వావి, సైంధవుడు,వేగమ కాననసీమ నెంతొన
  ల్లాడెను,చేయిబట్టుకొని లాగెను ద్రౌపది కౌగలింతకై
  కీడును కోరి తెచ్చుకొనె,కేవల కామమె నాశకారమౌ

  రిప్లయితొలగించండి
 13. రాజేశ్వరి అక్కయ్యా,
  లాడెను అనే ఇంగ్లీషువాని విషయం చెప్తున్నప్పుడు అన్యదేశ్యాలు తప్పులేదు లెండి.
  *
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. మూడెను కీచకాధముని మొత్తము నాయువు భీముచేతిలో
  తోడనె సోదరీమణికి తోడుగనుండెడి కృష్ణజూచి య
  ల్లాడెను చేయిపట్టుకొని లాగెను ద్రౌపది కౌగలింతకై
  పీడను బోవద్రోలె గద భీముడు నర్తనశాల చీకటిన్

  రిప్లయితొలగించండి
 15. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. వీడను నిన్ను పొందకను వీడిని కీచకుడందురే సఖీ
  నీడగనిన్ను వెంటబడి నిక్కము కోర్కెను దీర్చుకొందునే
  వీడిని బొంద సౌఖ్యములు పెక్కగు నీకని వ్యర్థ భాషణా
  లాడెను, చేయిపట్టుకొని లాగెను, ద్రౌపది కౌగలింతకై.

  రిప్లయితొలగించండి
 17. వీడను నిన్ను పొందకను వీడిని కీచకుడందురే సఖీ
  నీడగనీదు వెంటబడి నిక్కము కోర్కెను దీర్చుకొందునే
  వీడిని బొంద సౌఖ్యములు పెక్కగు నీకని వ్యర్థ భాషణా
  లాడెను, చేయిపట్టుకొని లాగెను, ద్రౌపది కౌగలింతకై.

  రిప్లయితొలగించండి
 18. కీడని యెంచకుండ రతి క్రీడకు నర్తనశాలలోపలన్
  గూడగ నెంచి రమ్మనుచు గోరెను మించిన కామవాంఛతో
  వేడెను కీచకుండు తన వేదన నంతయు వెళ్ళబుచ్చి య
  ల్లాడెను, చేయి బట్టుకొని లాగెను, ద్రౌపది కౌగిలింతకై!

  రిప్లయితొలగించండి
 19. చేడియ కోర్కె తీర్చుటకు చిందర వందర కామమెచ్చగా
  వేడుక మీర చేరుచును వెన్కను ముందును కానరాకయే
  గాడిద కీచకుండపుడు ఘాటగు ప్రేమను చాటుచుండి య
  ల్లాడెను;...చేయి బట్టుకొని లాగెను ద్రౌపది కౌగలింతకై!

  రిప్లయితొలగించండి