25, మే 2014, ఆదివారం

సమస్యాపూరణం – 1423 (పాపము చేయంగవలెను)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పాపము చేయంగవలెను భాగ్యము నందన్.
ఈ సమస్యను పంపిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.
గరికిపాటి వారికి అవధానంలో ఇచ్చిన సమస్య ఇది...
“పాపము చేయగావలయు భాగ్యము నందగ నెల్ల వేళలన్”

26 కామెంట్‌లు:

 1. పాపులు నిండిన జగతిని
  పాపము చేయంగ వలెను భాగ్యము నందన్
  శాపము గాదట మనిషికి
  దీపము లున్నపుడె చక్క దిద్దగ గృహమున్

  రిప్లయితొలగించండి
 2. రాజేశ్వరి అక్కయ్యా,
  పాపాత్ముల పాపం చేయవచ్చు అన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 3. కోపము చెంద కుండగను కోరిన వారికి కోర్కె దీర్చగన్
  తాపము నందుకొంద రిలతన్విని దూషణ చేసి యుండినన్
  శాపము లీయ కుండగను శాంతిని చిత్తము నందునిం పుచున్
  పాపము చేయగా వలయు భాగ్యము నందగ నెల్ల వేళలన్

  రిప్లయితొలగించండి
 4. పాపము చేసెను గనుకనె
  శాపము దగిలెను దరిద్ర జనులకటంచున్
  కోపము జెందక సాయము
  పాపము, చేయంగవలెను భాగ్యము నందన్.

  రిప్లయితొలగించండి
 5. శాపము లిచ్చుట మిక్కిలి
  పాపము; చేయంగవలెను భాగ్యము నందన్,
  జూపుచు ప్రేమను దీనుల
  నీ పంచను నిల్పి పంచ నీ భాగ్యమ్మున్

  రిప్లయితొలగించండి
 6. పాపపు బనులను జేయుట
  పాపము, చే యంగవలెను భాగ్యము నంద
  న్నీ పొ ద్దా పొద్దనకను
  నేపొద్దున నైన శివుని నింపుగ సేవన్

  రిప్లయితొలగించండి
 7. కోపము వీడినాడు, తన గొప్పలు చెప్పుట మాని నాడు, స-
  ల్లాపములే యెరుంగడు, విలాపము లోననె, వెంగలప్పకున్
  వాపడె భాగ్యలక్ష్మి చెయి పట్టిన దాదిగ, వెట్టిచాకిరీ
  పాపము! చేయగావలయు భాగ్యము నందగ నెల్ల వేళలన్.

  రిప్లయితొలగించండి
 8. పాపముచేయబోక తనభావమునందు సుకర్మకక్రియా
  దీపితుఁడై చెలంగియు నధీనుఁడు గాన విధిప్రకారమై
  పాపము చేయగా, వలయు భాగ్యమునందగ నెల్లవేళలన్
  బాపురె! కష్టమౌను కద ప్రాకటమియ్యది చూడనిద్ధరన్.

  వలయు = పొందవలసియున్న
  అధీనుఁడు = వశమైనవాఁడు ( విధిచేత )

  రిప్లయితొలగించండి
 9. కోపము వీడి, శాంతమున, కోర్కెల కట్టడి చేసి, నిష్ట్హతో,
  పాపల రేని మంచమున పండెడు దేవుని ప్రేమపున్ సతిన్,
  ప్రాపును గోరి డెందమున భావన, సుంతయు నెంచ బోక యే
  పాపము, చేయగావలయు భాగ్యము నందగ నెల్ల వేళలన్”

  రిప్లయితొలగించండి
 10. రూపాయలె భాగ్యమనుచు
  సాపాటుకు నోచుకోని సామాన్యుడనెన్
  "యీ పాడు లోకములో
  పాపము చేయగా వలయు భాగ్యమునందన్"!

  రిప్లయితొలగించండి
 11. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  బాగున్నది మీ పూరణ. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  మూడవ పాదాన్ని ‘ఈ పాడు లోకమందున’ అంటే గణదోషం తొలగిపోతుంది. ‘చేయంగవలెను’ అన్నదాన్ని మీరు ‘చేయగావలయు’ అని టైప్ చేశారు. దానివల్ల గణభంగం.

  రిప్లయితొలగించండి
 12. వేపుడు గింజలు మొలచునె?
  ధూపముగావింప సంచితోపాదుల ని-
  ర్లేపితమై కర్మల ని
  ష్పాపము చేయంగ వలెను భాగ్యము నందన్
  (నిర్లేపకర్మ = కర్మయోగం, భాగ్యము = మోక్షము)

  రిప్లయితొలగించండి
 13. నిన్నటి సమస్యకు నా పూరణ,

  ఆకలి దీర్చలేని తన యప్పయు నన్నలు పెండ్లి జేతురో
  లేక వివాహ భారమని లెక్కలు జేయుచు తప్పుకుందురో
  నాకిక పెండ్లి చేయగల నాథుడు లేడని పైకమున్న యే
  కాకిని పెండ్లి యాడె నొక కన్నె విలాసిని కాకినాడలో

  రిప్లయితొలగించండి
 14. కోపమె తమలోని మహా
  పాపము;చేయంగ వలయుభాగ్యము నందన్
  తాపస మందారు భజన
  కోపమునశియించు కలుగు కూరిమి ధాత్రిన్ !!!

  రిప్లయితొలగించండి
 15. నీపై ధ్యానంబుంచిన
  నాపై కరుణామృతంబు నందించగదే
  మా ప్రభువా! యవని నే
  పాపము చేయంగ వలెను భాగ్యము నందన్?

  రిప్లయితొలగించండి
 16. గురుదేవులకు నమస్కారములు, తొందరలో తప్పులు దొర్లాయి, చూచుకోలేదు. సవరణకు ధన్యవాధములు

  రూపాయలె భాగ్యమనుచు
  సాపాటుకు నోచుకోని సామాన్యుడనెన్
  "ఈ పాడు లోక మందున
  పాపము చేయంగ వలయు భాగ్యమునందన్!"

  రిప్లయితొలగించండి
 17. మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణలు

  ఏపని చేయక కలిలో
  నేపుగ జీవించ ధనము నింపున గొనగా
  రాపిడి వెట్టుచు నితరుల,
  పాపము చేయంగ వలయు భాగ్యము నందన్

  పాపులు దేవుని చేరరె
  కోపమునందిన యతడల కూల్చగవానిన్
  తా పగచే పుణ్యము గొన
  పాపము చేయంగవలయు భాగ్యము నందన్

  రిప్లయితొలగించండి
 18. చంద్రమౌళి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  వృత్తంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  నిన్నటి సమస్యకు మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మూడవ పాదంలో గణదోషం. ‘మా ప్రభువ! లోకమున నే’ అందామా?
  *
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  ప్రతి సమస్యకు మీరు క్రమం తప్పకుండా రెండు రెండు పూరణల చొప్పున ఇస్తున్నారు. సంతోషం!
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. కవిమిత్రులకు మనవి..
  రేపటినుండి నాలుగైదు రోజులు ‘పద్యరచన’ శీర్షిక ఉండదు. సమస్యలను మాత్రం షెడ్యూల్ చేస్తున్నాను. ఈ నాలుగైదు రోజులు నేనెక్కడ ఉంటానో నాకే తెలియని పరిస్థితి.. అవకాశముంటే పూరణలపై స్పందిస్తాను. స్తిమితపడ్డాక మళ్ళీ మీ పద్యాలపై స్పందిస్తాను. అప్పటివరకు పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి
 20. పాపౌఘమ్మున బడకయె
  పాపమ్ముల జేయుమనును భగవద్గీతే!
  పాపము మనకంటు కొనక
  పాపము జేయంగవలయు భాగ్యమునందన్

  రిప్లయితొలగించండి
 21. మిత్రులారా!
  శుభాశీస్సులు.
  మన బ్లాగులో వివాదాస్పదము కాని విషయములనే ప్రస్తావించుటే మంచిది. భగవద్గీత మొదైలైన పవిత్ర గ్రంథముల యొక్క ఉత్కృష్టతకు భంగము వాటిల్లకుండా వ్రాయుట మంచిది. అందరూ తప్పక తగు జాగ్రత్త వహించగలరు. శ్రీ కంది శంకరయ్య గారు అట్టి విషయములలో కత్తెరను ఉపయోగించవలెను. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 22. దోపిడి చేసి సంపదను దోచెడు వారల వృత్తికన్న యే
  లోపము లేని వస్తువుల రూపము జూపుచు బెంచి మూల్యమున్
  ఏపుగ పెట్టి యంగడిన నెల్లర కమ్ముట పాపమన్న నా
  పాపము చేయగా వలయు భాగ్యము నందగ నెల్లవేళలన్!

  రిప్లయితొలగించండి
 23. కోపము కామము మోహము
  శాపములివి, ముదము తోడ చంపగ వలయున్,
  తాపము నొందక మరియీ
  పాపము చేయంగవలెను భాగ్యము నందన్!

  రిప్లయితొలగించండి


 24. శాపము‌ లిత్తురు పెద్దలు
  పాపము చేయంగ; వలెను భాగ్యము నందన్
  తాపము బోవగ భక్తిగ
  గోపాలుని సేవ సూవె కొమరు‌ జిలేబీ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 25. వీపును గోకుచున్ విరివి వేడుక మీరగ ముఖ్యమంత్రిదిన్
  రేపును మాపునున్ గనక రివ్వున బట్టుచు పాదపద్మముల్
  వాపసు చేయకుండగనె బ్యాంకుల నెల్లను కొల్లగొట్టుటౌ
  పాపము చేయగావలయు భాగ్యము నందగ నెల్ల వేళలన్

  రిప్లయితొలగించండి