12, మే 2014, సోమవారం

సమస్యాపూరణం - 1410 (తమిళకవి యల్లసాని)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
తమిళకవి యల్లసాని పెద్దనకు నతులు.

22 కామెంట్‌లు:

  1. అవుర! మను చరిత్రముఁ గూర్చె నద్భుతముగఁ
    గనగ రాయల కొల్వులో ఘన కవీంద్రుఁ
    డాంధ్ర కవితా పితామహుఁడతనికిడుము
    తమిళకవి ! యల్లసాని పెద్దనకు నతులు !

    రిప్లయితొలగించండి
  2. ఆంధ్ర కవి పండితులతోడ నాదరమున
    ముచ్చటించుచు సాహిత్యమున విలువ
    లబ్బురంబంది యొనరించె నహహ యొక్క
    తమిళకవి అల్లసాని పెద్దనకి నతులు

    రిప్లయితొలగించండి
  3. ప్రణయ మందు వరూధిని ప్రవరు డనగ
    మధుర మైనట్టి కావ్యము మనుచరిత్రగ
    నిలిపెనొక ప్రవరాఖ్యు నిలను గాన
    తమిళకవి! యల్లసాని పెద్దనకు నతులు

    రిప్లయితొలగించండి
  4. ఉల్ల మందున నుత్సాహ మొదవ మనుచ
    రిత్రముఁ జదివి యెద నలరి వినయముగఁ
    గుసుమ గంధమ్ము లర్పించి యొసగె నొక్క
    తమిళకవి , యల్లసాని పెద్దనకి నతులు !

    రిప్లయితొలగించండి
  5. చాలా కాలము తర్వాత డా. విష్ణునందన్ గారి పూరణను చూచినందుకు ఆనందముగా నున్నది.


    తెలుగు గ్రంథమ్ములెన్నియో తెలిసి చదివి
    మనుచరిత్రపు కావ్యమ్ము మనసుదోచ
    కలచి మెచ్చుచు చేసిరి కన్నడకవి
    తమిళకవి, అల్లసాని పెద్దనకి నతులు.

    రిప్లయితొలగించండి
  6. తెలుగు కైతపై మక్కువ తెలిపె నొక్క
    పండితుడు సుబ్రహ్మణ్య భారతి ఘన
    తమిళకవి,యల్లసాని పెద్దనకు,నతులు;
    కనగ తమిళాంధ్ర సాహిత్య కల్పతరులు

    రిప్లయితొలగించండి
  7. పూజ్యులు పండితనేమానివారికి, మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవిపండితమిత్రమండలికి మనఃపూర్వక నమస్కారములు.

    ఆంధ్రకవితాపితామహుఁ డల్లసాని
    పెద్దనకవీంధ్రుఁ డొసఁగిన విద్దెలున్న
    మనుచరిత్రమ్ముఁ జదివి,చేసెనట యొక్క
    తమిళకవి, యల్లసాని పెద్దనకు నతులు!

    రిప్లయితొలగించండి
  8. డా. విష్ణునందన్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    రెండవపాదంలో ఒక అక్షరం తక్కువయింది. ‘...సాహిత్యమున విలువల/ కబ్బురంబంది..’ అంటే ఎలా ఉంటుందంటారు?
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    రెండవ పాదం చివర ఉన్న ‘గ’ను తొలగించండి. మూడవ పాదంలో గణదోషం. ‘ప్రవరాఖ్యుఁ దా నిల నొసఁగుము’ అనండి. అన్వయం కూడా కుదురుతుంది.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘కలచి’... టైపాటానుకుంటాను!
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    రెండవ పాదంలో గణదోషం. ‘పండితు డగు సుబ్రహ్మణ్య భారతి ఘన’ అంటే సరి!
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘ఆంధ్రభోజుడు’ అనే తమిళచిత్రం వచ్చిందా? నాకు తెలీదు.

    రిప్లయితొలగించండి
  9. పెద్ద నామాత్యు నల్లిక బిగువ త నము
    మరియు జిగిబిగి నుంట కు మదిని బొంగి
    వినయ ముట్టిప డునటుల నొనర జేసె
    ద మిళ కవి యల్లసాని పెద్దనకు నతులు

    రిప్లయితొలగించండి
  10. ఆంధ్ర కవితా పితామహు డంచు బిరుదు
    నొసగి గండపెండీరము నుల్లమలర
    దొడిగె శ్రీ కృష్ణ దేవరాయుడు, ఘటించె
    తమిళ కవి, యల్లసాని పెద్దనకు నతులు

    రిప్లయితొలగించండి
  11. సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ రెండవ పూరణ కూడా బాగున్నది. అభినందనలు.
    మనుచరిత్ర తమిళంలోకి అనువదింపబడిందని విన్నాను కాని వివరాలు తెలియవు.

    రిప్లయితొలగించండి
  12. మనుచరిత్రను జదివి తద్ఘనత గాంచి
    ముదము గల్గగ నాతని హృదయమందు
    తమిళకవి, అల్లసాని పెద్దనకు నతులు
    నిచ్చె నొక మహా సభలోన నిమ్ము గాను

    రిప్లయితొలగించండి
  13. పండిత నేమాని వారి వ్యాఖ్య......

    శ్రీ శంకరయ్య గారూ శుభాశీస్సులు.
    మీరు సూచించినట్లుగనే సవరించుదాము. సంతోషము.

    రిప్లయితొలగించండి
  14. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణ

    ఆంధ్రభాషయె గొప్పదియంచు తెలిపె
    ఘనుడు నప్పయదీక్షిత కవి వరుండు
    రసము రీతులతెలిసిన రమ్యమైన
    తమిళకవి; అల్లసానిపెద్దనకు నతులు

    రిప్లయితొలగించండి
  16. చాల గ్రంధాలు వ్రాసినమేలుబంతి
    సుబ్రమణ్యభారతికాదె సురుచిరముగ
    తమిళకవి; యల్లసాని పెద్దనకు నతులు
    మనుచరిత్రము నందించె మధురగతుల

    రిప్లయితొలగించండి
  17. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    బాగున్నది మీ పూరణ. అభినందనలు.
    కాని సుబ్రహ్మణ్య శబ్దం సుబ్రమణ్యం అయింది.

    రిప్లయితొలగించండి
  18. నా జ్వర తీవ్రత ఇంకా ఎక్కువయింది. మందులు వాడుతూనే ఉన్నాను. రేపటికి పరిస్థితి ఎలా ఉంటుందో?

    రిప్లయితొలగించండి
  19. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. తమరు రుగ్మత నుండి త్వరగా కోలు కోవాలని భగవంతుడిని కోరు కుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  20. వాడుకలో అలాప్రయోగించాను క్షమించండి....
    మందులు సరైన ఆహారంతో వాడండి,రేపటికి తగ్గుతుందనే భావిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  21. నిజము గ్రహియింపుమయ్యరొ! నీదు స్వంత
    భాష యన్ననొకింత గొప్పదను భ్రమనుఁ
    బడక పరికించి చదివిన పల్కగలవు
    తమిళకవి! యల్లసాని పెద్దనకు నతులు.

    రిప్లయితొలగించండి