కళ్యాణ రాఘవము - 1
శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు
౧
శా.శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు
౧
"శ్రీలూరించెడి శాంతిభద్రము లిలం జెన్నారుతన్, సత్కృతుల్
సాలంబంబులు గాత, సాధుజనరక్షైకావతారంబు శ్రీ
లోలంబౌ నొకవెల్గు నమ్ముత మహాలోకంబు, నిర్భీకముల్
కేళీచంక్రమణోన్నమచ్ఛిరములం గేరించుతన్ ధర్మువుల్. (1)
మ.
అనయమ్ముం ద్రిజగమ్ము లేర్చెడి పులస్త్యబ్రహ్మవంశాటవీ
జనితాభీలదవాగ్ని నార్పుటకు భాస్వద్గోత్రలీలావతా
రనిరూఢంబగు నీలమేఘ మిదిగో క్రమ్మెన్! నెమళ్ళౌచు న
ర్తనముల్ సేయుఁడు సాధులార! శుభగీతస్ఫీతకంఠంబులన్" (2)
తే.గీ.
అనుచుఁ దనుఁదాన యజ్ఞసమాప్తిముదిత
హృదయుఁడై మౌనదీక్షను వదలిపెట్టి
గాధిసుతుఁడు వసంతనిశీధమందు
సుఖశయిత బాలరాముని శోభఁ జూచి. (3)
సీ.
"పద్మపుత్రిక మృదుస్పర్శ సానందమై
జగమేలు వాత్సల్యసార మిద్ది
యఖిలవిశ్వమ్ముఁ బ్రత్యణువుగా వ్యాపించి
దీపించు నిర్వ్యాజ తేజ మిద్ది
ఋషులు ప్రాణ మొకెత్తు హృదయాబ్జపుటికల
దాఁచుకొన్న సుధానిధాన మిద్ది
సాకేతపుర రాజసౌధాగ్రముల కలం
కారమౌ ధర్మావతార మిద్ది
తే.గీ.కలసిమెలసియు పేదసాదులను గూడి
యాడుకొను కల్కికన్నుల కోడె యిద్ది
దుర్జనధ్వాంతసంతతుల్ దొంగిలింప
వేచికొనియున్న బాలార్కబింబ మిద్ది. (4)
తే.గీ.
అహహ! యీ సుమసుకుమారుఁ డస్మదీయ
పర్ణశాల పంచలఁ దృణాకీర్ణశయ్య
హాయిగా నిద్దురించెడి చాయఁ జూడ
మాకు నీకూన కెన్ని జన్మల ఋణమ్మొ. (5)
తే.గీ.
ఎప్పు డీ రాముఁ గంటికి ఱెప్పవోలెఁ
గాచుకొనెడి కుమారలక్ష్మణుఁడు తాను
మయిమఱచి కూర్కుఁ జెందె; మాపయి నిదెంత
నమ్మికయొ, యెంత భావబంధమ్మొ! వీరి
కేమి యిడి నాహృదయము సంతృప్తి గాంచు. (6)
తే.గీ.
ఏ నెవఁడ యజ్ఞఫలము పేరెత్త? దాని
వారికై వారె కాచుకొన్నారు, మఱియు
నేను తమవాఁడనని యింత యెఱిఁగి యెఱిఁగి
నన్ను నే నిచ్చుకొనుటయు నవ్వుగొల్పు. (7)
శా.
ఔనౌ జ్ఞప్తికి వచ్చెఁ - గ్రొమ్మెఱపుచే నాలింగితం బైనచో
నీ నీలాంబుద మెట్టిశోభ గనునో! యీ సృష్టి యవ్వెల్గులో
నే నూత్నత్వము జెందునో! కనెదగా కే" నంచు ద్విత్రక్షణ
ధ్యానోదంచితమోదమేదురసముద్యన్మందహాసాస్యుఁడై. (8)
తే.గీ.
"ఈ చిరంజీవి స్వీయధర్మాచరణము
సలుపఁ దలఁచిన దోడయి నిలుచుకొఱకు,
నలపు గొన్నప్డు జింకచూపులను సేద
దేర్చుకొఱ, కార్తరక్షణదీక్ష బూను
వేళ మునుముందె తా నందుఁ బాలుగొనుట
కొఱకు నొక దివ్యశక్తి తాఁ బెరుఁగుచున్న
దల మిథిలరాజు నింట సీతాహ్వయమున. (9)
ఉ.
వెన్నుని భర్తగాఁ బడయ విశ్రుతనిష్ఠఁ దపమ్ముసేయ నే
కన్నియ తన్ను రావణుఁడు కాముకతన్ మును బైకొనంగ, వాల్
గన్నులు నిప్పులై "భువనకంటక! నా యొడలంటు పాపి! నిన్
గ్రన్నన రూపుమాపెదనురా కను మొండొక మేనుదాల్చి యేన్" (10)
తే.గీ.
అనుచు నిలిచినయది నిల్చినట్లె యొడలఁ
దేలు ప్రజ్వలద్యోగాగ్నికీలలఁ గను
మూసి తృటిలో నదృశ్యయైపోయె నట్టి
వేదవతి సీత శ్రీకళాన్వీత నేఁడు. (11)
తే.గీ.
పరిమళముతోడఁ బొల్చు బంగరువుపోల్కి
రాముఁ డా లేమతో నభిరాముఁ డగుత;
గావలయు దుష్టసంహారకార్యసిద్ధి
నాయమయె మార్గదర్శిని యగునుగాత. (12)
సీ.
ఎవని బాహులక్రొవ్వు శివు కొల్వుకూటమ్ము
లల్లాడ రజతాద్రిఁ బెల్లగించె
నెవని యాజ్ఞాశక్తి యింద్రచంద్రాదులౌ
నమరోత్తముల కూడిగములు నేర్పె
నేవాని వాలు తపోవనమ్ముల మౌని
శిరసులరాసులు దొరలఁబోసె
నెవని పాపపుఁజూపు లేడేడు భువనాల
సుందరీబృందంబు బందిగొనియె
తే.గీ.రావణుఁడు వాఁడు త్రిజగతీరావణుండు
జానకీదేవి నెమ్మేని చక్కఁదనము
కనియొ వినియొ ద్రోహపుటూహ గొనకపోఁడు
కడకు మా రాఘవునిచేతఁ బడకపోఁడు. (13)
తే.గీ.
కలదు జన్నపుఁ బిల్పు మైథిలుని వీటి
కెల్లియె ప్రయాణ మింక జాగేల" ననుచుఁ
గమ్మకమ్మని కల లేవొ కాంచు మౌని
కెల్ల రే యొక్కక్షణమయి తెల్లవాఱె. (14)
రాక్షసాంతక యజ్ఞమై రామ చంద్రు
రిప్లయితొలగించండినటవులకు గొనిపోయిన యా మునీశు
హృదయ మధురానుభూతుల నెదలు పొంగ
వ్యక్త పరచిరి గురువులు వందనములు.