కం.
శ్రీలకు నిలయం బైనది
పాలున్ పెరుగులకు తావు, బహుయశములకున్
శీలతకున్, సద్గుణముల
కాలంబనమైన దౌర! హరియాణము తాన్.
కం.
హరి, యానము చేయుటచే
"హరియాన"మటన్న నామ మందురు విబుధుల్
ధర నీ "హరియాణం"బిక
సురుచిర సంస్కృతికి తావు సుందరము గదా!
శా.
ఈ హర్యాణము దివ్యభూమి కనగా నిచ్చోటనే మాధవుం
డోహో పాండవపక్షమంది, యవివేకోన్మాద రోగార్తులై
మోహావేశితులైన కౌరవుల నున్మూలించగా క్రీడికిన్
సాహాయ్యం బొనరింప బూని నిలిచెన్ సద్ధర్మరక్షార్థమై.
ఉ.
వాహినితోడ వచ్చి, తనవారిని జూచి విరక్తుడై మహా
ద్రోహ మటంచు పోరుటకు రోసిన ఫల్గును జేరదీసి తా
నాహరి దివ్యవాక్యముల నప్పుడు గీతను బోధ చేయగా
నాహవరంగమందు తెగటార్చెను క్రీడి విరోధివర్గమున్.
తే.గీ.
సవ్యసాచిని చేకొని శార్ఙి యపుడు
దుష్టశిక్షణ గావించి దురిత మణచి
ధర్మరక్షణ చేసిన కర్మభూమి
సిద్ధ మలనాటి యాకురుక్షేత్ర మదిగొ.
సీ.
ఆకురుక్షేత్రమే అత్యద్భుతంబౌచు
దర్శనార్థుల కెల్ల తనివి దీర్చు,
ఆకురుక్షేత్రమే అమితసౌఖ్యద మౌచు
స్థిరనివాసుల కెల్ల సిరులు బంచు,
ఆకురుక్షేత్రమే చీకాకులను ద్రుంచి
చేరువారల కిందు సేదదీర్చు,
ఆకురుక్షేత్రమే అఘసంఘములబాపి
దివ్యత గూర్చును దేహములకు
విద్యలకు నిలయంబయి వెలయు నదియె,
అఖిల ధర్మాల కాటపట్టైన దదియె,
సత్యదీప్తికి నిలలోన సాక్ష్యమదియె
మునిజనాదుల కయ్యదె ముక్తిదంబు.
కం.
కలుషంబులు హరియించెడి
విలసన్నైర్మల్యయుక్త విస్తృత జలముల్
కలిగి వెలింగెడు నట శుభ
ఫలదంబు సరోవరంబు "బ్రహ్మా"ఖ్యంబై.
ఆ.వె.
స్నాన మాచరించి సానందచిత్తులై
దరిని వెలసియున్న దైవములను
దర్శనంబు చేసి ధన్యత గాంచంగ
వచ్చు నెల్ల వారు వైభవముగ.
తే.గీ.
ఆ సరోవర తటమున నందమైన
శిల్పమొక్కటి కన్పించు చిత్రగతుల
శరము సంధించి నిలిచిన నరుని ముందు
కమలనాభుని రథమందు గాంచ వచ్చు.
కం.
అచ్చటి "పనోరమా" కడు
ముచ్చటలను గొల్పుచుండు మోదకరంబై
అచ్చెరువు గల్గజేయును
(ఖ)కచ్చితముగ జూడవలయు క్రమముగ దానిన్.
సీ.
ఆ పనోరమలోన నతిసుందరంబైన
వస్తుజాలము చూడవలయు నిజము
పరమాద్భుతంబైన భారతయుద్ధంబు
దర్శించగల మింక దానిలోన,
సమరాంగణం బౌట జలదరించును మేను
చేరి చూడగ వచ్చు శిల్పమదియ
చిత్రంబు లెన్నియో జీవమున్నట్టులే
చోద్యమన్పించును చూపరులకు
భీష్ము, నర్జును, నటమీద భీమసేను,
నంత ధర్మజు, నభిమన్యు నమితశౌర్యు
కర్ణ దుర్యోధనాదులన్ కదనభూమి
నచట గాంచగ వచ్చునత్యద్భుతముగ.
తే.గీ.
గుడులు నుద్యానవనములు బడులతీరు
వరకురుక్షేత్రనగరాన నరయదగును
ధరను మోక్షదమైన తత్పురికి మిగుల
ఖ్యాతిదంబౌచు నిలిచెను "జ్యోతిసరము."
కం.
అందే కృష్ణుడు క్రీడికి
సుందరముగ బోధ చేసె శోకమడం(ణ)చన్
సందేహమేల? కనుడా
మందిరమే సాక్షియగుచు మైమరపించున్.
తే.గీ.
సర్వభారకుడై యొప్పు చక్రి యపుడు
జగములకు సవ్యమార్గదర్శనము చేయు
పరమపావన మైనట్టి భవ్యగీత
బోధ చేసిన యాదివ్య భూమి యదియె.
రచన
హరి వేంకట సత్య నారాయణ మూర్తి
హరి వేంకట సత్య నారాయణ మూర్తి
గీత పుట్టినిల్లు క్రీడి క్రీడాంగణ
రిప్లయితొలగించండిమాప గాత్మజునకు నమర ధాత్రి
కౌరవాధములకు కడపటి తావును
కనుల గట్టు రీతి ననిరి మూర్తి.
సిరులొప్పారెడు పావనస్థలి కురుక్షేత్రంబు హర్యాణ నా
రిప్లయితొలగించండిబరగున్ వేల్పుల కాలవాలమయి సద్భావమ్ముతో క్రీడికిన్
హరి బోధించెను గీత గూర్చె జయ మాహ్లాదమ్మునున్ గూర్చు సుం
దర దృశ్యంబుల పెన్నిధానమది యుత్సాహంబుతో కాంచుడీ
అని వర్ణించెను కడు క
మ్మని పద్యమ్ములను వ్రాసి మాన్యుడు ధన్యుం
డును సఖుడు మూర్తి యాతని
కొనియాడుచు దీవెనలను గూర్తును వేడ్కన్
ఆర్యా!
రిప్లయితొలగించండిధన్యవాదములు
హరి వేంకట సత్య నారాయణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండికురుక్షేత్ర స్థల విశేషాలను, ప్రాశస్త్యాన్ని వర్ణించిన మీ పద్యాలు అద్భుతంగా ఉన్నాయి. మనోహరమైన మీ పద్యాలను "శంకరాభరణం" బ్లాగులో ప్రకటించే అవకాశం కల్గించినందుకు ధన్యవాదాలు.
గురుతుల్యులు శ్రీ శంకరయ్య గారికి,
రిప్లయితొలగించండిఆర్యా!
మీ శంకరాభరణంలో నాపద్యాలు ప్రచురించబడటమే నాకు మహద్భాగ్యం. ధన్యవాదములు.
నమస్కారములు
రిప్లయితొలగించండికన్నులకు కట్టినట్లు గా వర్ణించిన పద్య రచన శ్లాఘ నీయము . చదవగలిగిన అదృష్టము లభింప జేసి నందులకు ధన్య వాదములు.