మిస్సన్న గారూ, నిజమే. ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారి లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. మొన్న వారికి మెసేజ్ కూడా పెట్టాను. సమాధానం లేదు. వారి గురించి గన్నవరపు వారే చెప్పాలి!
వసంత కిశోర్ గారూ, విశ్వనాథ వారిపై చక్కని పద్యం చెప్పారు. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, ‘వేయిపడగలు, రామాయణ కల్పవృక్షము’లను ప్రస్తావించిన మీ పద్యాలు ‘ఓహో" అనిపించే విధంగా ఉన్నాయి. మూర్తి గారి స్ఫూర్తితో వ్రాసిన పద్యాలు బాగున్నాయి. అభినందనలు. ‘దాల్చె నొసటిపైన....’ పద్యంలో చివరిపాదంలో గణదోషం ఉంది. ‘మొగములోన వెలుగు ముదము గూర్చు’ అందాం. * సుబ్బారావు గారూ, కవిసమ్రాట్‌కు కైదండ లందించిన మీ పద్యం బాగుంది. అభినందనలు. * శ్యామల రావు గారూ, వాస్తవం తెలిపారు. విశ్వనాథ వారు సాహితీసాగరం. మనం దాని ఒడ్డున నత్తగుల్లలేరుకొనే పసివాళ్ళం. ఆ సముద్రం లోతుల సంగతి మనకేం తెలుసు? చక్కని పద్యం. అభినందనలు. * సత్యనారాయణ మూర్తి గారూ, విశ్వనాథ వారి బహుముఖ ప్రజ్ఞను పరిచయం చేసిన మీ ‘ఖండిక’ సమగ్రంగా, ప్రశస్తంగా ఉంది. వారి రూపాన్ని వర్ణించిన మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు. * పండిత నేమాని వారూ, ‘రసరమ్యవాగ్వివభవం’తో విశ్వనాథ వారిని వినుతించిన మీ పద్యం ఉత్తమంగా ఉంది. అభినందనలు. * రాజన్ గారూ, ‘శంకరాభరణం’ బ్లాగు మీకు సంతోషంగా స్వాగతం పలుకుతున్నది. మీ పద్యం సలక్షణంగా ఉంది. అభినందనలు. ‘విబుధసముడు’... ‘విబుధవరుడు’ అయితే? * రాజేశ్వరి అక్కయ్యా, బాగుంది మీ పద్యం. అభినందనలు. కాకుంటే అన్వయలోపం ఉంది.
విశ్వనాథ వారి ప్రస్తుతి కవి వరేణ్యులు చక్కగా చేసారు. అందఱికీ అభినందనలు. చంద్రశేఖరుల వారు భారతదేశములోనే ఉన్నారనుకొంటాను. చంద్రభాసురము పోస్తామంటే నాగుల చవితి నాడు పుట్టలోంచి బయటకు వచ్చే నాగేంద్రుల వలె బయట పడే అవకాశముంది.
మిస్సన్న గారూ, విశ్వనాథ వారిపై మీ పద్యం ప్రశంసార్హమై శోభిల్లుతున్నది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, శారదాస్వరూపుని గురించిన మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండి01)
___________________________________
విశ్వ విఖ్యాతి గాంచిన - విబుధ వరుడు
విశ్వ నాథ కవి యటన్న - వినుతి గాంచె !
కల్ప వృక్షము రచియించి - ఖ్యాతి నొందె !
ఙ్ఞాన పీఠము సాధించె - జనులు మెచ్చ !
___________________________________
వేల వందనాలు విశ్వనాథులవారికి.
రిప్లయితొలగించండిసమయాభావం వల్ల ఒక్కటే వ్రాశాను. మళ్ళీ కొనసాగిస్తాను.
వేయి పడగలున్న విద్వాంసుడాతడు
తెనుగు తల్లి ముద్దు తీర్చినాడు
జాతి గర్వపడెడు జన్మమెత్తి యతడు
వెలిగినాడు ఎదల వేల్పుగాను
ఈ చిత్రానికి చంద్రశేఖరుల స్పందన చూడాలని ఉంది.
రిప్లయితొలగించండిఈ మధ్యన ఆయన మరీ నల్లపూసై పోయారు.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండినిజమే. ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారి లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. మొన్న వారికి మెసేజ్ కూడా పెట్టాను. సమాధానం లేదు.
వారి గురించి గన్నవరపు వారే చెప్పాలి!
వేయి పడగల రచయిత విశ్వ నాధ !
రిప్లయితొలగించండికల్ప వృక్షము నీ సొత్తు కవి వరుండ !
విశ్వ విఖ్యాతి గాంచిన వేద పురుష !
అందు కొను మయ్య ! కైదండ లందు కొనుము .
ఏనుగునుగూర్చి చీమ యేమేమి పలుకు
రిప్లయితొలగించండిగులకరా యేమి పలుకును కొండగూర్చి
విశ్వనాథనుగూర్చి నే పెదవి విప్పి
పలుకబోవుట యటువంటి పనియె గాదె.
కం.
రిప్లయితొలగించండిశ్రీ "విశ్వనాథ"గురునకు
ధీవరునకు, "శోభనాద్రి" ధీనిధికిలలో
సేవాతత్పరయై స
ద్భావముగల "పార్వతమ్మ" పట్టికి ప్రణతుల్.
సీ.
బహుకావ్యకర్తగా భవ్యకీర్తులు గాంచి
"గజమునెక్కితి"వింక క్రమముగాను
"జ్ఞానపీఠం"బంది మానితంబుగ నాడు
"వేయిపడగల"తో వినుతి కెక్కి
"కళల ప్రపూర్ణుడన్" ఘనతను సాధించి
"కవుల సామ్రాట్టుగా" గణుతి పొంది
ఆంధ్రదేశంబున "కాస్థానకవి"గా న
సంఖ్యాకమౌ పురస్కారములను
తే.గీ.
మిక్కుటంబుగ గొనినావు నిక్క మవుర!
సత్యనారాయణార్య! హే సచ్చరిత్ర!
విశ్వవిఖ్యాత కవివరా! విబుధవినుత!
"పద్మభూషణ"! నీకిదె వందనంబు.
సీ.
"ఏకవీరా"దులౌ యెన్నెన్నొ నవలలన్
"వేయిపడగ" లన్ని విశద పరచి,
"కాశ్మీర నేపాళ ఘనరాజ చరితంబు"
"లాంధ్రపౌరుష మాంధ్ర యశము" దెల్పి,
రమ్యమై వెలుగొందు "రామాయణాఖ్యం"పు
"కల్పవృక్షము" నాటి ఘనత గాంచి,
"కిన్నెరసాని"కై యెన్నెన్నొ పాటలు
పాడించి యన్నింట ప్రౌఢు డగుచు
ఆ.వె.
"అల్లసాని వారి యల్లిక జిగిబిగి"
"నన్నయార్యు గుణము" లెన్నొ గలవు
శిష్యులార! యనుచు, చెప్పి చూపినయట్టి
"విశ్వనాథగురుడు" విజ్ఞవరుడు.
మనమారన్ వినుతింతు నాంధ్రకవి సమ్రాడ్విశ్వనాథార్యునిన్
రిప్లయితొలగించండిఘన రామాయణ కల్పవృక్ష ముఖ నైక గ్రంథకర్తన్ సుధీ
జనమాన్యున్ రసరమ్య వాగ్విభవ భాస్వత్ కీర్తిమంతున్ సదా
వనజాతాసన భామినీ చరణ సేవాతత్పరున్ సద్గురున్
జోహారుల, నే బలికెద
రిప్లయితొలగించండినోహో యని కవిమనమ్ములుప్పొంగు విధిన్
సాహిత్యపు వనమందున
నా హృదయంగమమనదగు నక్కావ్యము దా
నాటె నపుడు మఱియు నవ్యపురీతుల
పెంచె నొక్క కల్పవృక్షము వలె,
శరణు కోరినంత సాయమ్ము దొరకును
తెలిసి చదువవలయు తీరుబడిగ.
పాత బంగారమొక్కటి పట్టి తెచ్చి
పుటము పెట్టి మెఱుపులద్ది పోత పోసి
జనుల కందించి చనియెను సంతసముగ
నుతులు వేవేలు చేయుచునుందు నేను.
బుద్ధిభావుకతల బుట్టింటికవిఱేడు
రిప్లయితొలగించండిచద్దిమూట మాట చల్లువాడు
కాలమందునిలచుకావ్యకరవిభుడు
విశ్వనాథ గురుడు విబుధ సముడు
----
రాజన్
సీ.
రిప్లయితొలగించండివరలలాటమునందు భస్మరేఖలు దాల్చి
యటపైన కుంకుమం బలదినాడు,
హరితవర్ణంబులో నతిసుందరంబౌచు
ఒప్పారు శాలువా గప్పినాడు,
బ్రహ్మతేజస్సుతో రాజిల్లు వదనాన
దరహాస మొకయింత దాల్చినాడు,
సంస్కృతాంధ్రములందు సామర్థ్యభావంబు
నేత్రద్వయంబులో నింపినాడు
ఆంధ్ర దేశాన శిష్యుల కనుపమగతి
పాండితీభిక్షనొసగిన పరమగురుడు
లోపమే లేని భారతీ రూపమతడు
విశ్వనాథకు దండాలు వేలవేలు.
సత్యనారాయణ మూర్తిగారు,
రిప్లయితొలగించండిమీ వర్ణన నాకు చాలా నచ్చింది.
మీ భావాల్నే నా పదాల్లో చెప్పుకున్నాను.
మన్నించగలరు.
దాల్చె నొసటి పైన తనరెనట విభూతి,
తీర్చి కుంకుమంబు దిద్దినాడు
లేత పచ్చవలువ లీలగ ధరియించి
మొగము లోన వెలుగు ముదమారగా చిన్న
చిఱునగవులను కురిపించి చెలగినాడు
దేవభాషను మఱి మన తీపి తెనుగు
పలుకు కన్నుదోయి వలెను పాడినాడు
వందనాలు వందలు వేలు పలుకుచుందు.
వేయి పడగల శేషుడు విశ్వ నాధు
రిప్లయితొలగించండిపలు ప్రశంసల కాణాచి పద్మ భూష
శిరము తాటించి పదమంటి కరము మోడ్చి
కల్ప తరువును బొగడ నే నల్ప జీవి !
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండివిశ్వనాథ వారిపై చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
‘వేయిపడగలు, రామాయణ కల్పవృక్షము’లను ప్రస్తావించిన మీ పద్యాలు ‘ఓహో" అనిపించే విధంగా ఉన్నాయి.
మూర్తి గారి స్ఫూర్తితో వ్రాసిన పద్యాలు బాగున్నాయి. అభినందనలు.
‘దాల్చె నొసటిపైన....’ పద్యంలో చివరిపాదంలో గణదోషం ఉంది. ‘మొగములోన వెలుగు ముదము గూర్చు’ అందాం.
*
సుబ్బారావు గారూ,
కవిసమ్రాట్‌కు కైదండ లందించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
శ్యామల రావు గారూ,
వాస్తవం తెలిపారు. విశ్వనాథ వారు సాహితీసాగరం. మనం దాని ఒడ్డున నత్తగుల్లలేరుకొనే పసివాళ్ళం. ఆ సముద్రం లోతుల సంగతి మనకేం తెలుసు? చక్కని పద్యం. అభినందనలు.
*
సత్యనారాయణ మూర్తి గారూ,
విశ్వనాథ వారి బహుముఖ ప్రజ్ఞను పరిచయం చేసిన మీ ‘ఖండిక’ సమగ్రంగా, ప్రశస్తంగా ఉంది.
వారి రూపాన్ని వర్ణించిన మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
‘రసరమ్యవాగ్వివభవం’తో విశ్వనాథ వారిని వినుతించిన మీ పద్యం ఉత్తమంగా ఉంది. అభినందనలు.
*
రాజన్ గారూ,
‘శంకరాభరణం’ బ్లాగు మీకు సంతోషంగా స్వాగతం పలుకుతున్నది.
మీ పద్యం సలక్షణంగా ఉంది. అభినందనలు.
‘విబుధసముడు’... ‘విబుధవరుడు’ అయితే?
*
రాజేశ్వరి అక్కయ్యా,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
కాకుంటే అన్వయలోపం ఉంది.
కల్పవృక్షము భక్త కల్పవృక్షము గాగ
రిప్లయితొలగించండిరామాయణమ్మును వ్రాసినారు.
ఆదిశేషునకైన నచ్చెరువౌ రీతి
వేయిపడగలతో వెలసినారు.
మంజీర గాధలో మార్దవమ్మును నింపి
కణ్ణగి వైగైల కలిపినారు.
కిన్నెరసానిని వన్నెచానను జేసి
వంపుసొంపుల నింపి వదలినారు.
జ్ఞానపీఠమ్ముపై శోభ లీనినారు.
కవుల సమ్రాట్టులై ఖ్యాతి గన్నవారు.
తెలుగు వెలుగుల జగతికి తెలిపినారు
విశ్వ నాథులు సాహితీ విభులు వారు.
ఏక వీరు డీయ నెక్కె ఙ్ఞానపుపీట
రిప్లయితొలగించండికల్ప వృక్ష మిచ్చె కవుల రాజు
వేయి పడగల కడ విశ్వనాధుడు సత్య
మితడు శారదాంబ కితర రూపు.
విశ్వనాథ వారి ప్రస్తుతి కవి వరేణ్యులు చక్కగా చేసారు. అందఱికీ అభినందనలు. చంద్రశేఖరుల వారు భారతదేశములోనే ఉన్నారనుకొంటాను. చంద్రభాసురము పోస్తామంటే నాగుల చవితి నాడు పుట్టలోంచి బయటకు వచ్చే నాగేంద్రుల వలె బయట పడే అవకాశముంది.
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ,
రిప్లయితొలగించండివిశ్వనాథ వారిపై మీ పద్యం ప్రశంసార్హమై శోభిల్లుతున్నది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
శారదాస్వరూపుని గురించిన మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.