17, ఏప్రిల్ 2012, మంగళవారం

సమస్యాపూరణం - 680 (కోపమే భూషణము)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

కోపమే భూషణము నీతికోవిదునకు

17 కామెంట్‌లు:

 1. భాగ్య మడగించి, కీర్తిసంపత్తి గూల్చి,
  నష్టములగూర్చునట్టిది నరులకిలను
  కోపమే, భూషణము నీతికోవిదునకు
  శాంత మటుపైన మధురోక్తి సంపదయును.

  రిప్లయితొలగించండి
 2. భూరిశాంతగుణంబు సద్భూషణంబు
  కూర్చ శ్లేషార్థపంక్తి వాగ్భూషణంబు
  పుస్తకంబులు హస్తాబ్జ భూషణంబు
  కోపమేభూషణము నీతి కోవిదునకు?

  కోపము + ఏ భూషణము ?

  రిప్లయితొలగించండి
 3. సకల సంపత్తి హరియించు సాధనంబు
  కోపమే , భూషణము నీతి కోవిదునకు
  శాంత సహనంబు లియ్యివి సముచితము గ
  నొప్పి , కలిగియు యలరారి యోలలాడ .

  రిప్లయితొలగించండి
 4. కయ్యమునకు నరాతులు కాలుద్రువ్వి
  పలుకుచుండ ప్రగల్భముల్ పరువుతీయు
  నట్టి యపనిందలను వారి నణచు కొరకు
  కోపమే భూషణము నీతికోవిదులకు

  రిప్లయితొలగించండి
 5. సత్య పథముల జూపెడు జ్ఞాన జ్యోతి
  పథ్యవాక్యమ్ములకు మందు వంటి పూత
  ప్రేమతో సుద్దు లాడెడు వేళల చిరు
  కోపమే భూషణము నీతికోవిదులకు

  రిప్లయితొలగించండి
 6. శాంతికాముకుడైనను,సత్యధర్మ
  హాని కల్గెడి పట్టున ,నట్టి దుష్ట
  శక్తుల నుపేక్ష చేయంగ సాధ్యమౌనె?
  కోపమే భూషణము నీతికోవిదునకు.
  -----------

  రిప్లయితొలగించండి
 7. గుండా సహదేవుడు గారి పూరణ....

  ఎల్లవేళల చిరునవ్వు లెక్కుబెట్టి
  మధురభాషణమే సరిఁ బెదవిఁ బల్కి
  కార్యనిర్వహణార్థముఁ గలిగెడుఁ జిరు
  కోపమే భూషణము నీతికోవిదులకు

  రిప్లయితొలగించండి
 8. సత్యనారాయణ మూర్తి గారూ,
  చక్కని విరుపుతో మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  సమస్యను ప్రశ్నార్థకంగా మార్చిన మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మంచి విరుపుతో సమస్యను పూరించారు. ముఖ్యంగా చెప్పదలచుకున్న విషయాన్ని బలంగా సమర్థించడాని కన్నట్లు "ఒప్పు, కలుగు, తనరారు, ఓలలాడు" అనే సమానార్థ పదాల ప్రయోగం బాగుంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  ధర్మాగ్రహ ప్రాశస్త్యాన్ని వివరిస్తూ చక్కని పూరణ చెప్పారు. ఉత్తమమైన పూరణ. అభినందనలు.
  *
  శ్యామలీయం గారూ,
  మీ "చిరు కోపం" పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  "జ్ఞాన జ్యోతి" అన్నప్పుడు "న" గురువై గణదోషం అవుతుంది కదా. అక్కడ "జ్ఞాన దీప్తి" అందాం.
  *
  కమనీయం గారూ,
  ధర్మగ్లానిని ఉపేక్షించకుండా సదాగ్రహం చూపడం మంచిదన్న మీ పూరణ బాగుంది. అభినమదనలు.
  *
  గుండా సహదేవుడు గారూ,
  చిరు కోపం మంచిదే అన్న మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. ఖర్మ ఫలమును తొలగించ మర్మ మనుచు
  కోరి శపియించి మరలించి భూరి వరము.
  భువికి దిగివచ్చి తపియించి పుర హరుండు
  కోపమే భూషణము నీతి కోవిదునకు ?

  రిప్లయితొలగించండి
 10. జిగురు సత్యనారాయణమంగళవారం, ఏప్రిల్ 17, 2012 8:11:00 PM

  ఎత్తుకెత్తుగ కెరటమ్ములెగయచుండ
  ఎల్ల కపులు దాటగ లేక తల్లడిల్ల
  ఉల్లమందునుగ్రుండయ్యె నల్ల వాడు
  కోపమే భూషణము నీతికోవిదునకు!!

  రిప్లయితొలగించండి
 11. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  01)
  _____________________________________________

  కోమలత్వంబు లేనట్టి - కూళ లందు
  క్రొవ్వి మీదికి వచ్చెడు - కుంక లందు
  కొట్ట వచ్చెడు కఱుకైన - క్రొత్త భార్య
  కూళతనమును నెదిరించ - కొంత యైన
  కోపమే భూషణము నీతి - కోవిదునకు !
  _____________________________________________

  రిప్లయితొలగించండి
 12. రాజేశ్వరి అక్కయ్యా,
  పద్యం సలక్షణంగా ఉంది. కాని అన్వయమే ఇబ్బంది పెడుతున్నది.
  *
  జిగురు సత్యనారాయణ గారూ,
  సముద్రునిపై రాముని కోపాన్ని చక్కగా వివరిస్తున్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  అప్పుడప్పుడు ఆయా సందర్భాలలో కోపం చూపించాలన్న మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. నమస్కారములు
  చాలా రోజుల తర్వాత వినబడిన పిలుపు .చాలా ఆనందంగా ఉంది. తమ్ముడు ! ధన్య వాదములు.

  రిప్లయితొలగించండి
 14. పిన్ని దుర్భాష లాడగ వివశు డగుచు
  తపము చేయంగ వెడలెను విపినములకు
  ధృవ మండలము నేలెడి ధృవుడె యనగ
  కోపమే భూషణము నీతి కోవిదునకు !

  రిప్లయితొలగించండి
 15. నిజమే అక్కయ్యా ! చాలా ఆనందంగా ఉంది !ఎన్నో రోజుల తరువాత !

  రిప్లయితొలగించండి
 16. మంచి మాటలు వినని సమాజమునకు
  ధర్మ బోధల చక్కని దారి జూపు
  వేళలందున గురువుగా వెలుగు వేళ
  కోపమే భూషణము నీతికోవిదునకు

  రిప్లయితొలగించండి