3, ఏప్రిల్ 2012, మంగళవారం

కళ్యాణ రాఘవము - 2

కళ్యాణ రాఘవము - 2

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

తే.గీ.
పయనమా సాగె; వననదీపట్టణములు
దాఁటఁబడె; గౌతమాశ్రమస్థలము దోఁచె;
మగని రోషానఁ బాషాణమగు నహల్య
రామపదధూళిఁ జక్కని రామ యయ్యె. (15)


తే.గీ.
చిరవిరహ మీఁగి యిల్లాలిఁ జేరుకొన్న
గౌతమునియింట నతిథిసత్కార మంది
వెడలి తొలిదెసఁ జూపుడువ్రేలు సాఁచి
కౌశికుఁడు వల్కె రామలక్ష్మణుల కపుడు. (16)


చం.
"ఇది మిథిరాజు తొల్లి వెలయించిన మధ్యమలోకనాక, మి
య్యది జనకావనీభుజుల న్యాయమయంబగు రాజధాని, యి
య్యది పురుటిల్లు నేల జవరాలి, కొకానొక నూత్నరత్న మిం
దుదయము జెంది ప్రోది గనుచున్నది క్రొన్నెలవంక పోలికన్. (17)


ఉ.
పెంపుడుతండ్రియై పుడమిబిడ్డ కిటం జనకుండు పేరునం
బెంపు వహించె నౌరవుర! వీరకుమారుల గండుగుండెలం
గంపిలఁ జేయఁ జాలు పెనుకార్ముక మున్నది వానియింటఁ; బ్రా
యంపుఁ గుమారి నిచ్చునఁట యా ధను వెక్కిడు శౌర్యశాలికిన్. (18)


తే.గీ.
చాటఁబడియె స్వయంవరోత్సవ మఁటంచు
నోళ్ళ నీళ్ళూరె రాచవా రెల్లరకును
బహుమహీవరపరివారపరికరములఁ
గ్రిక్కిఱిసిపోయె మిథిల ము న్నొక్కమాటు. (19)


ఉ.
ఆ రుచిరాంగి మీఁది యడియాసల రాసుతు లప్పు డెందఱో
చేరిరి గాని - నారి విలు జేరుపలేరు, రవంత యెత్తఁగా
లేరు, బలమ్ము సూపి కదలింపను లే, రటుచూచి నిస్పృహ
స్మేరముఖమ్ము ద్రిప్పికొని సీత గిఱుక్కున లోని కేగఁగన్. (20)


తే.గీ.
ఱేఁ డొకఁడు గెల్చి మోమెత్తు జాడలేదు
సిగ్గుపడి సీత మోమువంచినది లేదు
క్షణములో నా స్వయంవరస్థానమందు
రాజలోక మదెల్లఁ బరాజితంబు. (21)


తే.గీ.
నెపము గొని సన్నఁగా సాఁగు నృపతులఁ గని
పురము నవ్వె, ఫక్కున నంతిపురము నవ్వె,
విసిగి చనెడి పతింవర విసరఁ గూలి
కూలి నవ్వెఁ జెలులమ్రోలఁ బూలమాల. (22)


తే.గీ.
ఉర్వి నిర్వీరమనుచు నిట్టూర్చె జనక
రాజు, క్షాత్రతేజ మది పరాజయాబ్ధిఁ
గూలి చల్లారె, నేఁటికిఁ గూడ దాని
కంతరౌర్వాయమాణుఁ డొక్కయ్య లేఁడు." (23)


తే.గీ.
అని మిథిలమ్రోల గాధినందనుఁడు వలుక
నూగుమీసము లెగదువ్వ నేగుకరము
ననుజుఁ డపుడెట్లు బిగఁబట్టుకొనెనొ కాని
పొంగు దాఁగదు రాముని భుజశిరముల. (24)


శా.
"ఏమేమీ యొక వింటి నెత్తు మగవాఁడే యుర్వి లేఁడో? స్ఫుర
న్నామంబౌ రఘువంశ మెవ్వరి యెడందం దట్టలేదో? మహ
ర్షీ! మీ శిష్యుల కానతీయవలె, నేఁడే నింగిపై క్షాత్రతే
జోమాంగల్యపతాక ప్రాఁకవలె" నంచున్ రాముఁ డుత్సాహిగాన్. (25)


తే.గీ.
కుశికసుతుఁ డంత రఘుసింహశిశువు చెంత
కల్లనల్లనఁ దన కటాక్షాళి పఱపి
"భద్రమ"స్తని దక్షిణబాహు వెత్తి
చిఱునగవు లంకురింప నాశీర్వదించె. (26)


సీ.
"రామచంద్రునిఁ గన్న రఘుకులాంభోధి త

రంగమాలికలఁ బా ల్పొంగుఁగాతఁ
గడుపుచల్లని తల్లి కౌసల్య లోకైక
వీరమాత యనంగ వెలయుఁగాత
సిగ్గుపాటునఁ గ్రేటు సీత నీ చేయూఁత
వడిఁ గన్నెచెఱఁ బాసి వెడలుఁగాత
నేడుదీవుల గంతు లిడి రామనామము
మూలమూలలను మార్మ్రోయుఁగాత
తే.గీ.
రమ్ము ననుఁగన్న కల్యాణరామ!" యంచు
గనుల నానందబాష్పముల్ గ్రమ్ముకొనఁగఁ
గరములన్ జాఁచు మునికి స్వాగత మొసంగె
జనకమఖధూమసురభితశ్వసన మపుడు. (27)

ఉ.
అచ్చొటు వారు దాఁటిన రవంతన చెంతకుఁ బచ్చపచ్చఁగా
వచ్చెను యజ్ఞవాటి, వినవచ్చె మనోహరవేదనాదముల్,
"వచ్చెఁ దపశ్శరీరుఁ డిదె వచ్చెను గాధికుమారుఁ" డంచుఁ దా
రచ్చెరువంది రచ్చటి మహర్షులు హర్షవిధూతశీర్షులై. (28)

1 కామెంట్‌:

  1. కమనీయ శబ్దయుతమును
    రమణీయార్థాంచితమయి రాజిల్లెడు కా
    వ్యము శ్రీరాఘవ కళ్యా
    ణము శుభఫలదమగు సజ్జనప్రతతి కిలన్

    రిప్లయితొలగించండి