20, ఏప్రిల్ 2012, శుక్రవారం


ఈశ్వరేచ్ఛ

హరి వేంకట సత్యనారాయణ మూర్తి

చం.
ఇనకుల సంభవుండు మృగయేచ్ఛను బూని సరిత్తటీస్థలిన్
ఘనవనభూమి కేగి, నిశ గ్రమ్మినవేళ నొకానొకండు ని
స్వనమది సోక వీనులకు సామజమంచు దలంచి శబ్దభే
దిని ఘనుడౌట వేసెనొక తీక్ష్ణశరం బపుడా దిశన్ వడిన్.

తే.గీ.
ఆర్తనాదంబు విన్పింప నచటికేగి
దశరథాధిపు డచ్చట దారుణమగు
బాణహతిచేత మిక్కిలి బాధ జెందు
నేల కొరిగిన సన్ముని బాలు గాంచె.

కం.
ఆతడె శ్రవణకుమారుడు
సాతురతను జలముగోరి సరయూనదికిన్
మాతాపితరులు పంపగ
నేతెంచి శరాగ్నిగూలె నీశ్వర మాయన్.

కం.
తను జేసిన దుష్కృత్యము
మనమును గుందంగజేయ మాటలడం(ణం)గన్
మునిబాలకు దుర్దశగని
ఘనతాపము జెంది నిలిచె క్షత్రియుడంతన్.

కం.
అంధులు జననీజనకులు
బంధువులా లేరు, నన్ను బాలుని శరమున్
సంధించి కూల్చి వారిని
బంధించితి వౌర! నీవు బాధలలోనన్.

తే.గీ.
అనుచు వచియించు శ్రవణున కనియె రాజు
వినుము గజమంచు బాణము వేసినాడ,
ననఘ! నీయున్కి నేనిందు గనగ లేక
ఇట్టి పాపాని కేనొడి గట్టినాడ.

తే.గీ.
కట్టి కుడుపును నాకింక చుట్టుకొనును
బ్రహ్మ హత్యాఖ్య మైనట్టి పాతకంబు
మునికుమారక! నీవారి ముందు కరిగి
విషయమును జెప్పి సర్వంబు విశద బరతు.

కం.
అని పలికిన దశరథునకు
ననఘుం డా మునికుమారు డనెనీ రీతిన్
కనగలవు నాదు జనకుల
వనభూమిని కుటిని నీవు వారతి వృద్ధుల్.

ఆ.వె.
అచటి కేగి వారి కాసాంతమును దెల్పి
యంజలించి యభయ మడుగ గలవు
దాహబాధతోడ తప్తులై యున్నార
లింక నీదు భాగ్య మెట్లు గలదొ.

తే.గీ.
బ్రహ్మహత్యాఘ మంటదు, బ్రాహ్మణుడను
గాను నేనింక వైశ్యుని మేనినుండి
యువిద శూద్రకు జన్మించి యుంటిగాన
చింత వలదింక మనమున సుంత యేని.

తే.గీ.
అనగ నాముని బాలుని తనువునందు
దిగిన బాణంబు నారాజు దీసి వేయ
కనులు మూసెను శ్రవణుడు కనగ నపుడు
చిత్తరువు వోలె నృపునకు చేష్టలుడిగె.

9 కామెంట్‌లు:

  1. శ్రీ హరి వారికి శుభాశీస్సులు. మీ రచన ఈశ్వరేఛ్ఛ చాల బాగున్నది. కొన్ని సూచనలు:
    (1) అస్త్రమునకు మంత్రమే ప్రాణము. శబ్దభేది అస్త్రము కదా - మంత్రించినట్లు మీరు చెప్పలేదు.
    (2) 3వ పద్యములో: సాతురత అని వాడేరు. స + ఆతురత అని మీ ఉద్దేశము కాబోలు. ఆతురత అనే పదము లేదు. ఆత్రము అని వాడాలి.
    ఇవి చాల చిన్న పొరపాటులు. మీ పద్య ధార చాల బాగున్నది.

    రిప్లయితొలగించండి
  2. సత్యనారాయణ మూర్తిగారు,
    బాగా వ్రాశారండి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. గురుతుల్యులు శ్రీ నేమాని వారికి,
    ఆర్యా!
    నమస్కారములు. సదా నాకందుతున్న మీ ఆశీస్సులకు సూచనలకు ధన్యవాదములు. మీ సూచనలు శిరోధార్యములు.
    మూడవ పద్యం లోని
    "సాతురతను" అనేచోట
    "సాతురుడై జలము గోరి సరయూ నదికిన్"
    అనే విధంగా మారుస్తున్నాను.
    ఇక "అస్త్రమును మంత్రించు విషయము"-
    వాల్మీకి రామాయణంలో ఈ ఘట్టంలో-
    "అథాంధకారే త్వశ్రౌషం జలే కుంభస్య పూర్యత:,
    అచక్షుర్విషయే ఘోషం వారణస్యేవ నర్దత:|
    తతోహం శరముద్ధృత్య దీప్తమాశీవిషోపమమ్,
    శబ్దం ప్రతి గజప్రేప్సు: అభిలక్ష్యత్వపాతయమ్|
    అముంచం నిశితం బాణం అహమాశీవిషోపమమ్
    తత్ర వాగుషసి వ్యక్తా ప్రాదురాసీద్వనౌకస:,
    హా హేతి పతతస్తోయే బాణాభిహత మర్మణ:||
    తస్మిన్ నిపతితే బాణే వాగభూత్ తత్ర మానుషీ
    కథమస్మద్విధే శస్త్రం నిపతేత్తు తపస్విని |
    అనే చోట మంత్రించినట్లు ఉటంకించ బడలేదు. అది కేవల శస్త్రప్రయోగముగా మాత్రమే చెప్పబడియున్న కారణముగా అట్లు వ్రాసితిని. పొరపాటైనచో మార్చుకొన గల వాడను.
    మరోమారు ధన్యవాదములతో,
    మీ ఆశీర్వచనాభిలాషి,
    మూర్తి.

    రిప్లయితొలగించండి
  4. అయ్యా శ్రీ హరి వారూ!
    శుభాశీస్సులు. మీ వివరణను చదివిన తతువాత నేను మరియొక మారు రామాయణమును చూచితిని:

    1. అధ్యాత్మరామయణము (వ్యాసకృతము) లో శబ్దవేధి అను అస్త్రమును ప్రయోగించినటుల నున్నది.

    2. వాల్మీకీయములో కూడా మీరు ఉదహరించిన శ్లోకములకు కొంచెము ముందుగా ఈ శబ్దవేధిని ప్రయోగించినట్లు దశరథుడు కౌసల్యతో చెప్పెనటుల ఉన్నది. (అయోధ్యా కాండము 63వ సర్గము 10 నుండి 13 శ్లోకములు).

    మీ ప్రయోగము తప్పు కాదు.

    రిప్లయితొలగించండి
  5. హరికుల శశి మూర్తీజీ!
    పరువెత్తును మీ కలమ్ము భావము వెనుకే
    విరబూయు పద్య సుమములు
    మురిపించును పద్యప్రియుల ముచ్చటలగుచున్

    రిప్లయితొలగించండి
  6. గురుతుల్యులు శ్రీ నేమాని వారికి
    ఆర్యా!
    మీ వాత్సల్యానికి ధన్యవాదములు
    శుభములు గూర్చుచు నుండెడి
    యభినందనలిచ్చుచుందు రస్మద్గురుస
    న్నిభులౌ పండితవర్యా!
    అభివాద శతంబు జేతు నయ్యా! మీకున్.

    రిప్లయితొలగించండి