6, ఏప్రిల్ 2012, శుక్రవారం

కళ్యాణ రాఘవము - 5

కళ్యాణరాఘవము - 5

శ్రీమాన్ చిలుకమఱ్ఱిరామానుజాచార్యులు
ఆ.వె.
ఎవరొ రాచకోడె లేతంచినారఁట
వింటి నిపుడ యెక్కువెట్టెదరఁట
యనెడి వార్త జగము కనుమూసి విప్పున
ప్పటికె పొంగిపొరలెఁ బట్టనమున. (54)


ఆ.వె.
చూడఁబోద మనుచు సుదతులు మిథిలలో
దిద్ది తీర్చుకొనెడి తీరు జూచి
మొగము గడిగి తూర్పుముదితయుఁ గుంకుమ
బొట్టు దాల్చినట్లు ప్రొద్దువొడిచె. (55)


ఆ.వె.
ఎగసె నపుడు రాచనగరులోఁ గలకలం
బుఱుము దోఁచె మేఘవిరహితము
నదరె వీథి, మేడ లల్లాడి నట్లయ్యె
ముందు సాఁగె జనసమూహ మొకటి. (56)


ఆ.వె.
బెదరు జింకకనుల వెలఁదుకల్ ముంగిటి
మారుతాయనములు జేరి చూడ,
నద్ది యే మఁ టంచు నడుగులో వీథికిఁ
బురుషు లొక్కపరిగఁ బరుగువెట్ట. (57)


చం.
అదె యిదె పట్టుపట్టుఁ డని యార్చుచుఁ బేర్చుచు వేనవేలు బ
ల్లిదు లెదొ లాగసాఁగిరి, చలించి యెదో గిరిశృంగమట్లు బి
ట్టదరుచు వచ్చె భూరిజవమై - యొహొహో! తెలియంగ నయ్యె ని
య్యది మఖవాటికన్ హరశరాసనపేటికఁ జేర్చు చొప్పగున్. (59)


ఆ.వె.
అవుర! యెంత బెదరనయ్యె నిమ్మంజూష
కతన నంచుఁ బౌరవితతి యట్టె
కాంచుచుండ నొక్కగడెలోన గడగడ
వింటిపెట్టె నగరవీథి దాఁటె. (60)


ఉ.
ఎట్టిఁడొ కాని నేఁటి కొకఁ డీ ధను వెక్కిడఁ బూనెఁగా! యదే
గట్టితనమ్మొ చూతమని గ్రక్కునఁ బిన్నలు పెద్ద లంత ను
న్నట్టులె పెట్టెతోఁ బయనమైరి, తదుద్ధతచక్రనేమిసం
ఘట్టితరాజమార్గముల కాలువలం దడుగుల్ తడంబడన్. (61)


ఆ.వె.
చెలులగుంపుతోడ క్షితికాంత యల్లల్లఁ
గదలివచ్చె ధూళికైతవమున
ముద్దుఁగూఁతు నొసఁగ మునుముందె యల్లుని
చెలు వొకింత దెలియఁదలఁచి నట్లు. (62)


ఆ.వె.
పిల్లవానినుండి గొల్లని దాఁకయుఁ
బొంగిపొంగి పోఁదొడంగె మిథిల
వానకారుపరుపులో నిండు నది పోల్కి
సర్వతోముఖంపు సంభ్రమమున. (63)


ఉ.
తుంగతరంగమాల లన ధూళులు ధూమము లేకమై పయిం
బొంగఁ బ్రజాప్రవాహములు భూరిగభీరజవంపుఁ బెంపునం
జెంగటి యజ్ఞవాటమును జేరఁగఁబాఱె, నదీసముద్రముల్
సంగమరంగమం దమరుజాడలు కన్నులఁ గట్టునట్టులన్. (64)


సీ.
పావనాహుతుల క్రొందావులు తడలెత్తి

గుప్పుగుప్పునదెసల్గప్పికొనఁగ
సవనావసానప్రసన్నదీప్తాగ్ని ప
ర్యాయమైమునిసముదాయమమర
వహ్నిశిఖల్ దాఁటి వచ్చి సీత చెలుల
చూడ్కులెవ్వారినోచూచినిలువ
గాయత్రిఁ గన్గొన్న ఘనుఁడు రాముని బాల
చరితామృతపుఁజిత్తజల్లుగురియ
తే.గీ.
నమరపతివోలె విబుధమధ్యమున వెల్గు
జనకవిభుఁ జేరి ప్రణమిల్లి సచివవరులు
వింటిపెట్టియఁ దెచ్చిన విధము దెల్ప
నమ్మునివరేణ్యుఁ గని మిథిలాధిపతియు. (65)

మ.
"తడవేలా? దయచేయుఁ" డంచు రఘుసంతానస్ఫురత్పూర్ణపా
ర్శ్వుఁడు గాధేయుఁడు తోడరా నెడనెడన్ భూరిప్రజానీకముల్
తడఁబాటై వెనువెన్కగా నొదిగి జోతల్ వెట్టఁగాఁ గొన్నియౌ
నడుగుల్ మేరగ నిల్చి పెట్టెకడ నుద్యత్పాణియై యిట్లనున్. (66)

2 కామెంట్‌లు:

 1. ఎప్పు డెప్పుడు చూతు నా యిందు ముఖిని
  తెల్ల వారుట దెన్నడో తెలియ దంచు
  నాత్మ లో నవ్వు కొన్న యధ్యాత్మ రామ
  మూర్తి విలు భంగ మొనరించు మూర్త మెపుడొ.

  రిప్లయితొలగించండి
 2. మిస్సన్న గారూ,
  ఛందోబద్ధమైన మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి