10, ఏప్రిల్ 2012, మంగళవారం

కళ్యాణ రాఘవము - 9

కళ్యాణ రాఘవము - 9

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

తే.గీ.
అని మునికి మ్రొక్క "ఓయి, రాజా! త్వదీయ
విమలహృదయమె యిట్టి శ్రేయము గడించె
నింక నీయల్లువానితో నింపుమీఱ
క్షీరసాగర మట్లు నిండారు" మనుచు. (111)


తే.గీ.
ముని పలుకుచుండ రఘుమౌళి మూఁపుదట్టి
"నాయనా! రామభద్ర! యీ నాదు ప్రతిన
పాటి కెక్కింప నెటు శ్రమంపడితివోయి!
మఱపురానిది నీ విక్రమస్ఫురణము" (112)


చం.
అనవుఁడు రాముఁ డిట్లను "మహాత్మ! యిటుల్ మిముబోంట్ల దీవనల్
పొనరిచెఁ గాక యేను నొక ప్రోడనె? యింతకు వీరుఁ డి ప్పురా
తనధను వెత్తినంతటనె తా నుతి కర్హుఁడె? యిద్ది భీతులన్
మనుపుటొ? దుండగీండ్ర పొడమాపుటొ? దిక్కులు గెల్చి పొల్చుటో?" (113)


తే.గీ.
వినయవినమితముగ్ధవదన మొకింత
యెత్తి స్మితపూర్వకమ్ముగా నిట్లు పల్కు
బాలు వాక్సుధ గ్రోలి మార్వలుకలేక
పరవశుఁడువోలెఁ గనుమూసి తెఱచి మరల. (114)


కం.
కని, ధ్యాననిశ్చలవిలో
చననిర్యన్మోదబాష్పజాలము చెక్కి
ళ్ళను దడుపఁ గౌఁగిలించెన్
జనపతి రాము గుణధాము జగదభిరామున్. (115)


తే.గీ.
అప్రయత్నముగ జగత్త్రయమ్ము గెలిచి
యేలినట్లు, బ్రహ్మానందకేళిఁ దేలి
నట్లు దలఁచి యొకింతసే పట్లె నిలిచి
జనకుఁ డెట్టకేనిఁ గుమారిజాడఁ జూడ. (116)


చం.
ఒకచెలి పెన్నెఱుల్ కలయనొత్తుచుఁ బూలజెడం గుదుర్పఁగా
నొకతె యెడంద ముత్తెసరు లొయ్యనఁ జిక్కులువో నమర్ప, వే
ఱొకతె విశీర్ణమౌ తిలక మొద్దిక దిద్ద, మధూకమాల నిం
కొకచెలి కేలనుంపఁ, జెవి నూర్మిళ నవ్వు చెదో వచింపఁగన్. (117)


సీ.
వెలిపట్టుచీర కుచ్చెళుల జరీయంచు

గోటిముత్తెములతోఁ గూడియాడఁ
జరణవిన్యాసంబు జగతిపైఁ గెందమ్మి
పూరెక్కలం గుప్పవోయుచుండ
నందెల చిఱుమ్రోఁత లానందలక్ష్మి లా
స్యమునకు నాందిగీతములు పాడ
సిగ్గువ్రేఁగున వంగు చిన్ని మో మెగబ్రాఁకి
కడగంటి తళుకులు తడలు నెరప
ఆ.వె.
హరుని విల్లు విఱిచి యతిదర్శనీయుఁడౌ
రాముఁ జేర నరిగె రమణి సీత
యంబురాశి ద్రచ్చి యలసిన హరిచెల్వు
గని వరింపఁబోవు కమల పోల్కి. (118)

ఉ.
ఆ నవనీలమేఘరుచిరాంగకు నెంతగ నిల్పికొన్నదో
జానకి కన్నుదోయిఁ, గడు చల్లని నల్లని చెల్వు కల్వపూ
లై నెఱదండ ట్లెగసి యాకరహారము తోడుపాటుగా
భానుకులాంకురంబు మెడపైఁ బడె సంచలదంచలంబుగన్. (119)


ఆ.వె.
పంటవెలఁది కడుపుపంటపై రాము క్రీ
గంటిముద్ర వడుట గాంచి యపుడు
త్రిభువనముల కఱవుదీఱిన ట్లానంద
ముద్రితమ్ములయ్యె మునులకనులు. (120)


తే.గీ.
జనుల కరతాళరవములో మునిఁగిపోయె
నమరదుందుభినిన మాకసమునఁ
బుడిమిఁ బడు పారిజాతపుఁ బూలసోన
జానకీమందహాసాన లీనమయ్యె. (121)


ఆ.వె.
ఎల్లవారి కనులు చల్లనై మిర్మిట్లు
గొనఁగ రాముమ్రోల జనకతనయ
సజలజలధరాగ్రసౌదామనీలీల
క్షణము మెఱసి చనియె సఖులదరికి. (122)


తే.గీ.
జనవిలోచనశ్రేణులు సాగెఁ గొన్ని
సీతతో, రాముపైఁ గొన్ని స్థిరములయ్యె
నూర్మిళాలక్ష్మణుల చూడ్కు లొక్కఁ డగుట
పొంచికొనియుండి యొకకొన్ని కాంచె నపుడు. (123)


సీ.
"ఈ వింటిపందె మెన్నేండ్లు బిడ్డను రద్ది

గొలిపెనమ్మా!" యని పలుకు వార
"లీ చక్కనయ్య తా నిట్టివీరుండని
యనుకొన లేదమ్మ!" యనెడువారు
"మన చిట్టితల్లి యీతనికి నిల్లాలౌట
భాగ్యమమ్మా !" యని పలుకువార
"లెది యెట్లయిన నొక యింటిదయ్యెను సీత
జనకుని చింత వాసె?" ననువార
తే.గీ.
"లమ్మలా! మన బంగారుబొమ్మ నింక
పెండ్లికొమరితగాఁ జేయు వేడ్క లెల్లఁ
గాంచఁగల మమ్మ కన్నుల కఱవుదీఱ"
ననెడు వారును నైరి శుద్ధాంతసతులు. (124)

తే.గీ.
దూత లంపఁగబడిరి సాకేతమునకు
శూన్యహృదయాలఁ జిగురులు జొంపమెత్తఁ
నెలవులకుఁ జేరఁ జనిరి పౌరులు, దిగంత
సీమలకుఁ బ్రాఁకఁదొడఁగె శ్రీరాము కీర్తి. (125)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి