కళ్యాణ రాఘవము - 8
శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు
శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు
శా.
"కన్నయ్యా! బుధు లింద్రియాద్యుపరతిం గావించి యోగస్థితిం
గన్నయ్యా! హృదయాబ్జకర్ణిక పయిం గాన్పించు మాయయ్య! యీ
కన్నుందోయికి గోచరించితివిగా కల్యాణసంధాన! మా
కన్నుల్ గట్టు భవద్విలాసములకుం గైమోడ్పు తేజోమయా! (96)
సీ.
నిగమచోరకు వాఁత నెత్తురుల్ గ్రక్కించి
యీవెకా మును ధాత నేలినావు
పాలేటఁ దిరుగు కవ్వపుఁగొండ బరు వది
నీవెకా మూఁపున నిలిపినావు
పువ్వులచెండుగా భూమండలం బెల్ల
నీవెకా మునుకోఱ నెత్తినావు
వనమాలతో పాటు దనుజేంద్రు ప్రేవుల
నీవెకా యెడఁద సంధించినావు
తే.గీ.నీవెకా యడుగులఁ గొల్చినావు విశ్వ
మీవెకా రక్తబలి యిచ్చినావు పరశు
ధారకుం గూళఱేండ్ల, సౌందర్యనిధిగ
నీవెకా యిప్పు డిట్టు లున్నావు రామ! (97)
కం.
మించెదు నిరుపేదలఁ బ్రే
మించెదు విశ్వహిత మనుగమించెదు భువి నే
మించెదు దుష్టాత్మకుల ద
మించెదు సమయమున విక్రమించెదు రామా (98)
తే.గీ.
ఎట్టి యద్భుతకృత్యము నెంచియేని
నవధరింపరు జనులు మహాత్మ! నిన్ను
లోకమున నీ కటాక్షవిలోకనములు
చల్లఁగా మచ్చుపొడి యెదో చల్లునేమొ? (99)
తే.గీ.
సీత కా దాపె నిం జేరు జీవకళిక
కాదు హరధను వది యహంకార మోయి!
తఱి యెఱిఁగి వచ్చి యద్దాని విఱుచు నీవు
బాలకుఁడవు గావు భువనపాలకుఁడవు. (100)
తే.గీ.
విబుధతతి నెమ్మొగమ్ములు విప్ప, వైరి
పంక్తిముఖములు నేలకు వ్రాల నింక
నలరఁగలవోయి! శ్రీరామ!" యని మహర్షి
వరుల హర్షాశ్రుగద్గదస్వరము నిలిచె. (101)
తే.గీ.
అంత సీతమ్మ వలపోల్కి నలము పసిఁడి
ముసుఁగు సడలింపఁ గాటుకపులుఁగు లట్టు
లోరచూపులు చివ్వునఁ బారిపోయె
దవ్వునం బొల్చు నా రామతరువు దరికి. (102)
తే.గీ.
విక్రమోద్దాము శ్రీరాము వీరకాంతి
మహితమూర్తికి నాపాదమస్తకముగ
వెలఁది యల్లల్ల స్నేహసంభృతకటాక్ష
దృష్టికళికలఁ ద్రిప్పుచు దృష్టి దీసె. (103)
కం.
జడివాన వెలియుగతిఁ జ
ప్పుడు లవి యంతంత కాగిపోయె, జనులలో
నెడనెడఁ గదలిక యలజడి
పొడమె, నిదురవోయి లేచు పొలుపు గనబడెన్. (104)
తే.గీ.
ఘోరరవమున గింగురుగొన్న కర్ణ
ములు మరల స్వస్థపడఁ, గనుల్ నులుముకొనుచుఁ
బ్రజలు గని రప్డు రఘువీరు పదములదరి
సాగిలంబడ్డ హరధనుష్ఖండములను. (105)
తే.గీ.
"విఱిచెనా యిక్కుమారుఁ డీ వింటి నౌర!
యంత పెనుమ్రోఁత యియ్యదియా!" యటంచు
నబ్బురంపాటుతో నెల్ల రరయుచుండ
గాధితనయుఁడు పులకితకాయుఁ డగుచు. (106)
సీ.
శ్రీరాము నభినవోదారతేజమ్ములో
మునుఁగు కన్నుల నఱమోడ్చి నిలుపు
శ్రీరాము వికసితసితపద్మలోచన
ములు జూచి సవితృమండలము జూచు
శ్రీరాము జగదేకవీరమూర్తినిఁ గాంచి
జనకుని కనులలోఁ గనులు గలుపు
శ్రీరాము విగ్రహశ్రీ నిల్చు కన్నులఁ
బోలించి జానకి పొడవు గొలుచు
తే.గీ.దిక్కుదిక్కున ఘనతపోదీక్ష మిగులఁ
బాటుపడి బ్రహ్మఋషి యైననాఁటికంటె
ఘనత యిపు డేదొ సాధించుకొనినయట్లు
ముదితుఁడై తనలోనె తా మురిసిపోవు. (107)
ఉ.
అంత నృపుండు మౌనివికచాననముం గని "దేవ! యీ జగ
త్కాంతు ననంతశక్తిఁ గనగంటిఁ, గృతార్థత నందఁగంటి, న
న్నింతటి మేటిసేయు నిను నేమి నుతింతుఁ, గృతజ్ఞతానత
స్వాంతపుఁ గాన్కతోడి యొక యంజలి పెట్టెదఁ గాక కౌశికా! (108)
తే.గీ.
ఎచట మిథిలాపురి, యయోధ్య యెచట! యిట్టి
ఘటనకున్ మూల మీవ, నీ కతనఁ బ్రాపు
జిక్క కే యల్లలాడు మాసీత యింక
మావిగున్న కల్లుకొనెడు మల్లెతీఁగ. (109)
తే.గీ.
రాము నర్ధాంగియై దశరథుని యింటి
పెద్దకోడ లనంగ నా ముద్దుబిడ్డ
జనకవంశము మౌక్తికచ్ఛాయ లొలుకఁ
గీర్తిసుధ వోసి మిన్ను బ్రాఁకించు నింక." (110)
అద్భుతం.
రిప్లయితొలగించండి