8, ఏప్రిల్ 2012, ఆదివారం

కళ్యాణ రాఘవము - 7

కళ్యాణ రాఘవము - 7

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

ఉ.
ఆయెడ నీలనీరజదళాంతరకాంతి వెలార్చు లేఁతనౌ
పై యఱమేను ముందుకకు వ్రాలిచి, చెంగలువల్ హసించు కేల్
దోయి రవంత చాఁచి, తృటిలోనఁ జటుక్కున నుక్కుపెట్టె కీ
ల్వాయఁగ మూఁతవిప్పె రఘుబాలుఁడు వీరకళావిశాలుఁడై. (82)

చం.
గణిలుగణిల్లునం గదలు గంటలకున్ మఖవాటి తల్లడి
ల్లినగతి దోఁప, దాశరథి లీలమెయిం గయివెట్టి పట్టి విల్
గొని వెలికెత్తి, మధ్యమునఁ గూర్చిన ముష్టినిఁ దూఁచి యూఁచి రి
వ్వున నఱత్రిప్పు త్రిప్పి పదభూమి మొదల్ గదియం గరావలం
బన మిడి చక్క నిల్పెను సభాజనవిస్మయభాజనంబుగన్. (83)

తే.గీ.
ఏ మహర్షులు శ్రమపడి యిట్టి హస్త
లాఘవము నేర్పిరోగాని రాఘవునకు
సకలలోకభీకరహరచాప మెత్తి
యంత సేయు టెడమచేతి యాట యయ్యె. (84)

శా.
డాకాలుం బొటవ్రేల వింటిమొద లుట్టంకించి, వేఱొక్క కాల్
వ్యాకోచింపుచు నిల్చు బాలకుని హస్తాగ్రమ్ముతో పాటుగా
నాకర్షించెను కించిదుత్థితదృగంతాలోకనం; బంతలో
నా కోదండము వంగె శౌర్యవిజితంబై యౌదలన్ వ్రాల్చెనాన్. (85)

తే.గీ.
వామకరము గ్రహించు నీ వరుఁ డటంచు
వామకరము గ్రహించె నీశ్వరునిధనువు
నదియ తనపని యని నారి నరయఁ దొడఁగె
దక్షిణము దీనరక్షణదక్షిణమ్ము. (86)

సీ. గట్టిగాఁ గదలనన్ పట్టు బట్టుట నేమొ

గట్టిగాఁ గదలని పట్టు బట్టె
నురుశక్తి నృపతుల నూఁపు లూఁపుట నేమొ
యురుశక్తి నెత్తి యుఱ్ఱూఁత లూఁపె
నిస్సారు లని ఱేండ్ల నిలిపి చూపుట నేమొ
నిస్సార మిది యని నిలిపి చూపెఁ
దలవంపు రాచబిడ్డలకుఁ గూర్చుట నేమొ
తలవంపు క్షణములోఁ గలుగఁజేసెఁ
తే.గీ.
దనకు రాజుల కున్న బాంధవ్యగరిమ
నరసెనో రామబాహు వయ్యవసరముఁ
గాక, తా నేడ? హరకార్ముక మ్మదేడ?
త్రాట బంధించు టేడ? నాఁ దనరె నపుడు. (87)

కం.
గొనయము విలుకొప్పునఁ జ
ప్పునఁ గూరిచి లాఁగె రాఘవుం, డింతకుఁ దా
ధనువుదరి నిలిచి సలిపెడి
పనులు మెఱపు మెఱసినట్లు భాసిలె నంతన్. (88)

తే.గీ.
వామముష్టికిఁ జిక్కి యీశ్వరుని విల్లు
దనకుఁ దా వంగఁ దద్గుణమ్మును గ్రహించు
దక్షిణపుముష్టి యమ్మహాధనువు వంతఁ
జెప్పుటకుఁ బోలె రఘురాము చెవిని డాసె. (89)

తే.గీ.
ప్రళయకాలోగ్రుఁ డని మహీపతులు చూడ
విశ్వపాలకుఁ డని ప్రజావితతి చూడఁ
బుష్పధన్వుఁ డనుచుఁ బువుఁబోండ్లు చూడ
నిండు క్రతుఫల మని జనకుండు చూడఁ
బ్రణవమయమూర్తి యని మహామునులు చూడఁ
జెలఁగి యాత్మేశ్వరుండని సీత చూడఁ
గుండలీకృతదీర్ఘకోదండుఁ డగుచు
నొకక్షణము వీరరాఘవుఁ డొప్పె నపుడు. (90)

ఉ.
అంతట మెండు నిండెఁ బ్రళయధ్వను లెవ్వియొ, సంచలించెఁ ద
త్ప్రాంతము లెల్ల, గుట్టలు గుభాలునఁ గూలినయట్లు, విశ్వ ము
ద్భ్రాంతిని గొన్నటుల్, నభము వ్రస్సినటుల్ కనుమూఁతలౌచు ది
గ్భ్రాంతిఁ బ్రకంపితాంగులయి పౌరులు మూర్ఛమునింగి రెల్లరున్. (91)

మ.
"అకటా! యియ్యది రామకోమలకరవ్యాకృష్యమాణత్రియం
బకబాణాసనభంగసంగతరవంబా! సప్తశైలంబులం
బెకలం జేయునొ? యబ్ధులం గలఁచునో? భేదించునో దిగ్గజ
ప్రకరశ్రోత్రములన్? మహాఫణిఫణాభాగంబులన్ వంచునో
ప్రకటస్ఫూర్తి" నఁటంచు మింట దివిజవ్రాతంబు భీతిల్లఁగన్. (92)

తే.గీ.
ప్రకృతి నిశ్చేష్టమై తోఁచె భయదరవ మ
జాండమున్ వ్రక్కలించిన ట్లయ్యె నపుడు,
విశ్వ ముపసంహృతమ్ము గావించి ప్రళయ
జలధి నెలకొన్న వటపత్రశాయి పోల్కి
వెలసె రఘురాజవంశపు మొలక తాను. (93)

తే.గీ.
అంత సుడియుచు మార్మ్రోయు నయ్యఖండ
నాదవీచికలం దెదురీఁది యీఁది
మునులు సీతయు సౌమిత్రి జనకవిభుఁడు
కనిరి వేర్వేఱు రాము నేకాంతశోభ. (94)

ఆ.వె.
తామె తలలు వంగెఁ, దముదామె పులకలు
మొలిచె, బాష్పధార లొలికెఁ దామె,
మునులు పారవశ్యమున నుండ మోములఁ
బ్రమదనదులు తామె పాఱఁదొడఁగె. (95)

2 కామెంట్‌లు:

  1. కళ్యాణ రాఘవము చాల ఆనందముగ శోభతో సాగుచున్నది. మా అందరిచే చదివించి ఆనందింప చేసిన శ్రీ శంకరయ్య గారికి శుభాభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  2. గురువుగారూ నేమాని పండితార్యులన్నట్లు యెంత సుందరమైన కవితా శిల్ప మండీ. ఆచార్యుల వారు ఆద్యంతమూ రామలక్ష్మణుల కూడా ఉండి దర్శించిన విధంగా అభివర్ణించారు. వారు ధన్యులు. మీరు ధన్యులు. మేము కూడా ధన్యులమయాము.

    రిప్లయితొలగించండి