26, ఏప్రిల్ 2012, గురువారం

పద్య రచన - 8


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

10 కామెంట్‌లు:

  1. ప్రకృతి సౌందర్యము

    అలరుచున్నది ధాత్రి యతిమనోహరముగా
    సుందర వృక్షముల్ శోభ గూర్ప
    నిర్మల జలముతో నిండి కన్నులవిందు
    నై యొప్పుచుండె జలాశయమ్ము
    వినువీధిలో నున్న ఘన ఘనాఘన పంక్తి
    విష్ణు దర్శనము గావించుచుండె
    ఆహ్లాదకరముగా నలరుచుండి ప్రకృతి
    హృదయాల దోచుచున్నది బళారె
    హర్షమును గూర్చుచుండెను కర్షకులకు
    నూహలం దేల్చుచున్నది యువతనెల్ల
    సాధు జనులకు సకలమున్ స్వామిమయము
    గా నలరి కవుల హృదయాల కాంతి నింపె

    రిప్లయితొలగించండి
  2. పండిత నేమాని వారూ,
    అద్భుతమైన వర్ణనతో మా హృదయాలలో కాంతి నింపారు. ధన్యులం. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. కలమత్యద్భుత రీతి సాగును కదా జ్ఞానప్రకాశమ్ముతో
    లలితార్థాన్విత శబ్ద వైభవముతో ప్రాజ్ఞ ప్రమోదమ్ముగా
    విలసత్ భావ తరంగ సంచయము హృద్వీధిన్ బిసాళించగా
    బళిరా! శంకర! మిత్ర సత్తమ! నమోవాకమ్ములో ధీనిధీ!

    రిప్లయితొలగించండి
  4. గురుతుల్యులు శ్రీ నేమాని పండితులవారికి,
    ఆర్యా!
    మీ ప్రకృతి వర్ణన అత్యద్భుతంగా ఉంది. నమస్కారములు.

    రిప్లయితొలగించండి
  5. అయ్యా శ్రీ శంకరయ్య గారూ! & శ్రీ హరి మూర్తి గారూ!
    సంతోషము - శుభాశీస్సులు - మీ వర్ణనలకై ఎదురు చూచుచున్నాను.

    రిప్లయితొలగించండి
  6. సురుచిరమై కనుంగవకు సుందరమౌ ఘనమేఘపంక్తియున్,
    హరితమనోహరాకృతుల నద్భుతరీతి వెలుంగు వృక్షముల్,
    సరముల నిండియున్న విక స్వాదుజలంబులశేష(తీవ)మాధురీ
    భరితములౌచు చూచుటయె భాగ్యమనందగు దృశ్యరాజమున్.

    రిప్లయితొలగించండి
  7. నీ లిగగనంబు రసమయ నీ రదంబు
    సాధు నీ రంబు గల యట్టి సరసు యదియ
    పట్టు వృక్షంబు లెన్ని యొ చుట్టు నుండె
    చూ డ ముచ్చట గొలుపును చూ పరులకు

    రిప్లయితొలగించండి
  8. సంధ్య వెలుగులం దమరె సౌరు లెన్నొ
    నీలి గగనంపు సొగసుల మేలి ముసుగు
    గంగ సిందూర లేలేత రంగు తరులు
    కవుల హృదయాలు ముదమంది కావ్య మలర

    రిప్లయితొలగించండి
  9. అతిమనోహర మాదృశ్య మపరసంధ్య
    గాఢ నీలనీరద పంక్తి క్రమ్ముకొనగ
    సుందరసరోవర తీరశోభమీర
    అరుణవర్ణ పర్ణమ్ముల తరుల జూడ
    శిశిరమని తోచె పాశ్చాత్య సీమ యందు.

    రిప్లయితొలగించండి
  10. సత్యనారాయణ మూర్తి గారూ,
    ‘మాధురీ భరితమునై పఠించుటయె భాగ్యమనందగు పద్యరాజమున్’ రచించి అందరికీ ఆనందాన్ని కలిగించారు. ధన్యవాదాలు.
    *
    కమనీయం గారూ,
    మీ పద్యం ‘చదువ ముచ్చట గొలుపును చదువరులకు’. చాలా బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    కవుల హృదయాలకు ముదమును కూర్చే సుందరదృశ్యాన్ని వర్ణించారు. బాగుంది. అభినందనలు.
    మొదటి పాదంలో ‘వెలుగులం దమరెను’ అంటే గణదోషం తొలగిపోతుంది.
    *
    ఆ దృశ్యం పాశ్చాత్యసీమకు చెందినదని గుర్తించిన మీ సునిశిత పరిశీలనకు జోహార్లు. సుందరమైన వర్ణన. అభినందనలు.

    రిప్లయితొలగించండి