27, ఏప్రిల్ 2012, శుక్రవారం

శ్రీ గణేశ స్తుతి


శ్రీ గణేశ స్తుతి

జయ గణేశ! శంకరాత్మజాత! విఘ్ననాశకా!
భయవిదార!యఘవిదూర! భాగ్యదాయకా! ప్రభో(ప్రభూ)
జయము సిరులు యశములొసగి సత్వమందజేసి నీ
దయను జూపి కావు మేకదంత! నీకు సన్నుతుల్.


భవుని ముద్దుబిడ్డవయ్య, భాగ్యమందజేయుమా,
శివశివా! యనంగ మాకు సిద్ధులన్ని గూర్చుమా,
భవభవా! యటంచు గొల్చు భక్తజనుల బ్రోవుమా
శివకుమార! నిన్ను జేరి శిరసు వంచి మ్రొక్కెదన్.


ఏకదంత! విఘ్నరాజ! యిభముఖా! శుభంకరా!
నీకనేక నతులొనర్తు నిత్య మెల్లవేళలం
దేకవింశతి దళ పూజ లేకనిష్ఠ చవితికిన్
లోకరక్షకా! సమస్తలోకనాయకా! విభూ!


ఇభముఖంబు, వక్రతుండ మేకదంత మాదటన్
శుభదనాగయజ్ఞసూత్ర! శూర్పకర్ణయుగ్మమున్
విభవమొసగు సుముఖముద్ర విస్తృతోదరంబులే
యభయమందజేసి గాచు నఖిలభక్తకోటులన్.


ధనములేల? సుఖములేల? ధరణినేలు శక్తులున్
ఘనతయేల? హయములేల? కరులవేల? గణపతీ!
జనులకింక నీపదాంబుజాత దివ్యపూజలే
మునులకైన, ఘనులకైన ముక్తినొసగు మార్గముల్.


హరి వేంకట సత్యనారాయణ మూర్తి,
జవహర్ నవోదయ విద్యాలయము,
పాబ్రా, హిసార్ జిల్లా, హర్యానా.

5 కామెంట్‌లు:

 1. శ్రీ సరస్వత్యై నమః:
  అయ్యా శ్రీ మూర్తి గారూ: శుభాభినందనలు.
  మీ పద్యములు చదివేను. మీ ప్రయత్నము బాగున్నది. ఉత్సాహముతో వ్రాసేరు. అక్కడక్కడ మార్పులు చేయాలి.
  (1) "అనేటి" ప్రయోగము బాగులేదు. వ్యావహారికము. భవ భవా యటంచు గొల్చు అని మార్చండి.
  (2) ఏక వింశ పత్ర పూజ అన్నారు: ఏకవింశతి అంటే 21 అని అర్థము. అందుచేత ఏకవింశతి దళ పూజ అంటే బాగుంటుందేమో.
  (3) శుభద నాగ యజ్ఞ సూత్ర అన్నారు. దానిని సంబోధనగ చేయండి. లేదంటే శుభద యజ్ఞ సూత్ర వరము అని మార్చండి.
  (4) 5వ పద్యము 3వ పాదములో ప్రాసను మర్చిపోయేరు.
  శుభం భూయాత్. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 2. గురుతుల్యులు శ్రీ నేమాని వారికి,
  ఆర్యా!
  నమస్కారములు. మీసూచనలు నాకు శిరోధార్యములు. అమిత వాత్సల్యంతో మీరు సదా సూచనలిస్తూ సవరణలు చేస్తున్నందుకు సర్వథా, సర్వదా కృతజ్ఞుడను.
  మీరు సూచించినట్లుగనే
  "భవభవా యటంచు గొల్చు" అని, "ఏకవింశతిదళపూజ" అని,శుభదనాగయజ్ఞసూత్ర అనుదానిని సంబోధనగాను" సవరిస్తూ,
  5 వ పద్యం రెండు, మూడు పాదాలను
  "జనులకింక నీపదాంబుజాత దివ్యపూజలే
  మునులకైన, ఘనులకైన ముక్తినొసగు మార్గముల్" అనీ మారుస్తూ
  మీకు మరోసారి భక్తిపూర్వక నమస్కారములు, ధన్యవాదములు సమర్పించుకుంటున్నాను.

  రిప్లయితొలగించండి
 3. పండిత నేమాని వారూ,
  సత్యనారాయణ మూర్తి గారూ,
  మీ మీ సూచనల ననుసరించి పాఠసవరణ చేసాను.

  రిప్లయితొలగించండి