18, ఏప్రిల్ 2012, బుధవారం

సమస్యాపూరణం - 681 (హనుమంతుని వేడుకొనిన)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

హనుమంతుని వేడుకొనిన నాయువుఁ దీయున్.

ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

21 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !

    01)
    _____________________________________________


    కనలేదీ వింత కబురు
    హనుమంతుని వేడుకొనిన - నాయువు దీయున్ !
    వనచరుడౌ పవన సుతుని
    హనుమంతుని వేడుకొనిన - నాయువు పెంచున్ !

    _____________________________________________

    రిప్లయితొలగించండి
  2. పెనుపొందజేయు నెంతయు
    హనుమంతుని వేడుకొనిన నాయువు, దీయున్
    మనమున గల భ్రమలెల్లను,
    మనమలరగజేయు నతని మంత్రజపమ్ముల్.

    రిప్లయితొలగించండి
  3. 1.
    అనయము సుఖదంబౌనిక
    హనుమంతుని వేడుకొనిన నాయువు, దీయున్
    మనమునగల వెతలన్నియు
    ఘనయశములు గల్గునింక కైవల్యంబున్.

    2.
    కనగలము సద్యశంబులు
    హనుమంతుని వేడుకొనిన, నాయువు దీయున్
    ఘనతకు చేటొనరించును
    మనకర్మలె, మానకున్న మహిదుర్బుద్ధుల్.

    రిప్లయితొలగించండి
  4. అనుభవితవైరినివహకృ
    తనితాంతప్రత్యనీకదశశతపరిభూ
    తినివారణమంత్రపరులు
    హనుమంతుని వేడుకొనిన నాయువుఁ దీయున్.

    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  5. సునిశిత వాక్సుద్ధికలుగు
    హనుమంతుని వేడుకొనిన, నాయువు దీయున్
    యినసుతుడనివార్యముగా
    జనపాపచయమ్ములన్ని సంపూర్ణమవన్.

    రిప్లయితొలగించండి
  6. విను ముర ! సర్వము నిచ్చును
    హనుమంతుని వేడు కొనిన , నాయువు తీ యున్
    ననవరత రామ దూషణ
    విని నంతనె నోట కరచి వేటులు వేచీ .

    రిప్లయితొలగించండి
  7. వినరో సత్యము భక్తులు
    హనుమంతునివేడుకొనిన, నాయువు తీయున్
    దునిమిదునిమిదుష్టాదుల
    మనకునొసగిధైర్యస్థైర్యబలముల ప్రీతిన్

    రిప్లయితొలగించండి
  8. కనుమీ వింతలు జగతిని
    హనుమంతుని వేడుకొనిన నాయువు దీయున్ !
    వినిపించు నిజము కాదని
    జనులంత నమ్మి కొలిచిన జయమే కలుగున్ !

    రిప్లయితొలగించండి
  9. ఏల్చూరి మురళీధరరావుగారి "అనుభవితవైరినివహకృతనితాంతప్రత్యనీకదశశతపరిభూతినివారణమంత్రపరులు హనుమంతుని వేడుకొనిన నాయువుఁ దీయున్. " పద్యంలో సమస్యాపాదం తక్క పైన అంతా యేకసమాసం. భలేగా ఉంది. మంచి నారికేళపాకంలో ఉన్న పద్యం. పగలగొట్టి చూద్ధాం.

    నితాంతము అంటే చాలా అధికమైన అని, పరిభూతి అంటే పరాభవం అనీ అర్థం. అలాగే అనీకం అంటే సైన్యం అనీ ప్రత్యనీకం అంటే విరోధిసైన్యం అనీ అర్థం. వైరినివహం అంటే శత్రు సమూహం. వైరినివహకృత అంటే శత్రువుల సమూహం చేత చేయబడిన అని అర్థం.

    దీనిని బట్టి కిట్టని వాళ్ళు శత్రువులకు చేసిన పరాభవాలను తిప్పికొట్టే మంత్రానుష్టానం దండిగా ఉన్న వాళ్ళు హనుమంతుని వేడుకొన్నట్లయితే ఆయన ఆ అనుష్టానపరుల శ్రేయస్సు కొరకు వాళ్ళ శత్రువుల ఆయుస్సును తీసివేస్తాడూ అని అర్థం. హమ్మయ్య సరిగ్గానే వచ్చిందనుకుంటాను. కవిగారే వివరించాలింక.

    రిప్లయితొలగించండి
  10. శ్రీ గురువులకు ప్రణామములు. పుత్త్రవివాహోత్సవపులకితగాత్రులైన శ్రీ కంది శంకరయ్య గారికి అభినందన పూర్వక అభివాదనం.

    ఈనాటి సంక్లిష్టమైన సమస్యను చూసి కొన్ని చర్చనీయాంశాలను చర్చించా లనిపించింది. పెద్దలందరూ తమతమ భావాలను వ్యక్తంచేసి ఏకాభిప్రాయానికి రాగలిగితే బాగుంటుంది.

    మొదటి విషయం: సమస్య అంటే – సాధారణంగా చతుర్థపాదపరిపూర్తి అని మాత్రమే ఉద్దిష్టార్థం. సమస్యను మొదటి లేదా రెండవ పాదంగానో మూడవ పాదంగానో మార్చుకొంటే – అవాంతరవాక్యకల్పనకు, సరికొత్త అన్వయానికి అవకాశం ఏర్పడి – సగం సమస్య అక్కడే పరిష్కృత మవుతున్నది.

    ఫలితార్థం - పృచ్ఛకుని ప్రత్యేకమైన అనుమతి లేకపోతే తప్ప సమస్య యొక్క చతుర్థపాదస్థానాన్ని మార్చకూడదు.

    సమస్య యొక్క పాదస్థానాన్ని మార్చితే – అది పద్యరచనాభ్యాసమే కాని; సమస్యాపూరణ ప్రయత్నం కాదు.

    అవధానాలలో సైతం నాల్గవ పాదాన్ని ఇవ్వటమే జరుగుతుంది. ఎక్కడో – కేవలం ఒక వికల్పంగా తప్ప – అవధాను లెవరూ పాదస్థానాన్ని మార్చటాన్ని సామాన్యంగా చూడము. ప్రాక్తన సంస్కృత ప్రాకృత హైందవ - జైనకవులు సైతం సమస్యాపూరణ కావించినపుడు పృచ్ఛకుని అభీష్టానుసారం మాత్రమే పాదనియమాన్ని పాటించడం కన్పిస్తుంది.

    అందువల్ల సమస్యను చతుర్థపాదపరిపూర్తి గానే చేయటం సమంజసం. అందువల్ల పూరణలలో వైవిధ్యం కొఱవడినట్లు కనిపించినా – అదే సరైన పద్ధతి.

    ఛందఃపరివర్తన జరిగి – సమస్యను వేఱొక ఛందస్సులోనికి మార్చినా సమస్య చతుర్థపాదగతం గానే ఉండాలి.

    సమస్య తరువాత అక్షరాలను చేర్చటానికి పృచ్ఛకుని అనుమతి అవసరం. ఆ అనుమతి - ప్రాఙ్నియమితం కాకపోతే సమస్య తరువాత అక్షరాలను చేర్చకూడదు.

    రెండవ విషయం: ఈనాటి సమస్యలో “ఆయువు” తర్వాత అరసున్న ఉండటం వల్ల “ఆయువున్నూ తీరుతుంది” అనే సముచ్చయార్థవిశిష్టమైన రూపం ఏర్పడింది. ఆ అరసున్నను తొలగించి, సముద్దిష్టమైన అర్థాన్ని మార్చటం అంగీకర్తవ్యం కాదు. ఒక్క శ్లేషలో మాత్రమే అటువంటి తొలగింపు సాధ్యం. సమస్యలో అరసున్న ఉన్నపుడల్లా తత్తత్సందర్భాలలో ఏర్పడే విశిష్టార్థాన్ని గుర్తుంచుకొని పూరణను తదుచితంగా చేయాలి.

    ఇవి పెద్దలు నిర్ణయింపవలసిన అంశాలు.

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  11. క్షమించాలి. పైని పేర్కొన్న నేటి సమస్య ఉదాహరణలో “ఆయువుఁ దీఱున్” కాదు – “ఆయువుఁ దీయున్” – “ఆయువున్నూ తీస్తాడు” అని సముచ్చయార్థక విశిష్టంగా ఉండాలి.

    రిప్లయితొలగించండి
  12. మిత్రులారా!
    డా. ఏల్చూరి మురళీధర రావు గారు కొన్ని నియమములను సూచించేరు. ప్రసిద్ధులైన అవధానులకు అయితే ఎన్ని నియమములయినా ఒక లెక్క లోకి రావు. మరి మన అందరి సంగతి ఏమిటి? మనము వినోదము కొరకు కాలక్షేపము కొరకు చిన్న చిన్న ప్రక్రియలను అభ్యాసము చేస్తున్నాము కానీ పాండిత్య ప్రకర్షను ప్రదర్శించ గలిగిన సమర్థులము కాము. అందుచేత వారి సూచనలను గుర్తు పెట్టుకొందాము కానీ మన పూర్వ పద్ధతులయిన వెసులుబాటులతోనే మన అభ్యాసమును కొనసాగించుదాము. లేని పక్షములో నా ఉద్దేశములో మనలో ఏ ఒక్కరమేనియు ఏ సమస్యను గాని ఇతర ప్రక్రియను గానీ అంతో ఇంతో అందముగా పూరించలేము. ఏదైన మన గురువు గారు శ్రీ శంకరయ్య గారి సలహా కూడా పొందుదాము.

    అయ్యా! డా. ఏల్చూరి వారూ! ఇలా నేను అంటున్నానని మరోలా భావించకండి. నా అనుభవము నాది. నేను చేసిన 25 అష్టావధానములలో ఏ ఒక్క వేదికపైని కూడా ఎవ్వరూ ఈ రీతిగా అభ్యంతరము చెప్ప లేదు.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. మాన్యులు శ్రీ శ్యామలరావు గారికి
    నమస్సులతో,

    “పగలగొట్టి చూద్దాం” అన్నారు కాబట్టి – నారికేళఫలం, తత్ఫలరసం ప్రసక్తికి వచ్చాయి కాని; మీరు నారికేళపాకాన్ని ప్రస్తావింపగానే - కేతన దశకుమార చరిత్ర (9-31)లో “బీరంబును నురమును వి, స్తారి యగు నారికేళజాతికి నెందున్” అని చేసిన నారికేళ జాతి వర్ణన గుర్తుకు వచ్చింది. ఆ నారికేళానికి ఈకలు తీసి పాకానికి పెడితే బహురుచికరంగా ఉంటుందట కాని, మీ వంటి ప్రౌఢవిద్వత్కవులు నా పద్యానికి ఈకలు (అభిహితార్థాలు) తీస్తే – శలాకాపరీక్షకు, రుచికి [“కావ్యశోభాయామ్” – భామహాలంకారానికి ఉద్భటుని వ్యాఖ్య], రౌచికతకు [“మృదుమధురోక్తులు వెదకి కావ్యంబెల్ల రచియించుఁ బదపడి రౌచికుండు” అప్పకవీయం (1-41)] నిలుస్తుందా? అని భయం.

    ఒక్కటే ప్రత్యామ్నాయం: ప్రత్యనీకమంటే అవరోధము, విఘ్నము అని. “జిఘాంసుప్రత్యనీకినః, అసుహృత్ప్రత్యవస్థాతృ ప్రతిపక్షవిరోధినః” అని అమరకోశంలో అధికపాఠం. మీరు చూచే ఉంటారు. “ప్రత్యనీక దశశత పరిభూ, తినివారణమంత్రపరులు” మీరన్నట్లే. విఘ్ననివారణమే గాక వైరిసంహారమూ జరుగుతుందని.

    మీ సరసతకు, సహృదయానికి, సమ్మతికి, సాధుచింతనకు, సౌజన్యార్థానికి ధన్యవాదాలు.

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  14. శ్రీ గురువులకు
    విహితానేక ప్రణామములతో,

    మీ ఆదేశం, నిర్ణయం నాకెన్నడూ శిరోధార్యమే. నేనూ పద్యరచనను అభ్యాసం చేస్తూ అడుగులు తడబడుతున్న విద్యార్థినే. అందుచేత అన్యధాకృతభావనకు అవకాశం లేదు. ఈ అంశాన్ని చర్చకు తెచ్చినందుకు మీరే నన్ను మన్నించాలి.

    సర్వఫలసిద్ధిదాయకమైన మీ ఆశీర్వాదానికి నోచుకోగలగటం ఈ అభ్యాసం వల్లనే నాకు సమకూడింది. అది నా అదృష్టం.

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  15. శ్రీ సరస్వత్యై నమః:

    మిత్రులారా!
    జగద్గురువులు శ్రీమఛ్ఛంకర భగవత్పాదుల వారి రచన కూడా ఎలాగ ఉండాలీ అంటే ఈ క్రింది శ్లోకమును ఉదహరించేరు శివానందలహరిలో.

    "సర్వాలంకారయుక్తాం సరళపదయుతాం సాధు వృత్తాం సువర్ణాం
    సద్భిస్సంస్తూయమానాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యాం
    ఉద్యద్భూషా విశేషా ముపగతవినయాం ద్యోతమానార్థరేఖాం
    కళ్యాణీం.... .. .. " అని

    సరళమైన పదజాలముతో వ్రాయబడిన రచనలు అందరికీ సుబోధకముగా ఉంటాయి. అదే కదా హాయి. పాండిత్య ప్రకర్షను ప్రకటిస్తూ చేసే ప్రక్రియలు ఒకటొ రెండో ఎప్పుడైన పరవాలేదు గాని -- అధికమైనా అనర్థమే. చిత్రకవిత్వ, గర్భ కవిత్వ, బంధ కవిత్వములు కూడా ఈ కోవలోకే వస్తాయి. అందుకే చిత్రకవిత్వాదులకి అంతగ ఆదరణ లేదు. పండితులకి కూడా సులభముగా అర్థముకాని రీతిలో పద్యము వ్రాస్తే అది జన సామాన్యమునకు ఎంత ఉపయోగపడుతుంది?

    అయినా ఎవరి ఆనందము వారిది కదా. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. వినుమా మనమన మనమున
    కనుపించక నున్న భయము కదలని దయ్యా
    లను పట్టి వేటు వేయును
    హనుమంతుని వేడుకొనిన నాయువుఁ దీయున్.

    రిప్లయితొలగించండి
  17. కొద్ది రోజులుగా ఈ బ్లాగు లోని సమస్యలూ, పూరణలు చదువుతూ ఉండిపోవటం తప్పితే సమస్య పూరించేందుకు సాహసించలేకపోతున్నాను. చాలా రోజుల తరువాత ఈ ప్రయత్నం చేస్తున్నాను. వడల్లో ఉప్పు తక్కువైతే, సర్దుకు పోవలసిందిగా మనవి.

    1) కనుపించని దోషములను
    దునుమాడెడు శుభకార్యము తమ బాధ్యతగా
    యనవరతము చేయువారలు
    హనుమంతుని వేడుకొనిన నాయువు దీయున్.
    (దోషములను సంహరించే ప్రయత్నము చేయువారి దోషములను హనుమంతుడు నాయువు దీయుననే భావము తెప్పించే ప్రయత్నము)

    2) జన మానస వైరిజనుల
    దునుమాడుట తమపనిగా దలచిన వారున్
    మనమున పరిపరి విధముల
    హనుమంతుని వేడుకొనిన నాయువు దీయున్.
    (జనులకు, వారి మనోభావములకు వ్యతిరేకముగా పనిచేయువారిని నివారించాలని అనుకొని,పని చేయువారికి హనుమంతుడు అండగా నుంటాడని చెప్పే ప్రయత్నం)

    రిప్లయితొలగించండి
  18. మినుకు మినుకనుచు నుండెను
    ఘనమగు కాంగ్రేసు వెలుగు కాట్లాటలతో
    వెనకయు ముందును తెలియని
    హనుమంతుని వేడుకొనిన నాయువుఁ దీయున్!!

    రిప్లయితొలగించండి
  19. వినుమా! యరిషడ్వర్గము
    మనసును వేధించి మెండు మలినము జేయన్
    కనుగొని జయింప వీనిని,
    హనుమంతుని వేడుకొనిన, నాయువుఁ దీయున్

    రిప్లయితొలగించండి
  20. మనమున కలిగిన వ్యథలను
    కనుటకు వినుటకును లేక ఘనులగు వైద్యుల్
    దినదినము క్రుంగుచుండగ
    హనుమంతుని వేడుకొనిన నాయువుఁ దీయున్

    రిప్లయితొలగించండి