27, ఏప్రిల్ 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 687 (పాదరసమన్న తీయని)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

పాదరసమన్న తీయని పానకమ్ము!

ఈ సమస్యను పంపిన
గుండా సహదేవుడు గారికి
ధన్యవాదాలు.

24 కామెంట్‌లు:

 1. సకల కళ్యాణగుణమయుల్ సర్వమంగ
  ళామహేశ్వరు లవ్వారి లలిత పద్మ
  పాదరసమన్న తీయని పానకమ్ము
  నైన మించెడు భవ్య కృపామృతమ్ము

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !

  01)
  ___________________________________


  ధవళ వర్ణాన లోహాల - తనరు నదియె
  పాదరసమన్న ! తీయని పానకమ్ము
  పంచదారను పవనము - ముంచినపుడు
  మంచి బెల్లము నీటిలో - నుంచి నపుడు !
  ___________________________________
  పవనము = నీరు

  రిప్లయితొలగించండి
 3. రామచంద్రుండు సదయుండు రాఘవుండు,
  సకల సద్గుణసంపన్న జనకసుతయు
  కరుణ నెప్పుడు జగముల గాచు వారి
  పాదరసమన్న తీయని పానకమ్ము.

  రిప్లయితొలగించండి
 4. కవులు పండితులకు నమస్కారములు. "లలిత పద్మ పాదాలు" అనాలా లేక "లలిత పాద పద్మాలు" అనాలా అని దయ చేసి సందేహం తీర్చవలెనని ప్రార్థన. భవదీయుడు కిశోర్ కుమార్.

  రిప్లయితొలగించండి
 5. శ్రీ సరస్వత్యై నమః:
  రెండు విధముల ప్రయోగములు సాధువులే.
  (1) పద్మముల వంటి పాదములు
  (2) పాదములు అనబడే పద్మములు
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 6. ఆంజనేయునికిష్టమౌ యాకు పూజ
  వడల మాల నివేదించి భక్తి తోడ
  పాదరసమును సేవించ బరగు సుఖము
  'పాదరసమన్న తీయని పానకమ్ము'

  రిప్లయితొలగించండి
 7. ‘పద్మముల వంటి పాదములు’ అంటే ఉపమా పూర్వపద కర్మధారయ సమాసం.
  ‘పాదములు అనబడే పద్మములు" అంటే రూపక సమాసం.

  రిప్లయితొలగించండి
 8. వసంత కిశోర్ గారూ,
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  కందుల వరప్రసాద్ గారూ,
  మిస్సన్న గారూ,
  ఇంత వరకు మీరు ‘శంకరాభరణం’లో ప్రకటించవలసిందిగా పంపిన సమస్యలను ఒక చోట చేర్చి ఒక్కొక్కరి పేర విడివిడిగా ఫైళ్ళు తయారు చేసి సేవ్ చేసి పెట్టాను. మీ మీ మెయిల్ చిరునామాలకు పరిశీలనార్థం పంపాను. ఒకసారి మీ మెయిల్స్ చెక్ చేసుకొని మీరు పంపిన సమస్యలలో ఏమైనా తప్పిపోయాయా గమనించి, అవసరమైన సవరణలు చేసి పంపవలసిందిగా మనవి.
  *
  చంద్రశేఖర్ గారూ,
  మీరు పంపిన సమస్యలు కూడా ఉన్నాయి.

  రిప్లయితొలగించండి
 9. బంధ రహితుని భక్తుల బాంధ వుణ్ణి
  ఉబ్బు లింగని గరళము నోర్చు వాని
  బంధ ములు దొల గగజేయు భవుని మృదుల
  పాద రస మన్న తీ యని పాన కంబు

  రిప్లయితొలగించండి
 10. మంగళకరుడైనట్టి రమాధవుండు
  వెలసియున్న దేవళమున తులసిపూజ
  చేసి పిమ్మట పాదాభిషేకమందు,
  పాదరసమన్న తీయని పానకమ్ము.

  రిప్లయితొలగించండి
 11. రామ మూర్తికే తీపైన నామ మేది ?
  'దాశరధి' యన్న నామమ్మె! తనివి దీర్చు!
  అట్టి 'దాశరధీ శతకంపు పద్య
  పాద' రసమన్న తీయని పాన కమ్ము!

  రిప్లయితొలగించండి
 12. క్షమించాలి పద్మపాదుడు అన్నప్పుడు పద్మములు పాదమందు గలవాడు అని బహువ్రీహి వస్తుంది కదా- కిశోర్ కుమార్

  రిప్లయితొలగించండి
 13. అయ్యా! శ్రీ సహదేవుడు గారూ!
  మీ పద్యమును చదివేను. బాగున్నది భావము. 3వ పాదములో యతి సరిపోలేదు. "అట్టి దాశరథీ శతకంపు పద్య" .. పాదమును సరిజేయండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 14. అజ్ఞాత గారికి మా వివరణతో తృప్తి కలగలేదు. అన్నీ తెలిసిన వారికి చెప్పగలము - ఏమీ తెలియని వారికి చెప్పగలము. అర్ధ జ్ఞానము గలవారి సందేహాలను బ్రహ్మదేవుడు కూడా తీర్చలేడు అని పెద్దలు చెపుతారు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 15. భక్తితత్వమ్ములనుజెప్పు భాగవతము
  రచనజేసిన పోతన్నరాజు నుడువు
  భవ్య సుందర పదజాల భక్తి పద్య
  పాదరసమన్న తీయని పానకమ్ము.

  రిప్లయితొలగించండి
 16. ‘అర్థవత్ సమాసః’ అన్నారు. మనం చెప్పుకునే విగ్రహవాక్యాన్ని బట్టి సమాసాన్ని పేర్కొనడం జరుగుతుంది.
  మీరు చక్రహస్తుడు, శూలపాణి మొదలైన పదాలను దృష్టిలో పెట్టుకొని అన్నారు.
  ‘పద్మపాదుడు’ అన్నప్పుడు ‘పద్మములవంటి పాదములు గలవాడు - పద్మములు పాదములందు గలవాడు’ అనీ చెప్పుకోవచ్చు.

  రిప్లయితొలగించండి
 17. గురుభ్యోనమః
  పద్యపాదానికి సవరణ:
  కాన'దాశరధీశతకంపు పద్య

  రిప్లయితొలగించండి
 18. భావసంపద గగన బంభరమువోలె
  భావితరములకు నిచ్చు ఈ బ్లాగునందు
  తేనెలూరించు కమ్మని తెలుగు పద్య
  పాదరసమన్న తీయని పానకంబు.

  రిప్లయితొలగించండి
 19. సోము నభిషేక మొనరించు సోమ ధార
  బ్రహ్మ కడిగిన పాదాల భద్ర జలము
  పరవ శమ్మున పులకించు భక్తి పద్య
  పాద రసమన్న తీయని పాన కమ్ము !

  రిప్లయితొలగించండి
 20. పండిత నేమాని వారూ,
  పార్వతీ పరమేశ్వరుల లలిత పద్మ పాదరస ప్రాశస్త్యాన్ని వివరించిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  మంచి విరుపుతో తీయని పానకం వంటి పూరణ నిచ్చారు. అభినందనలు.
  *
  సత్యనారాయణ మూర్తి గారూ,
  సీతారాముల పాదరస ప్రభావాన్ని వర్ణించిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  హనుమంతుని పాదరసాన్ని ఆశ్రయించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  చక్కని పూరణ. అభినందనలు.
  *
  కమనీయం గారూ,
  అభిషేక జల పవిత్రతను వెల్లడించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  వైవిధ్యమైన పూరణ మీది. దాశరథీశతక పద్యపాదాలు రసనిష్పన్నాలే! మధురమైన పూరణ. అభినందనలు.
  మూడవ పాదాన్ని ఇలా సవరిద్దాం. ‘అట్టి దాశరథీ శతకాత్త పాద...’ (ఆత్త = పొందబడిన)
  మీ సవరణను తరువాత చూసాను. బాగుంది.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  పోతన రసబంధురమైన పద్యపాదాలు పానకాలే. చక్కని పూరణ. అభినందనలు.
  *
  వామన కుమార్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  రెండవ పాదంలో గణదోషం. ‘తరముల కిచ్చు’ అందాం.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 21. గురువు గారికి ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 22. శ్రీగురుభ్యోనమ:

  కవిమిత్రులకు వందనములు.

  సేద దీరగ వచ్చిన పేదవాని
  బడలికనుదీర్చు మూలము పానుపగుచు
  పాదపమ్ముల కాచిన ఫలములందు
  పాదరసమన్న తీయని పానకమ్ము!

  రిప్లయితొలగించండి
 23. శ్రీపతి శాస్త్రి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి