13, ఏప్రిల్ 2012, శుక్రవారం

కళ్యాణ రాఘవము - 12

కళ్యాణ రాఘవము - ౧౨
శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

సీ.
గురునాజ్ఞ జవదాఁటి చరియింపఁ డదియెట్టి

గహనమైనను దాఁటఁగలుగుఁగాని
వెన్నుసూపఁడు వైరివీరు లెందఱనైన
నసహాయశూరుఁడై యడఁచుఁగాని
పరుషత్వ మూనఁడు "పాహిమా" మనఁ జాలు
పగవానినేనిఁ గాపాడుఁగాని
తలఁపు మార్చుకొనండు తనదారి నరికట్టు
జలధినే నింకింపఁజాలుఁగాని
తే.గీ.
ధర్మమయమూర్తి లోకైకధన్వి పరమ
కారుణికుఁడును సత్యసంకల్పుఁ డాతఁ
డట్టి రామున కనురూప యవనిజాత
లక్ష్మణున కట్లె మీ యూర్మిళాకుమారి. (163)

మ.
కల దింకొక్కటి చిన్నమాట - జనకక్ష్మాపాల! మీ తమ్ముఁ గూఁ
తుల నయ్యిర్వురు కన్నెలన్ భరతశత్రుఘ్నుల్ గ్రహింపన్ వలెన్
ఫలియింపన్ వలె సృష్టిశిల్పకళసౌభాగ్యంబు లీనాఁడు; మీ
కులముల్ చల్లఁగ నల్లుకోవలెను దిక్కుల్ నాల్గు పెంపెక్కగన్. (164)


శా.
మీమీ బిడ్డల యీడుజోడుగల నెమ్మే నందచందమ్ములున్
మీమీ వంశవిశుద్ధిగౌరవములున్, మీ దీటు దీటౌ గుణ
స్తోమంబు ల్బహుభోగభాగ్యములు మీ శుద్ధాంతసిద్ధాంతముల్
ప్రేమోదంతములుం బయింబయిగ నన్ బ్రేరేచె నిట్లాడఁగన్. (165)


ఉ.
బందుల వేడ్క మాత్రమె వివాహము గా, దెపుడేని ప్రేమమే
యందుఁ బ్రధానమై బ్రదిమి నంతయుఁ బండువు సేయఁజాలు, తీ
యందన మూటలూరఁగఁ దనంతన యయ్యది పొంగుఁగాని యే
బందమొ వైచి యీడ్చికొనివచ్చిన నిల్కడ గాంచ దింతయున్. (166)


చం.
స్థిరతరపూర్వవాసనలచేఁ బ్రణయ మ్మది విప్పునండ్రు; గు
ర్తెఱుఁగఁగ లేరు తజ్జనకహేతువువ్ గోవిదులేని, నా మహ
త్తరమగు ప్రేమసార మెడఁదల్ గరఁగించి లగించినట్టి యాం
తరదృఢబంధ మూడ్చఁగఁ బితామహుఁ డేని నశక్తుఁ డెమ్మెయిన్. (167)


తే.గీ.
ఆ మృదుప్రేమ మధురమౌగ్ధ్యంపుమాటు
నం బొటమరిల్లి నాల్గుజంటల మనోహ
రాంగకములం దెవో క్రొవ్వెలుంగు పొంగు
లొలుకఁ బోయుచున్నది తృణజ్యోతి పోల్కి. (168)


చం.
అల నలుజంటలం దుదితమౌ ప్రణయమ్మునఁ గొంతసాక్షులై
వెలయును యజ్ఞవాటవనవీధుల పూఁబొదరిండ్ల చేరువల్
చెలియల చాటుమాటులును చెన్నగు సౌధగవాక్షమాలలున్
గలిసియు నిండుగాఁ గలయకం గళలూరు పరస్పరాక్షులున్. (169)


తే.గీ.
ఇంత కొకమాట జనక! మీ యింటిలోనఁ
గలవయోరూపశీలానుగుణమనోజ్ఞ
దంపతుల సంఘటించు కృత్యంబునందు
మదనధనువుకంటెను మదనవైరి
ధనువ మిక్కిలి పేరు కెక్కెను గదోయి!" (170)


చం.
అని ముసినవ్వులొల్కఁ గుశికాత్మజుఁడో విరమించె; బాగు బా
గని తలయూచె దేశికుఁడు; నౌనవు నం చనె వృద్ధరాజు; త
మ్మునిఁ గొనగంటఁ జూచుచుఁ బ్రమోదము పొంగఁ "దథా" స్తటంచుఁ బ
ల్కెను జనకుండు; సభ్యు లదికించిరి శీఘ్రశుభాదిశేషమున్. (171)


చం.
ఇరుకొలముల్ సమమ్ములని యేకగళంబున మీరె పల్కగాఁ
గొఱఁత యిఁ కేమి? బ్రహ్మఋషికుంజరులార! మహోత్సవక్రియల్
నెఱపుఁడు, మాశిరమ్ముల మణిస్రజముల్ భవదాజ్ఞ లంచుఁ దాఁ
గరములు మోడ్చె మైథిలుఁడు గాధికుమారు వసిష్ఠుఁ జూచుచున్. (172)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి