17, ఏప్రిల్ 2012, మంగళవారం

పద్య రచన - 5


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

18 కామెంట్‌లు:

  1. శరము చెలరేగి శ్రవణుని సంహరింప
    శబ్దభేదియె రాజుకు శాపమయ్యె,
    దశరథుండంత దు:ఖాగ్నితప్తుడగుచు
    వాని జేరెను జీవచ్ఛవంబువోలె.

    రిప్లయితొలగించండి
  2. విని శబ్దంబును సామజంబను భ్రమన్ వేవేగమే శబ్దభే
    ధిని నే వేసితి, నీ యమాయకునిపై, దేవా! మహాపాపినై
    తిని, యీ బాలుని చంపినాడననుచున్, ధీశక్తి గోల్పోయి, ని
    ల్చెను నిశ్చేతనుడట్లు పంక్తిరథుడా రేయిన్ విషాదమ్ముతో

    రిప్లయితొలగించండి
  3. మిత్రులారా!
    ఈనాటి ఈ చిత్రమును చూచి ఒక చిన్న ఖండికను వ్రాయవచ్చును. క్లుప్తముగా 10 - 12 పద్యములకు మించకుండా ఒక పద్య ఖండికను వ్రాయుటకు ప్రయత్నించండి. ఆదివారములోగ పంపితే బాగుంటుండి అని నా ఆకాంక్ష. శుభం భూయాత్. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  4. ఉ. కాలము చేయు వింతలను కన్గొన శక్యమె నీకు నాకు నిం
    కేల విచార మో యనఘ యీ జలపాత్రయొ యీ శరంబొ నన్
    తూలగ జేసెనో మరల తొల్లిటి జన్మల కర్మమీ గతిన్
    కాలెనొ యెవ్వడే మెరుగు కాగల కార్యము దైవ మెంచెనో.

    ఆ.వె. అనతి దూరమందె యతివృధ్ధులగు నాదు
    పితరు లధికదాహ వివశులగుచు
    నున్నవారు వారి కిన్ని నీళుల గొని
    పొమ్ము వేగ పుణ్యబుధ్ధి వగుచు

    కం. నీరంబులు త్రావించుమ
    మా రాతను తెలియబరచు మా యటు పిమ్మట నిన్
    వారలు మన్నించెదరో
    దారుణ శాపంబు లీయ దలతురొ యెరుగన్

    వ. అని శ్రవణుండు నుడువుటుడిగె.

    రిప్లయితొలగించండి
  5. సత్యనారాయణ మూర్తి గారూ,
    చక్కని శబ్దచిత్రాన్ని ఆవిష్కరించారు. బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    దశరథుని నిశ్చేష్టతా స్థితిని మనోహరంగా చిత్రించించారు. అభినందనలు.
    మీ సూచనకు ధన్యవాదాలు. శ్యామలీయం గారు పాటించారు కొంతవరకు.
    *
    శ్యామలీయం గారూ,
    మీరొక్కరే చిత్రాన్ని చక్కగా "పరిశీలించారు". చిత్రంలో శ్రవణుడు చేతితో సైగ చేస్తూ దశరథునితో మాట్లాడుతున్నట్టు ఉంది. మీ మూడు పద్యాలు ఆ విషయాన్ని చక్కగా వివరిస్తున్నాయి. పద్యాలు కూడా మధురంగా ఉన్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. శంకరయ్యగారికి పద్యాలు నచ్చినందుకు ధన్యవాదాలు. ఈ చిత్రం చాలా భావస్ఫోరకంగ ఉంది. నేమాని వారన్నట్లు ఒక ఖండికను చిన్నదో పెద్దదో వ్రాయవచ్చును తప్పకుండా. అయితే, నేను నా బుల్లిఖండికను వ్రాసినది మధ్యాహ్నం తేనీటి విరామంలో. సమయాభావం కారణంగా కొంచెం వేగంగా క్లుప్తంగా వ్రాయవలసి వచ్చింది.

    ఒక చిన్న చిక్కు ఉన్నది. దశరదశ్రవణకుమార సంవాడంగా వ్రాయవచ్చును కాని అది అందంగించదు. శ్రనణుడు సంవాదం జరిగేంత తడవు మాట్లాడగల స్థితిలో లేడు కాబట్టి అలా అన్నాను. పైగా శ్రనణుడు క్లుప్తంగానే మాట్లాడగలడు కదా. అందుకే రానురాను తక్కువ దైర్ఘ్యంతో మూడే పద్యాలు.

    సంహటనా వర్ణనా, మనో విశ్లేషణలూ వగైరా జతపరచి మరికొన్ని వ్రాయవచ్చును కాని ముందే మనవి చేసినట్లు సమయాభావంవలన అవేమీ వ్రాయలేదు.

    రిప్లయితొలగించండి
  7. కదలలేని ముసలి కన్నవారిని మోసి
    కావడిలో నుంచు కడవలట్లు,
    మార్గ మధ్యమ్ములో మంచినీళ్ళను గోర -
    అన్వేషణము సల్పి అడవియందు,
    కొలనులో పాత్రను జలముకై ముంచగా -
    మిథ్యామతిని యెంచి మృగమటంచు
    వేటాడు భూపతి వేటు వేసినయంత -
    ప్రాణమ్ము వీడు నా పట్టు గూడ

    తల్లి, దండ్రి దాహము దీర్ప తాను గోరి,
    ఇలను మాతాపితల సేవ కేది లేదు
    సాటియని చాటె శ్రవణు, డా చరిత మెరిగి
    భారతాదర్శ మహనీయ పథము గనుడు!

    రిప్లయితొలగించండి
  8. డా.ఆచార్య ఫణీంద్ర గారి మతంలో 'జలముకై' అన్నది సాధువే. నేనయితే జలముకై అనిగాక జలమునకై యనే ప్రయోగిస్తాను. లోగడ వారి 'జగద్ధితంబుకై' అన్న ప్రయోగం విషయకమై ఈ 'కు' v 'నకు' ప్రయోగోచితిని గురించి మాయిర్వురి మధ్య గతంలో కొంత చర్చ జరిగింది.

    వివరాలకు చూడండిః http://drphaneendra.blogspot.in/2012/02/blog-post_12.html

    రిప్లయితొలగించండి
  9. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    దశరథుడు :
    ______________________________________________


    హా ! విధి ! యేమి జేసితిని ? - హస్తని యెంచితి ! నెంత పాపమో
    ఈ విధి సంక్రమించె నిట ! - నే విధి తీరును పాప మీ యెడన్ ?
    త్రోవెది నాకు ? జూపుమయ - తూపుల గూల్చితి నిన్ను ! నమ్మవే !
    భూవరునైన నా వినతి - భూసుర చంద్రమ ! మత్పురాకృతిన్ !
    ______________________________________________

    శ్రవణకుమారుడు :

    ______________________________________________


    భూవర నీకు సేమ మగు ! - పుణ్యము దక్కును ! తల్లిదండ్రుల
    న్నావల నుంచి వచ్చితిని ! - యంభువు చేకొని వారికిచ్చినన్ !
    ఏ విధి నాకు నీ వలన - యీగతి గల్గెనొ యుగ్గడించుమా !
    ఆవట లేని వా రకట ! - యంధులు ! వారల నూరడింపుమా !
    ______________________________________________

    రిప్లయితొలగించండి
  10. శ్యామలీయం గారూ,
    మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను. అలవోకగా వ్రాసినా మీ పద్యాలు రసభావపుష్టి కలిగి ఉన్నాయి. ధన్యవాదాలు.
    *
    డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    బహుకాలానికి నా బ్లాగుపై దయ చూపించారు. భారతాదర్శ మహనీయ పథాన్ని చూపిన మీ పద్యం చాలా బాగుంది. ధన్యవాదాలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    దశరథ శ్రవణకుమారుల సంవాద రూపంగా మీ పద్యాలు బాగున్నాయి. అభినందనలు.
    "హస్తి + అని" అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. కనుక దానిని "హస్తిగ నెంచితి" అందాం.

    రిప్లయితొలగించండి
  11. ’శ్యామలీయం’ గారు!
    నా ’మతం’లోనే కాదు. ఆదికవి నన్నయ, కరుణశ్రీ, ఇంకా చాలా మంది ప్రాచీన, ఆధునిక మహాకవుల మతంలో కూడ అది సాధు ప్రయోగమే!
    వారిని మించిన సాధుత్వం నాకు అక్కర లేదు. నన్నయ గారి ప్రయోగం చూపాక కూడ వెటకారమయితే ఎలా సార్?
    ఏమయినా నా పద్యం చదువగానే మీలో పొంగిన రసజ్ఞతకు అభినందనలు!
    శంకరయ్య గారు!
    మీ అభిమానానికి ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  12. ఆచార్య ఫణీంద్రగారూ
    కేవలం తమ విధానాన్ని ప్రస్తావించానే కాని, వెటకారపు మాట కాదు. అటువంటి యుద్దేశ్యం నాకు లేదని మనవి. మీకు నొవ్వు కలిగించితే క్షంతవ్యుడను.

    రిప్లయితొలగించండి
  13. ఒక విలు కాని దెబ్బకు కూలిన తనువు
    పుత్ర శోకమున విలపించిన తల్లి దండ్రుల
    కన్నీరు ఒక తండ్రి కి కుమరుని ఎడబాటు

    మరొక విలుకాని దెబ్బకు నేలవాలిన సఖి
    వియోగమున విలపించిన ఒక పక్షి
    కన్నీరు ఒక వాల్మీకిని ఇచ్చి
    దేశ జనావళికి వినుడు వినుడీ గాధ నందించింది

    కారణముల వెదుక చేయు ప్రతి ఒక్క
    కార్యము,చుట్టూ ఉన్న వారి పై ప్రభావం
    కాన, మదిని మంచి తలచి
    జీవనమును సాగింపవె మనసా

    జిలేబి.

    రిప్లయితొలగించండి
  14. తప్పు నీదేమి లేదులే దైర్య మంది
    కడవ నీరంది వెంటనే కడకు బోయి
    దప్పి దీర్చుము నల్లదే తల్లి దండ్రి
    పొవు చుంటిని రారాజ పోయి రమ్ము.

    రిప్లయితొలగించండి
  15. దాహార్తు లైన పితరుల దప్పి దీర్చ
    జలము గొనిపోవు టకునీవు కొలను కరుగ
    హరిణ మనియెంఛి బ్రమసినే శరము విడచి
    పాప మొనరించి నేనింక శాప హతుడ

    రిప్లయితొలగించండి