14, ఏప్రిల్ 2012, శనివారం

కళ్యాణ రాఘవము - 13

కళ్యాణ రాఘవము - 13

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులుచం.
ఇది గద సుప్రభాతమన, నీ దెసలెల్ల బులుంగుఁదోరణుల్
పొదలు శుభప్రహారములు, భూతల మిద్ది పసిండినీటితో
ముదమొదవించున ట్లలికి పూసిన పెండిలియిల్లుగా నవా
భ్యుదయము గాంచి పొంగెఁ గులముఖ్యుఁ డహర్పతి వేవెలుంగులన్. (173)


తే.గీ.
అద్దిరా! తాన యిలుపెద్దయగుట లోక
బంధు వతఁడు సువర్ణశోభ లొలికించు
దీర్ఘకరపత్రికల నెల్లదెసలు కంపెఁ
బెండిలిపిలుపు వానిలో నుండెనేమొ. (174)


ఉ.
ఎచ్చటఁ జూచినన్ మిథిల యింపగుచున్నది పచ్చపచ్చఁగా
నచ్చపునిండుకల్మిఁ బొలుపారెడి పెండిలిపేరఁటాలునా
నెచ్చట విన్న మంగళమహీయము వాద్యరవమ్ము పొంగి వై
యచ్చరపాళిఁ బిల్వఁ జనునట్లు పయింబయి మిన్ను ముట్టెడిన్. (175)


కం.
పుర మెల్ల నొక్క యిల్లై
కరమరుదుగ సంభ్రమించెఁ గల్యాణాలం
కరణముల యజ్ఞశాలాం
తర మెల్ల నవీనశోభ తద్ద వెలార్చెన్. (176)


చం.
ఇల నవదంపతుల్ మొగము లెత్తి తనుం గని భక్తిసంభృతాం
జలు లిడ నెందు నందికొను చల్లనితల్లి నిజేశుమ్రోల ని
చ్చలుఁ జెలువొందఁగాఁ గలుగు చక్కనిచుక్క యరుంధతీసతీ
తిలకము తాన ముద్దొలుకఁ దీరుచుచున్నది యెల్ల వేడుకల్. (177)


తే.గీ.
"జనకుఁ డెంతటి సమ్మాన్యచరితుఁ డహహ!
బంధుసమ్మతమైన సంబంధ మిద్ది"
యను ప్రియాతిథి కేకయతనయు పల్కు
లిచ్చ మెచ్చుచుఁ గోసలాధీశ్వరుండు. (178)


ఉ.
రెండవబ్రహ్మ గాధిజుఁడు రెండుదెసల్ తన రెండుకన్నులై
యొండు కొఱంతయుం బొరయకుండఁ గనుంగొని, బ్రహ్మపుత్రుఁడున్
బెండిలి కర్హమౌ విధులు వేడుకమై నెఱవేర్ప, మైథిలేం
ద్రుండును వైభవోన్నతి నెదుర్కొన వచ్చె సబాంధవంబుగన్. (179)


తే.గీ.
ఎల్లెడ మధురరుచి వెదఁజల్లు చేగుఁ
దెంచు పెండ్లికుమారులం గాంచి యప్పు
డెఱుకగలవారు, లేనివా రేకరీతిఁ
బొగడఁదొడఁగిరి పాయసమూర్తు లనుచు. (180)


తే.గీ.
పసుపు పారాణి రాణిల్లఁ బదములందుఁ
జెక్కుటద్దాలఁ గాటుకచుక్క లమర
శిరములందుఁ జూడామణుల్ చెలువుగులుకఁ
గన్నియలమేనఁ బెండిలికళలు పొంగె. (181)


తేటగీతిక.
అది యచిరపూరితాధ్వరయజ్ఞవాటి
కాంతరసుశీతలప్రపాప్రాంతసీమ
యది కదళికాదళాలంకృతాంచలప్ర
లంబిమౌక్తికజాలవిలాసరంగ
మది యుపరిభాగమధ్యమధ్యానువిద్ధ
వివిధమణిగణకిరణసంభేదచిత్ర
మది యనేకమహర్షివర్యాధివేశ
పుంజితబ్రహ్మతేజఃప్రపూర్ణగర్భ
మది పవిత్రదర్భాస్తరణాధిరోపి
తార్ఘ్యసుమగంధలాజాక్షతాంకురాభి
పూర్ణసౌవర్ణపాలికాకీర్ణవేది
యది వసిష్ఠప్రతిష్ఠాపితాగ్నిహోత్ర
పావనశిఖానికటశుభభాసమాన
జానకీముఖ్యకన్యకామాననీయ
మది వివిధయజ్ఞభరణధన్యత్వఫలిత
రామజామాతృలాభహర్షప్రకర్ష
మహితసీతాకుమారికామాతృభూమి
యది సుచిరకాలతృషితలోకాళి దప్పి
మాన్ప నెలకొన్న కల్యాణమండపమ్ము. (182)

తే.గీ.
"అడ్డమాకలు లే, వెవ్వరానవెట్టు
వారు లేరు, మే మెల్ల మీవార, మింక
నొక్కటి యయోధ్య, మిథిల వే ఱొకటి కాదు
స్వగృహ మిది మీకు రాఘవసార్వభౌమ! (183)


తే.గీ.
నందనభుజావిజయశుభానంద మంది
కొనుఁ" డనుచు దశరథునితో వినయ మొలుకఁ
బలికి తమ్ముఁడుఁ దాను మైథిలవిభుండు
వరుల కర్ఘ్యాద్యుచితగౌరవములు నెరపి. (184)


తే.గీ.
"ఇదిగొ సీత నా కొమరిత, యీ లతాంగి
నీకు సహధర్మచారిణి, నీడపోల్కి
సంతతము ని న్ననుగమించు సాధ్విసుమ్ము,
భద్రమగు రామ! కేలఁ గేల్ పట్టు" మనుచు. (185)


చం.
మునిముఖమంత్రపూతజలపూర్వముగా రఘురాముదోయిట
న్జనకుఁడు సీతకే లిడి, ప్రసన్నమనంబున లక్ష్మణాదిరా
ట్తనయుల కన్యకన్యల యథావిధి ధారలువోయ లోకలో
చనములు చాలవయ్యె నల చారువధూవరశోభ లారయన్. (186)


తే.గీ.
దోయిళులఁ బెండ్లికూఁతులు వోయ, వరుల
మకుటముల్ దిగజాఱి వేదికను వ్రాలు
ముత్తెఁపుందలబ్రాలు కెంపులును చందు
రాలు నీలాలు వివిధరత్నాలు నయ్యె. (187)


తే.గీ.
కన్నియల కంకణమనోజ్ఞకరములు గొని
యగ్నివేదిని, జనకు, మహర్షి తతిఁ బ్ర
దక్షిణముచేసి వరులు గౌతమవసిష్ఠ
మతమున వివాహవిహితహోమము లొనర్ప. (188)


తే.గీ.
ఇన్నినాళ్ళకు జానకి యిట్లు మగని
చెంతఁ జెలువొంద హోమాగ్నిశిఖలు జనుల
కనులకుం జల్లఁగాఁ దోఁచె; ననలుఁ డపుడె
సీతకడ శీతగుణ మభ్యసించెనేమొ. (189)


తే.గీ.
ఎడనెడన్ మౌళితలముల నెలమిగూర్చు
బ్రాహ్మణాశీశ్శుభాక్షతల్ రాలుచుండఁ
బసుపువస్త్రాలడాలు నల్దెసల కెగయఁ
బ్రీతి ముమ్మాఱు లగ్నిఁ బరిక్రమించి. (190)


తే.గీ.
క్రొత్తయిల్లాండ్రతోఁ బెండ్లికొడుకు లపుడు
విడిదికిం జేర, నెలఁతల వేడ్కలందుఁ
బయనపుంజెయ్వులందు సంబరములందుఁ
తెలియరాకయె గిఱ్ఱునఁ దిరిగె రేయి. (191)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి