5, ఏప్రిల్ 2012, గురువారం

కళ్యాణ రాఘవము - 4

కళ్యాణ రాఘవము - 4

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

చం.
లలితవచోగతిన్ మునిలలాము నుతింపుచు రాముఁ జూచి "యీ
జ్వలితతపోగ్నిపాకముల క్షాత్రపు బీజము బ్రహ్మతేజమై
తళతళలాడు రెండవ విధాతృని కన్నుల వన్నెగన్న మీ
రలు మిగులం గృతార్థులరు రాఘవులార! జగత్త్రయంబునన్." (46)


కం.
అని దప్పిదీఱ నా రా
ముని పావనశోభ నేత్రములఁ ద్రావు గతిం
గనుచుండె నహల్యానం
దనుఁడు, సభయు వెలసె విస్మితస్తిమితముగన్. (47)


తే.గీ.
ధరణి నా సాత్త్వకజ్యోతి తమ మడంచి
కర్మనిష్ఠ సమర్పితార్ఘ్యముల మించె
నింక శ్రమ మేల నా కని క్రుంకుమలకుఁ
దరలె నప్పుడు ముదుసలి కిరణమాలి. (48)


ఉ.
ఆ ముకుపచ్చలారని యొయారపు బిడ్డల విక్రమక్రమం
బా ముని లోకభీకరతపోద్భుతరీతులు నెంచియెంచి యు
ద్దామపినాకిచాప మది తామయి చూపు మఁటన్న మాట కెం
తే మది పొంగుచుండ మిథిలేశ్వరుఁ డల్లన లేచి నమ్రుఁడై. (49)


తే.గీ.
"విశ్వము మహాతపమ్మున వెలుఁగఁజేసి
పండువాఱిన దీప్తి మార్తండుఁ డదిగొ
మునివరా! నీవలెనె ప్రశాంతిని వహించె
సమయ మిద్ది సాయంతనసవనమునకు. (50)


తే.గీ.
ఎవరయా యిట్టి శిష్యుల నేలువార
లీవుదప్ప తపోనిధీ! త్రోవనడచి
యలసితిరి విశ్రమింపుఁ, డీ లలితతనులు
కాంచెదరుగాక విలు రేపకడ" నఁటంచు. (51)


తే.గీ.
తత్క్షణమె గాధిపుత్రుఁ బ్రదక్షిణించి
యాన గొని రాజు మునులతో నరిగె; నప్పు
డాకసపు మేడతుదలపై నల్లుకొనెడి
రాగరేఖల డాఁచె నా రాతిరి తెర. (52)


తే.గీ.
‘ఎన్ని యుగము లీ యొక రేయి కింకఁ బ్రొద్దు
పొడువదో! విల్లు మోపెట్టఁబడదొ! కంటఁ
బడదొ జానకి! తొందరపా టిదేల
నా’ కనుచు రాముఁ డాత్మలో నవ్వుకొనియె. (53)

2 కామెంట్‌లు:

  1. అయ్యా! నమస్కారములు:
    కళ్యాణ రాఘవములో 49వ పద్యము 3వ పాదము గణభంగము ఉన్నది. అది టైపు పొరపాటు అగును. సవరించండి.

    రిప్లయితొలగించండి
  2. పండిత నేమాని వారూ,
    ధన్యవాదాలు. అది టైపాటే. సవరించాను.

    రిప్లయితొలగించండి