1, ఏప్రిల్ 2012, ఆదివారం

జై శ్రీరాం!సీ.
శ్రీరామ యనుపేరు కోరి మున్నెత్తక
వ్రాయ నొల్లరు తెల్గువార లెదియు
చిన్ని నాబిడ్డకు శ్రీరామరక్ష యం
చనని తల్లియె లేదు తెలుఁగు నేల
రామాయణమునే శిరమ్ముపై నిడుకొని
బాస గావింతురు ప్రజలు నేఁడు
శబ్దశాస్త్రమ్మును జదువు శిష్యుల కెల్లఁ
బ్రారంభమునయందె రామ శబ్ద
తే.గీ.
మెన్ని యుగములైనను నిన్న మొన్న రాముఁ
డింట మెదలిన యట్లుండు నెల్లరకును
గావ్యవస్తువు లెల్లఁ దూకమ్ము వైవఁ
జాల మొగ్గగు మా రామచంద్రు కతలె.

తే.గీ.
రామపదమందు మరుగుమం దేమి కలదొ!
తలఁపుగొన నేదొ ప్రేమబంధము బిగించు
నెన్నిమారులు పలికిన నేమి నమృత
రసము చిప్పిలునే కాని విసువు రాదు.


తే.గీ.
రామ యనినంత నెంతటి కోమలతయొ
సీత యన నంతకంటెను లేఁతదనము
యే మహర్షులు కనిపెట్టి యీ మనోజ్ఞ
నామయుగళంబు గూరిచినారొ కాని!


సీ.
చిరునవ్వు వెలుఁగులో మెఱసెడి గోటి కం
దనినూగుమీసముల్దనరువాఁడు
వినయగాంభీర్యముల్ విప్పారు నెమ్మోము
దమ్మివీరకళలుజిమ్మువాఁడు
వలఱేని మేని తళ్కుల మూలమౌ నిగ
నిగలంగకమ్ములనెగడువాఁడు
తన జింకకనుల సీతమ్మ దాఁచికొనిన
చాంచల్యధనముహరించువాఁడు
తే.గీ.
విలు విఱిచి లోఁచికొన్న క్రొవ్విరులదండ
వ్రేలు పేరెద విందుల విందొనర్చు
నాదు కళ్యాణరాముఁడు నాయకుఁడగు
కావ్య మేదైన నానందకరము గాదె!

సీ.
వెలిపట్టుచీర కుచ్చెళుల జరీయంచు
గోటిముత్తెములతోఁగూడియాడఁ
జరణవిన్యాసంబు జగతిపైఁ గెందమ్మి
పూరెక్కలంగుప్పవోయుచుండ
నందెల చిఱుమ్రోత లానందలక్ష్మి లా
స్యమునకునాందిగీతములుపాడ
సిగ్గువ్రేఁగున వంగు చిన్నిమో మెగబ్రాఁకి
కడగంటితళుకులుతడలునెరప
.వె.
హరుని విల్లు విఱిచి యతిదర్శనీయుఁడౌ
రాముఁ జేర నరిగె రమణి సీత
యంబురాశి ద్రచ్చి యలసిన హరిచెల్వు
గని వరింపఁబోవు కమల పోల్కి.

.
నవనీలమేఘరుచిరాంగకు నెంతగ నిల్పికొన్నదో
జానకి కన్నుదోయిఁ, గడు చల్లని నల్లని చెల్వు కల్వపూ
లై నెఱదండల ట్లెగసి యాకరహారము తోడుపాటుగా
భానుకులాంకురంబు మెడపైఁ బడె సంచలదంచలంబుగన్.


.వె.
పంటవెలఁది కడుపుపంటపై రాము క్రీ
గంటిముద్ర వడుట గాంచి యపుడు
త్రిభువనముల కఱవుదీఱిన ట్లానంద
ముద్రితమ్ములయ్యె మునులకనులు.


తే.గీ.
జనుల కరతాళరవములో మునిఁగిపోయె
నమరదుందుభినిస్వాన మాకసమునఁ
బుడమిఁ బడు పారిజాతపుఁ బూలసోన
జానకీ మందహాసాన లీనమయ్యె.


మాగురుదేవులు

కీ.శే. శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల

"కళ్యాణరాఘవము"

కావ్యంనుండి.

2 కామెంట్‌లు:

 1. కమ్ర కల్యాణ రాఘవ కావ్య మందు
  జానకీ రామ చంద్రుల సర్వ లోక
  శుభ కరమ్మగు కల్యాణ ప్రభల జూపి
  ధన్యు లయ్యిరి గురువులు దండము లివె.

  రిప్లయితొలగించండి
 2. మీపై సదా రామకృపావర్షం కురియాలని కోరుకుంటూన్నాను జైశ్రీరాం

  రిప్లయితొలగించండి