4, ఏప్రిల్ 2012, బుధవారం

కళ్యాణ రాఘవము - 3

కళ్యాణ రాఘవము - 3

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

తే.గీ.
"అల్లదే! పుష్పఫలపల్లవార్ఘ్య మెత్తి
ప్రణమితశిరస్కుఁడై యెదు ర్వచ్చు జనకుఁ
గంటివా? రామ! నిష్కళంకహృదయుఁడగు
రా జితఁడు గురుభక్తివిరాజితుండు. (29)


ఉ.
ఈ జగదీశు నేలుబడి కెల్లరు దీపమువెట్టి మ్రొక్కువా
రీ జయశాలి కోడిరి బహిర్గతశత్రులతోడ నాంతరుల్
రాజను పేరె కాని మునిరాజుల కేనియు నొజ్జబంతియై
రాఁ జను వీని వృత్తి" యని రామునితో ముని పల్కె నంతలోన్ (30)


తే.గీ.
జనకుఁ డేతెంచి పూజలు సలిపెఁ, గుశల
మరసె గాధేయుఁ, డెల్ల రర్హాసనముల
నధివసించిరి; తత్క్షణమందె రామ
లక్ష్మణులు లోచనశతైకలక్ష్య మైరి. (31)


తే.గీ.
ఎవ్వరో? యెవ్వరో? యని యెల్లవారి
కొదవు జిజ్ఞాస కెల్లఁ దానొకఁడె మార్గ
దర్శినా నిట్లు పల్కె హస్తములు మోడ్చి
మౌనిమండనుతో యజమానుఁ డపుడు. (32)


ఆ.వె.
"తలఁపఁబడని దయ్యుఁ దమరాకతోన నా
యజ్ఞఫలము వచ్చినట్టు లయ్యె;
నిమికులంపుఁ బుణ్యనివహమ్ము పక్వమై
యమృత మొలికెఁబో! మహాత్మ నేఁడు. (33)


తే.గీ.
చంద్రసూర్యులవలె సభాస్పదము విష్ణు
పద మొనర్చు నీబాలు రెవ్వారు? వీరి
పూల మెప్పించు పాదముల్ భూరివనుల
సోఁకె నెటు కారుచీఁకటిసోఁకు లవియ. (34)


తే.గీ.
పటు తపశ్శక్తి నీకు లోఁబడినయట్టి
క్షత్రియబలమ్ము బ్రహ్మతేజమ్ము గలసి
మధురమధురస్వరూపసంపన్న మగుచుఁ
గూడ నేతెంచెనో జోడుకోడెలట్లు? (35)


తే.గీ.
ధీరగంభీరదుర్వారచారుగతులఁ
బుడమి వంచెడి కైవడి నడచివచ్చు
నీ కొమరు లెవ్వరో కాని, నాకుఁ జూడ
దివ్యు లిల డిగ్గి విహరించు తెఱఁగు దోఁచె. (36)


ఉ.
పెంపగు రాచఠీవి మొలపింపుచు సాధుల బాధ మాన్పనా
నంపపొదుల్ విశాలహృదయంబులఁ బట్టముగట్టెఁ, జెట్టలం
ద్రుంపఁగ నూఁగులూఁగెడు ధనుస్సులు బాహులనీడ, ధర్మపుం

గంప మడంపఁగా నడుముగట్టినటుల్ గనుపట్టు ఖడ్గముల్. (37)

ఉ.
పూచెడిపూవుటంగముల పొంగును, శౌర్యపుఁ దావి క్రొత్తగా
గాచెడిఁగాత, జవ్వన మెగాదిగఁ జూచిన వాడుబాఱు, సా
రోచితకాంతులా తొలఁకుచున్నవి మోముల, వీరిచేత నే
రాచకొలమ్ము పండె నవరత్నపుఁ బంటల నో మునీశ్వరా!" (38)


చం.
అన, ముని "దైత్యయుద్ధసమయమ్ముల దక్షిణబాహువై మహేం
ద్రుని గెలిపించు మా దశరథుండు మఖంబునఁ గన్న కూన లీ
యినకులసూను" లంచు సభయెల్ల గగుర్పొడవంగఁ దాటకం
దునుముట లాది గౌతమవధూమణి ముచ్చటదాఁకఁ జెప్పియున్. (39)


తే.గీ.
"శ్యామలామలమూర్తి మా రాముఁ డీతఁ
డన్న కన్నిట సరిపోవు ననుఁగుఁదమ్ముఁ
డితఁడు లక్ష్మణుఁ, డిపుడు మీ యింట నున్న
ధనువు గనువేడ్క నేతెంచి" రని వచింప. (40)


కం.
మాతాపితృవిరహకృశీ
భూతాంగము వొంగ రాముఁ బొగడుచు నమిత
ప్రీతి శతానందుఁడు ముని
నాతఱిఁ బరికించి వత్సలాశ్రులఁ బలికెన్. (41)


తే.గీ.
"తల్లి శాపము దీఱెనా! తండ్రి రామ
భద్రు దీవించెనా! సుప్రభాత మయ్యె
నిప్పుడు మునీంద్ర! కటకటా! యిన్ని యేఁడు
లెట్లు గడచెనో కటికచీఁకట్లలోన. (42)


ఆ.వె.
మాయకోడి గూయ, మాయమ్మ యే చెడు
కాలమందు మేలుకనెనొ కాని
పండువంటి మేను బండవాఱెనుగదా!
యడలు పెరుఁగఁ గన్నకడుపు దఱుఁగ. (43)


సీ.
పల్లవారుణశాఖ లల్లాడెనే తల్లి

చాఁగి నాకై కేళ్లు సాఁచినట్లు
కోయిల కూసెనా కొడుకా! యనుచుఁ బంచ
నెలుఁగెత్తి మాయమ్మ పిలిచినట్లు
బెదరి పాఱెడి జింకపిల్ల నన్ జూచెనా
జనయిత్రి కనులలో మునిఁగినట్టు
లడవిమల్లియగుత్తు లఱపాలు విప్పెనా
యవ్వ చిర్నవ్వులు నవ్వినట్లు
తే.గీ.
దలఁతు నపుడప్పు డాశ్రమస్థలిని జూచి
యకట! యా పూజ్యమాత యేకాపరాధ
పంక మది తీర్థమయరామపాదరేఖఁ
గరఁగెనా! చిత్రచారిత్ర! గాధిపుత్ర! (44)

తే.గీ.
పొగలు మంటలు దీఱిన పుణ్యవహ్ని
కణిక లటు సుప్రసన్నులౌ కన్నవారిఁ
గాంతునా!" యని యానందగరిమఁ దేఱు
నక్కొమరు పేరు సార్థకమయ్యె నపుడు. (45)

1 కామెంట్‌:

 1. జనక భూపతి గూర్చిన ముని పలుకులు
  పలుకులా యవి కావులే పసిడి తునుక
  లొక్క పద్యమ్ము నందున మక్కువార
  పలుకగా జేసి రార్యులు పరవశించి.

  తల్లి శాపమ్ము నొందిన దారుణమును
  దలచి కలుగంగ హృదయమ్ము తనయునకును
  శాప మోచనమై తల్లి పాప ముడుగె
  ననగ నాతని భావమ్ము లార్ద్రములగు.

  రిప్లయితొలగించండి