29, ఏప్రిల్ 2012, ఆదివారం

పద్య రచన - 11


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

17 కామెంట్‌లు:

  1. తక్షకు విషాగ్ని చేత ప
    రీక్షిత్తు మృతించెననుచు ప్రేరేపితుడై
    కక్షగొని సర్పయాగము
    నా క్షితిపు సుతుండు చేసె నతిశ్రద్ధమెయిన్

    బుద్ధి వక్రించి క్రోధంబు బుసలు కొట్ట
    తల్లి కద్రువ యొసగెను తనయులెల్ల
    నొక్క వేళ మృతించెద రుర్విననుచు
    శాప మారీతి హతులైరి సర్పతతులు

    తల్లియే మృత్యుహేతువై తనయులెల్ల
    చచ్చెదరటంచు నిచ్చెబో శాపమకట
    అసలె నాగులమాతయు నందులోన
    నాగ్రహ మ్మావహించుచో నట్ల కాదె?

    రిప్లయితొలగించండి
  2. తల్లీ! శాపము తగిలిన
    పిల్లలు చచ్చిరి గనుమిక పెనుయాగమునన్!
    చల్లబడినదా యిక నీ
    యుల్లము? మమతల బలినిట యొసగితి గాదే!

    రిప్లయితొలగించండి
  3. క్షితి పై గల సర్పములను
    క్షతి జేయగ బూనె నొక్క క్రతువునను పరీ-
    క్షితు మృతికి కారణంబని
    క్షితిపతి జనమేజయుండు స్థిరమతి నచటన్.

    యాగము సాగిన కొలదిని
    భోగము లన్నియును వ్రాలె మూకలుగా నా
    రేగిన యజ్ఞాగ్నులలో
    నీగతి తమతల్లి శాప నేమము గూడన్.


    చేస్తిరి చాలిక యజ్ఞము
    కాస్త సహనమును వహించి గావుండనుచు
    న్నాస్తీకుండేతెంచెను
    స్వస్తిని కలిగించె నెల్ల సర్ప తతులకున్.

    రిప్లయితొలగించండి
  4. తక్షకు మీ దన కోపము
    కక్ష గ మారంగ జేసె క్రతువును రాజున్
    తక్షణమ పాము లన్నియు
    నాక్షణ మే భస్మ మయ్యె నగ్నికి వరుసన్

    రిప్లయితొలగించండి
  5. సర్పయాగం

    తక్షకాహి విషపు దావానలంబున
    జనకు డంతమౌట వినినమీద
    మునుపు చేయుచుండె జనమేజయాఖ్యుండు
    సర్పయాగ మచట నేర్పుమీర.

    సర్పకులములన్ని సత్వంబు నశియించి
    మహితమైన మంత్ర మహిమవలన
    ఒకటి రెండు గాదు, సకలాహిసంఘాలు
    వరుసగట్టి యజ్ఞవాటి కపుడు

    చేరి పడుచు నుండె నేరుగా హోమాగ్ని
    గోరినట్లు వాటి తీరు గనుడు
    తక్షకుండు తాను ధైర్యంబు గోల్పోయి
    నాకలోకమందు నక్కి యుండె.

    సిద్ధ మచట మఘవు సింహాసనంబును
    చుట్టి దాగి యుండె, చోద్యమపుడు
    యాగశాలలోని యాజ్ఞికవరులంత
    "ఇంద్రయుతుడ! వ్యాళ మిలకురమ్ము".

    అనుచు బల్కి వార లాహుతులీయంగ
    చిత్రమేమొగాని సేంద్రు డగుచు
    తక్షకుడను పాము ధరణికి నేతెంచి
    యాగవహ్నిలోన వేగమపుడు

    పడుచు నుండబోవ పరమదయాళుండు
    ఘోర మాప దలచి చేరి నిలిచి
    స్వస్తి వచనశీలి యాస్తీకు డదిగని
    దయను జూపు మనియె ధరణిపతికి.

    సాధువర్తనుండు జనమేజయుండంత
    శాంతమూర్తి యగుచు శ్రద్ధతోడ
    ప్రణతులొసగి యాగ పరిసమాప్తినిజేసె
    జగములన్ని మిగుల సంతసించ.

    రిప్లయితొలగించండి
  6. కోపము నాపక తానే
    శాపము పొందె నొక రాజు; సప్తాహములో
    పాపములను బాపుకొనగ
    గోపాలుని కథలను విన గోరెను నాడే.

    పితరుని పోగొట్టుకొనిన
    సుతుడౌ జనమేజయుండు సొక్కెను మదిలో
    చతురత యాగము సలిపెను
    గతి దప్పిన పాములెన్నొ కాలెను తృటిలో.

    వచ్చిన ఆ యాస్తికునికి
    ఇచ్చిన మాటకు నిలబడె నెంతో ఘనుడా
    సచ్చరితుండిక ధాత్రిని
    మచ్చయె లేకుండ బ్రతికె మాన్యుడు తానై.

    రిప్లయితొలగించండి
  7. నా చివరి పద్యమునకు సవరణ.

    వచ్చిన ఆ యాస్తీకుని
    కిచ్చిన మాటకు నిలబడె నెంతో ఘనుడా
    సచ్చరితుండిక ధాత్రిని
    మచ్చయె లేకుండ బ్రతికె మాన్యుడు తానై.

    రిప్లయితొలగించండి
  8. తక్ష కునిపై నాతని కక్ష దీర
    యాగ మొనరించి హతమార్చ భోగ ములను
    తల్లి శాపము తీరెను పొల్లు బోక
    వలదు చాలని వారించె వ్యాసు డపుడు .

    రిప్లయితొలగించండి
  9. కవిమిత్రులకు నమస్కృతులు.
    ‘పద్యరచన’ శీర్షికకు ఇంతటి స్పందన వస్తుందని నేను ఊహించలేదు. అందరూ ఖండకావ్యస్వరూపాలైన చక్కని పద్యాలు వ్రాస్తూ బ్లాగుకు నూత్నశోభలను చేకూరుస్తున్నారు. అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతాంజలి. అభినందనలు.
    ఈ ‘పద్యరచన’కు మొదటి చిత్రాన్ని పంపి దారి చూపిన శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య గారికి ధన్యవాదాలు.
    *
    ఈనాటి ‘సర్పయాగ’ దృశ్యానికి నిన్నటి సమస్యకు గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణ ప్రేరణ. వారికి ధన్యవాదాలు.
    *
    పండిత నేమాని వారూ,
    ఉదంక ప్రేరేపిత సర్పయాగాన్ని వివరించిన మీ పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    స్వాగతం. మీలోటు స్పష్టంగా కనిపించింది. మీ పునర్దర్శనం సంతోషాన్ని కలిగించింది.
    మమతలను బలిపెట్టిన తల్లిని గురించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
    కొనసాగింపుగా వ్రాసిన మూడుపద్యాలు చక్కగా ఉన్నాయి.
    *
    మిస్సన్న గారూ,
    బాగున్నాయి మీ పద్యలు. అభినందనలు.
    ‘శాప నేమము’? ‘శాపనియతి సెలంగన్’ అనవచ్చు. అఖండ యతి వద్దనుకుంటే ‘శాపమే కారణమై’ అనవచ్చు.
    మూడవ పద్యంలో ‘ఆస్తీకుణ్ణి’ ప్రాసస్థానంలో పెట్టారు. బాగుంది. స్వస్తి! కాని అందుకోసం వ్యావహారిక పదప్రయోగం ‘కాస్త చేస్తిరి’.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    కాని అది ‘తత్క్షణము’ కదా!
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ ఆటవెలదుల ‘సర్పయాగం’ ఖండిక చక్కగా ఉంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    చాలా బాగుంది మీ పద్యం. అభినందనలు.
    కాని యాగాన్ని అడ్డుకున్నది వ్యాసుడు కాడు. ఆస్తీకుడు. మీ చివరి పాదానికి నా సవరణ....
    ‘చేయవలదని చెప్పె నాస్తీకు డపుడు’

    రిప్లయితొలగించండి
  10. నమస్కారములు
    సందేహం గానే వ్రాసాను. సవరణ చేసి నందులకు ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  11. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    సర్పయాగము :

    ___________________________________

    01)

    తండ్రి చావుకు ప్రతి జేయ - దలచి , నాడు
    తక్షకుని జంపగా నెంచి - ధరను జేసె
    సర్ప యాగమ్ము పేరిట - జనమెజయుడు
    దందశూకము లన్నియు - తగుల బడగ !

    02)

    తల్లి శాపమ్ము ఫలియించి - దగ్ధ మాయె
    పిల్ల పాములు యెన్నెన్నొ - మెల్ల గాను !
    తల్లడిల్లిన తక్షకుం - డల్ల వేగ
    చెంత జేరెను శరణని - చిత్రరథుని !

    03)

    మంత్ర మావాహనము జేయు - మహిమ వలన
    తక్షకుడు చుట్టు కొన్నట్టి - తావు గాన
    ఇంద్ర పీఠము కదిలెను - యింద్రు గూడి
    ఆస్తికుడు సర్పయాగము - నాపు దనుక !

    04)

    దయను యాగంబు నాపిన - ధరణిజాని
    తక్ష కాదుల మరణంబు - తప్పె నపుడు !
    దందశూకముల్ మిగిలెను - ధరణి మీద
    సంచరింపగ నేటికిన్ - జగతి లోన !

    ___________________________________

    రిప్లయితొలగించండి
  12. వసంత కిశోర్ గారూ,
    మీ ఖండకృతి బాగుంది. అభినందనలు.
    జన‘మే’జయుని ‘జనమెజయుడు’ అన్నారు. అక్కడ ‘మేటి సర్పయాగము జనమేజయుండు’ అందాం.
    ‘పాము లెన్నెన్నొ’ అనకుండా యడాగమం వేసారు. అక్కడ ’పిల్ల పాము లెన్నెన్నియో’ అందాం.
    ‘కదిలెను + ఇంద్రు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘కదిలె తా నింద్రు’ అందాం.
    ఆస్తీకుణ్ణి ఆస్తికుడు అన్నారు. ‘దందశూకముల్ మిగులగా ధరణి మీద/ నాపె నాస్తీకు డా సర్పయాగ మపుడు’ అందాం.

    రిప్లయితొలగించండి
  13. శంకరార్యా ! చక్కని సవరణలకు ధన్యవాదములు !


    నేమానివారు నిన్న ప్రకటించిన వ్యాఖ్య :

    "పద్యములలో అక్కడక్కడ హ్రస్వమునకు బదులుగా దీర్ఘము, అలాగే దీర్ఘమునకు బదులుగా హ్రస్వములు పూర్వ కవి ప్రయోగములలో నున్నవి. పరిమళమునకు బదులుగా పరీమళము వాడుట నాకు చిన్న జ్ఞాపకము ఉన్నది. దీనికి సరైన వ్యాకరణ సూత్రమో లేక మరి ఎటువంటి వెసులుబాటో నాకు గుర్తు లేదు. మీరు తగిన వివరణలు మాకు సూచిస్తే చాలా సంతోషము."

    దీని ననుసరించి "జనమెజయుడు- ఆస్తికుడు " అని ప్రయోగించితిని !

    రిప్లయితొలగించండి
  14. గురువుగారూ సవరణలకు ధన్యవాదాలు.
    మూడవ పద్యాన్ని యిలా సవరిస్తున్నాను:

    అస్తోకమ్మగు యిష్టి స-
    మస్తాహుల ద్రుంచు చుండె మానుండనుచు-
    న్నాస్తీకుండేతెంచెను
    స్వస్తిని కలిగించె నెల్ల సర్ప తతులకున్.

    రిప్లయితొలగించండి
  15. మిస్సన్న గారూ,
    సవరించిన మూడవ పద్యం అద్భుతంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. వసంత కిశోర్ గారూ,
    అలాంటి పదాలు పరిమితాలు. ప్రత్యేకాలు.
    కాని నామవాచక శబ్దాలకు ఆ నియమం వర్తించదు.

    రిప్లయితొలగించండి