2, ఏప్రిల్ 2012, సోమవారం

సమస్యాపూరణం - 665 (పురుషగర్భమే సృష్టికి)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

పురుషగర్భమే సృష్టికి పుట్టినిల్లు.

ఈ సమస్యను పంపిన సహదేవుడు గారికి ధన్యవాదాలు.

29 కామెంట్‌లు:

 1. మన్ను తిన్నావటంచును మందలించు
  జనని కప్పుడు (నోటిలో)తననోట జగములన్ని
  యఖిలభారకుడై చూపునట్టి పరమ
  పురుషగర్భమే సృష్టికి పుట్టినిల్లు.

  రిప్లయితొలగించండి
 2. పెద్దలకు ప్రణామములు.

  ఏదీ మన చేతులలో లేదు. అంతా ఆ విరాట్పురుష పరమేశ్వరుని దయాలీల!

  మాయావిభుం డైన యా యజుష్పతి దాను దైవయోగమునఁ బ్రాప్తంబు లైన
  కాల జీ వాదృష్టలీలల మహదాదిఁ దననుండి పొదవించె దయను; నంత
  నం దహంకారంబు; నంతట సత్త్వాదు; లైదు భూతంబులుఁ జాదుకొనియె
  నింద్రియంబులు, మనం బందుండి గలిగె బ్రహ్మాండంబు విశ్వాంతరాళమందుఁ

  జేతనాచేతనములకు జీవరూప
  కాల కర్మ స్వభావంబు గతిని లోక
  శుభము నశుభంబును గలుగుచుండుఁ; బరమ
  పురుషగర్భమే సృష్టికిఁ బుట్టినిల్లు.

  విధేయుఁడు,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 3. కలికి పలుకున చేబూని గరళ మపుడు
  కుక్షిలోనున్న జగముల రక్షగోరి
  యుదరమునగాక, కంఠమందుంచు పరమ
  పురుషగర్భమే సృష్టికి పుట్టినిల్లు.

  రిప్లయితొలగించండి
 4. ప్రకృతి పురుషులే యాది దంపతులు, భూత
  పంచకము వారి వలననే ప్రభవమొందె,
  వీర్యము ధరించు గర్భమే, వినుము సరస
  పురుష! గర్భమే సృష్టికి పుట్టినిల్లు

  రిప్లయితొలగించండి
 5. మన్ను తింటివా కృష్ణయ్య వెన్న మాని
  నోరు జూపవే యన తల్లి, నోట జూపె
  విశ్వ మెల్లను వింతయే? వినుము పరమ
  పురుషగర్భమే సృష్టికి పుట్టినిల్లు.

  రిప్లయితొలగించండి
 6. కవి మిత్రులకు, పెద్దలకందరికీ నమస్కారములు.
  ఈ నాటి సమస్యకు శ్రీకృష్ణ పరంగాను, శివపరంగాను రెండు పూరణలు చేశాను. ముచ్చటగా మూడవ పూరణ విలక్షణంగా సమస్యను ప్రశ్నార్థకంగా అన్వయిస్తూ వ్రాస్తున్నాను. సాహసానికి క్షమించ ప్రార్థన.
  జనని కాగోరి వ్రతములు జరిపి జరిపి
  మాస నవకమ్ము గర్భాన మోసి యపుడు,
  జన్మనిచ్చును స్త్రీమూర్తి జగతి కవుర!
  పురుషగర్భ మేసృష్టికి పుట్టినిల్లు?
  (పురుషగర్భము+ఏసృష్టికి పుట్టినిల్లు?)

  రిప్లయితొలగించండి
 7. కరమున శంఖచక్రముల గల్గిన శోభనమూర్తియై సదా
  స్థిరముగ భద్రపర్వతపు శృంగము నందున నిల్చినట్టి శ్రీ
  కరుడగు రామభద్రవిభు కంజదళాయత నేత్రిఁ భక్తి తత్
  పరులకు రామచంద్రుని వివాహము పుణ్య ఫలప్రదంబగున్.

  ముక్తి పొందగోరెడి భక్తపుంగవులకు
  రామనామ మనిన రక్తి; రాక్షసులకు
  దానవులకు భువనమందు తపము జపము
  స్వార్థ తృప్తి కొఱకు నిత్య సత్యమిదియె.

  కనగ బ్రహ్మాండమంతయు కమలనయను
  నందె యడగి యుండునటంచు నమ్మదగును
  విశ్వరూపము జూపిన విశ్వమయుని
  పురుషగర్భమే సృష్టికి పుట్టినిల్లు.

  రిప్లయితొలగించండి
 8. విశ్వ మంతయు దానయై వెలుగు లీ య
  సకల లోకాలు నింపుకు శరణు నిచ్చు
  నాదిదంపతు లైనట్టి యాది దేవు
  పురుష గర్భమే సృష్టికి పుట్టి నిల్లు .

  రిప్లయితొలగించండి
 9. గోలి హనుమచ్ఛాస్త్రి గారి పూరణ.....

  మఱ్ఱియాకున బజ్జుండు కుర్రవాడు
  భువన భాండమ్ము లన్నియు బొజ్జ నుండు
  మఱ్ఱి విత్తనముల వోలె మనుపు నట్టి
  పురుషగర్భమే సృష్టికి పుట్టినిల్లు.

  రిప్లయితొలగించండి
 10. సకల జీవుల సృజియింప జాలినట్టి
  కంజుడేపుట్టె శ్రీవిష్ణు గర్భమందు
  విష్ణు లీలలో విషయమ్ము విశదమాయె
  పురుష గర్భమే సృష్టికి పుట్టినిల్లు

  రిప్లయితొలగించండి
 11. జనని నాపుణ్యఫలమని సంతసించి
  మాసనవకమ్ము గర్భాన మోసినంత,
  జనన మందును మహిలోన జనుడు, పుణ్య
  పురుష! గర్భమే సృష్టికి పుట్టినిల్లు.

  రిప్లయితొలగించండి
 12. శ్రీ శంకరయ్య గారికి నమస్కారములు.
  అయ్యా!
  శ్రీరామనవమి పర్వముల సందర్భముగా మీ గురువు గారు కీ.శే. చిలుకమర్రి రామానుజాచార్యులు గారు రచించిన కళ్యాణ రాఘవములోని పద్యములను బ్లాగులో నుంచుట చాల హర్షణీయము. తొలి భాగమునకు ముందుగనే ఆ కావ్యములోని కొన్ని కొన్ని విశేషములను కూడా కొద్దిగా వివరించినచో ఇంకనూ సులభగ్రాహ్యముగా నుండెడిది. పద్యముల శైలి, ధార, భావము బాగుగా నున్నవి. బ్లాగునకు వన్నె తెచ్చు చున్నవి.
  స్వస్తి.

  డా. ఏల్చూరి మురళీధర రావు గారి వ్యాసములను గూర్చి మీరు బ్లాగులో సభ్యులకు తెలియజేయుట కూడా సంతోషకరమైన విషయమే. వారి వ్యాసములు సాహిత్యపు లోతులలోనికి తీసికొని పోవుచూ పఠితులకి ఎంతో ఆహ్లాదకరముగను విజ్ఞాన వర్ధకముగను ఉన్నవి. వారికి మా అభినందనలు.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 13. గురువర్యులకు నమస్కారములతో
  నెట్ లో యానిమేషన్ చిత్రమలను జూచి, వచ్చిన వార్తలను జూచి జనులకు
  ----------
  సందేహము గల్గుచుండెను ఈ రీతిగా
  నేటి జనులకు నెట్ మాయ నీడలోన
  పురుషులకు బుట్టుచుండెను పుత్రులు యను
  వార్త విన్నవారికి గల్గె వాస్తవముగ
  పురుష గర్భమే, సృష్టికి పుట్టినిల్లు,

  రిప్లయితొలగించండి
 14. గురువర్యులకు నమస్కారములతో
  నెట్ లో యానిమేషన్ చిత్రమలను జూచి, వచ్చిన వార్తలను జూచి జనులకు సందేహము గల్గుచుండెను ఈ రీతిగా
  ---------
  నేటి జనులకు నెట్ మాయ నీడలోన
  పురుషులకు బుట్టుచుండెను పుత్రులు యను
  వార్త విన్నవారికి గల్గె వాస్తవముగ
  పురుష గర్భమే, సృష్టికి పుట్టినిల్లు,

  రిప్లయితొలగించండి
 15. నలువ జనియించె విష్ణువు నాభి నుండి
  సాగరము నుండి ప్రభవించె సురలు యనగ
  యాగ జలమున మాం దాత యవన సుతుడు
  పురుష గర్భమే సృష్టికి పుట్టి నిల్లు

  రిప్లయితొలగించండి
 16. పెద్దలకు ప్రణామములు. మొన్నటి మీ సచేతోవాక్యజాతాన్ని ఇప్పుడే చూడగలిగాను. నిర్వ్యాజదయావర్షమును కురిపించిన శ్రీయుత కంది శంకరయ్య గారికి, పద్యరూపాశీర్వాదాన్ని ప్రసాదించిన పూజ్యచరణులు శ్రీ పండిత నేమాని గురుదేవులకు, మాన్యులు శ్రీ మిస్సన్న మహోదయులకు –

  జ్యోతిర్మయ మగు శబ్ద
  శ్వేతారణ్యమున దారి వేఁడెడు నను సం
  గాతిగ నెద కత్తుకొనెడి
  ప్రాతర్వంద్యులకు మీకుఁ బ్రణతిశతమ్ముల్!

  పరిణతవిద్యావిభవులు
  సరస్వతీసుద్ధ్యుపాస్యసారస్వతవా
  గ్వరణీయులు మీ కరుణా
  వరణంబు కలిమిని వెలుఁగుబాటల నడతున్.

  విధేయుఁడు,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 17. జలధి కుక్షియౌ నద్రులు శల్యములును
  గాలి ప్రాణంబు ఘనములు కచములగును
  నభము నాభియౌ మూర్థము నాక మాది
  పురుష గర్భమే సృష్టికి పుట్టి నిల్లు

  రిప్లయితొలగించండి
 18. రాజేశ్వరక్కయ్యగారు రెండవపాదం సవరించాలి యతి కుదరడంలేదు

  రిప్లయితొలగించండి
 19. జనని నాపుణ్యఫలమని సంతసించి
  మాసనవకమ్ము గర్భాన మోసినంత
  జనన మందును మహిలోన జనుడు, పుణ్య
  పురుష! గర్భమే సృష్టికి పుట్టినిల్లు.

  రిప్లయితొలగించండి
 20. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  01)
  _____________________________________________

  పూని పూబోడులు గలియ - పూజ్యమౌను!
  పురుష సహకారమే లేక - పుడమి యందు
  పుట్టుకన్నది లేదుగా - యెట్టి విధము !
  పురుష గర్భమే సృష్టికి - పుట్టినిల్లు
  పుణ్య వచనంబు వినరయ్య - పూజ్యులార
  పుడమి పడతికి గర్భము - పురుషు వలనె !

  _____________________________________________

  రిప్లయితొలగించండి
 21. భగవానువాచ :

  02)
  _____________________________________________

  పుట్టు చున్నారు నా నుండె - పురుషులైన
  పుట్టు చున్నారు స్త్రీలైన - పుడమి యందు
  పుట్టుకయు చావు లన్నియు - పూని నేనె
  సృజన జేతును సృష్టిలో - నిజము గనుమ
  పురుష గర్భమే సృష్టికి - పుట్టినిల్లు !
  _____________________________________________

  రిప్లయితొలగించండి
 22. భగవానువాచ :

  02)
  _____________________________________________

  పుట్టు చున్నారు నా నుండె - పురుషు లైన
  పుడమి యందున స్త్రీలైన - జడము లైన
  పుట్టుకయు చావు లన్నియు - పూని నేనె
  సృజన జేతును సృష్టిలో - నిజము గనుమ
  పురుష గర్భమే సృష్టికి - పుట్టినిల్లు !!!
  _____________________________________________

  రిప్లయితొలగించండి
 23. నమస్కారములు .
  ఇప్పుడే చూసాను .
  పొరబాటును తెలిపి నందుకు ధన్య వాదములు శర్మ గారూ ! కాక పొతే ఏం వ్రాయాలో ఇంకా తోచ టల్లేదు .

  రిప్లయితొలగించండి
 24. నలువ జనియించె విష్ణువు నాభి నుండి
  కడలి యందుండి ప్రభవించె కల్ప తరువు
  యాగ జలమున మాందాత యవన సుతుడు
  పురుష గర్భమే సృష్టికి పుట్టి నిల్లు

  రిప్లయితొలగించండి
 25. చాలా బావుందక్కయ్యా !
  పురుష గర్భం లో నుండి
  యెవరెవరు పుట్టారో కూడా చెప్పావు !

  రిప్లయితొలగించండి
 26. నమస్కారములు
  తమ్ముడు వసంత కిషోర్ గారికి ధన్య వాదములు

  రిప్లయితొలగించండి
 27. శ్రీగురుభ్యోనమ:

  వేయి శిరముల పురుషుడౌ విశ్వవిభుని
  కుక్షినందుండు లోకములక్షయముగ
  ప్రళయ కాలపు వేళలో భయము బాపు
  పురుషగర్భమే సృష్టికి పుట్టినిల్లు

  ప్రళయము వచ్చిననూ జీవరాశులను భద్రముగా తన కడుపున దాచుకొని కాపాడునట్టి శ్రీమహావిష్ణువు(సహస్ర శీర్ష పురుషుషుని) గర్భమే సృష్టికి మూలము.

  రిప్లయితొలగించండి
 28. క్లిష్టమైన సమస్యకు మిత్రుల పూరణలపై నేమాని పండితులు కానీ, గురువుగారు కానీ వ్యాఖ్యానించక పోవడం వెలితిగా ఉంది.

  రిప్లయితొలగించండి