13, ఏప్రిల్ 2012, శుక్రవారం

పద్య రచన - 3


గజేంద్రుని ఆర్తి

చదువును జ్ఞానమునొసగి
రి దయను గణపతియు, వాణి; రేపవలును నా
మది వీడక కొలువుండగ
కుదురగు బుద్ధిని నిలుపగ కోరుచు నుందున్.


పరుగున నేతెంచి కరిని
హరి గాచిన తీరు యబ్బురమ్మది భువిలో
విరుగగ పాపపు చయములు
సరసముగా జెపుదు నిపుడు ఛందోరీతిన్.

పన్నగశయనుడవయి నెల
కొన్న కమల నయనుడయిన గోవిందా! యా
పన్నుల గాచెడు దయ నీ
కున్నదనుచు నమ్మె యేనుగు తనదు మదిలో

స్థానబలముగల మకరమ
దేనుగు పాదమును బట్టి యీడ్చ,మడుగులో
తానే పోరెదననుకొని
దీనత పొందక జతనము తీరుగ చేసెన్.

కడకా గజమది యోడుచు
మడుగున నిన్నే పిలిచెను మాధవదేవా!
"వడివడిగా వచ్చి నిలిచి
విడు నీ చక్రము" ననుచును వేడెను తానే.

"సృష్టికి నీవే మూలము
భ్రష్టుడనైతిని తెలియక బ్రతుకుననెంతో
నష్టము పొందితి తండ్రీ!
కష్టము గట్టెక్క నన్ను కావగదయ్యా!"

జనకుండెవ్వరు ప్రాణికి,
జననియదెవ్వరు, పతియును, జాయయదెవరో,
కనగా సంతును స్వంతమె?
యని నాకు కలుగగ చింతలచ్యుత! నాథా!"

ఆదియునంతము నీవే
నాదనుదేమియును లేదు, నమ్మితి"ననగా
సాదరముగ కదలి కరిని
నీ దరి చేర్చి కరుణింప నీవేగితివే!

పాపపు చీకటులు తొలుగ
దీపము నీవైన కథల దెలుపుచు, నన్నున్
కాపాడెడు దైవమగుచు,
గోపాలా! వందనమిదె గొనుమా, కృష్ణా!

రచన
లక్ష్మీదేవి

15 కామెంట్‌లు:

  1. అమ్మా లక్ష్మీ దేవి గారూ!
    శుభాభినందనలు. మంచి ఖండికతో ప్రారంభము చేసేరు. ఈ కథలో కొన్ని విషయములు నాకు తోచిన రీతిగ చెప్పుచున్నాను.
    గజేంద్రుడు బలమద మత్తుడు. సరస్సులో ఇష్టము వచ్చిన రీతిగా భార్యలతో సరసాలాడుచున్నాడు. మకరమును తక్కువగా అంచనా వేసేడు. చాలా వరకు శ్రమించేడు. తనకు ప్రాణభయము వచ్చేసరికి "ఆర్తుడై" హరిని ఆశ్రయించేడు. భగవంతుని దర్శనమును పొందేడు. ఆ భాగ్యము కలిగినా తన శారీరికమైన ఆర్తిని పోగొట్టమనియే హరిని వేడుకొనినాదు. వానికి దేహ భ్రాంతి పోలేదు. జ్ఞానము కలుగ లేదు. అందుచేతనే మోక్షమును కోరుకోవాలి అని అనుకొనలేదు. వచ్చిన సదవకాశమును శారీరికమైన ఆర్తిని పోగొట్టుకొనుటకే ఉపయోగించుకొనినాడు.

    మకరము తెలిసో తెలియకో ఒక సద్గురువు వలె గజము యొక్క కామ, క్రోధ, మదాదులైన శత్రువులన్నిటినీ తొలగించేడు. హరిని ఆశ్రయించుటకు కారణమయినాడు. ఆఖరికి తాను హరి చేతిలోనే మోక్షమును పొందేడు.

    కొందరు అంటారు == హరిని ఆశ్రయించిన వాడు గజరాజు; హరి భక్తుడైన గజరాజును ఆశ్రయించినవాడు (కాళ్ళు పట్టుకొనిన వాడు) మకరము -- భగవంతుని ఆశ్రయించిన వారికంటే, భగత్ భక్తులను ఆశ్రయించిన వారికే సత్వర సత్ఫలము లభించును అని.

    మీ పద్యములు బాగుగా నున్నవి. రాను రాను ఇంకా బాగుగా పద్యములను రచించగలరని ఆశిస్తూ - శుభం భూయాత్.

    రిప్లయితొలగించండి
  2. పండితుల వారి సత్వర స్పందనకు బహుధా కృతజ్ఞురాలను.
    తమరు సూచించిన పిదప ఒక విషయమును తీసుకొని వ్రాయుటకు ధైర్యము కలిగినది.
    ఎంతైనా ప్రేరణ కలిగించు గజేంద్రమోక్షము అను విషయమును గ్రహించాను.
    నిజము చెప్పినారు. గజేంద్రుడు వేయేండ్లు పోరాడిన విధమును మహాశయులు శ్రీ పోతన భాగవతంలో కన్నులకు కట్టినట్టు వర్ణించారు. తర్వాతే భగవంతుడిని ఆశ్రయించాడు గజేంద్రుడు. మకరమునకు ముక్తి కలిగినది. గజేంద్రుడిని విష్ణుమూర్తి సాదృశ్య రూపుని గా భాసించాడనే పోతన గారు చెప్పియున్నారు.

    మీరు చెప్పిన ఇంకొక విషయం కూడా "భగవంతుని ఆశ్రయించిన వారికంటే భగవద్భక్తులను ఆశ్రయించినవారికే సత్వర సత్ఫలము " అని విని ఉన్నప్పటికీ నా మనసు అందులోని సత్యాన్ని గ్రహించలేదు. కానీ ఇప్పుడు గజరాజు ను ఆశ్రయించిన మకరము పొందిన సద్గతిని గురించి చెప్పి నాకు చక్కగా బోధపరిచారు. మీకు నేను కృతజ్ఞురాలను.

    ఎవ్వనిచే జనించు అంటూ మూల పురుషుని తత్త్వాన్ని గజరాజు గ్రహించాడు. మోక్షానికి కాకపోయినా ఆర్తితోనైనా సరే. అందుకే ఆ వర్ణనకు నేను ముఖ్యత్వాన్ని ఇచ్చాను. ఇక నేను ఇక్కడ ౯ పద్యాలలో క్లుప్తంగా చెప్పాలనుకోవటం వల్ల గజరాజు దేహాభిమానాన్ని గురించి ఎక్కువ చెప్పలేదు.

    చతుర్విధా భజంతే మాం జనాస్సుకృతినోర్జున
    ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీచ భరతర్షభ ||

    అంటూ భగవద్గీతలో కృష్ణపరమాత్ముడు ఆర్తితో తననే నమ్మి పిలిచినవారిని కూడా నాలుగు రకాల భక్తుల్లో స్థానం ఇచ్చాడు. ద్రౌపది, గజేంద్రుడు ఆర్తితో ప్రార్థించిన వారిలో ఉన్నారు.ధృవుడు అర్థార్థి, శుక, భీష్మాదులు జ్ఞానులు.
    పైగా గజేంద్రుడు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడనే రాజు. విష్ణువుకు పరమ భక్తుడు.అగస్త్యశాపము వలన ఏనుగు గా జన్మించాడు.
    విష్ణు నామము నోట పలకాలన్నా , విష్ణుకథలు చెప్పాలన్నా పూర్వసుకృతము లేనిదే సాధ్యమా. అందుకే నేను ఏనుగు భక్తికే ప్రాధాన్యత ఇచ్చాను.
    అయినా మూడవ పద్యము ఎనిమిదవ పద్యముగా పెట్టిఉంటే సరిగ్గా ఉండేదని మీ సూచన వలన గ్రహించాను.
    మీకు వేనవేల ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  3. గురువుగారు,
    నా పద్యములను ప్రకటించి నన్ను గౌరవపఱిచారు.
    ధన్యురాలను.

    రిప్లయితొలగించండి
  4. కందమునందముగానా
    నందమునందందగింపనడపుచు కవితా
    విందొనగూర్చిన లక్ష్మీ!
    అందుమునేనందజేయుఅభినందనలన్.

    రిప్లయితొలగించండి
  5. నమస్కారములు
    పద్యాలు చాలా బాగున్నాయి లక్ష్మీ దేవిగారు ! గజేంద్రుడి చిత్రం ఇంకా బాగుంది. అందించిన మీకు ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  6. లక్ష్మీదేవి గారికి,
    గజేంద్రుని ఆర్తిని కందములలో వర్ణించారు, బాగున్నది.
    హరికథలను పలుకుటచే
    హరి, లక్ష్మీదేవి! మీకు ననవరతంబున్
    సిరులిచ్చి బ్రోచు నెల్లెడ
    వరమగు సద్యశము లింక వైభవదీప్తుల్.

    రిప్లయితొలగించండి
  7. అమ్మా! శ్రీమతి లక్ష్మీదేవి గారూ!
    శుభాశీస్సులు. నేను ఒక్క పద్యమే వ్రాద్దామనుకున్నాను.

    సరసింజొచ్చి మదాతిరేక జనితోత్సాహమ్ముతో నాడుచున్
    కరి జిక్కెన్ మకరాధినాథునికి సంగ్రామ్మునన్ డస్సె న
    త్తరి ప్రార్థించెను శ్రీహరిన్ శరణు నాథా! యంచు నత్యార్తితో
    హరిచే నంతట బొందె రక్షణము ధన్యంబయ్యె తజ్జన్మమున్

    రిప్లయితొలగించండి
  8. బాగున్నది.
    ఒక్క పద్యములో కథనంతా చెప్పినా, గజేంద్రుని అహంకారాన్ని,ఆర్తినీ కూడా వదలకుండా చెప్పవచ్చునని చూపించారు.ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  9. సత్యనారాయణ మూర్తి గారు,
    నమస్కారములండి. మీ ఆశీస్సులు ఆనందకారకాలు.
    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  10. కరి మకరి పోరు వారలు
    హరి దరి జేరిన విధమ్ము నమ్మా లక్ష్మీ
    సరళమగు కందములలో
    మురిపెముగా పలికినారు మోదమ్మాయెన్.

    రిప్లయితొలగించండి
  11. మిస్సన్న గారు,
    ధన్యవాదాలండి. పెద్దలు మీరంతా చూపిన బాటలోనే అడుగులు వేస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  12. శ్రీ సరస్వత్యై నమః:

    మిత్రులారా!

    అందరూ అనేక ప్రక్రియలలో పద్యములను వ్రాయాలి శంకరాభరణములో వానిపై ప్రశంసలు రావాలి అని నా ఆకాంక్ష. ఈ దిశలో శ్రీమతి లక్ష్మీదేవి గారు తొలి ప్రయత్నము చేసేరు. కృతకృత్యులు అయ్యేరు. ఇక్కడితో ఆమె ఆగిపోరాదు. అలాగే మిగిలిన మనమంతా అదే బాటలో నడచి వీలైనన్ని పద్యములను శంకరయ్య గారికి పంపుచుందాము ఒక దినచర్య గా. శ్రీమతి లక్ష్మీదేవి గారికి మరొక మారు శుభాశీస్సులు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. కం.
    సరి వేసవి కాలమునన్
    కరి యొక్కటి నీరుద్రావ కడువేగమునన్
    చరణంబు బట్ట మకరియు
    నురుతరముగ సాగుచుండె యుద్ధము నంతన్ !!
    ....
    సీసము:-
    ఏనుగునిటు లాగ నీడ్చెమొసలి యటు
    ఏమిటో వైరంబు నెవరి కెరుక
    యాహారము కొకటి దాహమ్మునకు నోటి
    బాపురే ! యీ రెంటి బాధ యొకటి
    తొండమ్ముతో కరి తోకతోడ మకరి
    సరి గొట్టుకొనుచుండె జంతువులును
    విదిలించ గజరాజు , విడువదు జలరాజు
    పోరు భీకరమయ్యె ప్రొద్దు మాపు
    ....
    తే. గీ.
    అలసి పోయెను నేనుగు నాశ లేక
    ప్రార్థనలు జేసె! శ్రీ హరీ! పాహియంచు
    గరుడవాహనమెక్కియు గదలివచ్చి
    కరిని రక్షించెనంత మకరిని జంపె !!
    ....

    రిప్లయితొలగించండి