19, ఏప్రిల్ 2012, గురువారం

సమస్యాపూరణం - 682 (శంకరుఁడు సకలశుభ)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

శంకరుఁడు సకలశుభ నాశంకరుండు.

30 కామెంట్‌లు:

  1. కవిమిత్రులారా,
    నమస్కృతులు.
    నూతన వధూవరులతో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నాము.
    బ్లాగుమిత్రులకు సర్వశుభాలు చేకూర్చ వలసిందిగా ఆ సర్వ శుభంకరుని సన్నిధిలో ప్రార్థిస్తాను.

    రిప్లయితొలగించండి
  2. ఒదవె నాలోన నిప్పుడే యొక్క శంక
    "రుడు సకల శుభ నాశంకరుండటంచు"
    ననుటలో లుప్తమయ్యెనో నర్థవంత
    మైన పదజాలమంచు నో యాప్తులార!

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _____________________________________________


    సకల శుభముల కలిగించు - శక్తియుతుడు
    సర్వ పాపము లణగించు - సర్వుడతడు
    శక్తి సంపద లందించు - ముక్తి నిచ్చు
    శంకరుఁడు ! సకలశుభ , నా - శంకరుండు
    అర్థహితుడగు నరుడిల - హానికరుడు !

    _____________________________________________

    రిప్లయితొలగించండి
  4. శంక యేటికి నిక్కము శంకరుండు
    సకల శుభకరుం డతనికి సాటి లేరు
    వాని గొలువనశుభమ్ములు పారి పోవు
    శంకరుఁడు సకలశుభ నాశంకరుండు.

    (సకల + అశుభ... అని నా భావం)

    రిప్లయితొలగించండి
  5. కోరి వచ్చిన భక్తుని చేరదీసి
    సత్వ మందించి శాశ్వతైశ్వర్యమొసగు
    శంకరుడు, సకలశుభనాశంకరుండు
    గాదు, దురితసంఘంబుల కాల్చివేయు.

    రిప్లయితొలగించండి
  6. శ్రీ గోలి వారు! మీరు మరొకలా ప్రయత్నించండి. సకల + అశుభ = సకలశుభ అని సంధికార్యము చేయలేము. అందుచేత భావమే కాదు, వాక్యములలో అది నిర్దుష్టముగా ప్రతింబింబించాలి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. శ్రీ హనుమచ్చాస్త్రి గారూ,

    నాకు కూడా ఇదే ఆలోచన వచ్చింది. వ్రాద్దామని ప్రారంభించినాను. తీరా పరికించి చూస్తే, సకల, శుభము అనేవి రెండూ సంస్కృతపదాలు కావడము వలన సకల + అశుభము = సకలాశుభము అవుతుంది.

    సకల + అశుభము = సకలశుభము అవడానికి వీలులేదు. "అ" కార సంధి తెలుగు సంధి. రెండు సంస్కృతపదాలతో అకారసంధి చేయలేము.

    ఇది నా ఆలోచన. విజ్ఞులు పరిశీలించవలసినదిగా విన్నపము.

    రిప్లయితొలగించండి
  8. శంకరుడు సకల శుభ నా శం కరుండు
    ననుట న్యాయమ? జగతిని నార్యులకును
    శం కరో తీ తి శంకర : శాస్త్ర ముండె
    సకల శుభముల నిచ్చును శంక రుండు .

    రిప్లయితొలగించండి
  9. ఎన్నికలవేళ వేదికలెక్కి యొకడు
    తివిరి ప్రత్యర్థి నిట్లని దిట్టుచుండె,
    వాని గెలిపించ బోకుడు వాడు నిధివ
    శంకరుడు, సకలశుభనాశంకరుండు.

    రిప్లయితొలగించండి
  10. రతీదేవి స్వగతం, మారుడు పునర్జీవితుడయ్యేలోపు:

    మంగళవరుడు మంగళమైధరుండు
    మంగళకరుడు సురమునిమానుషాసు
    రగణవినుతుండు,కాడొక్క రతికి నేడు
    శంకరుడు, సకల శుభ నాశంకరుండు.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. శ్రీ రామకృష్ణ గారి స్ఫూర్తితో:

    అత్యహంకారియై దక్షు డంధుడట్లు
    ద్వేషమున జ్ఞానము నశింప ప్రేలె నకట!
    శంకరుడు సకల శుభ నాశంకరుండ
    టంచు నపరాధియై ఫలమనుభవించె

    రిప్లయితొలగించండి
  12. జిగురు సత్యనారాయణగురువారం, ఏప్రిల్ 19, 2012 12:34:00 PM

    స్వంత పార్టీనె తిట్టెడి వింత నేత
    వంతపాడును పరులకు వరుస తప్పి
    ఓట్లు రావిక,కలుగును పాట్లు,కాన
    శంకరుఁడు సకలశుభ నాశంకరుండు!!

    రిప్లయితొలగించండి
  13. జిగురు సత్యనారాయణగురువారం, ఏప్రిల్ 19, 2012 1:11:00 PM

    దక్షుడు పలికె నిట్టుల కక్ష తోడ
    కన్నులెన్నియుండిననేమి? కాన లేడు
    పిన్న పెద్దల భేదము పెంకి వాడు
    శంకరుఁడు సకలశుభ నాశంకరుండు!!

    రిప్లయితొలగించండి
  14. అయ్యా! శ్రీ మిస్సన్న గారూ!
    జాతకములో వక్ర శనికి, శంకరుని లక్షణములకి ముడిపెట్టుట సరికాదు. ఆలోచించండి.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. నేమాని పండితార్యా ధన్యవాదములు.
    నేను భయపడి నంతా అయింది. నా పూరణలో ఆఖరి పాదంలో
    ఆతడు అంటే నా ఉద్దేశం శనైశ్చరుడు అని. శంకరుడని కాదు. పరవా లేదంటారా.

    రిప్లయితొలగించండి
  16. అయ్యా! శ్రీ మిస్సన్న గారూ!
    శుభాశీస్సులు. మీరు తొందరపాటులో పూరించేరు. తీగ లాగితే డొంకంతా కదిలింది.

    1. ఇవ్వబడిన సమస్య మీ పద్యములో పూర్తి పాదముగా కనుబడుట లేదు.

    2. శని యొక్క ఫలితములను చెప్పేటప్పుడు కేవలము వక్రగమనమును బట్టి చెప్పగలమా? శని స్థితి, బలము, దృష్టి మొదలగు అనేక అంశములను పరిగణనలోకి తీసుకొనవలెనేమో. నాకు జాతక విద్యలో ప్రవేశము లేదు. అందుచేత నా ఊహ తప్పు కావచ్చును.

    3. పై విషయములను గణనలోనికి తీసికొని మరొక ప్రయత్నము చేయండి.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. శంకరయ్య గారు!
    సమస్యాపాదాన్ని ’శంకరుండు సర్వశుభ నాశంకరుండు’ గా మారిస్తే మరింత అందగిస్తుంది కదూ!

    రిప్లయితొలగించండి
  18. శంకరుఁడు లయకారుడు; సర్వ సృష్టి
    లయము చేయుచు నుండడె, రయము గాను.
    కనగ శుభము నశుభములొకటిగ నెంచు.
    శంకరుఁడు సకలశుభ నాశంకరుండు,
    శంకరుఁడు సర్వ యశుభనాశంకరుండు.

    రిప్లయితొలగించండి
  19. దక్షుడిట్లు నిందించెను కక్ష తోడ
    రుద్రభూమి నివాసమ్ము ,రోత వుట్టు
    భస్మరాశియె మైపూత, పాప రేడు,
    భూషణమ్ము వాడెటు సభా పూజ్యుడౌను ?
    శంకరుడు సకలశుభనాశంకరుండు .
    ----------------

    రిప్లయితొలగించండి
  20. స్థితి లయముల కాతడే సృష్టి కర్త
    ముజ్జగంబుల నేలెడి ముక్తి యుతుడు
    బేధమున కైనను తుదక బేధ మైన
    శంకరుడు సకల శుభ నా శంకరుండు

    రిప్లయితొలగించండి
  21. డా. ఆచార్య ఫణీంద్ర గారు చిన్న సూచన చేసి విడిచిపెట్టేరు కానీ సమస్యను పూరించి మాకు ఆవిధముగా విందు చేయలేదు. ఇప్పుడైనను మించిన దేమి కలదు? మా ఎదురుచూపులను ఫలవంతములు చేయండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  22. నేమాని పండితార్యా అవును నేను అసలు సమస్య పాదాన్నే విడచి పెట్టేశాను కదూ. ఏమిటో నా పూరణ. దాన్ని మరచి పొండి. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  23. రావణా శంభు దాసువై రామ పత్ని
    నిట్లు దొంగిల న్యాయమే యేమి కాడె
    శంకరుఁడు సకలశుభ నాశంకరుండు
    నీ కుచేష్టల కనె హన్మ ప్రాకటముగ.

    రిప్లయితొలగించండి
  24. పండిత నేమాని వారికి, సంపత్ గారికి ధన్యవాదములు..
    నా తప్పును సవరించుచున్నాను...

    శంక యేటికి నిక్కము శంకరుండు
    సకల శుభకరుం డతనికి సాటి లేరు
    తప్పు చెప్పకు మెప్పుడు తలచ కిట్లు
    శంకరుఁడు సకలశుభ నాశంకరుండు.

    రిప్లయితొలగించండి
  25. విద్యాసాగర్ అందవోలుసోమవారం, ఏప్రిల్ 23, 2012 6:18:00 AM

    శంకరయ్య గారికీ, పండితమ్మన్యులందరికీ నమోవాకాలు

    చాలా రోజుల తరువాత నా పూరణ పంపే అవకాశం కుదిరింది.

    అది కూడా ఆలస్యంగా. అందరి పూరణలూ చూస్తుంటే నా పూరణలు పంపే ధైర్యం రావట్లేదు.

    ఎట్టకేలకు ధైర్యం కూడగట్టుకొని పంపుతున్నాను.

    శంకరుడు సకల శుభ నాశంకరుండు

    ననుచు బల్కిన నెవ్వరు నమ్ము వారు?

    శరణు కోరిన వారల దరికి జేర్చి

    సర్వ శుభముల గూర్చునా శంకరుండు

    రిప్లయితొలగించండి
  26. అయ్యా! అందవోలు విద్యాసాగర్ గారూ!
    నమస్కారం,
    మీరు "పండితమ్మన్యులందరికీ" అన్నారు. పండితమ్మన్యుడు అంటే "తనకుతాను పండితుడుగా భావించుకునేవాడు" అని అర్థం. ఈ విధంగా అనటం మంచిది కాదనుకుంటాను. ఆలోచించండి.

    రిప్లయితొలగించండి
  27. విద్యాసాగర్ గారూ,
    పండితమ్మన్యుడి గురించి నేను వ్యాఖ్య పెట్టేలోగా స.నా.మూర్తి గారు వివరణ ఇచ్చారు. తాను పండితుడు కాకున్నా పండితుణ్ణని చెప్పుకొనేవాడు "పండితమ్మన్యుడు"
    నేను చదువుకొనే రోజుల్లో (1970 లో అనుకుంటా) మా కాలేజీలో ఒక సాహిత్య సభకు ముఖ్య అతిథిగా కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు వచ్చారు. స్వాగత వచనాలు పలికిన మా సహవిద్యార్థి (గాదె శంకరయ్య) పండితశ్రేష్ఠుడు అనే అర్థంలో "విశ్వనాథ వంటి పండితమ్మన్యులు ఈ సభకు ముఖ్య అతిథిగా రావడం మా అదృష్టం" అన్నాడు. వేదిక మీద ఉన్న మా లెక్చరర్లు నెత్తీ, నోరు, చెంపలు వాయించుకున్నారు. విశ్వనాథ వారు నవ్వి "నిజం చెప్పావురా అబ్బాయ్! నేను పండితుణ్ణి కాకున్నా గర్విష్ఠినని పేరు ఎలాగూ ఉంది" అని సరదాగా నవ్వేశారు.
    కార్యక్రమానంతరం పాపం మా శంకరయ్యను అందరూ చీవాట్లు పెట్టారు.

    రిప్లయితొలగించండి
  28. విద్యాసాగర్ అందవోలుసోమవారం, ఏప్రిల్ 23, 2012 8:03:00 AM

    మూర్తి గారూ,

    నమస్కారం. నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది. తెలిస్తే, ఆ విధంగా సంబోధించే వాడిని కాదు, పండితోత్తములందరికీ అనే ఉద్దేశ్యం లోనే రాసేను గానీ మరి వేరు కాదు,

    మీ అందరికీ పేరు పేరునా క్షమాపణలు తెలియ చేసుకొంటున్నాను, నా అజ్ఞానాన్ని పెద్ద మనసుతో మన్నించ గలరు.

    విద్యాసాగర్ అందవోలు

    రిప్లయితొలగించండి
  29. విద్యాసాగర్ గారూ!
    తెలియక పొరపాటు పడి ఉంటారనే అనుకున్నాను. పర్వాలేదు. "ప్రమాదో ధీమతామపి"

    రిప్లయితొలగించండి