30, ఏప్రిల్ 2012, సోమవారం

సమస్యాపూరణం - 690 (ఏడుకొండలవాఁడు)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

ఏడుకొండలవాఁడు కాపాడలేఁడు.

 ఈ సమస్యను సూచించిన 

పోచిరాజు సుబ్బారావు గారికి 

ధన్యవాదాలు.

28 కామెంట్‌లు:

  1. గురువు గారికి ధన్యవాదములు
    .
    పాపకర్మలు చేయుచు పరుల కీడు
    కోరు వారిని; ముడుపుగ కోటి కోట్ల
    రూకలను పోసియున్నను రూఢిగనిక
    నేడుకొండలవాఁడు కాపాడలేఁడు.

    రిప్లయితొలగించండి
  2. కనగ జనులను ముంచిన ఘనులె యైన
    కోట్ల ధనమును కాజేసి కొండలయ్య
    భాగ మింతని ముడుపుల భక్తి నిడిన
    ఏడుకొండలవాఁడు కాపాడలేఁడు.

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    వేంకటేశ్వరుడంటేనే పాపములనుండి రక్షించు వాడని గదా అర్థం :

    01)

    ___________________________________


    పాప కర్ముల పాపముల్ - బాపి కాచు
    ఏడు కొండలవాడు ! కా - పాడలేడు
    మనుజ మాత్రుడు యెంతటి - మంత్రి యైన
    మనుష జన్ముల పాపముల్ - మాసి పోవ !
    ___________________________________

    రిప్లయితొలగించండి
  4. దేశరక్షణబాధ్యత తీసుకొనియు
    బాస లలనాడు దీటుగ చేసియుండి
    నిధులు మ్రింగుటె పనియను నేత నెప్పు
    డేడుకొండలవాడు కాపాడలేడు.

    రిప్లయితొలగించండి
  5. మిత్రుల పూరణ లలరిస్తున్నాయి.

    ఎందుఁ గలడంచు నడుగగా హృదిని జూపు
    పరమ భక్తులఁ బ్రోచును నిరతిఁ దోడ
    నేడు కొండల వాఁడు , కాపాడ లేఁడు
    భక్తవరులను భంజించు పాప రతుల !

    రిప్లయితొలగించండి
  6. గాలిలో దీపమునుబెట్టి కడు అమాయ
    కముగ దేవుడానీదెభారమననేల?
    ఆచరింపక మార్గత్రయముననొకటి-
    ఏడు కొండలవాడు కాపాడలేడు.

    [మార్గత్రయము = భక్తి,జ్ఞాన,కర్మ]

    రిప్లయితొలగించండి
  7. ఏడు కొండలవాడు కాపాడ లేడు
    లేడు మా దేవుడే యెల్లరి యెడ
    నొక్కడే యొక్క దిక్కంచు బ్రక్కద్రోవ
    లందు జేర్చుచునుందు రేమందు నకట!

    రిప్లయితొలగించండి
  8. వసంత కిశోర్ గారూ,
    ‘మాత్రుడు + ఎంతటి’ ఇక్కడ సంధి నిత్యం. యడాగమం రాదు. ‘మాత్రుడు తానెంత’ అంటే సరి.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ‘నిరతి తోడ’ అంటే చాలు. అక్కడ ద్రుతకార్యం అవసరం లేదు.
    *
    పండిత నేమాని వారూ,
    రెండవ పాదంలో టైపాటు వల్ల గణం తప్పింది.

    రిప్లయితొలగించండి
  9. ఏడు కొండల వాడు కాపాడ లేడు
    ననెడు మాటలు సత్యము లవియ కావు
    వేడు కోలున దప్పక వేంక టేశు
    కావు సేయును నిజ మిది కల్ల కాదు .

    రిప్లయితొలగించండి
  10. గురువు గారూ ధన్యవాదములు. తోడ అనే విభక్తి ప్రత్యయ ముండడము వలన నిరతి పై ద్రుతము పెడితే మరో విభక్తి ప్రత్యయము చేర్చి నట్లవుతుంది. ఇదివరలో మా అన్నగారు కూడా చెప్పారు. తప్పు తెలిసింది.

    నా సవరించిన పద్యము ;

    ఎందుఁ గలడంచు నడిగిన హృదిని జూపు
    పరమ భక్తులఁ బ్రోచును నిరతి తోడ
    నేడు కొండల వాఁడు , కాపాడ లేఁడు
    భక్తవరులను భంజించు పాప రతుల !

    రిప్లయితొలగించండి
  11. కిశోర్ జీ ఉత్వ సంధి నిత్య సంధి. ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధి యగు . అంటే సంధి చేసి తీర వలసిందే . సంధి జరగవలసిన చోట యడాగమము రాదు.

    రిప్లయితొలగించండి
  12. ఎన్ని ముడుపులు చెల్లింప నేమి ఫలము?
    దోషపరిహారమునకు నిర్దుష్ట రీతి
    నిజముగా సర్వమర్పించి ,నేర బుద్ధి
    విడచి, నిష్కాములై స్వామి వేడకున్న
    ఏడుకొండలవాడు కాపాడలేడు.

    రిప్లయితొలగించండి
  13. కార్య నిర్వహణార్థపు చర్య లొదలి,
    మానవ ప్రయత్నమన్నది మఱచి పోయి,
    నీవె దిక్కని మ్రొక్కిన నిష్పలంబు
    ఏడుకొండల వాడు కాపాడ లేడు!

    రిప్లయితొలగించండి
  14. సుబ్బారావు గారూ,
    ‘లేడు + అనెడు’ అన్నప్పుడు ‘లేడనెడి’ అవుతుంది కదా! అక్కడ ‘లేడ/టన్న" అంటే సరి!
    *
    సహదేవుడు గారూ,
    అది ‘వదలి’ కదా! ఒదలి అన్నారు. అక్కడ ‘చర్యలుడిగి’ అందాం.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ శంకరయ్యా గారూ నమస్కారములు. తొందరపాటు వలన తప్పు దొరలినది. అప్పుడప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొనమని ఇటువంటి తప్పులే గుర్తు చేస్తుంటాయి. 2వ పదమును సవరించేను. పద్యమును ఇలా చదువుదాము:

    ఏడు కొండలవాడు కాపాడలేడు
    లేడటంచు, మా దేవుడే యెల్లరియెడ
    నొక్కడే యొక్క దిక్కంచు బ్రక్క ద్రోవ
    లందు జేర్చుచునుందు రేమందు నకట!

    రిప్లయితొలగించండి
  16. 1.
    బొంకు లాడెడు వానిని, శంకలేక
    పాప కృత్యాల కొడిగట్టి, బహుళగతుల
    గురుని దూషణ చేయుచు తిరుగువాని
    నేడు కొండలవాడు కాపాడలేడు.
    2.
    ముందు వెనుకలు చూడక మూర్ఖులగుచు
    రాజమార్గాన నంధులై రయముతోడ
    బండ్లు నడిపెడు మత్తుల ప్రాణవాయు
    వేడు కొండలవాడు కాపాడ లేడు.

    రిప్లయితొలగించండి
  17. గురువుగారికి నమస్కారములతో
    ----------
    ఏడు జన్మల సరిబడు పాడు పనులు
    జేసి, కోట్లు ముడుపుగట్టి, సేవజచ్చి
    వేడు కొనిన వారలయొక్క కీడు త్రుంచి
    ఏడు కొండలవాడు కాపాడలేడు|

    రిప్లయితొలగించండి
  18. పండిత నేమాని వారూ,
    మరి రెండవ పాదంలో యతి?

    రిప్లయితొలగించండి
  19. అయ్యా శంక్రయ్య గారూ! ఒకటి కింకొక్క తప్పుజేయుచు తడబడు బడుగు వానిని .. .. .. ఏడు కొండలవాడు కాపాడలేడు కదా. 2వ పాదమును ఇలా సవరించుదాము.

    "లేడు మా దేవుడే యెల్లరికిని కాదె"

    రిప్లయితొలగించండి
  20. పండిత నేమాని గారు!
    ఈ మధ్య ’బాల వ్యాకరణం’ తిరుగవేసి చాల కాలమయింది. సమాస పరిచ్ఛేదంలోని రెండవ సూత్రం పూర్తిగా నా స్మృతి పథంలో నుండి చెరిగిపోయిందనే చెప్పాలి.
    మన వాదోపవాదాల వలన, నిన్న మా గురువుగారి జయంతి సభ నిర్వహణానంతరం మళ్ళీ అధ్యయనం చేసినాను.
    "సాంస్కృతి కాచ్ఛిక మిశ్ర భేదంబుచే సమాసంబు త్రివిధంబు. అందు సాంస్కృతికంబు సిద్ధంబని, సాధ్యంబని ద్వివిధంబు..."
    ఆ ప్రకారము ...
    లక్ష్మీ వల్లభుడు - సిద్ధము
    లక్ష్మి వల్లభుడు - సాధ్యము
    రెండూ వ్యాకరణ బద్ధమే!
    ఆ మాటకు వస్తే పై సూత్రం ప్రకారం మిశ్రమ సమాసమూ వ్యాకరణ బద్ధమే!
    అయితే మిశ్రమ సమాసాలను చాల మంది పండితులు పరిహరించినట్టే, సాధ్యాలను కొందరు పండితులు హర్షించరు.
    అందువలన నేను అవి ప్రయోగించి చాల రోజులయింది. అదే ధ్యాసలో 'అవనిజాత'ను దోషంగా పేర్కొన్నట్టున్నాను. ఏమైనా ఈ విషయంలో ప్రయోగాన్ని తప్పు పట్టడం కన్న, కవి విచక్షణకే వదలివేయాలేమో!
    కిషోర్ కుమార్ గారు 'అవనిజ' ఉదాహరణతో సులభంగా తేల్చిపారవేసినట్టు 'అవనిజాత' ప్రయోగం తప్పయితే కాదు.
    కిషోర్ కుమార్ గారి సద్యః స్ఫూర్తికి నా ప్రత్యేక అభినందనలు! మరొకమారు అధ్యయనం చేసే అవకాశం కల్పించినందుకు మీకు నా హార్దిక ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  21. గర్భ గుడిలోన పూజించి నిర్భ యముగ
    గుడిని మ్రింగును మెలమెల్ల గుట్టు గాను
    చర్చ నీయాంశ మయ్యెనే డర్చకుండు
    ఏడు కొండల వాడు కాపాడ లేడు !
    ----------------------------------------------
    లంచ ములుమెండు జమచేసి వంచ కుండు
    తిరుమ లేశుని బంగారు తీగ తొడిగి
    పంగ నామము లలదుచు భక్తి యనిన
    ఏడు కొండల వాడు కాపాడ లేడు

    రిప్లయితొలగించండి
  22. డా. చి. ఆచార్య ఫణీంద్ర గారూ! శుభాశీస్సులు.
    మీరు శ్రమ తీసికొని వ్యాకరణ సూత్రములను తిరగవేసి మాకు వివరణ ఇచ్చినందుకు చాల సంతోషము. శుభం భూయాత్.

    రిప్లయితొలగించండి
  23. లక్ష్మీదేవి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మంచి విరుపుతో చక్కని పూరణ చేసారు. అభినందనలు.
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    చక్కని విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    ఊకదంపుడు గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మనమేమో ‘ఏకం సత్ - బహుధా వదంతి విప్రాః’ అంటాం. కాని మా దేవుడే నిజమైన దేవుడు, మిగిలినవారు సైతానులు అనే వాళ్ల గురించి ఏమనగలం? చక్కని పూరణ. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మంచి పూరణ. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    సంతోషం.... స్వస్తి!
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండు పూరణలూ అన్నివిధాల బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. ఏడుగడ నీ వనిన మన కేలఁ గాఁడు ?
    సకల భూతములకు రక్ష చక్రధరుఁడు
    కలి యుగమ్మున వెలయఁగా , ఖలుఁడె పలుకు
    ' నేడుకొండల వాఁడు కాపాడ లేఁడు '

    రిప్లయితొలగించండి
  25. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ తాజా పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి