12, ఏప్రిల్ 2012, గురువారం

కళ్యాణ రాఘవము - 11

కళ్యాణ రాఘవము - 11

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

తే.గీ.
తివిరి నీ తీర్చిదిద్దిన రవికులంపు
రాజుల కెవండు వ్రేల్ సూపు బ్రహ్మతనయ!
క్రొత్తసంబంధమున బుధుల్ కులవిశుద్ధి
దెలుపు టది సంప్రదాయమై వెలసెఁగాక! (153)

తే.గీ.
ఎవరి దివ్యాత్మశక్తిమై నవతరిల్లు
దృఢతరమ్మగు సంతానదీర్ఘతంతు
వమ్మహాత్ముల ప్రస్తావనమ్ముఁ జేసి
సుదిన మగుగాఁత వాసర మ్మిది మునీంద్ర! (154)

చం.
నిమికిఁ గుమారుఁ డయ్యె మిథి; నిర్మితమయ్యెఁ దదీయనామధే
యమునన యీపురమ్ము; జనకాహ్వయుఁ డాతని నందనుండు వి
శ్వమున వెలింగినాఁడు తన చల్లనిపేరున; దానిఁ బూజ్యభా
వమున వహింత్రు మాకులమువారు కిరీటమువోలె నేఁటికిన్. (155)

కలిగెను దేవరాతుఁ డన గణ్యుఁడు తత్కులమందు, దేవతా
వళిఁ గడు నెయ్యుఁడై మెలఁగువాఁ డత, డాతని చేతఁబెట్టె ము
న్నలఘుఁడు శంకరుం డల మహాధను; వద్దియకాదె విక్రమో
జ్వలుఁడగు రామభద్రు కరసంగతి భంగముఁ జెందె నింతకున్. (156)

తే.గీ.
మఱి మహావీర సుధృతి కీర్తిరథ కీర్తి
రాతముఖ్యు లన్వర్థవిఖ్యాతనాము
లాశ లన్ని గెలిచి గర్వ మందఁబోరు
రాజు లయ్యును విషయానురక్తిఁ గొనరు. (157)

ఉ.
ఆవిభు లెల్లరుం గరతలామలకంబగు నాత్మతత్త్వమున్
భావనసేయుచుం బ్రకృతిపాలనముం బొనరింత్రు ధర్మక
ర్మావిరతప్రశాంతిగఁ, దదన్వయమందున హ్రస్వరోముఁ డన్
భూవరుపుత్రులై పొడముపున్నెము సేసితి మేను దమ్ముఁడున్. (158)

మ.
ఘనదర్పోన్నతుఁడై సుధన్వుఁ డను సాంకాశ్యప్రభుం డమ్మహా
ధనువున్ సీతను గోరి పోరి మిథిలాధన్యోపకంఠంబునం
దన ప్రాణమ్ములు వీడె ము న్నది మొద ల్తద్రాజ్యముం బ్రోచు నా
యనుజన్ముండు కుశధ్వజుం డితఁడు ధర్మాయత్తచిత్తంబునన్. (159)

తే.గీ.
ధన్యుఁడను రఘువంశబాంధవము కతనఁ
గూర్మి మొలకల నిత్తు మీ కోరినట్లు
రామలక్ష్మణుల" కఁటన్న భూమివరుని
పలుకులకు సభ సమ్మోదభరితమయ్యె. (160)

తే.గీ.
అంతఁ గేలెత్తి గాధేయుఁ డనియె నిట్లు
"సీతయున్ రాముఁడుం బిడ్డలై తనర్చు
జనకదశరథులారా! మీ సాటి సుకృతు
లవని లేరన్న నిది ముఖస్తవము గాదు. (161)

ఉ.
సీత యయోనిజాత యనఁ జెప్పెడిదే మిఁక రాముఁ డన్ననో
ప్రీతిని వాని ముచ్చటల విన్కలిఁ బ్రొద్దులు పుచ్చుచుందు రు
ద్యోతితలోకులై మెఱయుచుండు మహర్షులు సైత; మింతకున్
భూతల మొక్క పెన్వెలుఁగుఁ బొందుఁ దదుజ్వలభావిజీవికన్. (162)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి