4, ఏప్రిల్ 2012, బుధవారం

సమస్యాపూరణం - 667 (విధవ యనుచుఁ బిల్చె)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

విధవ యనుచుఁ బిల్చె విభుఁడు సతిని.


23 కామెంట్‌లు:

 1. నమస్కారములు.
  సోదరులు మిస్సన్న గారు చెప్పినట్టు " గురువులు సవరణ చేయక పొతే వెలితి గా ఉండ డమే గాక ముఖ్యం గా " సరిగా వ్రాయడం చేత గాని నాకు " తప్పులు తెలియవు సరికదా , వ్రాయాలన్న ఇంట్రస్ట్ కుడా ఉండ డంలేదు. దయచేసి శ్రమ తీసుకుని గురువులు ఎవరైనా , సరి జేయ ప్రార్ధన .సెలవు

  రిప్లయితొలగించండి
 2. పుట్టినింటి పేరు వొట్టి 'విశాలాక్షి'

  పెండ్లినాటి పేరు పేర్మి 'ధవళ'

  కలము పేరు 'వనిత' కలుపుచు ముద్దుగా

  విధవ యనుచు బిల్చె విభుడు సతిని.

  రిప్లయితొలగించండి
 3. అఖిలజనులయందు నవ్యాజమగు ప్రేమ
  జూపి కలహములను బాపి నట్టి,
  సరస భాషణముల సౌందర్య రాశి భా
  విధవ, యనుచు బిలిచె విభుడు సతిని.

  రిప్లయితొలగించండి
 4. విధవ పదమున కర్దము వేయి యేళ్ళు
  ధనము కలిగియు వర్ధిల్లు ధర్మ పత్ని !
  ననుచు నామెపై నను రక్తు డై సొబగున
  విధవ యనుచు బిల్చె విభుడు సతిని .

  రిప్లయితొలగించండి
 5. నాదు భాగ్య రేఖ! నా ప్రేమ రూపమా!
  నాకు తోడు నీడ! నా హృదయమ!
  నాదు వలపు బంధనమ్మ! రమ్మిటు పల్ల-
  వి! ధవ! యనుచు బిల్చె విభుడు సతిని

  రిప్లయితొలగించండి
 6. శ్రీగురుభ్యోనమ:

  ముద్దు సుతుని తండ్రి ముద్దులాడుచును భా
  విధవ యనుచుఁ బిల్చె, విభుఁడు సతిని
  మోహనాంగి యనుచు మోదమున బిలచె
  పిలుపు పిలుపు లోన వలపు మారు

  రిప్లయితొలగించండి
 7. ధన్యవాదాలు గురువుగారు,
  నిజమేనండి. రెండవ పాదం విషయంలో అసంతృప్తి గానే ఉంది.

  సవరణ
  సర్పరాజును పూజింప సమయమెద్ది?
  పాలు ద్రావ పుట్టవెడలి పాము రాదొ?
  జానకికి రామునికెపుడు జరుగు పెండ్లి?
  నాగపంచమి, వచ్చును, నవమి నాడు


  "ధవుని కోలుపోయె, దానికీ గతి నేడు
  విధవ యనుచుఁ"; బిల్చె విభుఁడు సతిని;
  దిగులు విడిచెనామె;ధీరమంది,తనదు
  సోదరి కయి కోరె సుంత ధనము.

  రిప్లయితొలగించండి
 8. సంపత్కుమార శాస్త్రి గారూ ,మిస్సన్న గారూ "భావి ధవ" . "ధవ ' శబ్దములు వచ్చు నట్లు పూరించినారు . దీని భావమేమి తిరుమలేశ !

  రిప్లయితొలగించండి
 9. సవరణ

  "తోడ బుట్టువు కద, దుఃఖపు సమయము,
  పిల్ల పెండ్లి చేయ పెద్ద ఖర్చు;
  చేతనయిన వరకు చేయూత నిచ్చెద,
  పతిని చేరి యడుగ భయమదేల?

  ధవుని కోలుపోయె, దానికీ గతి నేడు
  విధవ యనుచుఁ"; బిల్చె విభుఁడు సతిని;
  దిగులు విడిచెనామె;ధీరమంది,తనదు
  సోదరి కయి కోరె సుంత ధనము.

  రిప్లయితొలగించండి
 10. గోలి హనుమచ్ఛాస్త్రి గారి పూరణ.....

  వెధవ యనిన నిట్లు ’వెయ్యెళ్ళు ధనముతో
  వర్ధిలగను’ జెప్పు ప్రథమ పదము
  ‘విభుని గూడి’ యనుచు వేరుగా మారిచి
  విధవ యనుచు బిల్చె విభుడు సతిని.

  రిప్లయితొలగించండి
 11. ధర్మపత్నియనియె దాసిని కోపాన
  విధవ!యనుచు, పిలిచె విభుడు సతిని
  రాగదోయి భామ! రవ్వంత వినుమీవు
  తగదు పల్కుటిట్లు తగ్గుమంచు.

  రిప్లయితొలగించండి
 12. శ్రీ కంది శంకరయ్య గురువుగారికి నమస్కారములు. గురువుగారూ మన్నించండి.

  అజ్ఞాతగారికి నమస్కారములు. మీరు మిత్రుల పూరణలలోని తప్పులను గుర్తించి సవరించుకోమని తెలియజేస్తున్నారు. చాలా చాలా ధన్యవాదములు. కానీ మీరు మీ నామధేయయమును ప్రకటించనందువల్ల పలురకములైన అనుమానమూకు దారితీస్తున్నది. అజ్ఞాతలు ఎక్కువ అవటంవల్ల గురువుగారికి కూడా శ్రమకలుగుచున్నది. పద్యములు వ్రాయుటకు, వ్యాఖ్యలు చేయుటకు మాకు చేత కాకున్ననూ వీలున్నపుడల్లా మీవంటి కవులు వ్రాసిన పద్యములను చదివి ఆనందిస్తుంటాము. కనుక మీరు మీ నిజనామముతో వ్యాఖ్యలు చేయండి.

  గురువుగారూ మీరు అజ్ఞాత పేరుతో వచ్చు వ్యాఖ్యలను (ప్రశంశలైననూ, విమర్శలైననూ సరే) తొలగించ ప్రార్థన.

  ఇట్లు
  బుధ విధేయుడు
  విజయకుమార్
  కదిరి, అనంతపురం జిల్లా

  రిప్లయితొలగించండి
 13. పెద్దలకు ప్రణామాలు.

  నిన్న అజ్ఞాత గారు ఉదాహరించిన పూరణవృత్తాంతాన్ని చూసి ఈ సంగతి చెప్పాలనిపించింది: ఇది 18-వ శతాబ్ది నాటి సమస్య, దాని పూరణ - మద్రాసు ప్రాచ్యలిఖితపుస్తక భాండాగారంలోని సి.పి. బ్రౌను సంచయంలో ఉన్నాయి. దీపాల వారు చాటుపద్యరత్నాకరంలో గ్రహించారు.

  ఒక వేశ్య ప్రశ్న:

  మొల్ల సుగంధి కూఁతురదె ముంగిట నున్నది దానిఁ జూడు; నే
  నెల్ల విధంబులన్ రతుల నేలెడుదానను నన్నుఁ జూడు; ము
  త్ఫుల్లసరోజనేత్ర వరపుత్త్రిక దానిఁ జూడు; నా
  కల్లుఁడ వయ్యెదో? మగఁడ వయ్యెదొ? మనుమండ వయ్యెదో?

  అందుకు రసికుని సమాధానం:

  మొల్లసుగంధి కూఁతురిని ముంగిటఁ గంటిని దాని మాన; నీ
  వెల్ల విధంబులన్ రతుల నేలెడుదానవు నిన్ను మాన; ను
  త్ఫుల్లసరోజనేత్ర వరపుత్త్రిక దాని మాన; నీ
  కల్లుఁడ నయ్యెదన్, మగఁడ నయ్యెద; నీ మనుమండ నయ్యెదన్.

  దీనిలో ఉన్న తీరును పరిహరించి, సక్రమసంబంధంగా పూరించమని శ్రీ మిన్నికంటి గురునాథశర్మ గారిని కోరటం జరిగింది. శ్రీ శర్మ గారి అభిజనం మా ఏల్చూరు గ్రామమే!

  విధేయుఁడు,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 14. అజ్ఞాత గారూ ధవ అనే పదాన్ని భార్య అనే అర్థం వాడేను.
  ఉచితానుచితాలు పెద్దలు నిర్ణయించాలి.

  " కన్నతల్లి కన్న ఘన దైవ ముండునే
  యెవరు కూడ దనిరి యీ శుభాన
  విధవ యనుచుఁ " బిల్చె విభుఁడు సతిని మ్రొక్కు
  మనుచు ముందు తల్లి యంఘ్రులకును.

  రిప్లయితొలగించండి
 15. ఈ నాటి సమస్యకు నా పూరణలు:
  1. మంగళసూత్రం 2. పసుపు 3. కుంకుమ 4. గాజులు 5. చెవ్వాకు అనే మాంగల్యచిహ్నాలు ఉండటం "ఐదువ" లక్షణాలని అంటారు అంటున్న భార్యకు అది కృతకవ్యుత్పత్తి అని; సంస్కృతంలోని "అవిధవా" శబ్దం నుంచి ఏర్పడిన వైకృతమని చెప్పడానికి పిలిచాడు భర్త.
  ఐదు వన్నె చిన్నె లమరిన "యైదువ"
  యందు రంచుఁ బలికె నతివ; కాదు -
  "ఐదువ" యన వికృతి యగు - దాని ప్రకృతి "య
  విధవ" యనుచుఁ బిల్చె విభుఁడు సతిని.

  సంక్షిప్త వర్ణాలతో భార్యను సంబోధిస్తున్నాడు భర్త.

  (వి)నుత (ధ)న్య (వ)ర్త్మ! వికచాంబులోచన
  (వి)హిత (ధ)ర్మ (వ)ర్తన! హితశీల
  (వి)దిత (ధ)నిక (వ)నిత! విధువధూటీమణి
  వి. ధ. వ. యనుచుఁ బిల్చె విభుఁడు సతిని.

  విధేయుఁడు,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 16. అజ్ఞాత గారికి నమస్సులు.

  భావిధవ అంటే రాజు అనే అర్థములో ఒక మగడు తన భార్యను పిలచినట్లుగా వూహించి వ్రాసినాను. భర్త భార్యను ముద్దుగా రాజు అని, సరసంగా ఒరే అని ఇంకా పలువిధములుగా పిలుస్తారు కదా. అందువలననే సరస సంభాషణముల అని కూడా వ్రాసినాను. ఇక్కడ భావములనే తీసుకొనవలె గానీ లింగభేదములు అతీతములు కదా.

  పరిశీలించ మనవి.

  రిప్లయితొలగించండి
 17. శ్రీ మిస్సన్న గారికి,పెద్దలందరికి,

  ఈ వివరణ కేవలం స్థితగతిచింతనకు మాత్రమే.

  "ధేతి - ధవతి, ధూయతే అనయా ఇతి" అన్న వ్యుత్పత్తి ప్రకారం "ఆమెచే కదలికను, కంపనమును పొందువాఁడు" అనే అర్థంలో సంగతమైతే "టాప్" ప్రత్యయం విధించి "ధవా - భార్య" అని చెప్పవచ్చును.

  విధేయుఁడు,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 18. మురళీ ధరులకు ధన్యవాదములు.
  నా పూరణను వెనుకకు తీసుకొన్నట్లుగా భావించమని మిత్రులకు మనవి.

  రిప్లయితొలగించండి
 19. ఆ.వె. మానసికపు స్థాయి అనువుగా లేనట్టి
  విలువ లెరుగ నట్టి ఆలుమగలు
  వెధవ యనుచు మగని వెక్కిరింతల బిల్చ!
  విధవ యనుచు బిల్చె విభుడు సతిని!

  రిప్లయితొలగించండి
 20. గుండా సహదేవుడు గారి పూరణ.....

  మానసికపు స్థాయి మందగించినపుడు
  విలువలెరుగనట్టి యాలుమగలు
  వెధవ యనుచు మగని వెక్కిరింపులు హెచ్చ!
  విధవ యనుచు బిల్చె విభుడు సతిని!

  రిప్లయితొలగించండి
 21. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  డాక్టరేట్ చేసి , బ్లాక్ బెల్ట్ పొంది , కోట్ల ఆస్తికి యేకైక వారసురాలూ
  యేమడిగినా కాదనని భార్య వరలక్ష్మిని ఆమె భర్త :


  01)
  _____________________________________________


  "వి"ద్యలకు నిలయము; - వీరనారి; మరియు
  "ధ"నమునకు నిలయము; - తనివి తీర
  "వ"రములనొసగునది - వరలక్ష్మి యగునట్టి
  వి.ధ.వ యనుచు బిల్చె - విభుడు సతిని !

  _____________________________________________

  రిప్లయితొలగించండి
 22. తండ్రి లేకపోయినా అష్ట కస్టాలు పడి తనను పెంచి
  పెద్దజేసి విఙ్ఞాన వంతునిగా తీర్చి దిద్దిన తల్లి
  పాదాలకు నమస్కరిద్దాం రమ్మని
  ప్రేమించి పెళ్ళాడి ఇంటికి తీసికొనివచ్చిన
  భార్యకు పరిచయం చేస్తున్న భర్త :

  02)
  _____________________________________________


  "విహితురాలు నన్ను - విఙ్ఞాన వేత్తగా
  తీర్చి దిద్దినట్టి - దీన యామె
  విధవ యనుచు" బిల్చె - విభుడు సతిని
  పాదములకు మ్రొక్కి - పరవశింప !
  _____________________________________________

  రిప్లయితొలగించండి
 23. కవిమిత్రులకు నమస్కృతులు.
  ఈ సమస్య కొందరికి మనస్తాపాన్ని కలిగించినందుకు మన్నించండి. అయితే ఇది నేను సృష్టించింది కాదు. గతంలో ఒక అవధానంలో పృచ్ఛకుడు అడిగిందే.
  ఒకరిని మించి మరొకరుగా సరసమైన పూరణలు చెప్పినన
  కోడీహళ్ళి మురళీ మోహన్ గారికి,
  సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
  సుబ్బారావు గారికి,
  మిస్సన్న గారికి,
  శ్రీపతి శాస్త్రి గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  సత్య నారాయణ మూర్తి గారికి,
  ఏల్చూరి మురళీధరరావు గారికి,
  సహదేవుడు గారికి,
  వసంత కిశోర్ గారికి
  .............. అభినందనలు, ధన్యవాదాలు. సమయాభావం వల్ల అందరి పూరణలను వేరు వేరుగా పరామర్శించలేక పోతున్నాను.
  *
  అజ్ఞాత గారూ,
  ధన్యవాదాలు.
  *
  విజయకుమార్ గారూ,
  ప్రత్రేక ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి